జలతారు కలలు

“మనం అందరం కూడా పొట్ట చేతికొచ్చాక, తల్లి పేగుని విదిలించుకుని బయటికి వెళ్లి పోయిన వాళ్ళమే. కాలానుగుణంగా మారాం. ఇది ఇవల్యూషన్. ఈ నాగరికత మూలంగా మనం అంతా అటూ ఇటూ విసిరేయబడ్డ వాళ్ళమే. అందరం మన ఉద్యోగాల మూలంగా, తలో చోట అభివృద్ది బాగా చెందిన ప్రదేశాల్లోనే ఉంటున్నాం. కాని, ఒకరి మాట ఒకరికి వినపడని అభివృద్ది ఇది.

దండిదశ కుమార చరిత్రలో లాగా, దశ దిశలకి వెళ్ళి పోయిన మనం,మన జ్ఞాపకాల మూటలని, అనుభవాల పెట్టెలని, ఏరావి చెట్టు కిందో, గుళ్ళో అరుగుల మీదో, కోనేరు గట్టు మీదో కాకుండా, మనం చదువుకున్న స్కూలు క్లాసుల ముందున్నవరండాలో కూచుని విప్పుకుందాం. ఆ జ్ఞాపకాలని, ఎత్తుకుని ముద్దాడుదాం. తప్పిపోయిన చోటవెతుక్కుందాం. ఇన్ని ఏళ్ళ దూరాన్ని మనం చెరిపేసుకోవాలి. దూరమో కాలమో మన మధ్య అగడ్తగా మారకుండా, అందుకే మనం అప్పుడప్పుడు కలుసుకుంటూండాలి.

ఈ ఎఫ్ బీ మూలంగా అందరం ఎక్కడెక్కడుంటున్నామో మనకి తెలిసింది. అప్పటి నుంచి మనం అంతా ఇలా ఈ జూమ్ లో మాట్లాడుకుంటున్నాం. బావుంది. అయితే మనం అందరం కూడా ఓసారి వ్యక్తిగతంగా కలుసుకుంటే బావుంటుందని నాకనిపించింది, నూరేళ్ళు నిండిన  మా నాన్నగారి సంవత్సరీకాలు ఓ పెళ్ళిలా చేయాలన్నారు. అది జనవరి రెండో వారంలో వచ్చింది. ఆ టైములో ఇక్కడ వెదర్ కూడా బావుంటుంది. ఆ తరవాత మరో రెండు రోజులకే కనుము, ఆ రోజు ప్రభల తీర్థం కూడా ఉంటుంది. దానికి మనం అందరం చిన్నప్పుడప్పుడో వెళ్ళే వాళ్ళం.ఎడ్ల బళ్ళ మీద, సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. రాత్రైందంటే ఎడా పెడా లాంతర్లు కట్టుకుని ఇళ్ళు చేరుకునే వాళ్ళం. ఇప్పుడు మనం అందరికికార్లు పురమాయిస్తున్నాను.ఆ తీర్థానికి కూడా వెళ్దాం. ఈ గోవా, మెక్సికో, పారిస్ కార్నివల్స్ కన్నా ఎంతో బావుంటుంది.

మరో ముఖ్యమైన విషయం మన స్కూల్లో మనతో చదువుకున్న దుర్గ కూడా వస్తోంది. అందుకని మీరంతా రావాలి. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను.”

ఇలా జూమ్ లో పిలిచాక మరోసారి  మా అందరికివాట్సప్ లో ప్రత్యేకంగా రమ్మని మెసేజ్ కూడా పెట్టాడు పుండరీకం.

నిజానికిమేం అందరం సముద్రాల ఆవలే ఉంటున్నాం కాని ప్రవాసపు చెరసాలలో కాదు,మాకు బయటి ప్రపంచం చూడడానికి కిటికీలేం లేవు. కాని, మా ముందు విండోస్ ఉంది. దాని ముందు ఏదీ అలా నిలబడదు. కళ్ళప్పగించినా, కళ్ళల్లోంచి లోపలికి ఇంకదు. ఇది ఇలాంటి ఈ బిజీ ప్రపంచం నుంచి ఊరు వెళ్ళడం అంటే చిన్న విరామం.

ఇప్పుడందరిని ఈ చిన్న స్క్రీన్ మీద కాకుండా, విశాలమైన, ప్రకృతి కింద అందరం కలుసుకుంటాం.

ఇన్ని ఏళ్ళ తరవాత వెళ్లి, చూస్తేమా ఊరు అప్పటిలా ఉంటుందా, అనుమామే, ఉండక పోవచ్చు. మారి ఉంచ్చు. నా మనసులో ఉన్న చిన్నప్పటి పటం చెదిరి పోయి ఉండచ్చు, సరిహద్దులు చెరిగి ఉండచ్చు. దాని మీద అంగుళం మేర దుమ్ము పేరుకుని ఉండచ్చు. అయినా కూడా చెరిపినా, చెదరినా, కడిగినా వదలని ఉనికి నాది. ఎందుకంటే, మా తాత ముత్తాతలు ఆ ఊరి వాళ్ళ్లే. ఫలానా వాళ్ళ తాలూకు అన్న రిఫరెన్స్ కూడా ఉంది.

ఎన్నో దృశ్యాలు గాజుతలుపుల వెనకగా మసక మసకగా కనిపిస్తున్నాయి. అందులో అందమైన దుర్గ కూడా ఉంది, ఆరోజుల్లో ఎంతో హుందాగా ఉండేది. ఏది మాట్లాడినా స్పష్టంగా ఉంటుంది.

నేను పెళ్ళి చేసుకుందామనుకున్న దుర్గ కూడా వస్తోంది. కాని ఆమె నన్ను చేసుకోవాలనుకోలేదు. పైగా అవమానించింది. ఆమె అందం చూసికోరి చేసుకున్నాడు ముకుందం.

ఇంజనీరింగ్ అయిపోగానే, అందరం కూడాఓ చెత్తో పుస్తకం, మరోచేతిలో కాగాడా పట్టుకుని ఆ సముద్రపు ఒడ్డున నుంచుని రమ్మని ఆమె పిలుస్తే వెళ్ళి పోయాము.

కింగ్ అర్థర్ కెమెలాట్ టేబుల్ లాంటి దేశం, ప్రామిస్ డ్ లాండ్ కి వెళ్ళి పోయాను.ఇన్ని ఏళ్ళు, కొత్త ఊళ్లు, కొత్త ప్రయాణాలు, కొత్త స్నేహాలు, కొత్త విషయాలు నా జీవితాన్ని సంపన్నం చేసిందో లేదో కూడా ఆలోచించలేదు. అంత బిజీ

ఇన్నాళ్ళ ఈ అష్టావధాన జీవితంలోని కొత్త నిజాలని, కొత్త సత్యాలని పాత స్నేహితులతో కలబోసుకోడానికి ఇంత కన్నా మంచి సమయం మరొకటి మళ్ళీ వస్తుందో రాదో, వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. పుండరీకుడి ఆహ్వానం అందుకున్నాక మేం అందరం రోజూ ఏదో ఓ సమయంలో మాట్లాడుకుంటూనే ఉంటున్నాం.

అందరం ఎన్నో గుర్తు చేసుకుంటున్నాం. అది ఓ జ్ఢాపకాల పుస్తకం.

పాతవన్ని  చదివేసిన ఓ పుస్తకమే. అయినా సరే ఎంతో ఇష్టంగా చూస్తూ పేజీలు తిప్పాం. కొన్ని పేజీల్లో కన్నీటి తడి. కొన్ని పేజీల్లో అల్లరి, నవ్వులు , ఏడిపించడాలు, అమ్మాయిల్ని అల్లరి పెట్టడం ఎన్నో కనిపిస్తున్నాయి. అందులోంచి  ఎన్నో జ్ఞాపకాలు.పొరలుగా బయటికి వస్తున్నాయి.నవ్వులు, కన్నీటి బొట్లు.వెలుగులు, నీడలు. ఏ పేజీ కూడా స్కాన్ చెయ్యలేదు. సెన్సార్ చెయ్యని పుస్తకం.

అందరం ఏ రోజున బయల్దేరినా, అందరూ ఒకే రోజున పుండరీకం ఇంట్లో కలుసుకుందాం అని కూడా అనుకున్నాం.

రెండు నెలలముందు నుంచే ప్లాన్ వేసుకున్నాం కాబట్టి, అందరం ఆ విధంగానే బయల్దేరాం.

టాక్సీ మాట్లాడుకుని పుండరీకుడి ఊరు వెళ్ళే సరికి ఒంటిగంట దాటింది.

మేం వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. మా అందరికి పుండరీకుడి ఇంటి ఎదురుగా ఉన్న కాంతారావుగారిల్లు ఇచ్చారు. పాతకాలం నాటి మండువా  ఇల్లు. పైగా చాలా పెద్దది.

పెరట్లో మేం స్నానాలు చేసి వచ్చేసరికి దుర్గ వచ్చింది. నవ్వుతూ అందరినీ పలకరించింది. బాగా సన్నపడింది. అయినా ఆ అందం అలాగే ఉంది.

దుర్గని పెళ్ళి చేసుకుంటే అనే ఆలోచన స్కూల్లో  నాకు చదువుతున్నరోజుల్లోనే ఉండేది. ఓ రెండు సార్లు అడిగాను. నవ్వింది. ముకుందం కుటుంబం కి మా పెద్దవాళ్ళు మాట ఇచ్చారు. అమెరికా వెళ్తాను. అని అంది. నా హృదయం బద్దలైంది.ముక్కలు గుండెల్ని చీల్చుకుంటూ బయటికి వచ్చెస్తున్నాయి.

మనసులోనే ఏడ్చాను. బాధ పడ్డాను. ఆలోచించాను.

జీవితాన్ని, ఆ వయసు ప్రేమని ఓ అరలో బిగించడం కష్టం అని అర్థం యింది. అందుకే ఇంటర్ కోసం నేను హైదరాబాదు వెళ్ళి పోయేసరికి, నా మనసులోంచి దుర్గ ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తరవాత పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఇలా ఇక్కడ… ఎదురుగా కనిపించేసరికిఓ పాత, తప్పిపోయిన,ప్రేమికురాలు కాదు, మంచి స్నేహితురాలు కనిపించినట్లనిపించింది. ఇప్పుడు నా మనసులో ఏ విధమైన భావాలు లేవు. నాకుపెళ్ళి అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు.

“ఎలా ఉన్నారు ? “అంటూ అందరిని పేరు పేరునా పలకరించింది.

“ . నువ్వొస్తున్నావని పుండరీ అనగానే మేం అంతా నీ గురించిన ఎన్నోవిషయాలని గుర్తు చేసుకున్నాం, నవ్వుకున్నాం. సంతోషించాము. ఓ పాతికేళ్ళ తరవాత కలుసుకుంటున్నాం. మేం అంతా మా సంగతులు, ఏం చేస్తున్నామో, మా పెళ్ళిళ్ళు, పిల్లలు, వాళ్ళేం చేస్తున్నారో అన్నీ ముందే మాట్లేడేసుకున్నాం. ఇంక ఇప్పుడు నువ్వే మిగిలావు,  చెప్పు. ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, స్కూలు తరవాత ఇదే నిన్ను చూడడం, ఆ తరవాత ఇంటర్ చదివావా, ఏం చదువుకున్నావ్, ఏం చేస్తున్నావు, నిన్ను ప్రేమించి ముకుందం పెళ్ళి చేసుకున్నాడన్న సంగతి వరకు మాత్రమే తెలుసు. నీ పెళ్ళి, పిల్లలు ఈ విషయాలన్నీ చెప్పు. ”

“ చెప్పేందుకేం ఉంది. అంతా మామూలే.”అంది పేలవంగా నవ్వుతూ.

“ అంత చప్పగా తీసి పారేయకు, స్కూల్లో చదువుకునే రోజుల్లో నువ్వు మొగపిల్లలందరికి ఓ కలల రాణివి. ఎంతో మంది నీకు లైనేసే వారు. నేనైతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. పాతవి వదిలెయ్, అందుకని నువ్వు నీ సంగతి చెప్పల్సిందే. “

దుర్గ రాకముందే, పుండరీ మాకు ఆమె గురించి కాస్త చెప్పాడు.

“దుర్గ కుటుంబం మాకు బాగా తెలుసు. వాళ్ళ మూలంగా దుర్గ విషయాలు తెలుస్తూండేవి. వాళ్ళ కులం వాడైన ముకుందం దుర్గని ఏరి కోరి, కట్నం లేకుండా చేసుకున్నాడు. అమెరికా సంబంధం. ఆస్థి బాగా ఉంది. చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడని దుర్గ కూడా ఇష్టపడింది.  పెళ్ళి అయ్యాక ఓ పదేళ్ళు బాగానే ఉందనుకుంటాను. ఆ జీవితానికి, పరిస్థితులకి లొంగిపోయింది. ఆ తరవాత ఏం అయిందో తెలీదు. పిల్లలని తీసుకుని హైదరాబాదు వచ్చేసింది. ప్రైవేటుగా చదువుకుంది. ఇప్పుడు ఎంఫిల్ చేస్తోంది. పిల్లలు కాలేజ్ కి వచ్చాక ఉద్యోగం లో చేరుతుందిట

తన బాధలు, ఎప్పుడూ చెప్పుకోలేదు. చెప్పుకుని ఉంటే బావుండేది.  ఆత్మహత్యచేసుకోబోయింది.అప్పుడు అందరూ రంగం లోకి దిగారు. అమేరికాలోదాని జీవితం అంతా అబద్ధం. లోపల అంతా డొల్ల.తన బాధల్ని, దుఃఖాన్ని తొక్కిపెట్టింది. కష్టాన్ని మరిచి బతకడం నేర్చుకుంది. లోపల సుడిగుండాల్ని దాచుకుంది.ఇవన్ని నేను మీకు చెప్పానని దుర్గకి తెలీనివ్వద్దు. మీరు మామూలుగా మాట్లాడండి. “ అని అన్నాడు.

అలాగే అన్నాం. అందుకే ఏం తెలీనట్లుగా మాట్లాడడానికి ప్రయత్నించాం.

“ఏం చెప్పాలి, ఆ బిట్టర్ రిలేషన్ లో జీవితాన్ని ఎన్నాళ్ళు కొనసాగించగలను. ముందే వీసాకోసం ఓ అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. ఆ సంగతి ఎవరికీ తెలీదు. జీవితంలో స్వార్థాన్ని, దుర్మార్గాన్ని, మోసాన్ని, రాక్షసత్వాన్ని చూసాను. ఏమాత్రం భరించలేని స్థితికొచ్చాను. ఇప్పుడు విడిపోయాం. పిల్లలని తీసుకుని హైదరాబాదులో ఉంటున్నాను. “ఏదో మామూలుగా చెప్పినట్లుగా చెప్పింది. ఆ వెనక ఉన్న దిగులు మా అందరికి కనిపించింది,

భయంకరమైన నిశ్శబ్దం.

“ వినరానిది విన్నారా ! “ అంది మెల్లిగా.

“ అదేం లేదు, ఇది చాలా కామన్ అయిపోయింది. ఎవరూ విడిపోవాలని అనుకోరు, ఎందుకు విడిపోయారు అని అడగను, ఏదో కారణం ఉండే ఉంటుంది.కాని విడిపోయే ముందు ఆలోచించావా, పిల్లల సంగతి ఆలోచించావా? “ అని అడిగాను.

“చాలా ఆలోచించాను, ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు, పదేళ్ళు, ఆలోచించాను. ముకుందం ఉద్యోగం మంచిదే,కాని నాకో సవితి కూడా ఉంది, ఏమాత్రం అంగీకరిచలేని జీవితం. ముకుందం రాక్షస ప్రవర్తననితట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళి పోతున్నాను.

నన్ను నేను రక్షించుకోవాడానికి ఇంత కన్నా మరో మార్గం కనిపించ లేదు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. అన్ని పూర్తిగా కాకపోయినా మా మధ్య జరుగుతున్న గొడవలు వాళ్ళకి కాస్తగా తెలుస్తున్నాయి, ఇంకా పూర్తిగా  అర్థం కాకముందే, మా ఇద్దరి గురించి ఓ నిర్ణయానికి రాక ముందే, వాళ్ళని మంచి పిల్లలుగా, పౌరులుగా దిద్దాలంటే అతనికి దూరంగా ఉంచాలి.” ఆ కళ్ళల్లో కొంచెం దిగులు,

ఒకప్పుడుఆ అందమైన కళ్ళలో వెలుగులు చూసాం. భావి గురించి కలలు కనే వయసులో  ఆ కళ్ళని చూసాం.ఓ నాలుగు జలతారు కలల కోసం కళ్ళని కన్నీళ్లకి అమ్ముకుందా! ఆ కలలు ఏవీ? ఎక్కడ పారేసుకుంది? కాని ఇప్పుడు కొత్త కలల్ని కంటోందనే అనుకుంటాను.

“ ముందు ఏదో తప్పుచేస్తున్నానిపించింది. మా వాళ్ళేం అనుకుంటారు, సమాజం ఏం అనుకుంటుంది, నా తలిదండ్రులు, నా పిల్లలు, దేవుడు. ఎవరికి సంజాయిషి ఇచ్చుకోలేకపోతున్నాను. కన్ఫ్యూజన్, ఫియర్, ఫెయల్యూర్, డిసప్పాయింట్మెంట్. మాపెళ్ళి బంధాన్నిఎలా డిఫైన్ చేయాలో అర్థం కావడం లేదు.. అయినా బంధాన్ని బిగించి ఉంచడానికే చాలా ప్రయత్నించాను, కష్టపడ్డాను. విసిగి పోయాను, అలిసిపోయాను. నా సమస్య గురించి ఆలోచిస్తూంటే రోజు రోజుకీ అది పెద్దదవునట్లుగా అనిపించింది. ఏం చెయ్యగలను ఎలా చెయ్యగలను అని ఆలోచిస్తూంటే, అవకాశాలు  కనిపించడం మొదలెట్టాయి.

జీవితం ఎప్పుడూ సరళ రేఖ వంటి గమనం తో నడవదు. కాస్త గతి తప్పింది. అలా అని ఏ మజిలీ దగ్గర సెద తీర లేదు. వెనకకు తిరిగి నడిచి వచ్చిన దారిని చూడలేదు. నాది రిలే పరుగు, అక్కడినుంచి ఆ దార్లోంచి ఇక్కడికి, ఈ దార్లోకి వెంటనే వెళ్ళాను. నా అనుభవం పాదరసంగా మారింది. నా కంట్లోంచి జారిన ప్రతీ కన్నీటి బొట్టు జారిపోయేట్లు కాలాన్ని తామరాకులాగానునుపు దేర్చుకుంది, నాకు ఎవర్ని చూడాలని ఉండడం లేదు.నలుగురిలోకి వెళ్ళాలని లేదు. ఇప్పుడు మీరంతా వస్తున్నారని అంటే…“అని అందరిని చూసింది.

.“ అవును మీరంతా వస్తున్నారని నేనే దుర్గని రమ్మన్నాను, రానంది. కాని, నేను కాస్త మార్పుంటుందని, మనసు కొంచెం డైవర్ట్ అవుతుందని బలవంతం చేసాను.” అని అన్నాడు అంత వరకూ అక్కడే ఉన్న పుండరీ.

“ మాఊరుకి రాకూడదా, ఇంత దూరం వచ్చి, మా పిల్లలని చూడరా, మా వెనక వీధిలో తీర్థం కోసం ప్రభని తయారు చేస్తారు. మా వ్యాఘ్రేశ్వరం ప్రభ అంతెత్తున ఉంటుంది. తయారైన ప్రభలని, జగ్గన్న తోటలో, ఏకాదశరుద్రులు సమావేశంలో చూసాం. ఇప్పుడు ఆ ప్రభని వేటితో, దేనితో ఎలా చేస్తారో,ఎలా అలంకరిస్తారో అంతా చూడచ్చు. మీరు అందరూ రండి. చూద్దురుగాని,”అంటూ కళ్లతో మరోసారి వెళ్తున్నానని చెప్పింది.

నాలోని సగటు మొగాడు పైకి లేచాడు.

నేను చేసుకుని ఉంటే….దుర్గ జీవితం ఇంత కన్నా బావుండేది కదా…

Written by Ganti Bhanumati

గంటి భానుమతి.
ఐ బ్లాక్. Flat no. 205,
May Flower park Apts.
Annapurna colony
Mallapur.
Hyderabad 500076.
.మొబైల్ ...889777643009.

One Comment

Leave a Reply
  1. పడిలేచిన కడలి తరంగాన్ని స్ఫూర్తిగా తీసుకున్న దుర్గ (జలతారు కలలు ) పాత్ర దయనీయత కంటే స్ఫూర్తిమంతంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉషోదయం