నిన్నటి సంగతి మనకేల..

“గతం గతః” అన్నారు పెద్దలు. గతంలో మనకు సంభవించిన చేదు అనుభవాల గురించీ, కష్టనష్టాల గురించీ, అపజయాల గురిం కుంగిపోవటం వల్లగానీ, దుఃఖించడం వల్లగాని మనం ఎటువంటి ప్రయోజనం పొందలేము. ఎందుకంటే గతమన్నది గడిచిపోయిన కాలం. అందుకే గతాన్ని తలచుకుని కృంగిపోవడమంత మూర్ఖత్వం మరోటి లేదు. దీన్నే సంస్కృతంలో గతజల సేతు బంధనం అంటారు. అంటే గతాన్ని తలచుకుని బాధపడటం, ప్రవహించిపోయిన నీటికి ఆనకట్ట వేయడం లాంటిదని అర్థం.

అయితే గతంలో మనం చేసిన పొరపాట్లు తప్పులూ వర్తమానం, భవిష్యత్తులోనూ పునరావృత్తం కాకుండా చూసుకోగలిగితే చాలు అవే మన  విజయాలకి సోపానాలు కాగలవు.

అలా కాకుండా గతాన్ని తలచుకుని, అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందేనని అనుకుంటూ ఆ జరిగిపోయిన సంఘటనలకు తామే బాధ్యులను భావించి ఎంత ఎక్కువగా బాధపడతామో ఆ బాధ అంతే ఎక్కువగా మన శారీరిక మానసిక ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉంది.

మా చుట్టాలమ్మాయి ఒకామె భర్తతో ఓ ఎనిమిదేళ్లు కాపురం చేశాక ఇక అతనితో జీవితం కొనసాగించటం అసంభవం అని నిర్ణయానికి వచ్చేసి విడాకులు తీసుకుంది. కోర్టు ఏడేళ్ల కొడుకు కస్టడీ తల్లికే అప్పగించటం జరిగింది. ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు మంచి జీతం వచ్చే ఉద్యోగం అన్నీ ఉన్నాయి కానీ విడాకుల అనంతరం నలుగురూ ఆమెను గురిఁచి నాలుగు రకాలుగా అనుకోవటఁ విని తట్టుకోలేకపోయింది. విడాకులు తీసుకుని తనేమైనా తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఎంతో మానసిక వేదనకు గురైంది. ఓ రకమైన డిప్రెషసంలోకి వెళ్ళిపోయింది. సమయానికి ఆమె తల్లిదండ్రులు ఆమెకు మానసికఁగా అండగా ఉండబట్టి కోలుకుంది. లేకుంటే ఏ అఘాయిత్యానికైనా పూనుకొనేదే. ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక దాని గురించిన సెకెండ్ థాట్స్ కి తావివ్వ కూడదు. ఎటువంటి పరిణామాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలిగే మనస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి.

తల్లిదండ్రులను ఎదిరించి చేసుకునే ప్రేమ వివాహాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ప్రేమ వివాహం చేసుకునే ముందు తల్లిదండ్రులను ఎదిరించి చేసుకుంటున్నాము. కాబట్టి ఇక భవిష్యత్తులో వారి వద్ద నుండి మనకు ఏవిధమెనా ఆసరా ఉండబోదు అని మానసికంగా సంసిద్ధులైన తరువాతే ముందడుగు వేయాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక గతాన్ని తలచుకుని అయ్యో తప్పుచేసామా? అందరిలాగా మనకు తల్లిదండ్రుల అండ లేకుండా పోయిందేమోనని బాధపడి కృంగిపోకూడదు.

మరో ఉదాహరణ చూద్దాం . నాకు తెలిసిన ఓ ఆయన అతని తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. చిన్నతనంలో అంతా కలిసి ఓ పట్టణంలో స్వంత ఇంట్లో ఉండేవాళ్లు.  అతను సిటీలో చదువుకున్నాడు. తరువాత అతనికి పెళ్లైంది. అప్పుడతనికి డబ్బు సంపాయించాలన్న తపన కలిగింది. మామూలు ఉద్యోగంలో అంత సంపాదించలేమని,  వ్యాపారం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన తల్లిదండ్రులతో సహా సిటీలో కాపురం పెట్టి, వ్యాపారం మొదలుపెట్టాడు.

కానీ అనుభవం లేని కారణంగా వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాడు. ఆ దిగులుతో  దిగులుతో తండ్రి మరణించాడు. చేసేది లేక చిన్నా చితకా ఉద్యోగం చేసి ఎలాగో సంపాదించి చాలీ చాలని జీతంతో భార్య ఇద్దరు పిల్లలు, కన్నతల్లినీ పోషించలేక ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో తల్లి కొడుకు ఆస్తి అంతా హారతికర్పూరంలో

‘హరించి వేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. కనిపించిన ప్రతి వారితో కన్నకొడుకు చేసిన నిర్వాకం గురించి చెప్పి వాపోయేది

కానీ ఆ కోడలు మాత్రం అధైర్యపడకండా ఉన్నదాన్లోనే పొదుపుగా కాపురం చేస్తూ పిల్లవాడిని తన నగలు తాకట్టు పెట్టి ఇంజనీరింగు చదివించింది. అతను కూడా చదువు కాగానే ఇక్కడుండే ఓ కంపెనీ లో చేరారు కొద్దిరోజులకే అతన్ని ఆ కంపెనీ వారు అమెరికా పంపించారు. కొడుకు అమెరికాలో అంతకన్నా మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు డాలర్స్ పంపడం మూలంగా కుటుంబం తిరిగి తమ పూర్వవైభవాన్ని సంతరించుకుంది.

పైన చెప్పిన ఉదాహరణలో గతాన్ని తలుచుకుని ఆ వృదత పోతే, పాజిటివ్ థింకింగ్ తో తమ పరిస్థితులను తారుమారు చేయడంలో సఫలీకృతురాలైంది.

ఓ అబ్బాయి చిన్నప్పుడు తనకు డాక్టరు కావాలని ఉన్నా, తల్లి మాట కాదనలేక కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్లి అక్కడ ఎమ్.ఎస్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు.

ఇప్పుడు డాక్టరు కావాలన్న తన చిరకాల వాంఛను తీర్చుకోవడానికి మెడిసిన్లో చేరబోతున్నాడు. గతాన్ని తలచుకుని కుమిలిపోయేకన్నా పాజిటివ్ థింకింగ్ తో జీవితాన్ని సఫలం చేసుకోవచ్చన్న దృక్కోణానికి ఇదొక చక్కని ఉదాహరణ.

 

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి

పాట