పగటి కలలు

గేటు దగ్గర నిలుచుని చూస్తూ ఉంటే ఒకసోది చెప్పే అమ్మాయి వెళ్తూ కనబడింది. మనిషి అందంగ ముచ్చటగడింది. సోది వాళ్లు జరగబోయేవి చెపుతారని చిన్నప్పుడు విని ఉన్నందున, నాకు నా గురించి ముందు సంగతి ఏమి చెపుతుందో వినాలని ఆసక్తి కలిగింది. అదీగాక కాస్త కాలక్షేపం కూడా అవుతుందని ఆమెను పిలిచా. అది లోపలికి రాగానే నా చేయి అందుకొని చూసి ఇహ మొదలుపెట్టింది. సోది, సోది చెపుతానే తల్లి, ఉన్నది ఉన్నట్లు చెపుతా, లేనిది కల్పించి చెపుతా, ప్రధానమంత్రి మీద ఆన, మన ముఖ్యమంత్రి మీద ఆన, దేశ దేశాల పెద్దోళ్ళ మీద ఆన, నీ మీద ఆన, నా మీద ఆన, ఉన్నది ఉన్నట్లు చెపుతా, వినుకో మరి.

నీ చేతిలో రాజయోగం ఉందే తల్లి. పైసలు మస్తుగా వస్తయి. పదవి కూడా వస్తదే తల్లి. నాకు పదవి ఎలా వస్తది అనుకోకే తల్లి. చదువు తక్కువ అనుకోకే తల్లి. ఈ రోజుల్ల చదువు తక్కువ చదివితేనే పదవి వస్తాది తల్లి. అయినా మన దేశంలో పదవి పట్టటానికి చదువు అక్కరలేదమ్మా. ఎదుటివాళ్లను ప్రశ్న అడగనీయకుండ అదుపుల పెట్టగలిగితే చాలు తల్లి. ఇంట్లో అయినా, పార్లమెంటంలో అయినా అంతే తల్లి. ఇంట్లో అయినా, పార్లమెంట్లో అయినా అంతే తల్లి. ఇదే పద్ధతి ఎక్కడయినా తల్లి. ఎదుటివాళ్లను మాట్లాడనీయకూడదు అంతే. సలహాలు అసలే చెప్పనీయకూడదు. అది నీ చేతిలో రేఖ ఉండే అమ్మా. అందుకే చెప్తున్నా నీకు రాజయోగం ఉందని పదవి తప్పక వస్తుంది. ఆ పదవి మంచిగ నిలుపుకోవాల అంతే.

ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలలో పోటీ చేయి. ముందుగ జర కాళ్లు కీళ్లు జాగ్రత్త పెట్టుకో. పాదయాత్రలు చేయాలే అమ్మ. ఊళ్ళన్నీ తిరగాలి. అందుకే ఆరోగ్యం బాగా చూసుకో. ఈ లోపుగ వీలయితే ప్రక్కవాళ్ల స్థలంలో రాత్రికి రాత్రే గోడకట్టెయ్యి. వాళ్లు యాగీ చేసి పోలీసోళ్లను తెస్తారు. నిన్ను జైలుకు పంపుతారు.  పలుకుబడి ఉన్న పెద్దోళ్ల మాటమీద, బెయిల్ మీద నిన్ను విడుస్తారు. బయటికి వచ్చాక జనం హారతులు ఇస్తారు. కార్లబండిలో ఊరేగిస్తారు. బ్రహ్మరథం పడతారు. పేరు వస్తది. అప్పుడు మొదలుపెట్టాలే ఊర్లు తిరగటం. అందుకే చెప్తున్నా. బాగా తిను. మందులు వేసుకో. ఆరోగ్యం పెంచుకో. మారుమూల గ్రామాలకు వెళ్ళలి. పల్లెవారితో కలిసి ఆడాలి, పాడాలి, డప్పు వాయించాలి. వారితో కలసి క్రింద కూర్చుని తినాలి. పిల్లలను ఎత్తి ముద్దాడాలి. వంగి, వంగి దణ్ణాలు పెట్టాలి. రోడ్లు చిమ్మాలి. ఫోటోలు దిగాలి, చిమ్ముతూ. అందుకే చెపుతున్నా, మంచిగా తిను. మస్తుగా తయారుకా.

నీ మంచి కోరి చెప్తున్నా. పైసలు నిలువ చేసుకో. పదవి వచ్చాక పదవి కాపాడుకో. మరిగే వస్తా. నీకు పదవి వచ్చాక నన్ను మరవకు. నన్ను నీ క్రింద పెట్టుకో. పనులు చేసి పెడతా. నాకు అందరి సంతకాలు చూసి చేయగల దిమాక్ ఉంది. అందరిని సమంగ చూడవే తల్లి. ఈ కాలం జనం తెలివి మీరారు. అందరిని ఒక్కటిగా చూసుకోకుంటే ప్రాణం తీస్తారే అమ్మ. సంపాయించినదంతా వదిలేసి, ఇల్లు, వాకిలి వదిలి, ఆస్తిపాస్తులు వదిలి పారిపోవాలని వస్తుందే తల్లి. అందుకే పదవి వచ్చాక అందరిని సమంగా చూసుకో.

చెప్పవలసినవి అన్నీ చెప్పాకే బిడ్డ. మరళా వస్తా. ఒక మంచి పట్టు చీరె ఇయ్యవే తల్లి. నీకు పదవి వచ్చిన నాడు కట్టుకొని వస్తా. అందరు ఇసుకునేటట్లు నీ దయ పొగడతా. ఉంటానే అమ్మ. సోదీ, సోదీ, సోదీ.

అది అడిగినట్లుగ దానికి పట్టుచీరే ఇచ్చి పంపి, అది వెళ్లినాక దాని మాటలు గుర్తు తెచ్చుకుంటూ సంతోషసాగరంలో మునిగిపోయా నేనేదో మంత్రి నయినట్లుగ కలలు కనసాగా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సీతాకుమారి.ఒ చిత్రించిన రేఖాచిత్రాలు

ఓ అభాగ్య జీవి – యథార్థ జీవి – తగాథ