షావుకారు రామచంద్ర పటేల్ ‘పైసా ది సాయి బి’, ‘పైసా షావుకారు’ అనేవి గౌరవప్రదమైన పిలుపులుగా మారాయి.
వడ్డీ వ్యాపారస్తులకు, మిగిలిన వ్యాపారాలు చేసే వారికి పెద్ద రామచంద్ర పటేల్ తండ్రి షావుకారు జనార్ధన్ పటేల్. అతడు సారా బట్టీలను ఏర్పాటు చేసి, గిరిజనుల అందరికీ సారా అమ్మేవాడు. అయితే కొడుకుకు అది కుదరలేదు. ఎందుకంటే ఆ వ్యాపారాలను ప్రభుత్వమే చేస్తోంది. అందుకని రామచంద్ర పటేల్ వడ్డీ వ్యాపారం మొదలు పెట్టాడు. ఎడమ చేతికి లావుపాటి కడెం, చెవులకు మెడకు బంగారు పెండెంట్స్ తో తన ఐశ్వర్యాన్ని ప్రపంచానికి చాటే వాడు. దట్టమైన కనుబొమ్మలు, దట్టమైన మీసాలతో చెదరని చిరునవ్వుతో జిత్తులమారి చూపులు కలిగి ఉండేవాడు. చెదరని చిరునవ్వు అతని పెదవులపై నిత్యం అతికించినట్లు ఉండేది. అతని వయసు 35 సంవత్సరాలు. అతడిది సులువైన వ్యాపారం. ఎందుకంటే అతని వద్ద డబ్బు ఉన్నది. డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది. డబ్బు డబ్బును కురిపిస్తోంది. ఆ విధంగా షావుకారు సంచుల కొద్ది డబ్బును కూడపెట్టాడు. గిరిజనుల పేదరికపు గుడిసెలకు అతని వద్ద ఉన్న ధనం ఎంతో అవసరం. అతనికి తెలుసు ఏ విధంగా గిరిజనులను డబ్బుతో వేటాడాలో.. గిరిజనులకు తరచూ రుణాలు అవసరమయ్యేవి. ముఖ్యంగా వివాహ ఆచారాలు అయినా.. పెళ్లి సమయంలో వధువు ఇచ్చే ‘జోల’ అనబడే కన్యాశుల్కం 4నుండి 6 వేల రూపాయల వరకు డబ్బు అవసరమయ్యేది. అది లేకుండా.. జోల లేకుండా పెళ్లి జరగదు. అందుకొరకు పెళ్ళికొడుకు లందరూ.. అతని వద్దకు వచ్చేవారు. తమ స్వేదాన్ని వెచ్చించి డబ్బును పొందేవారు. షావుకారుకు వడ్డీ తో తిరిగి చెల్లించేవారు. షావుకారు ధాన్యాన్ని కూడా అప్పుగా ఇచ్చేవాడు. వర్షాకాలంలోని సాగు ప్రారంభ సమయానికి అత్యధికమైన 50 శాతం వడ్డీకి ఇచ్చేవాడు. ఇది అతని వ్యాపార పద్ధతి. అతనికి ఈ వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే గిరిజనులు ఎవ్వరు అతనిని ప్రశ్నించరు. షావుకారును మోసగించ లేరు. షావుకారు చెప్పిన లెక్క ప్రకారం ధాన్యాన్ని డబ్బును అధిక మొత్తంలో చెల్లించేవారు. అతనికొక గుర్రం ఉండేది. పర్వత ప్రాంతాల్లో దాని పై ప్రయాణం చేసేవాడు. ఆ విధంగా నిరుపేద గిరిజనుల పాలిటి అధిపతి, రాజు, యజమాని అన్నీ షావుకారు అయ్యాడు. గిరిజనుల భూములకు, డబ్బుకు, శరీరాలకు వారి ఆత్మకు కూడా అతనే యజమాని.
* * *
అటువంటి షావుకారు వద్దకు సోమ్లా, నాయక్, దీప్లా, పాప్లా కలిసి వెళ్లారు. వారిని చూస్తూనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు షావుకారు.
సోమ్లాతో “ఆ పర్వతం దిగువన, వాగుకు ఎగువన ఉన్న వరి పొలం నీదే కదా..” అని అడిగాడు.
“అవును సామీ” అని సోమ్లా సమాధానం చెప్పిన తర్వాత…
“ఎంత డబ్బు కావాలి” అని అడిగాడు.
“పది వందల రూపాయలు” అన్నాడు.
మిగిలిన విషయాన్ని పాప్లా వివరంగా చెప్పాడు. తాము కూడా రావాల్సిన అవసరాన్ని షావుకారుకు వివరించారు మిగిలిన వారు. వెంటనే షావుకారు లావుపాటి లెడ్జర్ తీసుకొచ్చాడు. అందులో నుండి ప్రామ్సరీ నోట్ ఒకటి తయారుచేశాడు అందులో మొదటి పార్టీగా షావుకారు రామచంద్ర పటేల్, రెండో పార్టీగా సోమ్లా పేర్లను రాసి అప్పుగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నట్టు, అందుకు బదులు తండ్రీ కొడుకులిద్దరూ అప్పు తీరే అంత వరకు పూర్తి సమయం సేవకులుగా… శ్రామికులుగా ఏ సమయంలో అయినా ఏ పనినైనా.. ఏ ప్రాంతంలోనైనా.. షావుకారు అవసరాన్నిబట్టి పని చేయ వలసినదిగా.. సంవత్సరానికి వేతనంతోపాటు ఒక బ్లాంకెట్ కు కావలసిన ఒక రూపాయి, 50 శాతం చక్ర వడ్డీకి తీసుకున్నట్టు అగ్రిమెంట్ రాయించుకున్నాడు. షావుకారు సంతకం చేసి, తండ్రీ కొడుకుల వేలిముద్రలను, సాక్షి సంతకాలు నాయక్, బారిక్, పాప్లా డోన్ తో ఎడమ చేతి బొటన వేలుతో ముద్రలు వేయించుకున్నాడు. ఆ తర్వాత షావుకారు వెయ్యి రూపాయలు వారి చేతిలో పెట్టాడు. అందరూ కలిసి తిరిగి గిరిజన గూడానికి వచ్చారు. ఊరు చేరగానే సోమ్లా ఫారెస్ట్ అధికారుల వద్దకు పోదామని ఊరిపెద్దని అడిగాడు.
కానీ “నువ్వు వస్తే.. నీకే ప్రమాదం. ఫారెస్ట్ గార్డ్ నీమీద చాలా కోపంగా ఉన్నాడు. అధికారులు కూడా అతని మాటే వింటారు. కాబట్టి ఆ డబ్బును మా చేతికి ఇచ్చినట్లయితే.. మేము అతని కాళ్ళపై పడి, నీ తరఫున క్షమించమని ప్రాధేయ పడతాము” అన్నారు. తనని ఎందుకు రావద్దంటున్నారో చెప్పి “మా మీద నీకు నమ్మకం లేకపోతే.. ఏ చెట్టు చాటు నుండో మేము డబ్బులు ఇస్తామో లేదో చూస్తూ ఉండు” అన్నాడు పాప్లా.
ఏదీ తేల్చుకోలేని పరిస్థితి సోమ్లాది. ఒక గిరిజనుడు మరొక గిరిజనుడిని నమ్మాల్సిందే.. అందుకని వారి చేతిలో డబ్బు పెట్టాడు. అది తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు.
తండ్రి కొడుకు దగ్గరికి వచ్చి.
“ఈరోజు నుండి మనం షావుకారు వద్ద బానిసల వంటి వారం” అంటూ.. రెండు తాడు ముక్కలను తీసుకుని. ఒక ముడి వేసి, “ఒక్కొక్క ముడీ ఒక సంవత్సరానికి లెక్క. దీని ద్వారా మనం ఎన్ని సంవత్సరాలు వెట్టి చేస్తామో మనకు తెలుస్తుంది” అన్నాడు సోమ్లా..
తర్వాత కొడుకులను పట్టుకొని “మనం ఇప్పుడు బానిసలం” అని గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. తండ్రిని చూస్తూ కొడుకులు రోదించారు.తర్వాత పెద్ద కొడుకు “బాధపడొద్దు నాన్నా.. కొద్ది సమయమే కదా… డబ్బు కూడా చాలా తక్కువ మొత్తం. తొందరగా అప్పు తీర్చేద్దాము” అని తండ్రికి ధైర్యం చెప్పాడు.
* ** ** **
మరుసటి రోజు ఉదయం పది గంటలు అయింది. సోమ్లా చెల్లించాలిసిన జరిమానా తగ్గించమని అడగటానికి తన అనుచరలతో ఫారెష్టు అధికారుల వద్దకు వెళ్ళాడు నాయక్.
ఎవరూ చూడకుండా ఫారెస్ట్ గార్డ్ చేతిలో వంద రూపాయలు దోపాడు. అతని కాళ్లపై పడ్డాడు “దయచూపు సామీ, పేద ప్రజలం ప్రభువా , నిరుపేదలం, కొండల్లో అడవుల్లో బతికే అనాగరికులం, అడవి మీద ఆధారపడ్డ మేము అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలము. దయ చూపండి” అన్నాడు గూడెపు పెద్ద నాయక్.
దీప్లా, బారిక్ ముగ్గురు కూడా వారి కాళ్ళ మీద బోర్లా పడి దయచూడమని ప్రార్థించారు. ఫారెస్ట్ గార్డ్ దైవ నామ స్మరణలో ఉన్నాడు.
మిగిలిన అధికారులు వార్తాపత్రికలు చదువుతున్నారు. దయ చూపండంటూ కేకలు పెట్టారు. “మాకు తినడానికి లేదు. అడవిలో ఆకులు తింటూ బ్రతికే మాపై దయ చూపండి. అంత పెద్ద మొత్తాన్ని సోమ్లా చెల్లించలేడు. ఐదు వందల రూపాయలకు తగ్గించండి సామీ. అవి కూడా అతడి దగ్గర లేవు వడ్డీ వ్యాపారి వద్ద తాను గోటీగా మరి మీకు జరిమానా చెల్లిస్తున్నాడు. ప్రభువులు మీరు మా తండా గిరిజనులకు మీరే తల్లీ , తండ్రీ అన్నీ..” అంటూ బ్రతిమిలాడారు. గీ పెట్టారు.
“ఔను.. ఔను.. అతడు పేదవాడు నాకు తెలుసు” అన్నాడు ఫారెస్ట్ గార్డ్ . అది విని మరొక అధికారి కాసేపు మౌనంగా ఉండి చివరికి నోరు విప్పాడు.
“సరే జరిమానా తగ్గిస్తాం. ఐదు వందల రూపాయలు కట్టమనండి” అన్నాడు.
కానీ ఆ గిరిజనులు బతిమిలాడి బామాడి ఏడ్చి చివరికి నాలుగు వందల రూపాయల జరిమానా చెల్లించి, సోమ్లా పై రాసిన ఫిర్యాదు కాయితాన్ని తిరిగి తీసుకున్నారు. అంతటితో ఆ విషయం ముగిసిపోయింది. ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయారు. సోమ్లా తరఫున వెళ్ళిన ముగ్గురు గిరిజనులు ఫారెస్ట్ అధికారులందర్నీ మెచ్చుకుంటూ, వారి దయాగుణాన్ని పొగుడుతూ వెనుదిరిగారు.
వారి రాక కోసం సోమ్లా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
కానీ ఆ ముగ్గురు మిగిలిన ఆ డబ్బును సమానంగా పంచుకున్నారు.
* * సశేషం * *