నీకు మేమున్నాం…

              శివల పద్మ

గేట్ ముందు క్యాబ్ ఆగాక బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చింది వైశాలి. మనసులో కొంచెం ఆందోళన కలుగుతుండగా లోపలికి తొంగి చూసింది.
ఫ్రిజ్ నుంచి ఏదో తీస్తోంది చెల్లెలు వైదేహి .చప్పుడుకి వెనక్కి తిరిగి అక్కని చూసి సంభ్రమంగా ఎదురొచ్చింది.

” నువ్వెప్పుడొచ్చావే … . ఎలా ఉన్నావ్? అక్కడ అంతా కులాసా యేనా? ” అడుగుతూ చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది.

లోపలి నుంచి హిమజ కూడా వచ్చింది .
” హాయ్ దొడ్డమ్మ .. ఎలా ఉన్నావ్? ” అంటూ.

బాగానే ఉన్నాను అన్నట్లు తల ఊపుతూ చెల్లెల్ని చూసింది .కాస్త చిక్కింది.. అంతే తప్ప బాగానే ఉంది .
కాసేపు కుశల ప్రశ్నలు…సమాధానాలు సాగాయి.
అనుకోకుండా అక్కని చూసి వైదేహి బోలెడు సంబర పడింది.

” అసలేమైందే ?ఎందుకలా కంగారు పెడుతూ పరిగెత్తించావు నన్ను ? ” హిమజని ఒంటరిగా చూసి అడిగింది .
” అది చూస్తే నిక్షేపం లా పనులు చేసుకుంటోంది. ” ” మెంటల్ గా ఏదో అబ్ నార్మలసీ వస్తోంది దొడ్డమ్మా… అన్ని విషయాలు మరిచిపోతుంది .చేసే పనులన్నీ తప్పులు చేస్తుంది. ఏమైనా అంటే చిన్నబుచ్చుకొని ఏడుస్తుంది .ఇది అల్జీమర్స్ లోకి దించుతుందేమో అని భయంగా ఉంది . ”
చెప్తుండగా కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఆ పిల్లకి.
చూస్తూ ఉండిపోయింది వైశాలి.
ఇంతలో వైదేహి వచ్చింది ముదురాకుపచ్చ చీర ఒకటి పట్టుకొని .
” ఒసేయ్ వైషు! నీకు గుర్తుందా …అమ్మ దగ్గర ఇలాంటి చీర ఉండేది .ఇది చూడగానే అది గుర్తుకు వచ్చి కొనేశాను .వరలక్ష్మీ వ్రతానికి నాన్నగారు కొన్నారు …ఒకసారి.
ఇలాగే పసుపు బోర్డర్ ఉండేది…. ”
అవునన్నట్లు తలాడించింది వైశాలి. చీర చేతిలోకి తీసుకుంది .
” నీ పెళ్ళిలో మీ అత్తగారికి కూడా ఇదే డిజైన్తో వేరే రంగుని తీసుకున్నారు. బ్రౌన్ అనుకుంటాను….”

” అవును ఆవిడ మహా ఇష్టపడేది దాన్ని …”

“ఇదిగో కూరలు అన్నీ తరిగాను .ముక్కలు వేసి ఆవపులుసు పెట్టు .అది పెడితే నువ్వే పెట్టాలి.. తెలుసా హిమా..! దొడ్డమ్మ అద్భుతంగా చేస్తుంది.” కూతురికి కూడా చెప్పింది .

తర్వాత భోజనాలు అయ్యాక అక్క చెల్లెలు ఇద్దరు కూర్చుని బోలెడన్ని పాత విషయాలు మాట్లాడుకున్నారు .మరొక్క రోజు ఉండి తిరుగు ప్రయాణం అయింది వైశాలి .ఆరోజు రాత్రి హిమజను వైదేహి కొడుకు నిశాంత్ ను ఇద్దరినీ డాబా మీదకి తీసుకు వెళ్ళింది .

” మీరు ఊహిస్తున్నంత .. మీరు చెప్తున్నంత సీరియస్ ఏమీ లేదు ఇన్నేళ్లు ఇన్ని విషయాలు ఒంటిచేత్తో హ్యాండిల్ చేసుకుంటూ వచ్చింది. కొన్నాళ్లకైనా అలసట వస్తుంది. అందుకని సహజంగా కొన్ని విషయాలు స్లిప్ అవుతాయి. దాన్ని మీరు భూతద్దంలో చూస్తున్నారు .మైండ్ లో ఉంచుకోవలసిన విషయాలు ఎక్కువ అవుతున్న కొలది కాస్తంత మర్చిపోవడం జరుగుతుంది.

” కాకపోతే పాత తరం వాళ్లకి ఈ అల్జీమర్స్ లాంటి ఇంగ్లీష్ పేర్లు తెలియవు. కనుక బ్రతికి పోయారు. పాత వాళ్ళు చేసే పనులు ప్రశాంతంగా చేసుకునేవారు .నేడు ఉన్నంత ఒత్తిడి లేదు. ఇప్పుడు అన్నీ డేట్ ల మీద డిపెండ్ అయి ఉంటాయి .సిస్టంలో బోలెడన్ని పాస్ వర్డ్స్ గుర్తుంచుకోవాలి. అలాగే నేటి ఇల్లాలు ఎన్నో విషయాలను చూసుకోవాలి .”

” మిక్సీలు వచ్చాయి ..వాషింగ్ మిషన్లు వచ్చాయి అంటారు . కానీ దానికి బదులుగా మెదడు ఉపయోగం పెరిగింది . ఒత్తిళ్లు పెరిగాయి . అలాగే పనులు …

” ఇదివరకు దాని వయసు తక్కువ ఉండేది. చురుగ్గా అన్ని చూసుకునేది .ఇప్పుడు అది 60లో పడుతుంది .ఇంకా ఎన్నాళ్ళు ఇదే ఇంటెన్సిటీతో పనిచేస్తుంది ? ”

పిల్లలిద్దరూ మౌనంగా ఉండిపోయారు .

” ఇంకొకటి….. నెట్ అరచేతిలో ఉంది కదా అని అడ్డమైనవి బుర్రల్లోకి ఎక్కించకండి .ఎంత అవసరమో అంతే తీసుకోండి.
ఇంట్లో పసిపిల్లాడుతుమ్మితే వెంటనే నెట్ ఓపెన్ చేసి చూస్తారు …అది ఎందుకు వచ్చిందో …
అది ఎన్ని రకాలుగా ఉంటుందో…
దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఎవరు …
తుమ్ముతో కూడుకున్న ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఏమిటో… వాటికి చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏమిటో….
దీన్ని అతి జ్ఞానం అంటారు .
“ఇప్పుడు మీ అమ్మకి ఉన్నది సాధారణ మతిమరుపు . మర్చిపోయాను అనగానే తనమీద ఒత్తిడి తీసుకురాకుండా ….కొత్త కొత్త జబ్బుల ఇంగ్లీష్ పేర్లు తనకి చెప్పకుండా కాస్త విషయాన్నీ గుర్తు చేసుకునే అవకాశం ,సమయం ఇవ్వండి చాలు.
అంతేతప్ప ఊరికే నీకు మతిమరుపు… నీకు మతిమరుపు అంటూ తనకి భయం కలిగేలా చేయకండి .నిజానికి మతిమరుపు మనందరికీ ఉంటుంది .కానీ ఏజ్ రాగానే దానికి అల్జీమర్స్ అని పేరు పెడతాం. ”
“ఇప్పుడు కూడా తను చాలా నార్మల్ గా ఉంది. చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం సహజమని తనకు చెప్పి వాటిని గుర్తు చేసుకునేలా సహాయపడండి. వయసు తో పాటు అనేక రకాల జబ్బులు రావాలని ఎక్కడ రూల్ లేదు. చాలావరకు మానసికంగా ఆ భావనతో జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం .మనసు ఆహ్లాదంగా ఉంటే ఏ జబ్బులు దరిచేరవు ..
నేను మీకు చెప్పేది ఒకటే తన అలసటని అర్థం చేసుకోండి. కాస్తంత సానుభూతిని పంచండి. మానసికంగా తనని ఆరోగ్యంగా ఉంచండి. అంతే…. అది చాలు ….

పిల్లలిద్దరూ తేటపడిన మొఖాలతో చిరునవ్వుతో దొడ్డమ్మని చూశారు.

Written by Shivala Padma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉషోదయం

జీవించు, జీవించు, జీవించు