అప్రమత్తం చెయ్యాలి…

మనకు తెలిసింది కదా అని సరిపెట్టుకుంటే ఎలా? ప్రక్క వారికి విషయాన్ని చెప్పి అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది కాదా. ఇప్పుడు మనము ఒక రెస్టారెంట్ కి వెళ్తాం. అక్కడ ఫుడ్ కానీ రుచిగా వుంటే ఫలానా హోటల్లో పలానా డిష్ బాగుందనో, లేకుంటే బాగోలేదనో మన అనుభవాలను తోటి వారితో ముచ్చటిస్తాం. దాంతో వారు కూడా అప్రమత్తమై మంచి ఆహారం దొరికే చోటుకు వెళ్లి తినడం వల్ల ఆనందాన్ని పొందుతారు. అదే తెలియని ప్రాంతానికి వెళ్లి ఆహారాన్ని తింటే అది నచ్చకపోగా, అధిక ఖర్చు కూడా భరించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏమిటంటారు మనం ఎక్కడికి వెళ్ళామో, ఆ వెళ్లిన చోటు బాగుందో లేదో అని పనిగట్టుకుని అందరికీ చెప్పాలనా మీ ఉద్దేశమని నా పై కారాలు మిరియాలు నూరకండి…. నేను ఒక వైద్య విద్యార్ధిని కనుక అందరికీ అర్థమయ్యేలా ఈ ఉదాహరణను వివరించానే కానీ నా ఉద్దేశం అది కాదు.
అసలు విషయం ఏమిటంటే మనలో కులాలు, మతాలు, వర్ణాలు వర్గాలు అన్న భేదాలు ఎన్ని ఉన్నా సరే…మన భారతదేశపు జనాభాలో మాత్రం ఎక్కువ శాతం మధ్యతరగతి కుటుంబాలే. రెక్కాడితే కాని డొక్కాడని
పరిస్థితి వీరిది. కుటుంబ సమస్యల రీత్యా వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎంతో కొంత పొదుపు చేస్తూ
అవసరానికని కొద్ది కొద్దిగా డబ్బుని కూడ పెట్టుకుంటూ ఉంటారు. అయితే వీరు వారి అమాయకత్వం వల్ల
ఖర్చు గురించి మాత్రమే ఆలోచిస్తూ, అనుకోని సమస్యలను ఎదుర్కొంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అది ఎలా అంటారా? పెద్ద ఆసుపత్రులకు వెళితే డబ్బు చాలా ఖర్చవుతుందని నాణ్యతలేని ఏదో ఒక చిన్న హాస్పిటలకు పరుగులు తీస్తారు ఈ పేదవాళ్ళు. ఆ హాస్పిటల్లో సదుపాయాలు, పరిస్థితుల గురించి అవగాహన అసలు ఉండదు వీరికి. దానితో వీరిని అమాయకుల్ని చేసి దొరికినంత డబ్బును గుంజేస్తుంటారు. డబ్బులు పోతే పోయాయి అదే ప్రాణాల మీదకు వస్తే? ఓ నిండు గర్భిణీ నొప్పులతో అల్లాడుతుంటే దగ్గర్లో ఉన్న ఏదో ఒక చిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు ఆమె బంధువులు. పరిస్థితి విషమించాక సరియైన పరికరాలు లేక, సదుపాయాలు లేక, అనుభవం లేని సిబ్బంది చేతికి ఆమెను అప్పగించి చివరకు ప్రాణాలు కాస్తా విడిచాక లబోదిబోమని కొట్టుకుంటారు.
అనవసరంగా డబ్బుల కోసం ఆలోచించి నిండు ప్రాణాన్ని కోల్పోయామంటూ జీవితాంతం బాధ పడుతూ ఉంటారు. ఇలాంటి దుస్థితి అవసరమా చెప్పండి? అందుకే ముందుగానే విషయాలను వివరంగా తెలుసుకుని వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితులను సులువుగా ఎదుర్కోగలం. ప్రాణాలను కాపాడుకోగలం. మనం మాత్రమే అప్రమత్తమైపోతే సరిపోదు. మన ఇరువు పొరుగు వారికి కూడా సూచనలు అందిస్తూ వారికి తెలియకపోతే తెలియని విషయాలను వివరిస్తూ, మనకు జరిగిన దుర్ఘటన మరల పునరావృతం కాకుండా మరో కుటుంబాన్ని, మరో జీవితాన్ని కాపాడే బాధ్యత కూడా మనమే తీసుకుందాం.
ఆస్పత్రులకు వెళితే పొగ తాగరాదు అని, చెప్పులు బయట విడిచి రావాలని ఇలా అనేక సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి చదువు రాని వారికి ఆ విషయం తెలీదు కదా వారు పొరపాటున ఆ పనులు చేస్తూ ఉంటే వారికి చెప్పి వాటిని పాటించేలా ప్రోత్సాహాన్ని అందించాలి. అప్పుడే మనతోపాటు, మన కుటుంబంతోపాటు సమాజం కూడా సుభిక్షంగా మానవతా భావంతో శోభిల్లుతుంది. ఇదంతా చదివాక “సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి సాయపడవోయ్ అన్న గురజాడ వారి మాట గుర్తుకు వస్తుంది కదూ. ఇక్కడ ప్రస్తావన లాభం నష్టం గురించి కాదు సాటి మనిషికి సాయం అందించడాన్ని గురించి…నేను ఇంకా మా పేషెంట్స్ ని,
చదువు రాని వాళ్ళని నా పరిజ్ఞానం మేరకు జాగ్రత్త పరిచే పనిలో ఉంటాను….మరి మీరో…!


డా.నీలం స్వాతి,
చిన్న చెరుకూరు గ్రామం,
నెల్లూరు.
6302811961.

Written by Dr.Neelam Swathi

చిన్న చెరుకూరు గ్రామం,
నెల్లూరు.
6302811961.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గణపతి పుట్టిన రోజు వేడుకలు

ఆమె మారింది