చెరువు నుండి ఇంటికి వచ్చిన సాలీ.. నిస్త్రాణంగా కూర్చున్న తండ్రి, అన్నలను చూసి భయపడింది. విషయం తెలిసిన తర్వాత.. సోమ్లా, అతని కొడుకులు, బిడ్డలు ఒకరిని ఒకరు పట్టుకొని గొల్లున ఏడుస్తూనే ఉన్నారు. వారి గోడును ఎవరూ పట్టించుకోలేదు.
అందరికీ తెలిసిన విషయమే , కానీ వీరిని ఓదార్చడానికి వస్తే, అధికారులు వారిని ఏం చేస్తారో అని భయం. పులి నోట్లో తల పెట్టే సాహసం ఎవరు చేయరు కదా.
అలుపు వచ్చేవరకు, గొంతు ఎండిపోయే వరకు పెద్దగా ఏడ్చి, మెల్ల మెల్లగా అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. రాత్రి గడిచి పోతుంది, ఎవరు ఏమి తినలేదు.
అర్ధరాత్రి దాటిన తర్వాత, వారి ఇంటి వైపు కొన్ని నీడలు కదులుతూ వచ్చాయి. ఇంటి చుట్టూ తిరిగి, గుడిసె వెనక నుండి తలుపు తియ్యమని గుసగుసగా అడిగాయి.
సోమ్లా తలుపు గడియ తీయగానే, నాయక్ , దీప్లా, పాప్లా డోంబ్ అతనితోపాటు మరో నలుగురు లోపలికి వచ్చారు. సానుభూతిగా తలాడిస్తూ ఇటువంటిదే ఏదో జరుగుతుందని ముందే చెప్పాను కదన్నా! అంటూ మొదలు పెట్టాడు. సామా మిగిలిన వారు వంత పాడారు.
ఇదంతా చేస్తున్నది ఆ ఫారెస్ట్ గార్డే, మనకందరికీ ఆ విషయం తెలుసు అన్నాడు ఏదోరకంగా మాటలు మొదలు పెట్టడానికి.
సోమ్లా నెమ్మదిగా నోరు విప్పి” మీ అందరికీ తెలుసు కదా! ఫారెస్ట్ గార్డ్ చెప్తేనే కదా! చెట్లు నరికాను. అతను నా వద్ద డబ్బు తీసుకున్నాడు. మీకు తెలుసు కదా! మీరు ఎందుకు మాట్లాడలేదు” అన్నాడు.
వారిలో ఒకరు మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తావు. పులికి ఎదురు చెప్పి మనం బ్రతకగలమా? మాకూ భార్య పిల్లలు ఉన్నారు కదా!” అన్నారు.
సరే సోమ్లా అన్న భయపడకు డబ్బులు ఇస్తే కేస్ కొట్టేస్తారు. ఏదో ఒక రకంగా డబ్బు చెల్లించు అన్నారు.
“అంత డబ్బు జీవితంలో ఎన్నడూ చూడని ఒక గిరిజనుణ్ణి, నా దగ్గర అంత డబ్బు లేదు, నావల్ల కాదు” అన్నాడు సోమ్లా. పాప్లా అనే వాడు “నీకు నేను ఒక ఉపాయం చెప్తాను. నువ్వు ఎంత దూరం వెళ్ళినవసరం లేదు ఇక్కడికి కొన్ని మైళ్ల దూరంలో తోట గూడ దగ్గర, రామచంద్ర పటేల్ అనే వ్యాపారస్థుని వద్ద డబ్బు చాలా ఉన్నది. అతనికి మనుషులు అవసరం ఉన్నది. కనుక మీ ఇంట్లో ఇద్దరు అతని వద్ద పనికి కుదిరినట్టయితే, కొంత డబ్బును మీకు అప్పు పెట్టగలడని చెప్పాడు.
సోమ్లాకు ఆ వ్యాపారి విషయం అంతా తెలుసు. గతంలో ఒకరికి ఐదు రూపాయలు అప్పు పెట్టి చక్ర వడ్డీ తో లెక్కకట్టి కొడుకులు, మనవళ్ళతో గొడ్డు చాకిరీ చేయించుకుని , అప్పు తీర్చలేదని చాలా వేధించాడు. అది గుర్తుకొచ్చి.
” వద్దు వద్దు” అంటూ గట్టిగా అరిచాడు.
వచ్చినవాళ్లు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని దీప్లా మరొకరు బయటకి వెళ్లి కాసేపు మాట్లాడుకొని మళ్ళీ లోపలికి వచ్చారు. “చూడు సోమ్లా తెలివి తక్కువగా ఆలోచించకు. డబ్బులు కట్టనట్లయితే, నీ చేతికి సంకెళ్లు వేస్తారు. జైల్లో పెడతారు. మీకు సంబంధించిన అన్నింటినీ జప్తు చేస్తారు. ఇల్లు కూలకొడతారు. ఇంట్లో ఉన్న వస్తువులను వేలం వేస్తారూ. ఇదంతా ఒక ఎత్తయితే నువ్వు జైలుకు పోతే, కులం తప్పు పడుతుంది. కులాన్ని కోల్పోతావు. మళ్లీ కులంలోకి రావాలంటే చాలా ఖర్చవుతుంది. ఆలోచించుకో..” అన్నాడు.
అది విన్న తర్వాత ‘జైలు, సంకెళ్ళు, ఇల్లు కూలగొట్టడం, కులం పోగొట్టుకోవడం, అన్నిటికంటే వ్యాపారి వద్దకు గోటీలుగా వెళ్లడ మే మంచిది అనుకున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గర తెచ్చే రుణాన్ని, తండ్రి కొడుకులు ముగ్గురు కష్టపడితే తీర్చ వచ్చునని అనుకున్నాడు.
కానీ అంతలోనే మనసు మార్చుకుని లేదు నాయక తల్లిలేని నా పిల్లలను బానిసలుగా వ్యాపారి వద్దకు పంపలేను అన్నాడు.
అప్పుడు “సరే మంచిది. రాత్రంతా నీకు సమయం ఉంది. ఆలోచించుకొని ఏ విషయం రేపు చెప్పు” అంటూ వెళ్లిపోయారు వాళ్ళు.
*** *** *** *** *** ***
రాత్రి పగలు తేడా లేకుండా సోమ్లా జీవితం అంధఃకారమయింది. తన భార్య సంచారితో కలిసి తన పిల్లల కోసం ఎంత కష్టపడ్డారో, ఎలా పిల్లల్ని పెద్ద చేశారు అన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. భార్య దూరం అయిన తర్వాత వచ్చిన పెద్ద కష్టం ఇది. ఒంటరిగా ఏమీ చేయలేని పరిస్థితి. సంచారి తోడుంటే బాగుండు అనిపించింది అతనికి. ఆ రాత్రంతా తెరిచే ఉన్న కళ్ళముందు ఏవేవో దృశ్యాల కనపడ్డాయి. అడవంతా విపరీతమైన వర్షంతో ముంచెత్తుతోంది పెద్ద పెద్ద చెట్లు వేర్లతో సహా కూలిపోతున్నాయి. సుడిగాలితో కూడిన వర్షం ఇళ్లను, పంటలను, పొలాలను సర్వ నాశనం చేసింది. సంచారి ఏడుస్తూంది. ఏదో వెతుకుతోంది. సోమ్లాకు అది కలో నిజమో తెలియని పరిస్థితి. అనవసరంగా ఎందుకు బాధ పడుతున్నాను అనుకున్నాడు.
ఈ భూమ్మీద ప్రతి ఒక్కరూ బానిసలే. అధికారులు, ఫారెస్ట్ గార్డ్ కూడా మరొకరికి బానిసలే. కొత్తగా నేను బాధ పడడం ఎందుకు అనుకున్నాడు.
ఈ తర్కాన్ని తనజీవితానికి అన్వయించుకున్న తర్వాత, అతనికి బాధ అనిపించలేదు. వడ్డీ వ్యాపారి దగ్గర ఎంతమంది పాలెగాళ్లు లేరు పాలేర్లులేరు. భయపడవలసినది ఏమీ లేదు వ్యాపారి వద్ద ఎనిమిది వందల రూపాయలు అప్పు తెచ్చి ఫారెస్ట్ అధికారులకు జరిమానా చెల్లిస్తాను. యోధుల వంటి నాకొడుకులు కష్టపడి రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. అట్లా అనుకున్న తర్వాత అతను ఒక కునుకు తీయాలి అనుకున్నాడు. పక్కకు ఒత్తిగిలి కళ్ళు మూసుకున్నాడు. అర్థరాత్రి దాటిన తర్వాత భూక్యా తన సోదరుని పిలిచాడు. టిక్యా నిద్ర పోతున్నావా అని అడిగాడు. లేదు నిద్రపోయే పరిస్థితి లేదు అన్నాడు. తమ్ముడూ మనం వడ్డీ వ్యాపారి దగ్గరికి గోటీలుగా పోదామా అని అడిగాడు అన్న. నేను సిద్ధమే, నాకు సమ్మతమే అన్నాడు తమ్ముడు.
తండ్రి బాధను తగ్గించడానికి వారిద్దరూ వడ్డీ వ్యాపారి దగ్గర జీతగాళ్ల వలె వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయం వారికి కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. తర్వాత నిద్ర పోయారు.
ఆలోచించి ఆలోచించి సోమ్లా కన్ను మూత పడింది, కానీ తెల్లవారుజామున మళ్ళీ మెలకువ వచ్చింది. బయటకు వచ్చి చూస్తే యధావిధిగా కొండలు ముళ్ళ చెట్లతో అడవులు ఎప్పటి లాగానే ఉన్నాయి. తెల్లారి ఇంకా కొంచెం వెలుతురు రాగానే గ్రామ పెద్ద, దీప్లా, పాప్లా మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. సోమ్లా ఇంటి ముందు కుప్పలుగా ఉన్న కట్టెలను చూసి, “ఎంత ఆశగా పెట్టుకున్నాడు కర్రలను కుప్పలుగా” అన్నాడు నాయక.
“పాపం ఎంత కష్టపడ్డాడో కదా..” అంటూ సానుభూతి చూపాడు పాప్లా..
వాళ్ళ మాటలు విని బయటికి వచ్చిన సోమ్లా… “వడ్డీ వ్యాపారి దగ్గరికి రావడానికి నేను సిద్ధమే, పదండి పోదాం..” అంటూ ముందుకు నడిచాడు.