ఇంటికి చూసి ఇల్లాలిని చూడమనేది పాత నానుడి. అందంగా తీర్చిదిద్దిన ఇల్లు సకలశుభాలకు నెలవు అనేది పెద్దలు చెప్పిన మాట. అలా ఇంటికి మగువ జీవితానికి, కుటుంబసౌఖ్యానికి ముడిపడిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంటిని అందంగా తీర్చిదిద్దాలంటే …కాస్త సృజనాత్మకత ఉంటే చాలు.. మన చుట్టూ కనిపించే అనేక పూలు, కొమ్మలు ఆహ్లాదపరిచే అందాలను కనువిందు చేస్తాయి. ఇంటిని అందంగా చూపించేందుకు నేర్చుకున్న కళ ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చింది.
ప్రకృతి సోయగాలను ఇంటిలోపలికి ఆహ్వానించి పరిసరాలను అందంగా తీర్చిదిద్దే జపాన్ ఆర్ట్ ఇకెబానా. ఈ కళను జపాన్‌తో పాటు అనేక దేశాల్లో ప్రదర్శించి ఔరా అనిపించారు ఇకెబానా ఇంటర్నేషనల్ హైదారాబాద్ చాప్టర్ మాజీ ప్రెసిడెంట్ రేఖారెడ్డి. ఆమె ఒకవైపు పోషకాహారంపై.. మరోవైపు ఇకెబానా కళపై వ్యాసాలు రాస్తూ మహిళలు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంటినే అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తున్నారు. రేఖ రెడ్డిగారితో తరుణి ముఖాముఖీ..
తరుణి : నమస్కారం మేడమ్ ఈ ఇంటి ముందు పచ్చని చెట్లు, ఇంటిలో అందమైన పూల అలంకరణలు ముచ్చటగా ఉన్నాయి. మీ పరిచయం మా తరుణి పాఠకుల కోసం..
రేఖ : తరుణి పాఠకులందరికీ నమస్కారం. ప్రకృతి పై ప్రేమ మా ఇంటిని ఇలా మార్చింది. ఆసక్తి ఉంటే ఎవ్వరైనా ఇలా అందంగా మార్చుకోవచ్చు. ఇక నా గురించి, ఈ కళపై నాకు పెరిగిన ఆసక్తి గురించి చెప్పాలంటే నా చిన్నతనం గురించి గుర్తుచేసుకోవాలి. మా నాన్నగారు డాక్టర్ వై.రాంచంద్రరెడ్డి, చిన్నపిల్లల డాక్టర్. అమ్మ శ్యామల. నాన్న మెడిసిన్ లో స్పెషలైజేషన్ చేయడానికి లండన్ వెళ్లారు. కొద్దిరోజులు ఆయన జపాన్‌లో ఉన్నారు. నాన్నతో పాటు అమ్మ కూడా జపాన్ వెళ్లారు. అక్కడ జపాన్ పుష్పాలంకరణ కళ ఇకెబానా అమ్మను ఎంతో ఆకర్షించింది. అక్కడి వారిని అడిగి ఆ కళ గురించి తెలుసుకున్నారు. చిన్నచిన్న చిట్కాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇండియా వచ్చాక తాను తెలుసుకున్న ఇకెబానా కళను అనుకరిస్తూ ఇంటి తోటలో పూచే పూలతో ఇంటిలోపల చిన్నచిన్న అలంకరణలు చేసేవారు. నాకు ఊహ తెలిసిన నాటి నుంచే అమ్మ తో పాటు తోటలోకి వెళ్లేదాన్ని. అక్కడ పూసిన బంతి, చామంతి, మల్లే, కనకాంబరం ఇలా అన్ని రకాల పూల కొమ్మ తో, ఎండిన రెమ్మలు కూడా తీసుకువచ్చేదాన్ని. అమ్మ వాటితో ఇంటిని అలంకరించేవారు. అలా చిన్నతనం నుంచే పూలపై, పూల అలంకరణపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత విద్యారణ్య, భారతీయ విద్యాభవన్స్‌లో చదివేరోజుల్లో స్కూలు ఫంక్షన్స్ డెకరేషన్లో నాకు తోచిన చిన్నచిన్న అరెంజ్మెంట్స్ చేసేదాన్ని. అందరూ ఎంతో మెచ్చుకునేవారు. ఆ తర్వాత వనిత కాలేజీలో, హోమ్ సైన్స్ కాలేజీలో చదువుకున్నాను. యూనివర్సిటీ స్థాయిలో రెండు గోల్ట్మెడల్స్ అందుకున్నాను.
తరుణి : ఇకెబానా శిక్షణ ఎప్పుడు తీసుకున్నారు మీరు రాసిన పుస్తకాల గురించి వివరించండి
రేఖ : శతాబ్దాల కిందట జపాన్‌లో ప్రారంభమైన పుష్పాలంకరణ కళ ఇకెబానా. మొదట్లో బౌద్దాలయాలలో బుద్దుడి విగ్రహం చుట్టూ పుష్పాలను అందంగా అలంకరించేవారు. ఆ తర్వాత ఇది ఒక కళగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కళ పై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రారంభంలో ఆలయాలకే పరిమితమైనా..ఇప్పుడు ప్రతి ఇంటికి చేరువైంది. చాలామంది నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెండ్లి తర్వాత భర్త, పిల్లలు అంటూ ఇంటికే పరిమితమైన రోజుల్లో ఇకెబానా ఆర్ట్ నేర్చుకునే వీలు కలిగింది. హైదరాబాద్‌లో ఇకెబానా స్కూలు నిర్వహించిన ఘనత గ్రాండ్ మాస్టర్ హోరీ మీనా అనంతనారాయణ్కే దక్కుతుంది. ఆమె ప్రారంభించిన ‘ ఓహరా ఇకెబానా’లో ఫస్ట్ టీచర్‌గా పనిచేసాను. ఆ తర్వాత ఇకెబానా ఇంటర్నెషనల్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఓహరా ఇకెబానా హైదరాబాద్ చాప్టర్‌కు, ఇకెబానా ఇంటర్నెషనల్ హైదారాబాద్ చాప్టర్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఈ కళపై కొన్ని పుస్తకాలను కూడా తీసుకువచ్చాం. నా మొదటి పుస్తకం ‘పెటేల్స్ అండ్ పాలెట్స్’. ఎంతో మంది ప్రశంసలు అందుకున్న పుస్తకం ఇది. ఇకెబానా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ‘ ఫ్లవర్స్అండ్ఫ్లేవర్స్’ పుస్తకం తీసుకువచ్చాం. చాప్టర్లోని 50మంది కృషిలో రూపొందిన ఈ పుస్తకం ఇకెబానా, భారతీయ వంటల సమ్మేళనం. ప్రచురించిన ఆరునెలల్లోనే రెండో ముద్రణకు వెళ్ళిన పుస్తకం ఇది.
తరుణి : దేశవిదేశాల్లో మీరు నిర్వహించిన ప్రదర్శనల గురించి చెప్పండి.
రేఖ : ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఇకెబానా ప్రదర్శనలు ఇచ్చాను. ఇకెబానా ప్రారంభమైన జపాన్‌లోనూ ఇకెబానాపై ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. 17దేశాల ప్రతినిధులు పాల్గన్న ఇకెబానా ఇంటర్నేషనల్ వరల్డ్ కాన్ఫరెన్స్‌లో ఇకెబానా పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో బహుమతి గెలుచుకున్నాను. పత్రికలకు ఇకెబానా పై వ్యాసాలే కాకుండా ప్రతి ఏడాది ఇకెబానా క్యాలెండర్‌ను గత అనేక సంవత్సరాలుగా చేస్తున్నాను. ఏ దేశంలో ప్రదర్శన నిర్వహించినా.. మన దేశ సంస్కృతి ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటాను.
తరుణి : మహిళలకు మీరిచ్చే సూచన..
రేఖ : ఇంటిపనులు, ఉద్యోగ బాధ్యతలతో ఆడవారు ఎంతో బిజీగా ఉంటున్నారు. ఉూద్యోగ, ఉపాధి కోసమే కాకుండా కొన్ని కళలను మానసికానందం కోసం నేర్చుకోవాలి. అవసరాన్ని బట్టి అవి ప్రొఫెషనల్గానో.. హాబీగానే మారుతాయి. ఇప్పుడు అనేక ఫంక్షన్లలో, ఈవెంట్స్‌లో పూల అలంకరణ ఒక భాగమైంది. ఇకెబానా కళ నేర్చుకున్నవారు మరింత అందంగా పూల అలంకరణ చేయగలరు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే వారిలోని సృజనాత్మకతకు మెరుగులు పెట్టడమే కాకుండా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ప్రకృతి ఆరాధన కూడా ధ్యానమే అని నేను భావిస్తాను.