
తెల్లారుజామున ఐదు అవ్వటానికి ఇంకా పది నిముషాలు ఉంది. ఆత్మకు సాంత్వనం చేకూరుస్తూ మసీదులోనుంచి ఆజాను విన్పిస్తుంది. రిజ్వాన్ ఇంటిల్లిపాదీ నమాజ్ మొదలెట్టారు. రిజ్వాన్ వాళ్ళ నాన్న, తాత, ముత్తాత అందరూ పాల వ్యాపారమే. నార్సింగిలో రిజ్వాన్ వాళ్ళ గురించి తెలవని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. నార్సింగి మార్కెట్ దాటంగానే ఎడం వైపు రెండో ఇల్లు వాళ్ళదే. ఇంటికి ఆనుకుని వేయి గజాల పైనే ఖాళీ స్థలంలో నలభై బర్రెలు, ఇరవై ఆవులు కట్టి ఉంటాయి. ఆ మధ్యే ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఒక్కోటి లక్షన్నర పెట్టి పన్నెండు బర్రెలు తెచ్చారు. వాళ్ళ డైరీ ఫార్మ్ లో పాలు, పెరుగు, క్రీమ్, పన్నీర్, నెయ్యి అన్నీ దొరుకుతాయి. చిన్న చిన్న పాల వ్యాపారులు కూడా రిజ్వాన్ వాళ్ళ డైరీ ఫార్మ్ లో పాలు పోసి పోతారు.
యాద్గిరి చిన్న వ్యాపారస్తుడు. అతనికి కేవలం మూడు బర్రెలు మాత్రమే ఉన్నాయి. నలుగురు పిల్లలు, అందులో పెద్దవాడికి ఆరేళ్ళు. ఉండటానికి మంచిరేవులలో ఉన్నా, రిజ్వాన్ వాళ్ళ డైరీ లోనే పాలు పోస్తాడు. మంచిరేవులకి నార్సింగికి పది నిముషాలు పట్టదు. రెండు రోజులనుంచి యాద్గిరి జ్వరంతో బాధ పడుతుండటం చేత, రిజ్వాన్ వాళ్ళ నాన్న షంషుద్దీన్, రిజ్వాన్ నే వాళ్ళ ఇంటికి పంపుతున్నాడు.
పంతొమ్మిదేళ్ళ రిజ్వాన్ అందగాడు, మర్యాదస్తుడు, మొయినాబాద్ లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. లేత గులాబీ రంగు ఛాయ, పట్టు కుచ్చు లాంటి జుట్టు, అయస్కాంతంలా ఆకట్టుకునే కనులతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. శుక్రవారం, తెల్లటి షేర్వానీ, కళ్ళకి నల్లటి సుర్మా పెడతాడేమో అందరి కళ్ళూ రిజ్వాన్ మీదే, అందరి పెదవుల పై సుభానల్లానే. రిజ్వాన్ కాన్సంట్రేషన్ మాత్రం జామా మసీద్ లో జుమా మీదే. అందరికి సలాం చెబుతూ, పలకరిస్తూ, మెచ్చుకుంటే సిగ్గు పడుతూ, ఎంతో వినయంగా ఉంటాడు. ఇంట్లో ఆఖరి కొడుకు అవటం చేత అందరికీ ఎంతో ముద్దు. తల్లి తండ్రి ఎంత చెబితే అంత లోనే మెలిగే సాంప్రదాయం.
ఆజాను అవ్వంగానే రిజ్వాన్ ఏక్టీవా తీసి, తండ్రితో చెప్పి మంచిరేవుల వైపు బండి పోనిచ్చాడు. మార్కెట్ నుంచి కుడి వైపుకి పోనిచ్చి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దాటి, జామా మసీదు వైపు ఓ క్షణం భక్తితో చూసి ముందుకి పోనిచ్చాడు. నార్సింగి సర్కిల్ దగ్గర రాంగ్ రూట్ అయినా రైట్ తీసుకుని సర్కిల్ దాటి ముందుకి వెళితే ఐదు నిమిషాల్లో యాద్గిరి ఇల్లు వస్తుంది.
నార్సింగిలో ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓ రోజు ఓ రోడ్డు తవ్వుతారు. గుర్తుంటే పూడుస్తారు లేదా అంతే. మళ్ళీ వెంటనే వేరొక రోడ్డు మీద పడతారు. ఈ లోపు పూడ్చేసిన రోడ్డుని వేరొక డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వుతారు. ఇలా రోడ్లన్నీ గుంటలతోటి తవ్వకాలతోటి నిండి ఉంటాయి. దుమ్ము లేపటం నార్సింగి నైజం. ఓ గంట ఆగి వెళ్ళిన దారే మళ్ళీ వస్తే రోడ్డు మాయం, గుంట ప్రత్యక్షం! మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఒక్కోసారి నార్సింగి రోడ్లకి కోపం వస్తాయనుకుంటా, బయట వాళ్ళు లోపలికి వెళ్ళటానికి గానీ లోపలి వాళ్ళు బయటకి పోవటానికి గానీ దారి ఇవ్వవు! అష్ట దిగ్బంధనం చేస్తాయి. నార్సింగి లేఔట్ తెలిసిన వాళ్ళు ఏ తర్కానికి అర్థం కాని రోడ్డు తవ్వకాలలో ఏర్పడిన గుంటలలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతామేమోనని అంతగా లోపలి వెళ్ళటానికి సాహసించరు. కానీ, నార్సింగి లోకల్స్ మాత్రం మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చీల్చినట్లు, నార్సింగిని చీల్చి బయట పడతారు.
సర్కిల్ కి ముందు ఎడమ వైపున అన్సారీ హోటల్ కి తవక్కల్ బిర్యానీ హౌస్ కి నడుమ ఖాలిద్ సాబ్ ఇల్లు. ఖాలిద్ సాబ్ కొడుకులు ఇద్దరూ రియల్ ఎస్టేటు వ్యాపారంలో బిజీ. ఇంకా జేసీబీ లు, బుల్ డోజర్లు కూడా రెంట్ కి సప్లై చేస్తారు. ఏడవ దశకంలో అడుగుపెట్టిన ఖాలిద్ సాబ్ అంటే నార్సింగిలో అందరికీ ఎనలేని గౌరవం. కొన్ని విషయాలలో ఒప్పందాలకి, రాజీలకి ఖాలిద్ భాయ్ దగ్గరికే వస్తారు. కుల, మత, లింగ, వర్గ వివక్షత లేకుండా న్యాయంగా, ధర్మంగా ఆలోచించి అందరికీ కలిసొచ్చే తీర్పు చెప్పే నేర్పు గల మనిషి. ఉదయాన్నే ఆరోగ్యం సహకరించక మసీదుకు వెళ్ళకపోయినా, వరండాలో కూర్చుని తస్బిహ్ వేళ్ళ మీద తిప్పుతూ ప్రార్థిస్తుంటాడు. రెండు రోజుల్నుంచి రిజ్వాన్ ని గమనిస్తున్నాడు ఖాలిద్ సాబ్. పొద్దునే తన వైపు చూసి సలాం పెట్టి పోతుంటే ఎక్కడికో ఎందుకో అని అడగాలని ఉన్నా, ప్రార్థనలో ఉండటం చేత ఊరుకున్నాడు. రోజు లాగే సలాం పెట్టి వెళ్ళిపోతున్న రిజ్వాన్ కు తిరిగి సలాం చెప్పి రిజ్వాన్ వెళ్ళే వైపే చూస్తూండిపోయాడు.
టైం ఐదు గంటల ఇరవై ఐదు నిముషాలు.
***
తెల్లారుజామున ఐదు అవ్వటానికి ఇంకా పది నిముషాలు ఉంది. శివాని మెల్లగా కళ్ళు తెరిచింది. ఎక్కడుందో ఏమిటో అంతా అయోమయంగా అనిపించింది. నిస్సత్తువుగా నీరసంగా అనిపించి మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఓ నిమిషం ఆగి కళ్ళు తెరిచింది. అంతా కొత్తగా ఉంది. ఏదో హోటల్ రూంలా ఉంది. మెల్లగా పక్కకి తిరిగి చూసింది. బెడ్డు పక్కన టేబుల్ పైన నిండిపోయిన యాష్ట్రే , సగం తిన్న ప్లేట్లు, ఖాళీ బాటిల్, మూడు గ్లాసులు, డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు. తన బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పరిస్థితి అర్థం అవుతుంది కానీ నమ్మలేకుండా ఉంది. అతికష్టంగా లేవటానికి ఓపిక తెచ్చుకుంది. ముందు రోజు రాత్రి జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించింది.
శివాని బిజినెస్ మాన్ మల్లేష్ ఏకైక కూతురు. ఆత్మవిశ్వాసం తెలివితేటలూ కల ఆధునిక యువతి, ఇరవై రెండేళ్ళు. నాలుగు తరాలనుంచి హైద్రాబాద్ లో ఆటో స్పేర్ పార్ట్శ్ బిజినెస్ వాళ్ళది. కోట్లల్లో సంపాదన. నాలుగంతస్థుల మల్లేష్ ఇంట్లో అతని భార్య, కొడుకు, తల్లీ, తండ్రి మాత్రమే ఉంటారు. మొదటి సంతానం, శివాని ఆస్ట్రేలియాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ చేస్తుంది. ఈ మధ్యే ఇండియాకి వచ్చింది.
హరీష్ శివానికి ఇంటర్లో ఫ్రెండ్. బర్త్ డే పార్టీ అంటే రాత్రి గోపన్నపల్లి దగ్గర ఆన్ ది రాక్స్ పబ్ కి వచ్చింది. ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. మరి తను ఇక్కడ ఈ పరిస్థితి లో ఎలా అని ఆలోచిస్తూ వాష్ రూంలోకి వెళ్ళింది. ఒళ్ళంతా రక్తమే, మంచం అంతా రక్తమే. గబగబా వాష్ చేసుకుని బట్టలు వేసుకుంది. రేప్ కి గురి అయ్యిందని అర్థం అయింది. ఉబికి వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ చుట్టూ చూసింది హ్యాండ్ బాగ్ ఓ మూల పడి ఉంది. సెల్ ఫోన్ మిస్సింగ్. కార్ కీస్ ఉన్నాయి. హ్యాండ్ బాగ్ లో ట్వంటీ థౌసండ్ కాష్ మిస్సింగ్. హరీష్ ఫ్రెండ్స్ ని పరిచయం చేయటం గుర్తు. డ్రింక్స్ తీసుకోవటం గుర్తు. అందరూ కలిసి షాట్స్ తీసుకోవటం గుర్తు. తరువాత కళ్ళు తిరుగుతున్నాయని సోఫాలో కూర్చోవటం గుర్తు. హరీష్ వచ్చాడు. ఏదో మాట్లాడాడు. ఆ తరువాత ఏం గుర్తుకు రావటం లేదు. తననెవరో ఎత్తుకుని రావటం, తాను ఫైట్ చెయ్యటం, వాళ్ళు తనని కొట్టటం, దుస్తులు విప్పటం అస్పష్టంగా గుర్తు కొస్తున్నాయి.
ఫ్రెండ్సే ఇంత అమానుషంగా బిహేవ్ చేస్తే ఎవరిని నమ్మాలి? అసలు ఓ ఫ్రెండ్ ని ఆ దృష్టితో ఎలా చూడగలరు? వీళ్ళు మనుషులేనా లేక మృగాలా? దీనికంటే నన్ను చంపేసినా బాగుండేదేమో. ఇంత దారుణం జరిగాక వాడు కానీ తెలిసిన వాళ్ళు కానీ కనిపించినప్పుడల్లా నేను ఎలా బ్రతకాలి? డాడీకి చెప్పింతరువాత వాడు బ్రతికుంటాడా? అసలు ఇప్పుడు కనుక వాడు నా ముందుకొస్తే నేనే చంపేస్తాను. ఇంకో మనిషిని తాకి, వాడి జుగుప్సాకరమైన కోరికలు తీర్చుకునే అధికారం వాడికి ఎవరు ఇచ్చారు? వాళ్ళందరిని నేను చంపితే తప్పేంటి? రేప్ కేసులకు కాపిటల్ పనిష్మెంట్ ఎందుకు లేదు? రేపిస్టులని వెంటనే చంపేయాలి. పోలీసుల దాక ఎందుకు? తెలియగానే మోబ్ జస్టిస్ అమలు చేయాలి. వాడు సిగ్గు లేకుండా సొసైటీలో తిరుగుతుంటే సొసైటీకే కదా తలవంపు. ఇలాంటి సివిలైజేషన్ లోనా మనం బ్రతుకుతుంది? డెవలపింగ్ కంట్రీ, ప్రోగ్రెసివ్ సొసైటీ అంటారు, ఇదేనా అది? ఇంత సీరియస్ ఇష్యూస్ కి కూడా సొల్యూషన్ లేకుండానే బతికేస్తున్న సిగ్గులేని జాతా మనది? మనిషికి జంతువుకి తేడా లేకుండా బతుకుతున్నాం కదా. ఆడదైతే చాలు, వయసు, బంధం చూడకుండానే ఏనిమల్స్ లా కలబడే జాతికి ఎందుకంత అహంకారం?
ఇంతకీ సెల్ ఫోన్ ఏది? మెల్లగా తలుపు తీసి బయటకి చూసింది. ఎవరూ లేరు. ఇంకా పబ్ లోనే ఉన్నట్లు గుర్తించింది. గుండె చేతిలో పెట్టుకుని కిందకి దిగటం మొదలు పెట్టింది. ఎవరూ కనిపించలేదు. తూలుకుంటానే కార్ పార్కింగ్ దగ్గరికి పరిగెత్తింది. కార్ డోర్ తీసి లోపల కూర్చుంది. గట్టిగా ఏడవటం మొదలు పెట్టింది. రెండు నిముషాలు ఏడ్చిన తరువాత కంట్రోల్ చేసుకుని కార్ ముందుకి పోనిచ్చింది. 40, 60, 80, 100, 120 దగ్గర స్పీడోమీటర్ స్టడీ అయింది. త్వరగా మెహదీపట్నంలో ఉన్న తన ఇంటికి రీచ్ అవ్వాలని యాక్సిలరేటర్ పై కాలు నొక్కి పెట్టి ఉంచింది.
మెహదీపట్నం సిటీకి జంక్షన్ అనుకోండి. ఇక్కడ్నుంచి అన్నివైపులకి బస్సులు ఉంటాయి. అందుకేనేమో ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది. అలాగని మెహదీపట్నం తొందరపడదు, దిగ్బంధిస్తుంది. నింపాదిగా అందరిని గంటల తరబడి కూర్చోబెట్టి మాట్లాడి గాని పంపదు. పీక్ టైంలో మూడు, నాలుగు గంటలు ట్రాఫిక్ ఎక్కడికీ కదలదు. జనాలు తమ జీవితం మొత్తాన్ని ఓ సారి ఫ్లాష్ బ్యాక్ లో వీక్షించి, చేసిన పాపాలకి పశ్చాత్తాపం పడటానికి మెహదీపట్నం సమయం ఇస్తుంది. ఎంతమంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో! ఎంతవారు గానీ మెహదీపట్నం పంపించినప్పుడే కదలాలి. ఇంకో దారి లేదు. రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం ఏడు గంటల దాకా మీ ఇష్టం. కానీ మిగిలిన సమయంలో మెహదీపట్నం దయ మీదే ఆధారపడాలి.
కార్ క్యూ సిటీ దగ్గర రెండు సిగ్నల్స్ దాటి, కుడి వైపు యు ఎస్ కాన్సులేట్ వైపు తిరిగింది. వర్చూసా బిల్డింగ్ దగ్గర లెఫ్ట్ తీసుకుని ముందుకి పోయి రైట్ తీసుకుంది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సెజ్ ముందు లెఫ్ట్ తీసుకుని స్పీడ్ 140 కి పెంచింది. తెల్లారుజాము కావటంతో రోడ్ అంతా ఖాళీ. ఇంక నార్సింగి సర్కిల్, లంగర్ హౌజ్, మెహదీపట్నం. ఈ స్పీడ్లో వెళితే ఇంకో పది నిమిషాల్లో ఇంట్లో ఉంటుంది. అక్కడక్కడా వాకింగ్, జాగింగ్ చేసే వాళ్ళు తప్పించి రోడ్డు మీద ఎవరూ లేరు.
టైం ఐదు గంటల ఇరవై ఐదు నిముషాలు.
రిజ్వాన్ నార్సింగి సర్కిల్ దగ్గర మెల్లగా రైట్ తీసుకున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లవారక పోవటం చేత, ఆ సమయంలో అంత స్పీడ్ గా కార్ వస్తుందని ఊహించక పోవటం వలన, శివాని కారుని గమనించలేదు. 140
కి మీ వేగంతో శివాని కారు రావటం, రిజ్వాన్ బండిని గుద్దటం, బండి మీద నుంచి రిజ్వాన్ ఎగిరి 20 అడుగుల దూరం పడటం క్షణాల్లో జరిగిపోయింది. ఖాలిద్ సాబ్ చేతిలోనుంచి తస్బీహ్ కింద పడింది. వెంటనే గట్టిగా అరుచుకుంటూ కొడుకులని అప్రమత్తం చేసి కిందకి పరిగెత్తాడు. ఆయన వెనకే ఆయన కొడుకులు అన్వర్, నసీర్ పరిగెత్తారు. రిజ్వాన్ తలకి బలమైన గాయం అయినట్లుంది. రక్తం ఆగకుండా కారుతుంది. కనిపించినంత మేర చేతులు, కాళ్ళు కొట్టుకుపోయాయి. సృహలో లేడు. శరీరమంతా రక్తసిక్తమైంది.
శివాని ఒకే ఒక క్షణం ఆగి రియర్ వ్యూ మిర్రర్ లోనుంచి చూడటం, ఆమె మోహంలో భయాందోళనలు ఖాలిద్ సాబ్ గమనించారు. ఓ ప్రమాదం నుంచి ఇంకో ప్రమాదంలోకి పడిన శివాని వెంటనే కారు వెనక్కి తీసి అదే వేగంతో వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. లగ్జరీ కారు మేక్, ఫాన్సీ నెంబర్ ఖాలిద్ సాబ్ మెదడులో నమోదయ్యాయి. అన్వర్ ఫోన్ చేసే లోపే, నసీర్ కార్ తీసాడు. ఖాలిద్ సాబ్ వంటిపైనున్న శాలువాని తలకి గట్టిగా చుట్టి, రిజ్వాన్ ని కార్ వెనుక సీట్లోకి ఎక్కించారు. నసీర్ రైట్ తీసుకుని కారుని దగ్గర్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. ఖాలిద్ సాబ్ అక్కడే ఉండి ఫోన్లు చేయటం మొదలు పెట్టాడు. 100 కి, షంషుద్దీన్కి, పంచాయతి ప్రెసిడెంట్ రాముకి, ఇంకా ఆపత్సమయంలో తోడు నిలిచేవాళ్ళకి. పావుగంటలో నాలుగు కార్లు హాస్పిటల్ వైపు బయలుదేరాయి. రిజ్వాన్ ని స్ట్రెట్చర్ పై తీసుకు వెళ్లారు. పంచాయతి ప్రెసిడెంట్ రాము స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ కి కాల్ చేయటంతో వెంటనే అడ్మిట్ చేసుకున్నారు.
టైం 5. 40.
శివానీ ఇంటి గేట్ ఓపెన్ చేసే ఉంది. బయట వాచ్ మాన్ భార్య ఊడుస్తుంది. ఆమెని తప్పించి స్పీడుగా ఇంటి ముందుకెళ్ళి ఆగింది కార్. ఆ స్పీడ్ కి, వాచ్ మాన్, అతని భార్య అవాక్కయి చూస్తూనే ఉన్నారు. మల్లేష్ వాకింగ్ చేయటానికి బయటికి రాబోయి, కార్ లో నుంచి దిగి వస్తున్న కూతురి పరిస్థితి చూసి విస్తుపోయాడు. ఆమెని, ఆమె వెనుక నున్న ఎనభై లక్షల బండి, ఊడి కిందకి వేలాడుతున్న బంపర్, సొట్ట పోయిన ముందు భాగం, చూసి అంచనా వేసే లోపే, అతన్ని చుట్టుకుని ఏకధాటిగా ఏడవటం మొదలు పెట్టింది శివాని. కూతుర్ని పట్టుకుని హాల్లోకి తీసుకెళుతూ, భార్య సువర్ణని బిగ్గరగా పిలిచాడు.
టైం 6.30.
రిజ్వాన్ ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకు వెళ్ళారు. ఈ మధ్య ఇలాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని అందరూ తలో మాట అనటం మొదలెట్టారు. మైనర్లకి స్టేటస్ కోసం లగ్జరీ కార్లు ఇచ్చి కొంత మంది తల్లి తండ్రులే చెడగొడుతుంటే ఇంకొంతమంది పిల్లల బ్లాక్మెయిల్ కి లొంగిపోయి ఇస్తున్నారు. ఆ పిల్లలు అమాయకుల ప్రాణాలు బలి తీసుకుని బెయిల్ మీద వెంటనే బయటికి వచ్చేస్తారు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ కామన్ సెన్స్ కానీ ఏ మాత్రం లేని డ్రైవర్స్ ని రోడ్ మీద వదిలేయటం అంటే యముడికి లైసెన్స్ ఇచ్చినట్లే. ఎవరెన్ని మాటలు చెప్పినా మేలిమి బంగారం లాంటి కుర్రోడిని రక్తపు కట్ల మధ్య చూస్తుంటే ఎవరికీ మాత్రం దుఃఖం రాదు! తల్లి తండ్రి నేల మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూనే ఉన్నారు. చూసినవాళ్ళు కరిగి నీరవుతూనే ఉన్నారు.
ఖాలిద్ సాబ్ కార్ నెంబర్, మేక్ పంచాయతీ ప్రెసిడెంట్ రాముకి చెప్పాడు. డ్రైవ్ చేస్తుంది ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి అని, అతి వేగంగా వచ్చిందని కూడా చెప్పాడు. అరగంటలో కార్ రిజిస్ట్రేషన్ వివరాలు శివాని పేరుతో సహా తెలిసిపోయాయి. షంషుద్దీన్ ని పట్టుకోలేక పోతున్నారు. రిజ్వాన్ ప్రాణాల కోసం కుటుంబ సభ్యులూ, తెలిసిన వాళ్ళూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూనే ఉన్నారు. విధి ఎంతటి వారినైనా గుండెలవిసేలా ఏడిపించగలదు!
అక్కడ మల్లేష్ ఇంట్లో, లాయర్ శేఖర్, క్లోజ్ ఫ్రెండ్స్ మల్లిక్, మధుకర్, ఫ్యామిలీ గైనికాలజిస్ట్, సునీత ఉన్నారు. ఏడుస్తూ తనకి జరిగిన ఘాతుకాన్ని, దారిలో జరిగిన ఆక్సిడెంట్ గురించి తల్లి తండ్రితో చెప్పి, నిస్తేజంగా బెడ్ పైన వాలింది, శివాని.
7 గంటల కల్లా మేజర్ ఆక్సిడెంట్ జరిగిందని, హెడ్ ఇంజురీ అని, రిజ్వాన్ కండిషన్ క్రిటికల్ అని తెలిసింది. కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలని మల్లేష్ విశ్వ ప్రయత్నం మొదలెట్టాడు. మల్లిక్ ని హరీష్ ఎక్కడున్నా సరే తీసుకురమ్మని పంపించాడు. వాడు కనిపిస్తే వట్టి చేతులతో వాడి పేగులు బయటకి లాగాలన్న కసితో రగిలిపోతున్నాడు. లాయర్ శేఖర్ ని రిజ్వాన్ వాళ్ళ ఫ్యామిలీ తో మాట్లాడమని పంపించాడు. ఎన్ని లక్షలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. వాచ్ మాన్ ని, ఇంకా ఇద్దరు పని వాళ్ళని పిలిచి కార్ డ్రైవ్ చేసి ఆక్సిడెంట్ చేసింది తామేనని ఒప్పుకుంటే ఎవరికైనా సరే పాతిక లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇంకా వాళ్ళ కుటుంబం పోషణ చూసుకుంటానని, జైలు నుంచి త్వరగా విడుదలయేటట్టు చూస్తానని, లాయర్ ఖర్చులన్నీ తనవేనని చెప్పాడు. మధుకర్, ఫ్యామిలీ డాక్టర్ సునీత మల్లేష్ కి పోలీసులకి కాల్ చెయ్యమని నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. జరిగిన పరిస్థితి బట్టి శివానికి శిక్ష పడక పోవచ్చని. రిజ్వాన్ బతికితే అంతగా ప్రాబ్లెమ్ ఉండబోదని చెప్పారు. కానీ, శోకం, కోపం ఆ తండ్రిని ముంచెత్తుతున్నాయి.
మల్లేష్ ఎవరి మాట వినేటట్టులేడు. హై లెవెల్ ఫ్రెండ్స్ ద్వారా లోకల్ ఎంపీ ని కలవటానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. రిజ్వాన్ తండ్రికి నష్ట పరిహారం కింద కోటి రూపాయలైనా ఇవ్వటానికి సిద్ధం అయ్యాడు. టెక్నాలజీ లోకంలో సమాచారం చేరటానికి ఎంత సేపు పడుతుంది? ఎంపీ దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ రాముకి ఫోన్ వచ్చింది. రిజ్వాన్ పరిస్థితి ఎలా ఉందని, కాంప్రమైజ్ కి ఎంత దాక వెళ్ళొచ్చని. నార్సింగి ఎన్నో ఏళ్ళ నుంచి హిందూ ముస్లిం ఐక్యతకి ప్రసిద్ధి. ఎంపీ గారి కాల్ వినగానే రాము చాలా ఇబ్బందికి గురయ్యాడు. ఇటు సన్నిహితుడి కొడుకు అటు ఎంపీ గారి కాల్. తెలివిగా ఖాలిద్ సాబ్ తో మాట్లాడితే పని అవుతుందని చెప్పాడు. రిజ్వాన్ ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి మూడు గంటలవుతుంది.
లాయర్ శేఖర్, స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, రాము ఖాలిద్ సాబ్ వద్దకు వెళ్ళారు. శేఖర్ జరిగింది మొత్తం ఖాలిద్ సాబ్ కు చెప్పాడు. నష్ట పరిహారంగా ఎంతైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఆడపిల్ల భవిష్యత్తు ఆలోచించమని బ్రతిమిలాడాడు. అంతా విని ఖాలిద్ సాబ్ నిట్టూర్చాడు. షంషుద్దీన్ ని పిలిచి మాట్లాడారు. అంత బాధలోనూ షంషుద్దీన్ నోట్లోనుంచి ఒకటే మాట వచ్చింది, “ఇన్షాహ్ అల్లాహ్.” ఏ విధమైన నష్టపరిహారం తమ కుటుంబానికి అక్కరలేదని, అంతా దైవనిర్ణయం అని, తన కొడుకు కోసం వాళ్ళని ప్రార్థన చేయమని, వాళ్ళ కూతురు కోసం ప్రార్థిస్తానని చెప్పి తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు.
శేఖర్ మల్లేష్ కి విషయం చెప్పాడు. అంత క్లిష్ట సమయంలో కూడా శేఖర్ చెప్పిన మాట విని మల్లేష్ చాలా ఆశ్చర్యపోయారు. కోటి రూపాయలు అడిగినా ఇవ్వటానికి రెడీ అయిన మల్లేష్, షంషుద్దీన్ మానవత్వానికి, దైవభక్తికి ఏమని అనుకోవాలో తెలియక ఉండిపోయాడు. మధుకర్, సునీత ఇంకా మల్లేష్ కి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. విషయం బయటకి పొక్కకుండా చేయటానికి మల్లేష్ పడుతున్న అవస్థలు చూసి, రేపు నిజం బయట పడితే సమస్య ఇంకా జటిలమవుతుందని చెప్పారు. పరువు, ప్రతీకారం సినిమాలలోనే అని, నిజ జీవితంలో నిజం చెప్పటమే ఉత్తమమని శేఖర్ కూడా నచ్చచెప్ప చూసాడు. మల్లేష్ ఎవరి మాట వినదలుచుకోలేదు.
శివాని ఈ గొడవంతా వింటూనే ఉంది. ఆలోచిస్తూనే ఉంది. తనకి జరిగిన అన్యాయం, తన వల్ల జరిగిన అన్యాయం! ఒక్క రోజులో జీవితం ఎంత మారిపోయింది. తనకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలని ఉంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరిని నరికెయ్యాలన్నంత కోపం! రిజ్వాన్ ని తలుచుకుంటే బాధ వేస్తుంది. ఆ టైంలో అస్సలు ఎక్సపెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఇంటికెళ్ళదామా అన్న ధ్యాసలో ఉందే గానీ, రోడ్ మీద కాన్సంట్రేషన్ లేదు. తండ్రి కోపం, మధుకర్ అంకుల్, సునీత ఆంటీల మాటలు వింటూ ఆలోచిస్తుంది. అయినా తనేం తప్పు చేసింది? తనకి జరిగిన దారుణం వల్లే ఆ ఆక్సిడెంట్ అనుకోకుండా అయ్యింది. ఇంతకీ సెల్ ఏమయ్యింది? సెల్ ఎందుకు తీసుకుపోయారు? అది ఉంటె ఆ రూమ్ పిక్స్ తీసుంటే ప్రూఫ్స్ గా ఉండేయి కదా. జరిగింది సెల్లో రికార్డు చేసి ఉంటారా? కళ్ళు తిరిగినట్లయింది. మెల్లగా లేచి కూర్చుంది.
నెమ్మదిగా నడుచుకుంటూ బయటి కొచ్చింది. డాక్టర్ సునీత తల్లిని ఓదారుస్తున్నది. శేఖర్, మధుకర్ మౌనంగా కూర్చుని ఉన్నారు. తండ్రి కిటికీ లోనుంచి బయటకి చూస్తున్నాడు. మెల్లగా తండ్రి దగ్గరికి వెళ్ళింది. సునీత ముందుకి వచ్చింది. “డాడీ, నా సెల్ ఫోన్ మిస్సింగ్. అందులో రికార్డు చేశారేమో అని డౌట్ గా ఉంది,” అన్నది. మల్లేష్ “నువ్వేం భయపడకమ్మా! అన్నీ నేను సాల్వ్ చేస్తానుగా,” అన్నాడే కానీ ఇంక తట్టుకోలేక నేల మీద కూలబడి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు. ఇలాంటి పరిస్థితులలోనే అనాలేమో, మగాడికి మగాడే శత్రువని! మగాడు తన ఇంట్లో ఆడదాన్ని బయటకి వెళ్ళనివ్వపోవటానికి కారణం ఎంతటి ఘాతుకానికైనా తెగించగల తన తోటి మగాడి ప్రవృత్తి వలనే! ఆస్థి ఐశ్వర్యం సంపాదించుకుని సమాజంలో ఓ వటవృక్షంలా ఎదిగిన మగాడు కూడా కుప్పకూలి ఏడవటానికి కారణం తన తోటి మగాడు చేసే ద్రోహమే.
మధుకర్ అతన్ని పట్టుకుని కుర్చోపెట్టాడు. “కాంప్లికేట్ చేస్తున్నావురా, విషయం బయటకి పొక్కక మానదు. కార్ నెంబర్ పోలీసులకి తెలిసిపోయింది. సర్వేయలెన్స్ కెమెరాస్ పట్టేసాయి, క్రైమ్ కవర్ చేసినందుకు నువ్వూ భాభీ రెస్పాన్సిబిలిటి తీసుకోవాల్సి ఉంటుంది” అన్నాడు శేఖర్. “ఆంటీ, నేను స్టేషన్ కి వస్తాను. నాకు జరిగిన అన్యాయానికి లా ప్రకారంగానే పోరాడదాం. నేను చేసిన ఏక్సిడెంట్ కి నేను రెస్పాన్సిబిలిటి తీసుకుంటాను. లా నాకు తోడు నిలుస్తుంది,” అని ఏడవటం మొదలు పెట్టింది శివాని. డాడీ, మనం పోలీస్ స్టేషన్కి వెళదాం, ఆ తరువాత నేను రిజ్వాన్ ని చూడాలని అనుకుంటున్నా,” అన్న కూతురుని వింతగా చూసాడు మల్లేష్. తల్లీ, తండ్రి శివానిని దగ్గరికి తీసుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. ఇంతలో కాల్ వచ్చింది. రిజ్వాన్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు, కానీ డాక్టర్స్ 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు అని, ఛాన్సెస్ చాలావరకు బ్రైట్ గానే ఉన్నట్లు తెలిపారని. తన బాధంతా ఓ క్షణం మరచిన శివానీ మొహం పై చిరునవ్వు, తను తీసుకున్న నిర్ణయం సరైనదేనన్న గట్టి నమ్మకంతో తల్లీ, తండ్రి తో పాటు ముందుకు కదిలింది.