అంతరంగ వారధులు

వనపర్తి పద్మ

మానవుడు సాంకేతికంగా ఎంతో సాధించాను అనుకుంటున్నాడు. ప్రపంచాన్నే ‘గ్లోబల్ విలేజి’గా మార్చి తన గుప్పిట్లో ఉందని భావిస్తున్నాడు. నేటి తరం సెల్ ఫోన్ వుంటే చాలు ప్రపంచంలో ఏమూలవున్న కమ్యూనికేషన్ వుంటుంది అని భావిస్తూ తనను తాను కోల్పోతున్నాడు. తన వారి ఆత్మీయతను పొందలేకపోతున్నాడు. ఒకనాటి మధురభావాలు, అనుంబంధాలు, ప్రేమలను కోల్పోతున్నాడు. కరెన్సీ కోసం తీసెపరుగుల్లో మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనిషి ఎంతగొప్పవాడైనా, మరెంత సాధించిన ప్రగతి శూన్యుడే అనుకోవచ్చు. కాబట్టి ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ, బంధాలను పటిష్టపరుచుకోవలసిన ఆవశక్యత నేటి తరానికి ఎంతో అవసరం.

ఒక లేఖ మనిషికి మనిషికి మధ్య మానసిక బంధాన్ని పెంచుతుంది. అందులోని ప్రతి అక్షరం వ్యక్తిగత ఊరటనిస్తూ, ఎదుటి వ్యక్తి మనగూర్చి ఆలోచించే విధం మనస్సులో భద్రంగా ముద్ర పడుతుంది. వ్యక్తిగత పరిధిని దాటినపుడు లేఖలకు సామాజిక విలువలు మొత్తం సమాజంలోని వ్యక్తులందరికి చెందుతాయి. కొన్ని లేఖలకు చారిత్రక, రాజకీయ, సామాజిక, సంస్కృతిక విలువలు వుంటాయి. అలాంటివి వ్యక్తులందరిసొత్తు అవుతాయి. భాషా సాహిత్య రంగంలో ప్రముఖులు రాసిన లేఖలకు సాహిత్య విలువలుంటాయి. అలాంటి 11 మంది సాహిత్య వేత్తలు రాసిన లేఖల పై డా॥ సీతాలక్ష్మి గారు చేసిన పరిశోధన గ్రంథమే ‘‘తెలుగులో లేఖాసాహిత్యం’’, నాటి భాషా విశేషాలు, లేఖా రచనా విధానాలు సాహిత్య వేత్తల శైలి కూడా మనకు ఆదర్శంగా అవగతమవుతుంది.

సి.పి. బ్రౌను, కందుకూరి విరేశలింగం, వేంకటరామశాస్త్రి, గురుజాడ అప్పారావు, కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని రామస్వామి చౌదరి, చలం, దువ్యూరి రామిరెడ్డి, నార్ల వేంకటేశ్వర రావు, సంజీవ దేవ్, బాల గంగాధరతిలక్, రాచమల్లు, రామచంద్రారెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మల లేఖ సాహిత్యం ఇందు మనకు పఠనీయం.

ఆనాడు తామరాకులపై గోటితో శకుంతల తన భర్తకు ‘లేఖ’ రాసింది. ‘ప్రభావతి ప్రద్యుమ్నం’ వంటి కావ్యాల్లోను లేఖలు కన్పిస్తాయి. తెలుగు సాహిత్యకారులు కూడా ‘లేఖాత్మక’ సాహిత్యాన్ని ఆవిష్కరించారు. ఆకోవలోనే ‘చలం’ గారు ‘‘ప్రేమలేఖలు’’ నవలలో లేఖ ప్రస్తావన వుంది. ఓ మంచి లేఖ రాయలంటే సంస్కారంతో పాటు, విశాలమైన మనస్సు విద్య, జ్ఞానం, ఆత్మ జౌన్నత్యం ఉండాలంటారు. అందులోను ప్రేమలేఖకి ప్రత్యేకస్థానం ఇచ్చారు. ‘‘ప్రియురాలు దగ్గర లేనపుడు ఆమెతో ఇంటిమేట్గా మాట్లాడటమే ప్రేమలేఖ, మన ఆత్మని వాళ్ళ ఆత్మలతో దూరాన్ని కాలాన్ని జయించి ఐక్యచేసే ప్రయత్నమే ప్రేమ లేఖ అంటారు ‘చలం’గారు.
త్రిపురనేని రామాస్వామి చౌదరి గారు తనయాత్రాను భావాన్ని ముట్నూరి కృష్ణారావు గారికి రాసిన లేఖలో బౌద్ధమతంలో కులాలను పాటిస్తున్నట్లు చెప్పారు. కట్టమంచి రామలింగారెడ్డి రాసిన లేఖల్లో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మకు లేఖ రాస్తూ ‘‘శాలివాహన సప్తశతి’’ అనువాదాన్ని మెచ్చుకుంటూ భావయుక్తంగాను, సరళంగా, సుందరంగా, ఆకర్షణీయంగా ఉందని అభినందించారు. ఆధునిక విద్యా విధానాన్ని విశ్లేషిస్తూ ‘‘మాతృభాషలో బోధన’’ వుంటే విద్య అందరికి అందుబాటులో ఉంటుందని శ్రీ సంజీవదేవ్ లేఖల్లో రాశారు. చింతాదీక్షితులకు చలం రాసిన లేఖలో మునిమాణిక్యం రచనలు సరళంగా వుంటాయని, విశ్వనాధం కవిత్వం కాస్త అర్థంకాదని, కృష్ణశాస్త్రి గారు నిజమైన అనుభవంతో అద్భుతమైన గీతాలు వ్రాయగలరు అంటూ వారి వారి సాహిత్యపు విలువలను మనకు తెలియచేశారు. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు రాసిన ‘ఆంగ్లకవిత్వం’ అంతర్జాతీయ స్థాయిలో గౌరవ స్థానాన్ని పొందిన విషయం తల్లావర్జల శివశంకర శాస్త్రి గారికి రామిరెడ్డి రాసిన లేఖల వల్ల విషయం విదితమవుతుంది. నార్ల వేంకటేశ్వర రావు గారి లేఖల్లో భిన్న కోణాలనుండి సాహిత్య సృజన చేయవచ్చు. నిండైన మానవతావాది ‘‘బాలగంగాధర్ తిలక్’’ లేఖల్లో అతని అనుభూతులు, అనుభవాలు కవితా లక్ష్యం. రచనోద్దేశ్యం, విమర్శ, ప్రకృతివర్ణన, ఆరోగ్య విషయాలు, మిత్రత్వానికి ఇచ్చిన విలువలు లాంటి అనేక విషయాలు అవగతంమవుతాయి. రాచమల్లు రామచంద్రారెడ్డి గారి లేఖల్లో శాస్త్రీయ దృక్పథంతో పాటు రాజకీయ అవగహన, మార్క్సిస్టు దృక్పథం, సాహిత్య విమర్శ, గురజాడ, శ్రీశ్రీలపై వున్న అవగాహన మనకు తెలుస్తుంది. ఇలాంటి లేఖలన్ని ఒకర్కి మరోకరి లేఖలకు మధ్య గల భావం, భాష, వ్యక్తీకరణ మొదలైన వ్యత్యాసాల్ని తెలియచేస్తాయి.

పూర్వరాజులకు వారి బిరుదులతో లేఖ రాసేవారు. శ్రీ మన్మహరాజా, గండభేరుండ అంటూ బిరుదునామాలతో సంబోధించేవారు. పెద్దలకు వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి మొదలుపెట్టేవారు, బ్రాహ్మణులకు గోత్రం, వంశం మొదలైన వాటితో సంబోధించేవారు. పురుషులకు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన అని పుణ్య స్త్రీలను మహాలక్ష్మి సమానురాలైన అని, విధవలను గంగాభాగీరథీసమానురాలైన అని సంబోధించేవారు. చిన్నవారిని ‘చిరంజీవి’ అనియు, పెద్దవారికి వారి, వారి బిరుదునామాలతో, గౌరవ పురస్కారంగా సంబోధిస్తూ పాదపద్మాలకు నమస్కారంతో అని ఎంతో మర్యాదగా ఉత్తరాలు వ్రాసేవారు.
లేఖ సాహిత్యంలోను ఎన్నో క్రొత్త పద్దతులతో, క్రొత్త సంప్రదాయ రీతిలో నూతనత్వాన్ని సంతరిచంఉకుంది. వ్యాసము, కథానిక, నవల మొదలైన వివిధ ప్రక్రియలపై పాశ్చాత్య ప్రభావమున్నట్లే లేఖా రచనలో కూడా ఆ ప్రభావం వుంది. కాబట్టి భారతీయ సంప్రదాయంను తిరిగి తేవాలంటే లేఖలు అత్యవసర సాధన. మనిషి జీవితంలో ఒక అంతర్భాగంగా స్థానం వుండాలి. లేఖల్లో సాంఫీుక, రాజకీయ, ఆర్థిక, తాత్త్విక మొదలైన ఎన్నో విషయాలను మనం లేఖ రచనల్లో తెలుసుకోవచ్చు, ప్రేమను పంచే పదాలతో పాటు ఆత్మీయతను, అనుబంధాలనేకాక మనస్సులో ఊహాతీతమైన భావాలను మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ హృదయంలో భద్రపర్చుకొనేవి కొన్ని అయితే జీవితాలనే మార్చే మరేన్నో విషయాలను, తెలుసుకోగల్గె అంతర్గత వారధులు లేఖలు, అలాంటి లేఖ సాహిత్యం పై పరిశోధన చేసిన డా॥ సీతామహాలక్ష్మి గారికి అభినందనలతో . . . .

Written by Vanaparti Padma

వనపర్తి పద్మావతి, హన్మకొండ

9949290567

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వలస పోతున్న స్వర్ణకారులు

సాధికారత సాధ్యపడని వంటకం