
నవమాసాలు మోసి,
పురిటి నొప్పులెన్నో భరించి…
నూతన సృష్టికి నాంది పలికే నెలత!
నలుగురూ మెచ్చినా, మెచ్చకపోయినా…
నగుబాటు పాలైనా…
నచ్చిన దారిలో పయనిస్తూ…
నలుదిశలా తన ప్రతిభను
చాటుకుంటోంది నారీ శిరోమణి!
నవ్యమైన విధానాలను ఆకళింపు చేసుకుని…
నవరీతులలో తన
సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ…
నడతలో నియతి కలిగి…
నిండుకుండలా వ్యవహరిస్తోంది!
నిర్వహణా చాతుర్యంతో
నిర్ణయాధికారం కలిగిన
పదవులు చేపట్టి…
నయానో,భయానో ఉద్యోగులందరినీ ఏకతాటిపై నడిపిస్తోంది!
నాలుగ్గోడల మధ్య నిర్బంధించినా…
నిషేధాలు ప్రకటించినా…
నిరసనలు వెల్లువెత్తినా…
చేతకాని అబల అంటూ నిందలెన్నో మోపినా…
నిగ్రహంతో మసలుతూ,
నిశ్చయంతో అడుగులు వేస్తూ…
అంతరిక్షంలోకి సైతం అడుగిడి…
ఆకాశంలో సగమై…
నీలాకాశంలో నక్షత్రంలా నికాశం వెదజల్లుతోంది నారీరత్నం!!
*************