వర్ణ విన్యాసం

వర్ణ  విన్యాసం శీర్షికతో కొన్ని ముఖ్యమైన రంగుల విశేషాలను గుర్తు చేసుకుందాం .  మానవ జీవితంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది  . అసలు రంగులు లేని ప్రపంచాన్ని ఊహించగలమా! మన వల్ల కాదు . ప్రకృతిని  ,పరిసరాలను పరిచయం చేసే ఈ రంగులు మన భావోద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి . ఇష్టమైన రంగును బట్టి మన వ్యక్తిత్వాలను అంచనా వేయొచ్చు . రంగుల ప్రభావం గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి  .వాటి గురించి తర్వాత చెప్పుకుందాం .

ఈ విశ్వం నిరంతర మార్పుకు సంకేతం  . ఈ మార్పులు మనకు రంగులే చెప్తాయి .ప్రకృతి మారగానే రంగులు మారతాయి  . రంగులు మన ఉద్వేగాలను  ,శరీరాన్ని , మనస్సును ప్రభావితం చేస్తాయి . ఓ యోగి ఏం చెప్పారంటే సంధ్యాకాశంలో మూడు రంగులు ఉంటాయి . అవి ఎరుపు –నీలం- తెలుపు  .ఇవి త్రిమూర్తులకు ప్రతీక . ఎవరైతే  సంధ్యా సమయంలో ఈ మూడు రంగుల పై దృష్టి పెట్టి , ధ్యానం చేస్తారో , వారు శారీరకంగా  ,మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు  అన్నారు  .ఇలా చేయడాన్ని వేదిక్ సంధ్య అంటారు .

మనకు తెలియకుండానే రంగులు మనపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి  .మన మూడ్ ని మారుస్తాయి . నిర్ణయ శక్తిని ప్రభావితం చేస్తాయి . ఇన్తెందుకు కొన్ని రంగుల్ని మనసారా ఆహ్వానిస్తాం. మరికొన్నింటికి దూరంగా జరుగుతాము  .ఇంకో ముఖ్య విషయం .అన్ని రంగులు అందరిపై ఒకేలా ప్రభావాన్ని చూపలేవు  . ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది  .ఓ ప్రత్యేకమైన వర్ణం  ఏదో రకంగా మనకి ఎదురుపడినప్పుడు కారణం తెలియని ఉల్లా సం పొందుతాం. కొత్త ఉత్సాహం ఆవరిస్తుంది.

రంగుల ప్రభావాన్ని అంచనా వేయడానికి ముందు కొన్ని ముఖ్యమైన రంగుల లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రంగులను చూడగానే ఆకర్షణకు లోనవుతాం. మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది . ఫేవరెట్ కలర్ అంటే మన వ్యక్తిత్వమే   .అలాగే కొందరికి కొన్ని రంగులు అస్సలు నచ్చవు  .అలాంటి రంగులు మనలోని వీక్నెస్ లక్షణాలను బయటపెడతాయి .  ఇష్టం లేని రంగును బట్టి కూడా మనం ఎలాంటి వ్యక్తులమో తెలుసుకోవచ్చు .

రంగు అనగానే మొదట గుర్తొచ్చే రంగు ఎరుపు  .ఆలోచిస్తున్నారా ?

మీరు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళుతున్నారు . నలువైపులా పరుచుకున్న పచ్చదనంలో ఎక్కడో సుదూరంగా తలెత్తి చూస్తున్న చిన్ని ఎర్ర పువ్వు . వెంటనే  తెలియకుండానే మీ దృష్టి అటువైపు మళ్ళు తుంది .అదే ఎరుపంటే  .అన్నింట్లోకి ఎరుపు చలింప చేసే రంగు .మిగిలినవి అందమైనవి కోమలమైనవి కావచ్చు . కానీ ఎరుపు ఉత్తేజపరిచే రంగు .

ఎరుపు అంటే ఉద్వేగం .ఎ రుపంటే శక్తి  .అగ్ని తత్వానికి ఇది ప్రతీక  .నాడీ కణాలను  ,రక్తాన్ని ఉత్తేజపరుస్తుంది . పంచేంద్రియాలలో చురుకు పుట్టిస్తుంది . లోలోపల దాగిన ఉద్రేకాలను వెలికితీస్తుంది  .ఇది భయాన్ని రగిలిస్తుంది  .స్వచ్ఛతకు గుర్తు .మనల్ని ఆకర్షించే చాలా వస్తువులు ఎర్రనివే. ఏదైనా సమృద్ధమైనది అంటే ఎరుపు రంగు .మనం కొలిచే దుర్గాదేవి నాలుక ఎరుపు  .మన రక్తం ఎరుపు .ఎరుపు అంటే విప్లవం . విప్లవం అంటే తిరుగుబాటు . ఒక ఆశయ సాధన కోసం ఒక సమూహం చేసే యుద్ధమే విప్లవం . ఆ విప్లవానికి సంకేతం ఎర్ర జెండా . అదీ ఎరుపే

ఇద్దరు వ్యక్తుల కలయిక పెళ్లితో మొదలవుతుంది మన సంప్రదాయంలో  .ఎరుపు రంగు వస్త్రాలు , నుదుట ఎరుపు బొట్టు తన నిబద్ధతకు గుర్తుగా జీవితాంతం ధరిస్తుంది స్త్రీ . ఎరుపు సఫలత్వానికి అభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు  .స్వచ్ఛతకు  ,మాతృత్వానికి  ,సున్నితత్వానికి  ,సహకార శక్తికి చిహ్నం  .ట్రాఫిక్ లైట్ లకు పైనుండే రంగు ఇదే .

దీన్ని ఇష్టపడే వారిలో దూకుడు  ,దృఢమైన ఆలోచన విధానం ఉంటుంది  .ఎక్కువగా ఆలోచిస్తుంటారు  .అవిశ్రాంతంగా పనిచేస్తారు  .మార్పుని కోరుతారు . గుండె నిబ్బరం  ,క్రమశిక్షణ వీరి లో ఎక్కువ . కఫ తత్వం గల వారికి మంచిది. అలా అని అతిగా వాడితే బద్దకానికి దారి చూపుతుంది  .కలర్ థె రపీ లోను దీన్ని వాడుతారు  .ఇదండీ ఎర్ర రంగు కథ.

వచ్చే వారం మరిన్ని రంగుల కబుర్లు చెప్పుకుందాం.

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘ఒడిపిళ్ళు’

విజయానికి తొలిమెట్టు The path