“మనలో చాలామందికి ఉచిత సలహా ఇచ్చే అలవాటు ఉంటుంది. వారిచ్చే సలహాలు ఎదుటివారు పాటిస్తున్నారా? లేదా? అన్నది కూడా ఆలోచించరు. వీరు తోటి స్త్రీలకు కిచెన్ లో ఏ ఏ వస్తువులు ఎలా సర్దుకోవాలి దగ్గర నుంచి ఎటువంటి నగలు కొనుక్కోవాలి వరకూ తమ అమూల్యమైన సలహాలు ఇస్తుంటారు. మరికొంతమంది ఎదుటివారి వ్యక్తిగత విషయాలలో సైతం తమ ఆధిపత్యం నిలుపుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఇటువంటివారిని గూర్చి ఆంగ్లంలో ఓ నానుడి ఉంది. అదేంటంటే అడక్కుండా సలహాలు ఇవ్వకండి విజ్ఞులకు అవి అక్కర్లేదు. మూర్ఖులు వాటిని పాటించరు.
మరైతే జీవితంలో ఎవరికీ ఎప్పుడూ సలహాలు ఇవ్వకుండా ఎలా కుదురుతుందని మీరు అడగవచ్చు. నిజమే. సలహాలు ఇవ్వచ్చుగాని కొన్ని సందర్భాలలో మాత్రమే! అందుకే ఎప్పుడు సలహాలు ఇవ్వకూడదు, ఏ సందర్భాలలో ఇవ్వచ్చు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మొదటగా, ఎదుటివారి సమస్యకు మీకు పరిష్కారం తెలిసినా జరగకుండా సలహా ఇవ్వకూడదు. ఎందుకంటే కొంతమంది ఒక్కొక్కసారి ఎదుటివారికి, తమ కోణంలో నుంచి ఆలోచించి సలహాలు అడగకుండానే ఇస్తుంటారు. అలా ఇచ్చిన తర్వాత, ఎదుటివారు, మా దృక్కోణం నుంచి ఆలోచిస్తే మీ సలహా పాటించదగినది కాదు అని నిర్మొహమాటంగా చెప్పారనుకోండి, అడగ్గకుండానే సలహాలు ఇచ్చినవారు ఒక్కసారిగా గాలి తీసేసిన అనుభూతిని పొందాలి. ఎదుటివారి దృష్టిలో చులకన అవడమే కాకుండా ఉచిత సలహా రాయుళ్ళుగా ప్రసిద్ధి పొంది అందరూ వీరి దగ్గర నుంచి తప్పించుకుని పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
ఒక్కొక్కసారి ఎదుటివారే వచ్చి మనల్ని ఏ విషయంలోనైనా సలహా ఇవ్వమని అడగడం సంభవిస్తుంది. ఆ సందర్భంలోనైతే ఎదుటివారు ఏ రంగంలో అయితే మనల్ని సలహా అడగారో ఆ రంగంలో మనం నిష్ణాతులమయితేనే సలహా ఇవ్వాలి. ఉదాహరణకు మీ స్నేహితురాలు వచ్చి “మేము కారు కొనాలనుకుంటున్నాము. నాకు కార్ల గురించి పెద్దగా తెలియదు. ఏ కారు కొంటే బాగుంటుందో సలహా చెప్పు” అని అడిగారనుకోండి. అప్పుడు మీకు కార్ల గురించి నాల్టెజీ బాగా ఉంటే మీరు కారు కొనుక్కోవడంలో సలహా తప్పక ఇవ్వచ్చు. కానీ కార్ల గురించిన పరిజ్ఞానం లేకపోతే ఎటువంటి సలహా ఇవ్వకండి. మాకు కార్ల గురించి అంతగా ఏమీ తెలియదు అని నిజాయతీగా ఒప్పేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు గనుక కార్ల గురించి మిడి మిడి జ్ఞానంతో మీరిచ్చిన సలహా వికటిస్తే ఎదుటివారు ఆ నెపం మీ మీదే వేసే ప్రమాదం ఉంది.
ఇక కొంతమంది వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటారు. చాలావరకు అటువంటివారు వచ్చేదే తమ గోడు వెళ్ళబోసుకోవడానికే. ఇంకా చెప్పాలంటే వారికి కావాల్సింది ఒక శ్రోతమాత్రమే. అందుకే వారికి ‘ఇలా చేయండి’, ‘అలా చేయండి’ అని సలహాలు ఇవ్వకుండా, సమస్యలను సానుభూతితో వినడమే కాకుండా కష్టకాలంలో తోడుగా మనమున్నామనే నమ్మకం కలుగజేయాలి. అందుకే మనం చేయవలసిందంతా వారి మనోభావాలను అద్దంలా ప్రతిఫలింపచేస్తూ కొన్ని ప్రశ్నల ద్వారా వారి సమస్యను కూలంకషంగా విశ్లేషింపచేసి దానికి పరిష్కారం వారి చేతనే చెప్పించాలి.
ఇక ఎదుటివారు సలహా అడగకపోయినా మనం చెప్పి తీరవలసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఉదా : మనం తగిన సలహా ఇవ్వకపోతే ఎదుటివారికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులలో తప్పక సలహా ఇవ్వవలసిందే. అడగకపోయినా, ఎలా అంటే ఒసారి మా చుట్టాలమ్మాయికి జాండీసం (పచ్చకామెర్లు) వచ్చింది. మొదటిదశలోనే ఉంది. కానీ అ అమ్మయాి పసిమిఛాయ కావడం మూలాన జాండీస్ వల్ల శరీరం పచ్చగా అయినా ఆ రంగులో అమ్మాయి రంగు కలిసిపోయి ఇంట్లోనివారు కనిపెట్టలేకపోయారు. ఆ సమయంలో ఆ అమ్మాయి మేనమామ వాళ్ళింటికి వెళ్ళడం జరిగింది. తమాషా అతను ఆ అమ్మాయి రంగు పచ్చగా ఉండటం గమనించి తన అక్కకు ఈ విషయం చెప్పాడు. డాక్టరు వద్ద చేయించిన టెస్టులలో అ అమ్మాయికి జాండీస్ అని తేలింది. కనుక ఇటువంటి సందర్భాలలో సలహాలు చెప్పడం కూడా ఒక విధంగా ఎదుటివారికి నష్టం జరగకుండా ఎదుటివారిని కాపాడినట్లు అవుతుంది. అందుకని ఇటువంటి సందర్భాలలో అడగకుండానే సలహాలు ఇవ్వవచ్చు.
ఇక ఎదుటివారి వ్యక్తిగత విషయాలలో అడిగినా సలహా చెప్పకూడదు. ఎందుకంటే ఎదుటివారి వ్యక్తిగత విషయాలలో అన్ని కోణాలు మనకు తెలియవు. కనుక మీరు ఉచిత సలహా ఇచ్చేవారి చేతిలో బలయిపోతున్నారా? అయితే వారి నుంచి తప్పించుకోవడానికి ఓ సూచన. ఎవరైనా మనకు ఉచిత సలహాలు ఇచ్చేవారు తారసపడ్డప్పుడు మనం చేయవలసిందల్లా వారి మాటలకు స్పందించకుండా ఉండడమే. అలా కాకుండా మనం వారితో కనుక ‘అలా కాదండి ఇలా అండీ’ అనో లేకపోతే ‘నేను ఫలానా పనిని ఈ కారణం చేత చేశాననో’ సంజాయిషీ ఇవ్వకుంటే మాత్రం వారు మన మీద ఇంకా అధికారం చెలాయించడానికి అవకాశం ఇచ్చినవారం అవుతాము. కనుక ఇంకోసారి మీరు మీ ఇచుత సలహా రాయుళ్లని కలిసినప్పుడు సాధ్యమైనంత వరకూ ఈ చిట్కా పాటిస్తారు కదూ!
చాల చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలు.
చాల చక్కగా వివరణ యిచ్చారు.