ఉషోదయం

పెంపకం – పర్యవసానం

మాధవపెద్ది ఉష

ఓ రోజు మా పని మనిషి, భర్తతో సహా దీపావళి పండగ సామాను కొనటానికి తమ ఇద్దరు పిల్లలతోనూ మార్కెట్కి వెళ్తుంటే జరిగిన సంఘటన ఇది. ఆ మరునాడు ఆమె ఆ విషయం పూసగుచ్చినట్లు నాతో చెప్తుంటే నేను అవాక్కయ్యాను. ఆ ఘటనలో ఏం జరిగిందో ఆమె మాటల్లోనే వినండి.
“ అమ్మా… నిన్న మేము బజారు కెళ్తుంటే, మా కన్నా ఓ బీద పిల్లవాడు చొక్కా లేకుండా, అడుక్కుంటూ కనిపించాడమ్మా…!అప్పుడుమాబాబు మా ఆయనతో “నాన్నా పాపం ఆ పిల్లవాడు చొక్కా కూడ లేకుండాఉన్నాడు వాడికి ఏమన్నా ఇద్దాం నాన్నా అన్నాడమ్మా! మా ఆయన వెంటనే ఓ పది రూపాయల నోటు తీసి ఆ అబ్బాయికి ఇచ్చాడు. అయినా మా బాబు ఊరుకోలేదమ్మా…”పది రూపాయలు ఏం సరిపోతాయి నాన్నా నా చొక్కా ఇచ్చేస్తా……ఎట్టాగో మనం ఇప్పుడు కొనుక్కోబోతున్నాం కదా “ అన్నాడమ్మా! అందుకు నేను “అది కాదు నాన్నా మనం పది రాపాయలు ఇచ్చాంగదా చాలు “ అన్నాను. దానికి వాడు “కాదమ్మా నువ్వే కదా చెప్తూ ఉంటావు లేని వాళ్ళకి ఎంతో కొంత దానమివ్వాలి అని అందుకని మనం బట్టలు కొనటానికి తెచ్చుకున్న డబ్బులు ఆ బీద వాళ్ళకి ఇచ్చేద్దాం అని ఒకటే ఏడుపు మొదలు పెట్టి ఆపడం లేదమ్మా! చివరికి వానికి అర్ధం అయేటట్లు చెప్పి ఏడుపు మానిపించేటప్పటికీ మా చావు మేము చచ్చామమ్మా “ అంది నవ్వుతూ.
అది విని నేను ఆశ్చర్య పోయాను.ఆహా ఏమి త్యాగం….! ఏమి దయ!…ఏమి కరుణ!….ఏమి జాలి! అదీ సంస్కారం అంటే! అంత చిన్న పిల్లాడిలో అంత సంస్కారం ఎలా వచ్చిందంటారూ? ఖచ్చితంగా వాడి తల్లి తండ్రులనుంచే అని చెప్పక తప్పదు.
◦ ఇక్కడే ‘పెంపకం’ అనే అంశం సీన్ లోకి ఎంటర్ అవుతుంది. పిల్లలను కనగానే సరికాదు.వారిని సక్రమంగా పెంచడంలోనే ఉంది తల్లితండ్రుల చాకచక్యమంతా!
◦ పిల్లల శారీరిక పోషణకు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో అంతే ప్రాముఖ్యత వారి మానసిక ఎదుగుదలకి కూడ ఇవ్వాలి. అతి లేత వయసునుంచే క్రమశిక్షణను అలవాటు చేయాలి.ఉదాహరణకు ‘థాంక్స్’ ‘సారీ’ లాంటి పదాలు ఏ సందర్భాలలో ఉపయోగించాలో చెప్పడం, ఎవరైనా కొత్తవాళ్ళు కనపడితే విష్ చేయడం, వారు వెళ్ళి పోయేడప్పుడు ‘బాయ్’ చెప్పడంలాంటి మంచి మ్యానర్స్ నేర్పించాలి.
◦ కొంచెం పెద్దైనాక తమ వస్తువులు ఒక క్రమ పద్ధతిలో ఎలా పెట్టుకోవాలో భోజనంచేసేటప్పుడు , ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో లాంటి మంచి నడవడికను వారికి అలవాటు చేయాలి. అంతేకాని క్రమ శిక్షణ పేరుతో కొట్టడం, తిట్టడం చేయకూడదు. ప్రేమతో జయించలేనిది ఏదీ లేదని తల్లి తండ్రులు గ్రహించాలి.
◦ ఇక పిల్లల మానసిక వికాసానికి దోహదపడే మంచి ఆట వస్తువులు కొనివ్వడం ఎంతో అవసరం. అంతేకాదు ఆడ పిల్లలకి ఒకరకం, మగపిల్లలకి ఒక రకం ఆట వస్తువులు కొనడం ఎన్నటికీ సరి కాదు అని పేరెంట్స్ తెలుసుకోవాలి. పిల్లలందరికీ కూడ మనోవికాసం, విజ్ఞానం పెంపొందేందుకు ఉపయోగపడే ఆట వస్తువులనే కొనివ్వాలి.
◦ మరొక ముఖ్య విషయం ఏంటంటే పిల్లలను ఒకరితో ఒకరిని పోల్చి చూసే అలవాటును మానుకోవాలి. అందువల్ల పిల్లల్లో ‘ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్’ గానీ లేక ‘ సుపీరియారిటీ కాంప్లెక్స్’ గానీ పెరిగే ప్రమాదం ఉంది. దీని మూలాన పిల్లల వ్యక్తిత్వ వికాసం దెబ్బతినే అవకాశం ఉంది.
◦ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగితే, పిల్లలు మానసికంగా కృంగిపోయి జీవితంలో తాము ఏమీ సాధించలేమన్న నిరాశావాదానికి గురవుతారు. సుపీరియారిటీ కాంప్లెక్స్ పెరిగితే పిల్లల్లో అహం మాత్రమే కాకుండా తాము ఇతరులకన్నా అధికులమన్న భావన కూడ పెరిగే ప్రమాదం ఉంది.అందుమూలాన ఇతరులపై తమ ఆధిపత్యాన్ని చాటుకునే నైజం అలవడుతుంది. అది కూడ ఒక నెగెటివ్ క్వాలిటీ అని పెద్దలు గ్రహించాలి.
◦ ఇక పిల్లల్లో, క్షమ, దయ, కరుణ, జాలి త్యాగం లాంటి ఉన్నత గుణాలు పెరగటానికి ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. అందుకు తగినట్లుగా తల్లి తండ్రులు ఆ గుణాలను తాము కూడ పెంపొందించుకోవలసిన అవసరం ఉంది. పెద్దలను చూసే పిల్లలుకూడ నేర్చుకుంటారు. దాని పర్యవసానమే తొలుత గా మనం చెప్పుకున్న పిల్లవాడి ఉదాహరణ.మన పిల్లలు కూడా అంతటి సంస్కార వంతమైన వ్యక్తిత్వం గల స్థాయికి ఎదగాలని కోరుకుందాం. ఏమంటారు?

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమెరికా బతుకమ్మ

మన విదూషీమణులు