స్త్రీలు నేడు పురుషులతోసమానంగాఅన్నిరంగాలలోరాణిస్తున్నారు. పురుషులతో సమానంగా స్త్రీలకి సమాన అవకాశాలను కల్పించడం హర్షించదగినదే అయితే సమాన అవకాశాలకల్పనని స్త్రీ పురుష సమానత్వంగా భావించవచ్చా!? అంటే ఆలోచించాల్సిందే.
ఒక విత్తు మహావృక్షం కావలంటే అది ఎదగడానికి కావల్సిన పరిస్థితులని కల్పించవలసి వస్తుంది. సమానత్వం కేవలం ఆర్థిక అవకాశాలకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. సమాన అవకాశాలని సృష్టించడం సమానత్వాన్ని లేదా సమాన హోదాని కల్పించినట్లుకాదు.
సమానత్వం ముందుగా గౌరవంతో మొదలు అవుతుంది. ఏబెరుకు తొణుకు లేకుండా నిర్ణయాలను తీసుకోవడంలో, ఏభయమూ , న్యూన్యత లేకుండా పనిచేయగలిగిన వాతవారణంలోనూ ఉంటుంది సమానత్వం.
స్త్రీలు తము పనిచేసేచోట పురుషుల ప్రవర్తనని గమనించుకుంటూ ఉండాలి. పనిచేసే చోట్లలో వీలైనంత వరకు తమ కుటుంబ మరియు వ్యక్తిగత విషయాలనుపంచుకోకుండా ఉంటే మేలు. తోటి స్త్రీలవల్ల కూడా ఒక్కోసారి అపాయం కలిగే అవకాశం లేకపోలేదు కాబట్టి విషయ గోప్యత ననుసరించి ఎవరితో ఎంతవరకు పంచుకోవచ్చు అన్న పరిధి పట్ల అవగాహన కలిగి ఉంటే మేలు.
స్త్రీల పరిరక్షణకై రాజ్యాంగము మరియు దేశచట్టాలు అనేక నింబంధనలని రూపొందించడం జరిగింది. జరుగుతోంది కూడా. అయితే వీటి పట్ల అవగానలేక కొంత, తరువాతి పరిణామాలు యెలా ఉంటాయో అన్న భయంవల్ల కొంత కూడా స్త్రీలు తమకి కల్పించిన హక్కులని ఉపయోగించుకోవడంలో ఇంకా విఫలమవు తున్నారు.
పని ప్రదేశాలలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టే దిశగా 2013 లో భారత ప్రభుత్వం కార్యక్షేత్రాలలో మహిళా లైంగిక వేధింపు నిరోధక, నిషేధ మరియు సంస్కరణ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కార్యాలయాల్లో, కార్యక్షేత్రాలలో లైంగిక వేధింపుల నుండి స్త్రీలకు రక్షణ కల్పించడం. ఈ చట్టం “పనిప్రదేశం” అనే పదాన్నిచాలా విస్తారంగా నిర్వచించింది. ప్రభుత్వ సంస్థల నుండి మొదలుకొని చిన్నచిన్న వ్యాపార కేంద్రాలు, సంఘటిత, అసంఘటిత, వ్యవస్థీకృత , అవ్యవస్థీ కృతరంగాలైన వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగంలో, వస్తు ఉత్పత్తి, సేవారంగాలు.. ఇలా యెక్కడైతే పని సంబంధ కలాపాలు నిర్వహింపబడతాయో ఆయా ప్రదేశాలన్నిటా స్త్రీలకి భద్రత , రక్షణ కల్పించడం ఆ యజమాని లేదా సంస్థ యొక్క బాద్యత.
శారీర కస్పర్శ మాత్రమే వేధింపులు కావు. అటువంటిచర్యలకి పూనుకొన తలచిన, లైంగిక లేదా తత్సంబంధ కోరికలు కోరిన, అసభ్య లేదా ద్వందార్థల సంభాషణ జరిపినా, హాస్యమాడినా , ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉదాహరణకి వాట్సప్‌లో పంపిన అశ్లీల , అసభ్య చిత్రాలు లేదా అటువంటివి పద జాలం కూడా వేధింపుల కిందికి వస్తుంది. అలాగే అటువంటి చర్యలను వ్యతిరేకించినపుడు ఉద్యోగానికి సంబంధించిన బెదిరింపులు కాని మరే ఇతరత్రా బెదిరింపులకు కాని పాల్పడినా కూడా అది చట్టప్రకరం నేరమే అవుతుంది.అవమానకరంగా , నీచంగా ప్రవరించినా సూటిగా చెప్పాలంటే స్త్రీల గౌరవానికి, భద్రతకి భoగం కలిగించే ఏ చర్యైన వేధింపుల క్రిందికి వస్తుంది. ఈ వేధింపులు తోటి ఉద్యోగుల నుండి మొదలుకొని పైస్థాయి, కింది స్థాయి ఉద్యోగులు లేదా పని కల్పించిన యజమాని వరకు యెవరు వేధించినా ఈ చట్టప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.
చట్టం ఏం చెబుతోంది?
పది లేదా అంతకన్నా ఎక్కువ ఉద్యోగస్థులు పని చేసే చోట తప్పని సరిగా ఈ చట్టం అమలు లో ఉండాలి. అంటే ఈ చట్ట ప్రకారం స్త్రీల భద్రతకై ఏయే నిబంధనలు నియమాలు ఉండాలో అవి అమలులో తప్పక ఉండాలి .ప్రతీ సంస్థ తమ యొక్క ఉద్యోగినుల భద్రత కోసం ఒక నియమావళి ని రూపొందించాలి. ఆ నియమావళి గురించిన అవగాహన ప్రతీ ఉద్యోగికి కల్పించాలి.
సంస్థ తప్పనిసరిగా ఒక అధ్యక్షురాలు నలుగురు సభ్యులతో కూడిన ఒక అంతర్గత కమిటీ కలిగి ఉండాలి. సభ్యులు సంఖ్య సంస్థ పరిమాణం మరియు స్వభావాన్ని బట్టి మారవచ్చు . అయితే కమిటీ లో 50% సభ్యులు మహిళలే అయి ఉండాలి. అలాగే అధ్యక్షురాలు సంస్థ యజమాని కాకూడదు. ఆమె అదే సంస్థలో సీనియర్ స్థాయి ఉద్యోగిని అయి ఉండాలి . మిగిలిన సభ్యులలో పురుషులు ఉండవచ్చు.
ఏ ఉద్యోగిని అయినా లైంగిక వేధింపులకు గురి అయితే ఆ ఉద్యోగిని ఈ కమిటీ కి లిఖిత రూపంలో ఫిర్యాదుని అందిచవల్సి ఉంటుంది.
ఫిర్యాదు అందాక కమిటీ నిజ నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఫిర్యాదు నిజమే అని నిర్ధారణ అయితే దాని తీవ్రతని అనుసరించి కమిటీ చర్యలు తీసుకుంటుంది . చిన్న క్రమశిక్షణ చర్య దగ్గరి నుంచి తాత్కాలిక లేదా పూర్తిగా ఉద్యోగము నుండి తొలగించుట లాంటి చర్యలు తీసుకోవచ్చు . అలాగే బాధితురాలు పోలీసులని ఆశ్రయించవచ్చు కూడా. బాధితురాలికి తమ కమిటీ నిష్పక్షపాతముగా వ్యవహరించినట్లు అనిపించకపోతే స్థానిక కమిటీ కి ఫిర్యాదు అందించవచ్చు .
ఒక సారి కనుక బాధితురాలు రాజీకి వచ్చిన యెడల మరి సదరు సహా ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం కోల్పోతుంది . రాజీ ఎట్టి పరిస్థితిలో ను డబ్బు సంబంధమైనది కాకూడదు .
కమిటీ ఫిర్యాదురాలి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. అలాగే నింద మోపబడిన వ్యక్తికీ సైతం తన తరఫున చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వ వలసి ఉంటుంది. ఫిర్యాదు ఉద్దేశ పూర్వకంగా చేసిన తప్పుడు ఆరోపణ అని తేలితే సంస్థ క్రమశిక్షణా నియమావళి అనుసరించి చర్యలు తీసుకోవచ్చు. అయితే కేవలం ఫిర్యాదు ని నిరూపించలేనంత మాత్రాన అది తప్పుడు ఆరోపణ గా భావించకూడదని చట్టం చెబుతోంది.
ఈ చట్టం యజమాని / సంస్థ నిర్వర్తించ వలసిన విధులు మరియు బాధ్యతలతో పాటు చట్టములోని నిబంధనలు పాటించకపోతే కలిగే జరిమానాలు కూడా విపులంగా వివరించింది .
చట్టం యొక్క అవగాహన కలిగి ఉండి ప్రతీ మహిళా ఉద్యోగి తమకు కల్పించబడిన ఈ మహిళా లైంగిక వేధింపు నిరోధక , నిషేధ మరియు సంస్కరణ చట్టము ఇఛ్చిన హక్కు ని తమ భద్రత మరియు ఆత్మ గౌరవ నిమిత్తం ధైర్యంగా వినియోగించుకోవాలి.
by వరికొండ సురేఖ
This post was created with our nice and easy submission form. Create your post!