అభిమాన హీరోలు

కథ

“అమ్మ నేను పోతున్నా?”అన్నాడు శివ హడావుడిగా షర్ట్ వేసుకుంటూ.

“ఏడికి వోతవు బిడ్డ! వచ్చి జెర్ర సేపన్న కాలేదు. ఉడుకుడుకు అన్నం వండిన తిను. ఊకే తిరుగుడేనారా?”అన్నది సత్తవ్వ కట్టెల పొయ్యి దగ్గర నుండి లేస్తూ.

“ఏ, నీఅన్నము ఎవరికి గవాలే , ఆడ మా మల్లు హీరో సినిమా రిలీజ్ అయితుంది .మాకు మస్తు పనులున్నయి. పాలతోటి అభిషేకం జె య్యాలె.పాలు కొనుక్క పోవాలే. పోస్టర్లు అంటు వె ట్టాలె . టే టర్ ముందర మేమే ఉండాలె .ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఇయ్యి. ఖర్సు లకు, మల్ల రేపు మా ఫ్యాన్స్ కు సినిమా ఏపిస్తున్నరు రేపు ఇంకొక వెయ్యి గావాలే”అన్నాడు శివ.

“ఏంది, వాళ్లు సినిమాలు చేసుకుంటే ఖర్సు. గిన్ని పాలవట్లు శేల్లెకు జ్వర మొచ్చిందని పోతామంటే లేవు. గాడనేమో అభిషేకం చేస్తవా? మనకెందుకురా గివ్వి. పొద్దటి నుంచి రెక్కలు ముక్కలైతే మాకు వెయ్యి రూపాయలు కూడా రావు. నువ్వేమో అల్కగ ఒక్క దినంకు 1000 రూపాయలు అడగవడితివి .ఇంకా రేపు 1000 కావాల్నా ?మీ ఫ్యాన్ల కు సినిమా ఫ్రీగా చూపియ్యరా? పైసలు మీకేమన్న ఇస్తరా?ఇంత కష్టపడుతున్నారు కదా”అన్నది సత్తవ్వ కోపంగా.

“నువ్వు ఊకో అమ్మా”అని గుడిసెలోకి పోయి చిలుంబట్టిన ఇనుప డబ్బాలో నుండి పైసలు తీసుకొని వెళ్ళిపోయాడు శివ.
సత్తవ్వ ఎంత మొత్తుకున్నా వినలేదు.

ఏడ్చుకుంటూ బయటకు వచ్చి కూర్చుంది సత్తవ్వ.

ఆ బస్తీలో గుడిసెలో ఉన్న పొరలు అందరూ ఇదే తీరు. వాళ్ళ హీరో సినిమా వచ్చిందట నెల నుండి ఇలాగే పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నారు. ఒక పని లేదు, చదువు లేదు .ఇదే తీరు.

పక్క బస్తీలో కొన్ని గుడిసెలు ఉన్నాయి.

“అమ్మా! పైసలు గావాలె”అన్నాడు రాజు.

గుడిసె కురుస్తుందని మట్టితో మెత్తుతున్న మంగవ్వ

“ఏంటికి రా పైసలు”అన్నది.

“ఇయాల మాకు ఇష్టం లేని మల్లుహీరో సినిమా తేటర్ల వొ స్తుంది . ఆళ్లు మా పాగ హీరోను తిడుతున్నారు .అందుకని గా సినిమా ఆడకుండా మేము జేస్తం .పైసలు గా వాలే”అన్నాడు హడావిడిగా తల దువ్వుకుంటూ.

“వాళ్లు సినిమాలు చేసుకొని పైసలు సంపాదించుకుంటే మనకి ఏంది కొడకా, నీకు ఏమొ స్తది ?మన పైసలు ఖర్సు అయిపోతున్నయి. అయ్యకూ పానం బాగాలేదు. నేనొక్కదాన్నే సంపాదించవడితి. తమ్ముళ్ళు చిన్నోల్లాయే. ఏమన్నా ఆసర అయితవ నుకుంటే, ఉన్న పైసలు ఖర్సు చేయవడి తివి”అన్నది మంగవ్వ ఏడ్చుకుంటూ.

“ఇట్లా అడిగితే నువ్వు ఇయ్యవు గని “అని లోపలికి వెళ్లి చీరల పెట్టెల నుండి ఎన్ని పైసలు దొరికితే, అన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు రాజు.

ఇలా హీరోల అభిమానులు వారిపై పిచ్చి అభిమానం పెంచుకొని ,వారి కటౌట్ లకు పాలాభిషేకాలు చేస్తూ, పోస్టర్లు అతికించడానికి, సినిమాను ప్రమోట్ చేయడానికి చేస్తుంటారు. హీరోలు “మీ అభిమానమే మాకు కొండంత అండ” అని వెన్నపూసే డైలాగులు చెబుతూ, మరింత పిచ్చి వాళ్లను చేస్తున్నారు. “మీ అభిమానం అంటే మాకు ఇష్టం .అందుకనే మీకు స్పెషల్ షోల్ వేస్తున్నాము” అని చెప్పి వాళ్లను మరింత పిచ్చి గొర్రెలను చేసి బోలెడంత టికెట్ పెట్టి, వాళ్లకు సినిమా చూపిస్తారు. ఆ షోలో హీరోలు వచ్చి వాళ్లకు కనిపిస్తారు. ఈ పిచ్చి అభిమానులు అదే మహాభాగ్యంగా చొక్కాలు చించుకొని, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఆ తొక్కిసలాటలో ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.

శివతో ఉన్న కొంతమంది అభిమానులు రాజుతో ఉన్న కొంతమంది అభిమానులు థియేటర్కు చేరుకున్నారు.

రిలీజ్ అయ్యే మల్లు సినిమా అభిమాని అయిన శివ వారి హీరోని “జై జై “అంటూ అరుస్తూ నిలబడ్డాడు. టికెట్ల కోసం వచ్చిన జనులు క్యూ లల్లో తొక్కిసలాటలో అలాగే చూసుకుంటూ వెళుతున్నారు.

ఈ లోపల ఈ హీరోకు అగే నిస్ట్గా ఉన్నా పాగ అభిమాని రాజు తన గ్రూపుతో వచ్చి నెగటివ్ కామెంట్స్ చేసుకుంటూ అరుస్తున్నాడు.

అరుపులు కాస్త పెద్దగా అయిపోయాయి. ఒకరి పై ఒకరు కాలు దువ్వుకోవడం మొదలుపెట్టారు. తిట్టుకోవడంతో మొదలైన విషయం కొట్టుకునే వరకు వచ్చింది. వీరాభిమానంతో, వీరావేశంతో శివ , రాజు విపరీతంగా కొట్టుకున్నారు ఆ కొట్టుకోవడంలో ఇద్దరూ పక్కనే ఉన్న ఇనుప ఫెన్సింగ్ పై పడ్డారు. ఇద్దరికీ తీవ్రమైన దెబ్బలు తగిలాయి.

ఇంత జరుగుతున్నా, అక్కడ హడావుడి తగ్గలేదు .సినిమా టిక్కెట్లు యధావిధిగా తీసుకుంటూనే ఉన్నారు. సినిమా థియేటర్లోకి వెళ్ళిపోతున్నారు. రక్తా లు కారుతున్న వీరి పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఇద్దరు హీరోల అభిమానులు అరుస్తూనే ఉన్నారు. కొట్టుకుంటూనే ఉన్నారు.

చివరికి వారిని హాస్పిటల్ కి తీసుకెళ్లి దిక్కు కూడా లేకుండా పోయింది. చివరికి వారిని ఎవరో చూసి హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.

మీడియా వాళ్ళు ఇదంతా లైవ్ చూపిస్తున్నారే, కానీ అక్కడ గొడవను సద్దుమణిగేలాగా చేయాలని మాత్రము ప్రయత్నించడం లేదు. ఇంకా హింసాత్మ కమైన సంఘటనను జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు. రెచ్చగొట్టే వారి మాటలను రిపీటెడ్ గా ఛానల్ లో ప్రసారాలు చేస్తున్నారు.

కొంతమంది లైవ్ లో కనబడటానికి ఈ కొట్టుకున్న హీరో అభిమానులకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
“ఇప్పుడు ఆ హీరోలు ఇక్కడికి రావాలి. వీళ్లకు జరిగిన దానికి డబ్బు చెల్లించాలి . ఆ మల్లు” హీరో వచ్చి చూడాలి అని పాగ హీరో అభిమానులంటే, పాగ హీరో వచ్చి చూడాలని మరొక హీరో అభిమానులు అరుస్తూనే ఉన్నారు. ఇదంతా లైవ్ రికార్డు అవుతూనే ఉంది. కానీ ఎవరి గోల వాళ్ళదే. సినిమా హిట్ అయింది అనే సంతోషంలో హీరో ఉన్నాడు. వీళ్ళని ఏం పట్టించుకుంటాడు. చివరికి ఆ నోట ఈ నోట ఇలా జరిగిన విషయం హీరో గారికి తెలిసింది. వెంటనే కంటి తుడుపు చర్యగా ఎంతో కొంత పారితోషకం చెల్లించి చేతులు దులుపుకున్నాడు. సినిమా సక్సెస్ అయిందని సంతోషంలో గాలిలో తేలిపోతున్నాడు. ఎవరి ప్రాణాలు పోతే వారికి ఏంటి?

ఆ హీరోకు అగే నెస్ట్ గా అభిమానం చాటుకున్న పాగ అభిమానులు ఆ హీరో సినిమా హిట్ అయినందుకు విపరీతంగా వారి అభిమానులను కొడుతున్నారు.

పిల్లలిద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.

శివ,రాజు ఇద్దరు పక్కపక్క బెడ్ల మీదనే పడుకుని ఉన్నారు. ట్రీట్మెంట్ జరగడం కాదు కదా, అటు వచ్చి చూసే వాళ్ళు కూడా ఎవరూ లేరు.

శివ తల్లిదండ్రులు రాజు తండ్రి దండ్రులు వాళ్ల దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడిగి ఇద్దరికీ ట్రీట్మెంట్ ఇప్పించారు.

కొంచెం కోలుకున్న రాజు, శివ ఒకరినొకరు చూసుకున్నారు. ఇన్ని రోజులు హీరోల ఫ్యాన్స్ అయినా వీళ్లు బద్ధ శత్రువు లాగా కొట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే ఒకరి పక్కన ఒకరు పడుకుని ఉన్నారు.

ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

“రాజూ ,గింత కష్టపడ్డది మనం ఎందుకోసం రా? ఒక హీరో అయినా మనని ఆదుకున్నాడా? మనమేమో తిండి తిని తినక మన అయ్యా అవ్వలు కష్టపడ్డ సొమ్మును కూడా వీళ్ళ సినిమాల కోసమే ఖర్చు పెడుతున్నాము .వాళ్లు మాత్రం మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనీసం మనకు సహాయం కూడా చేయలేదు. ఒకవేళ ఇట్లే ప్రాణం పోతే ఓ లక్షనో రెండు లక్షలో ఇచ్చి చేతులు దులుపుకుంటారు”అన్నాడు బాధగా.

“అవును రా శివ! మనిద్దరికీ ఏం దుష్మన్ ఉందని ఇద్దరం యిన్ని రోజులు కొట్లాడుకున్నం. కానీ ఇప్పుడు మనం ఎవరికోసమైతే పని చేశిన మో వాళ్లు కనీసము మనల్ని మీడియా ద్వారా కూడా పలకరించలేదు. ఎందుకురా మనం ఈ ఎట్టి చాకిరీ చేయడం. వాళ్ళ మాటలకు ఉబ్బిపోయి మన చదువులు ఉద్యోగాలు అన్ని వదిలి గీ పనులల్ల పడ్డము”అన్నాడు రాజు.

రాజు, శివ ఇద్దరూ వాళ్ల తల్లిదండ్రులకు దగ్గరికి పోయి..

“అమ్మా! ఇప్పటి సంది మేం గిట్ల తిరగమే, నువ్వు చెప్పినట్టు వింట” అన్నారు.

వాళ్ల సినిమాలు ఆడటానికి అభిమానులను “మీరే మా హృదయాలలో ఉండే ప్రేక్షక దేవుళ్ళు” అని చెప్పి వారిని మత్తెక్కించే మాటలతో మైమరిపించి, ఇలా చాకిరీలు చేయించుకుంటారు. ఇదే హీరోలు ఒక రైతుకు ఒక మద్దతు ధర కోసం ప్రయత్నం చేస్తారా? ధరలు గిట్టక రోడ్లమీద ఎన్నోసార్లు కూరగాయలు పారపోసి వెళ్తుంటారు రైతులు. ఎప్పుడైనా వారి కోసం అండగా నిలబడ్డారా? వీళ్ళ సినిమాల కోసం టికెట్లను పెంచుకుంటారు. కానీ దేనికోసమైనా వీళ్ళు సహాయం చేయడం చూస్తామా? ప్రపంచం అల్లకల్లోలం అయినప్పుడు ,ముష్టి వేసినట్టు కొంత డబ్బు పంపిస్తారు. అది కూడా నలుగురు దృష్టిలో పడటానికి తప్ప, ప్రజల మీద ఉన్న అభిమానంతో కాదు.

ఇలా సినిమా హీరోల కోసం వెంపర్లాడే అభిమానులు, పిచ్చి తగ్గించుకొని వారి వారి పనులలో నిమగ్నం కావాలి.

ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమాలు కొన్ని రోజులు ఆగి అయినా చూడొచ్చు. కానీ ఈ తొక్కిసలాటలో చూసి ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరమా? వారి జేబులు నిండుతాయి. మీ ప్రాణాలు పోతాయి. గ్రహించండి మారిపోండి.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు – మీరా

అన్నమాచార్య కీర్తన