రాత్రి పదౌతోంది. ఉదయంనుంచి ఓ టాపిక్ నా మనస్సును తొలిచేస్తోంది. దాన్నే అక్షర రూపంలో పెడ్దామని మధ్యాన్నంనుంచీ ప్రయత్నం. ఆఖరుకి అన్ని పనులూ ముగించిన నాకు ఇప్పటికి తీరిక దొరికింది.
మన దేశం కర్మభూమి, అమెరికాలాంటి పాశ్చాత్య దేశాలను భోగభూమి అంటారు. అంతే కాదు దాన్ని భూతల స్వర్గం అని కూడ అనడం కద్దు. కానీ మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం! అందుకే మన దేశంలోని ఆర్ధిక అసమానతలను ప్రజలు తమ పూర్వ జన్మలలో చేసుకున్న పాప పుణ్యాలుగా పరిగణించి వాటిని ఎలాగో అలా అనుభవించేయకపోతే , అవి మళ్ళా మరుజన్మకి క్యారీఫార్వార్డ్ అవుతాయన్న ఒక నమ్మకం మనది. మన దేశ ప్రజలకు ఇంతటి మనస్థైర్యం అలవడడానికి ముఖ్య కారణం మన ఆథ్యాత్మికత మరియు మత గ్రంథాల భోదనలే కారణంఅని చెప్పవచ్చు.
అందుకే మన దేశంలో, బీదా, బిక్కీ, మధ్యతరగతివారు, ధనవంతులు కలిసి సహజీవనం చేయగలుగుతున్నారు. లేకపోతే మన దేశంలోకూడ విప్లవం వచ్చేదే! అలా కాకుండా ఎవరికి వారు ఇదంతా తాము చేసుకున్న ఖర్మ అనుకుని, వీలున్నంతలో కష్టార్జితంతో సంతృప్తిపడుతూ , మరో ప్రక్క భగవంతుడా నాకు వచ్చేజన్మలోనైనా మంచి జీవితం ప్రసాదించమని వేడుకుంటూ తమ బ్రతుకు తాము బ్రతికేస్తూ ఉండేవారు.
కానీ ఈ మధ్య కాలంలో, పైన చెప్పిన పరిస్థితులలో గణనీయమైన మార్పు వచ్చేసింది.కొంచెం కొంచెంగా పేదల ఇళ్ళల్లో వారి సంతానం ఈ ఆర్థిక అసమానతలను గమనించడం మొదలు పెట్టింది. దాని గురించి తమ తల్లి తండ్రులను సూటిగా ప్రశ్నిస్తున్నారు కూడ. ఆ తల్లి తండ్రులుకూడ వారికి ఏం
జవాబివ్వాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
అందుకే సాధ్యమైనంతవరకు పేద వారి బ్రతుకులను బాగు చేయాలన్న తపన ఆర్ధికంగా మెరుగైన మనలాంటి వారిలో ఉదయించి తీరాలి. తప్పదు.
వారిని చదువు వైపు మళ్ళించడం, త్రాగుడు మానేసేలా చేయడం. ఇవి చేస్తే చాలు మన దేశం మరింత ముందుకు పోయే అవకాశం ఎంతైనా ఉంది.
అంతే కాదు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి విలయతాండవం చేస్తున్నాయి. అదేదో సినిమాలో పాటలా కోయీ ఛోటా చోర్ , కొయీ బడా చోర్ అన్నట్లు ఎవరికివారు తమ స్థాయికి తగ్గట్లు అవినీతి మార్గంలో పయనిస్తున్నారు. చిన్న స్థాయి వాళ్ళు చేసేవి లక్షల్లో ఉంటే పెద్ద స్థాయి వాళ్ళు చేసేవి కోట్లల్లా ఉంటున్నాయి.అందరికీ డబ్బాశ విపరీతంగా పెరిగి పోయింది. బై హుక్ ఆర్ కృక్ ఎట్లా అయినా డబ్బు సంపాదించి తీరాల్సిందే అన్న ఆలోచన ప్రతీవారిలోనూ పెరిగి పోయింది.
నిరుపేదలదగ్గరనుంచీ, రాజకీయ నాయకులవరకూ అందరికీ ఒకటే ఆలోచన.కోట్లు ఎలా సంపాయించాలన్నదే గోల్! అందుకోసం ఏం చేయటానికైనా సిద్ధమే! నిమ్న వర్గాలు చేసాయంటే ఓ అర్ధం ఉంది. వారి పరిస్థితులు మారాలని వాళ్ళల్లో ఏదో తపన. అందుకే అలా చేస్తూంటారు. కానీ పైస్థాయివాళ్ళకు ఏమొచ్చింది? ఓ….అవినీతి మార్గంలో కోట్లు సంపాయించేసి, మళ్ళీ ఆ విషయం పట్టుపడకుండా మరెన్నో అరాచకాలు చేయడం అంత అవసరమా! సరే అక్రమంగా సంపాయించిన కోట్లు ఏం చేసుకుంటారు? తమతో పట్టుకెళ్ళరు కదా తమ ముందు తరం వాళ్ళకు పంపిణీ చేయడం తప్ప! అందువల్ల తమ తమ వారసులకు బద్ధకం అలవడడం తప్ప వీరికి ఒరిగేదేమైనా ఉందా? నాకు తెలియక అడుగుతాను!
ఉదాహరణకు ఇటు వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్లను తీసుకోండి. ఇటువంటి పవిత్రమైన వృత్తిలో ఉండికూడా తాము విద్యానంతరం తీసుకున్న ‘ హిపొక్రెటిక్ ఓత్’ ని కూడ తుంగలో తొక్కేసి, కేవలం డబ్బే ఆశయంగా పెట్టుకుని వారు చేస్తున్న అవినీతి పనులు చూస్తున్నాం. ఇది ఎన్నటికీ క్షమించరానిది.
మచ్చుకి ఒక అంశం గురించి చెప్పుకుందాం! పుట్టేది ఆడపిల్లా లేక మగ పిల్లవాడా తెలుసుకునేందుకుగానూ, సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేయమనీ ఒకవేళ ఆడపిల్లైతే, ఎబార్షన్ చేయమనీ, డాక్టర్లకు డబ్బాశ చూపించి తమ పని చేయించుకుంటున్నారు కొంతమంది పామర జనం. అంతే కాదు ఈ పవిత్రమైన వైద్య వృత్తిని ఎన్నుకుని దానికి న్యాయం చేయకుండా, తమనే నమ్ముకుని తమ మాన ప్రాణాలను సైతం ఈ కలయుగ దేవుళ్ళ చేతిలో ఉంచిన అమాయక ప్రజలను , తల్లి కాబోతున్న స్త్రీలను మోసం చేయడం ఈ డాక్టర్లకు తగునా?
ఇంకా వినండి ఈ సదరు డాక్టర్లు మానవాళికి చేస్తున్న ఘోరాతి ఘోరమైన అపకారం ఏంటంటే……అదే సైన్టిస్ట్లు ఎంతో తెలివిని ఉపయోగించి, అవిశ్రాంతంగా కృషి చేసి, అత్యాచారాలు చేయబడ్డ స్త్రీజాతికి మేలు చేకూర్చేందుకుగాను కనిపెట్టిన డి.ఎన్.ఎ టెస్టు రిపోర్ట్లను, డబ్బుకోసమని తారుమారు చేయడం, తద్వారా ఆయా స్త్రీలకు ద్రోహం చేయడం ఎంతవరకూ న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను?
ఇక ఈ రాజకీయ నాయకుల విషయానికి వస్తే అదంతా కుళ్ళి నీరు కారుతున్న పరిస్థితి. జనం కోట్ల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే స్థితికి దిగ జారి పోయారని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు.
నా ఉద్దేశ్యంలో అయితే వీళ్ళు చేసే అకృత్యాలకు తగిన మూల్యం చెల్లించే పరిస్తితులు తప్పక వస్తాయి. అప్పుడు వారి మొర ఆలకించటానికి ఎవరూ ఉండరు. అందుకే ప్రజల్లారా మేల్కొనండి! మేల్కొని ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ
రు చేసే అకృత్యాల పర్యవసానం గురించి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి! అప్పుడు తెలుస్తుంది మీకు మీరు చేస్తున్నది ఎంతటి నీచాతి నీచమైన, ఘోరాతి ఘోరమైన పనో!!!