రాబోయే సమయంలో సమాజం ఎలా ఉంటుంది అనేది నేటి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. వారి పిల్లల్ని వారు పెంచే విధానం మీద ఆధారపడి ఉంది. ఆ తల్లిదండ్రులు ఏ వయసు వారైనా కావచ్చు .
ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత తరం తల్లిదండ్రుల తీరు, వైఖరి కొంచెం ఆందోళనకరంగా ఉంది. ఇద్దరూ విద్యాధికులు ఇద్దరూ సంపాదనపరులు అవ్వడం వలన పిల్లలకి ఇవ్వాల్సిన సమయం తగ్గిపోతుంది. అలాగే పిల్లలకి చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు తల్లితండ్రులు నేర్చుకునే అవకాశాలు కూడా తగ్గుతున్నాయి .
ఆపైన చాలా కుటుంబాల్లో ఇద్దరు, ఇంకా కొన్ని కుటుంబాల్లో కేవలం ఒక్కరే పిల్లలు ఉండటం వల్ల తల్లిదండ్రుల గారాబం పిల్లలకు చాలా ఎక్కువగా దొరుకుతున్నాది. అంతేకాదు ఆ గారాబం వలన తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి చెడు చెప్పే పద్ధతికే స్వస్తి పలికారు. అంతే కాకుండా పిల్లలు ఎంత చిన్న పిల్లలు అయినా సరే వారు చెప్పిన దానికే వీరు తలవంచుతున్నారు .అది ఏ విషయమైనా కావచ్చు. ఇది రానున్న కాలంలో చాలా నష్టం కలిగించే అంశం.
ఈరోజు కుటుంబాల్లో రెండేళ్ల పిల్లలు కూడా తల్లిదండ్రులను శాసించే స్థాయిలో ఉన్నారు. వారు చెప్పినట్లే వీరు వినడం జరుగుతుంది …అది తప్పైనా సరే. రెండు సంవత్సరాల వయసుకే తల్లిదండ్రులు పిల్లల ముందు లొంగిపోతే ముందు ముందు వారు మంచి చెడు చెప్పినా పిల్లలు వింటారని ఆశ ఎంత మాత్రం లేదు.
ఈ వైఖరి మారాలి అంటే చిన్న పిల్లలు చెబుతున్న ప్రతి విషయాన్ని శిరసావహించడం పెద్దలు మానుకోవాలి. తగ్గించుకోవడం కాదు మానుకోవాలి. తాము చెప్పిన విషయాలు పిల్లలు వినాలి అనే భావన పిల్లల్లో కలిగించాలి.. ఏ రోజైతే వారు చెప్పినట్లు వీరు వింటారో….. అంటే పిల్లలు చెప్పినట్టు పెద్దలు వింటారో ఆరోజు పిల్లలకి పెద్దలపై గౌరవం, భయం ఉండమన్నా ఉండవు .
ఆ ప్రకారం జీవితంలో వారు అనేక తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది .దీన్ని అవాయిడ్ చేయాలి అంటే చిన్నతనంలోనే వారు తమ మాటలు వినే విధంగా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. గారాబంతో వారు చెప్పినది ఒప్పుకోవడం అనేది అన్నివేళలా అభిలశనీయం కాదు. బదులుగా సున్నితంగానో ప్రేమగానో కాస్తంత భయపెట్టో వారు తమ మాట వినేలా చేసుకోవడం తల్లిదండ్రులకు చాలా అవసరం. చాలా మంది తల్లితండ్రులకు ఇది చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది. కానీ కాదు.
చిన్నతనాన ఏ స్వభావం వారిలో నాటుకుంటుందో అదే పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది. ఆ రోజు వాళ్ళు మాట వినటం లేదని బాధపడితే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అది మనం చేసిన అలవాటే. విద్యాధికులు అయిన తల్లిదండ్రులు ఎలా తమ పిల్లలకి చెప్తారో తామే ఆలోచించుకోవాలి.
పిల్లల ఆలోచనలను మార్చే అవకాశం కేవలం వారి చిన్న వయసు లోనే ఉంటుంది. వారు ఎదిగాక మార్చడం సాధ్యం కాదు.
వారిని కొట్టి బాధ పెట్టక్కర్లేదు. మీరు చెప్పినట్లుగా మేము వినము అని తల్లి తండ్రులు నిష్కర్షగా చెప్పడం అలవరచుకోకపోతే పిల్లల నిర్ణయాల వలన ఆర్ధికంగా, ఎమోషనల్ గా, ఆరోగ్యపరంగా …అనేక విధాలుగా నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
తల్లిదండ్రులు ఆలోచించాలి.