దొరసాని

ధారావాహికం -56 వ భాగం

అలా ఇద్దరు మనసారా మాట్లాడుకుని ఇంటికి వచ్చారు… ఆరోజు రాత్రి వర్ణ సౌదామిని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది.

చిన్ననాటి తీపి జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోష పడిపోయారు ‘బాల్యం తిరిగి వచ్చిందా’ అన్నంత ఆనందంగా ఉన్నారు. లోపలికి వచ్చి చూసిన రవీంద్ర “ఈ అమ్మాయి ఈరోజు రావడం మంచిదే అయింది పొద్దుటి నుండి బాధపడ్డ సౌదామిని ఇప్పుడు చక్కగా సంతోషంగా స్నేహితురాలితో కబుర్లు చెబుతుంది” అని అనుకొని లోపలికి వెళ్ళిపోయాడు..

” ఏయ్ వర్ణ! మనం స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నీ వెనకాల పడేవాడు గుర్తుందా వాడు తర్వాత కూడా నీ వెనకే తిరిగాడా ఐడియా మొబైల్ యాడ్ లో కుక్కలాగా” అని నవ్వింది సౌదామిని.

” పాపం మంచోడేనే ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు అలా వెనకాల వచ్చేవాడు అంతే! కానీ నా ఇంటర్ అయిపోయాక మాత్రం ఒక రోజు నేను మా ఇంటి ముందు నిలబడ్డాను నాకు ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు ఏంటిది !అన్నాను.. చదువు నీకే తెలుస్తుంది అన్నాడు..

నేను చదవను ఇలాంటివి నాకు ఇష్టం లేదు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పాను.. పాపం నాకు మళ్ళీ కనపడలేదు.” అన్నది వర్ణ.

” అవునా పాపం ఎక్కడున్నాడో” అన్నది సౌదామిని.

” ఈమధ్య అతని గురించి తెలిసింది పెళ్లి చేసుకున్నాడని కానీ వారి కాపురం అంతా సవ్యంగా లేదని చాలా బాధల్లో ఉన్నాడని విన్నాను” అన్నది వర్ణ

” అయ్యో పాపం.. అయినా అంత తొందరగా పెళ్లి చేసుకున్నాడా ఇంకా మనం ఆడపిల్లలమైనా చేసుకోనే లేదు” అన్నది సౌదామిని.

” నాకు వివరాలేం తెలియవు ఎవరో అనుకుంటే విన్నాను సరే అతని గోల మనకెందుకులే” అన్నది వర్ణ.

” నాకు కూడా అలాంటివి జరిగాయి కదా! ఆడపిల్లలకు ఇవి సహజమే.. కానీ అక్కడ మనము చంచలించక గట్టిగా నిలదొక్కుకుంటే మన చదువు చక్కగా సాగిపోతుంది మనం జీవితంలో స్థిరపడిపోతాము మనం ఆ వయసులో కొంచెం ఊగిసలాడితే ఇంకా అంతే మళ్ళీ పైకి లేవలేము మనకు దేవుడు ఆ ఆత్మస్థైర్యం ఇచ్చాడు కాబట్టే ఇద్దరము చక్కగా స్థిరపడ్డాము” అన్నది సౌదామిని.

” నిజమేనే… మన రాములు మాస్టర్ మొన్న కనిపించారు నిన్ను కూడా జ్ఞాపకం చేశాడు” అన్నది వర్ణ.

” నిజమా ఇంకెవరెవరు కనిపించారు మన టీచర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు మనల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దారు ఒకసారి అందర్నీ కలుద్దామే! నీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పు నేను మళ్ళీ వస్తాను” అన్నది సౌదామిని.

” ఎప్పుడో ఎందుకు? రేపు మనం స్కూల్ కి వెళ్దాము కొంతమంది టీచర్స్ ఉన్నారు అందర్నీ కలుద్దాం నువ్వెలాగూ ఎల్లుండి కదా గోపాలపురం వెళ్ళేది నేను కూడా నీకోసం రేపు ఇక్కడే ఉంటాను” అన్నది వర్ణ.

” సరే అలాగే వెళ్దాం నువ్వు స్కూల్ కు వెళ్ళాలి ఏమో అనుకున్నాను రేపు వెళ్దామంటే నాకు ఇంకా సంతోషమే కదా! ఒక్కసారి మన స్కూల్ ని చూస్తే మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవచ్చు..” అన్నది సౌదామిని.

” నేను అమ్మకి ఫోన్ చేసి చెప్తాను మనం ఇటు నుండి ఇటే స్కూలుకు వెళ్లి పోదాము లేదా మా ఇంటికి వెళ్లి అక్కడ నుండి స్కూలుకు వెళ్దాము” అన్నది వర్ణ.

” మీ ఇంటికి వెళ్లి అటు నుండి స్కూలుకు పోదాం నేను ఆంటీ అంకుల్ ని చూసి చాలా రోజులైంది వాళ్లతో మాట్లాడి స్కూలుకు పోదాం” అన్నది సౌదామిని.

అసలు రాత్రి భోజనం సంగతే మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. అప్పటికి “విజయమ్మ వచ్చి భోజనానికి రండి’ అని పిలిచింది..

” వద్దాంటి! పొలం దగ్గర కంకులు తిన్నాము కదా చాలా ఆయాసంగా ఉంది ఒకవేళ ఆకలేస్తే మేము పెట్టుకొని తింటాం మీరు పడుకోండి ప్లీజ్” అన్నది వర్ణ..

” మీరిద్దరూ తింటారని పులావ్ చేశాను కొంచమైనా రుచి చూడండి” అన్నది విజయమ్మ.

” మేము ఒక గంట ఆగి తింటాము మీరు పడుకోండి అమ్మా!” అన్నది సౌదామిని.

విజయమ్మ రవీంద్ర వెళ్లి పడుకున్నారు.

వీళ్ళ కబుర్లకి అంతులేకుండా పోయింది ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నారు ఇద్దరూ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు కాబట్టి చెప్పుకోవడానికి బోలెడన్ని కబుర్లు.

” నీకు గుర్తుందా సౌదామిని మనం చిన్నప్పుడు ఎవరం సినిమాకి వెళ్లి వచ్చిన ఆ కథంతా క్లాస్ లో చెప్పుకునే వాళ్ళము” అన్నది వర్ణ.

” అవును డైలాగ్స్ తో సహా ఇంకా పాటలను కూడా పాడుకునే వాళ్ళము” అన్నది సౌదామిని.

“మనిద్దరమూ మన టిఫిన్ బాక్స్ లను ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళము .. మా ఇంట్లో వంటలు నీకు నచ్చేవి మీఇంట్లో వంటలు నాకు నచ్చేవి” అన్నది వర్ణ.

” అవును ఆంటీ చేసే బెండకాయ వేపుడు అంటే నాకు ఎంతో ఇష్టం ఆరుచి ఇంకెప్పుడూ నాకు ఎక్కడా దొరకలేదు” అన్నది సౌదామిని.

” అయితే రేపు భోజనం మా ఇంట్లో చేద్దాము అమ్మ నీకు ఇష్టం ఉన్నవన్నీ వండి పెడుతుంది” అని చెప్పింది వర్ణ.

” తప్పకుండా మీఇంట్లోనే భోజనం చేద్దాం” అన్నది సౌదామిని.

ఒక గంట తర్వాత ఇద్దరు వెళ్లి ప్లేట్లలో పులావ్ పెట్టుకుని అందులోకి చేసిన పెరుగు పచ్చడి వేసుకొని తిన్నారు.

” చాలా బాగుంది చిన్నప్పటి రుచులన్నీ గుర్తుకొస్తున్నాయి” అన్నది వర్ణ.

భోజనం చేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎప్పటికో కానీ నిద్రలోకి వెళ్లారు.

తెల్లవారి కొంచెం ఆలస్యంగా నిద్ర లేచారు.. అప్పటికే చాయ్ తయారుచేసి విజయమ్మ ఫ్లాస్క్ లో పోసి పెట్టింది. ఇద్దరు చాయ్ తాగి స్నానాలు చేసుకొని ఇంటి పక్కనే ఉన్న గుడికి వెళ్లి దండం పెట్టుకుని వచ్చారు.

విజయమ్మ ఇద్దరికీ తపాలా రొట్టె పెట్టి ఇచ్చింది దానిలోకి వెన్న వేసుకొని ఇద్దరు తిన్నారు.

” ఎంతైనా అప్పటి వంటకాల రుచి వేరు ఇప్పుడు ఇడ్లీలు దోసెలు ఎన్ని తిన్న పాతకాలం వంటల మీదికి రానే రావు కదా!” అన్నది వర్ణ.

” అవును నా అదృష్టం ఏమిటంటే ఇప్పుడు నేను గోపాలపురంలో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్న కదా నీలాంబరి అత్తయ్యకు కూడా ఇలా పాతకాలపు వంటలు చాలా ఇష్టం చాలా వరకు నేను అక్కడ ఇలాంటి రుచులను మిస్ అవ్వడం లేదు” అన్నది సౌదామిని.

” ఇంకేంటి జాబ్ కం అత్తారిల్లు అంతేనా” అన్నది వర్ణ నవ్వుతూ.

” ష్ గట్టిగా మాట్లాడకు అమ్మ ఇక్కడే ఉంది ఇంకా ఇంట్లో తెలియదు కదా” అన్నది సౌదామిని.

” ఇలాంటివి ఆలస్యం చేయకూడదు తొందరగా ఇంట్లో చెప్పేసేయ్ ఆంటీ అంకుల్ నిన్ను అర్థం చేసుకొని ఒప్పుకుంటారు” అన్నది వర్ణ.

” చెప్తాను మళ్ళీ 15 రోజుల్లో వస్తాను అప్పుడు విషయం అంత చెప్తాను” అన్నది సౌదామిని.

ఇద్దరూ చక్కగా చీరలు కట్టుకొని తయారయ్యారు వర్ణ సౌదామిని చీర కట్టుకుంది… ఇద్దరూ చక్కని చుక్కల్లా మెరిసిపోతున్నారు.

సౌదామిని తల్లి విజయమ్మకు చెప్పింది..

” అమ్మా! నేను వర్ణ వాళ్ళింట్లో భోజనం చేసి స్కూలుకు వెళ్లి ఒకసారి మా టీచర్లను కలిసి వారి ఆశీస్సులు తీసుకొని వస్తానమ్మా” అని చెప్పింది సౌదామిని.

” సరే వెళ్ళిరండి” అన్నది విజయమ్మ.

బయటకు వచ్చిన రవీంద్ర “ఎలా వెళ్తారు కార్ తీసుకెళ్తారా” అన్నాడు.

” కారు వద్దు నాన్న స్కూటీ మీద వెళ్లి పోతాము” అన్నది సౌదామిని.

” జాగ్రత్త అప్పటిలా లేవు పరిస్థితులు విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది” అని చెప్పాడు రవీంద్ర.

ఇద్దరు స్కూటీ పైన ముందుగా వర్ణ వాళ్ళ ఇంటికి వెళ్లారు.

అక్కడ వర్ణ తల్లిదండ్రులను కలిసి మాట్లాడి స్కూలుకు వెళ్ళిపోయారు…

స్కూల్ గేటు ముందర స్కూటీ ఆపి అలాగే స్కూలు చూస్తూ నిలబడి పోయారు స్నేహితురాలిద్దరూ.

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాట

గిన్నీస్ బుక్