(ఇప్పటివరకు : ప్రసాద్ కి అపూర్వ కి పెళ్లి జరిగి పోతుంది. ఫస్ట్ నైట్ ప్రహసనం లో అపూర్వ జీవితం లో ఇంకెవరో ఉన్నారన్న అనుమానం వచ్చింది ప్రసాద్ కి. మొదటి రాత్రి అపూర్వ ప్రవర్తన ప్రసాద్ కి ఎన్నో ప్రశ్నలను మిగులుస్తుంది. ఆఫీస్ కెళ్లిన ప్రసాద్ ని కొలీగ్స్ పార్టీ ఇమ్మని అడుగుతారు. ఎలీషా ప్రసాద్ కి భవ్య ,అపూర్వ ల మధ్య నున్న బంధం గురించి వివరిస్తుంది. భవ్య అపూర్వ ఆఫీస్ నుండి రిలీవ్ అవుతారు కొత్త కంపెనీలో చేరడానికి.)
ఆఫీస్ నుండి రిలీవింగ్ తీసుకొని , పార్టీ అయినా తరువాత , “ నీకోసం ఇంట్లో వెయిట్ చేస్తుంటాను ప్రసాద్ . త్వరగా వచ్చేయ్ అంటూ ,” అపూర్వ భవ్య తో ఆమె కైనెటిక్ మీద ఎక్కి వెళ్ళిపోయింది. ప్రసాద్ పార్టీ అయినా తరువాత తన సీట్ లోకెళ్ళి కూర్చున్నాడు.
మనసంతా అదోలా అయిపొయింది. అపూర్వ నటిస్తున్నదని మాత్రం బాగా అర్ధ మయింది. ఆమెతో ఇప్పుడే ఏది నేరుగా మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. భవ్య ఎలా చెబితే అలా అపూర్వ చేస్తున్నదనిపిస్తున్నది. తనేం పాపం చేసాడు? తనతోనే ఇలా ఎందుకయింది? మంచిగా ఉండటం, ఎదుటి వాళ్ళని అర్థంచేసుకోవడం లాంటివి తన బలహీనతలుగా మారాయా? తన మొహమాట స్వభావం అపూర్వకి మంచి అవకాశంగ మారిందా ? అందుకే , పెళ్లి చేసుకుందామనుకున్న తరువాత కూడా తనతో టి ఈ ఆఫీస్ లో జాబ్ రిజయిన్ చేసిన విషయం చెప్పలేదు. అంటే తన తోటి ఏమి చెప్పదా? తనని తనకు కావాల్సిన విధంగా వాడుకోవడం కోసమే తనని పెళ్లి చేసుకుందా? పైగా తన కోసం, తన తరఫున నిలబడే కుటుంబం లేదు కనుక, ఎం చేసిన ఇతని దగ్గర చెల్లిపోతుందనుకుంటున్నదా? ఇలా ఎడతెగని ఆలోచనలతో వర్క్ మీద మనసుపెట్టలేక పోయాడు.
ఎలీషా కి ప్రసాద్ మీద జాలేసింది. వెంటనే బాస్ రూమ్ లోకెళ్ళి , పదినిముషాల్లోనే తిరిగొచ్చి , “ప్రసాద్ లే , నీ పని నేను చేసేస్తాను ఇవాళ, నాకేం పనిలేదు, నా టార్గెట్ పూర్తయింది. నువ్వు ఇంటికెళ్ళు. రెస్ట్ తీసుకో,” అంటూ బలవంతంగా కుర్చీ లోంచి లేపి అతని బాగ్ భుజానికి తగిలించి బయటికి తీసుకొచ్చింది. “జాగర్తగ ఇంటికెళ్ళు,” అంటూ అతన్ని పంపి తాను ప్రసాద్ సీట్ లో కూర్చుంది, కొన్ని అర్జెంట్ ఫైల్స్ ని పూర్తి చేయడానికి.
ప్రసాద్ కి అపూర్వ వాళ్ళింటి కెళ్లాలనిపించలేదు. నేరుగా తన ఫ్లాట్ కి వెళ్లి పోయాడు. వెళ్ళగానే, ఆఫీస్ బట్టలు మార్చేసి లూస్ పైజామా, కుర్తా వేసుకొని బెడ్ మీద వాలి పోయాడు. ఆలోచనలతో తల పగిలిపోతుంది. ఎవ్వరికి చెప్పుకోలేని సమస్య. ఎంత కాలం ఇలా భరించాలో తెలియదు. అల్మరాలోనుండి ఒక స్లీపింగ్ పిల్ వేసుకొని మొబైల్ ఆఫ్ చేసి పడుకుండి పోయాడు. చాలాసార్లు ఫోన్ రింగ్ అయింది. ఆ తరువాత స్విచాఫ్ అయింది,అవేమి ప్రసాద్ కి తెలియలేదు స్లీపింగ్ పీల్ ప్రభావం లో.
రాత్రి పది గంటల వేళ కాలింగ్ బెల్ ఒకటే మోగటం తో మేలుకు వచ్చి, ఇప్పుడెవరబ్బా అనివచ్చి తలుపుతీసాడు. ఎదురుగ చంద్రమౌళి గారు నిలుచుని ఉన్నారు. కాస్త తత్తర పడుతూ , “ లోపలకి రండి అంకుల్,” అంటూ పిలిచాడు.
బాగా నిద్దర మత్తులో ఉన్న ప్రసాద్ ని చూస్తూ, “ఎం ప్రసాద్ , మా ఇంట్లో నిద్దర పట్టటం లేదా? ఎంతయినా కొత్త ప్లేస్ కదా1 కాకపోతే మెసేజ్ పెట్టుండాల్సింది. మీ అంటి ఒకటే ఖంగారు పడి నన్ను పంపించింది . డిన్నర్ చేసావా,” అన్నాడాయన.
“లేదంకుల్, ఆకలిగా లేదు. అపూర్వ మీకు చెప్పే ఉంటుంది. ఈ రోజు ఆఫీస్ లో లంచ్ ఇచ్చాను అందరికి, చాలా లేట్ అయింది, అందుకని కాసేపు పడుకుందామని ఫ్లాట్ కొచ్చాను” అన్నాడు .
“ ఒకే, పద మరి ఇంటికెళదాము. అపూర్వ ఎదురుచూస్తుంటుంది,” అన్నాడాయన .
“ రేపు వస్తాలే అంకుల్, ఇప్పటికే చాల రాత్రయింది, మీరు ఇంటి కెళ్లి పడుకోండి,” అన్నాడు.
“ఒకే ఒకే, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి అక్కడికే రావాలి,” అంటూ అయన వెళ్ళిపోయాడు. మళ్ళి ప్రసాద్ బెడ్ మీద వాలిపోయాడు.
**************
అదొక అందమయిన తోట. ఎన్నో రకాల పూలమొక్కలు , చాలా అందంగా ఉన్నాయి. అక్కడి గాలి తెమ్మెరలు పూవుల సుగంధం మోసుకొస్తున్నట్లుగా ఉన్నది. మనసుకెంతో హాయిగా, బాధ పరితప్త హృదయానికి స్వాంతనలా ఎక్కడి నుంచో అందమయిన పూబాల తన దగ్గరి కొచ్చింది, ఆ సౌందర్యం, ఆ సుగంధం అపూర్వం. ఆమెనలా చూస్తూ ఆమె వెనకాలే వెళ్ళ సాగాడు. ఆమె తనని అందమయిన పూదోటనుండి , జాలువారుతున్న జలపాతం దాక , ఆ తరువాత ఆ జలపాతం వెంబడే నడిపిస్తూ ఆ జలపాతం కిందకు జారుతున్న ఎత్తయిన కొండా చరియా దాక తీసుకెళ్లింది. అక్కడి నుండి చూస్తే, ఈ జగత్ అంతా ఎంతో సుందరం, సుమధురం. శాశ్వతంగా అక్కడే ఉండి పోతే, ఈ పూబాల సాంగత్యం లో తన జీవితం పరిపూర్ణమవుతుంది, అంతా ప్రేమమయమే అవుతుంది, అనుకుంటూ తాను తన్మయత్వం లో ఆ పూబాల నే చూస్తున్నాడు తమకం గ , తనలో ఊపిరులు ఊపందుకున్నాయి. తన ఉచ్వాస నిశ్వాసలు తనకి వినిపిస్తున్నాయి. మనసంతా ఆనంద నిలయమైంది. అలా తాను వెనక్కి నడుస్తున్నాడు ఆ పూబాలనే చూస్తూ. ఆ పూబాల చిరునవ్వు చేరగనీయకుండా, అతని దగ్గరి దగ్గరికి వస్తున్నది. అలాటి మరుపు రాని కొద్దీ క్షణాలలో, తానూ అంత ఎత్తయిన శిఖరాగ్రం నుండి ఆ జలపాతం లోకి తోసివేయబడ్డాడు. ఊపిరి ఆడటం లేదు, తాను ఆ నీటి ప్రవాహం లో కొట్టుకు పోతున్నాడు. ఆసరా కోసం ఆ పూబాల కోసం వెదుకు తున్నాడు చూపులతోనే. ఆ వెతుకులాటలో ఓడిపోతున్నాడు , అలసిపోతున్నాడు చివరికి మునిగిపోతున్నాడు. ఊపిరి అందటం లేదు , ఆయాసం వస్తున్నది, తట్టుకోలేనంత దగ్గు. ప్రసాద్ కళ్ళు తెరిచాడు. ఆయాసంగా ఉంది దగ్గు వస్తున్నది.
బెడ్ మీద నుంచి లేచెళ్లి ఫ్రిజ్ లోంచి మంచినీళ్లు తీసుకొని గబగబా తాగేశాడు. కాస్త ఉపశమనం అనిపించింది. వాష్రూమ్ లోకెళ్ళి మొహం కడుక్కున్నాడు. ఇప్పుడు బాగా రిలాక్స్ అయ్యాడు. వచ్చి మళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. ఇదంతా కలా? నిజామా? కొంత నిజం , కొంత కల కావచ్చు అనుకున్నాడు. చిన్నగా నవ్వొచ్చింది తన స్థితి కి తనకే. ఫ్రీజ్ లోంచి టెట్రా పాక్ లో ఉన్న పాలతోటి బ్రూ కాఫీ కలుపుకొని వచ్చి మళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. టైం చుస్తే నాలుగుగంటలు. తెల్లవారు ఝామున వచ్చే కల లు నిజమవు తాయంటారు. నా ఈ కల కొంత అయితే ఇప్పటికే నిజమైంది. మళ్ళి అదే చిరునవ్వు , తన నిస్సహాయత మీద తనకే జాలి.
తన బుక్ రాక్ లో ఉన్న బుచ్చి బాబుగారి నవల “చివరకు మిగిలేది” చేతిలోకి తీసుకొని పే జీలు తిప్పసాగాడు.
కధలోని పేజీలు తిప్పుతున్నప్పుడు మధ్య మధ్యలో వస్తున్న స్త్రీ మూర్తులు , వారితో దయానిధికున్న సంబంధ బాంధవ్యాలు, ఆ తరువాత వారి పట్ల అతని ఆలోచనలు, అర్ధాలు అపార్దాలు అర్ధమవుతున్నకొద్దీ , ప్రసాద్ కి అనిపించింది “మనిషి మనుగడలో అతడే కర్త అనీ, అతడి జీవితంలో జరిగే పనులకు ఏ మానవాతీతశక్తి ప్రమేయం లేదనీ, అతడి కర్మకి అతడే బాద్యుడని , దేవుడో, తలరాతో, పునర్జన్మ సుకృతమో కాదు , అంత తన చుట్టు ఉన్న సమాజం , పరిస్థితులకు తాను ఆహుతి అవుతున్నాడు. అపూర్వ తో తన వివాహం ఏ మలుపు తిరిగిన అది ఒక నిర్బంధ జీవితం మాత్రమే. తాను కోరుకున్న జీవితం మాత్రం తనకి దొరకదు. చిన్న చిన్న సం తోషాల కోసం కూడా తాను వెదుకులాడాలసిందే. రాజీపడతు బతకాల్సిందే. చివరికి తనకేమి దక్కుతుందో అది కూడా ప్రస్నార్ధకమే? అలా ఆలోచిస్తూ మళ్ళి నిద్దర లోకి జారుకున్నాడు.
ఉదయం పది గంటలకి మెలుకువొచ్చింది. గబా గబా రెడీ అయి ఆఫీస్ కి వెళ్ళాడు. అక్కడ నుండే చంద్రమౌళి గారికి ఫోన్ చేసి తాను సాయంత్రం వస్తానని చెప్పాడు. ఆ రోజంతా పని లో పడి పోయి తనకి పెళ్ళయిందన్న విషయాన్నీ ఆ రోజుకి మరిచిపోయాడు. సాయంత్రాని కల్లా తను పూర్తి చేయాల్సిన ఫైల్స్ ని పూర్తి చేసి , బాస్ కి ఇచ్చేసి, బయట పడ్డాడు. తన ఫ్లాట్ కెళ్ళి ఫ్రెష్ అప్ అయి , హాఫ్ వైట్ టీ షర్ట్ బ్లాక్ జీన్స్ వేసుకొని, కొల్హాపురి చప్పల్ వేసుకొని అపూర్వ వాళ్ళింటికి కి బయలుదేరాడు.
అపూర్వ వాళ్ళింటి కి చేరగానే, లిఫ్ట్ దగ్గరే బుజ్జి కలిసాడు. “ సూపర్ బావ గారు! మీరు ఈ రోజు చాలా హ్యాండ్సం గ ఉన్నారు,” అంటూ ప్రసాద్ ని హగ్ చేసుకున్నాడు. ప్రసాద్ బుజ్జి ని దగ్గరికి తీసుకున్నాడు తన చిన్న తమ్ముడిలాగా. ఇద్దరు కలిసి ఫ్లాట్ దగ్గరికి వచ్చేసారు. తలుపు తెరిచే ఉండడంతో, “ రండి బావ గారు,” అంటూ “అమ్మ , ప్రసాద్ బావ వచ్చాడు,” అని పెద్దగా అరిచి చెప్పాడు.
హడవిడిగా కిచన్లొ నుండి చేయి తుడుచుకుంటూ హాల్లో కొచ్చింది ఆమె. ప్రసాద్ అక్కడ ఉన్న ఒక సోఫా లో కూర్చుని, టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసుకున్నాడు చేతిలోకి.
“ప్రసాద్ , వొంట్లో బాగున్నదా? మీ అంకుల్ చెప్పారు, ఇప్పుడెలా ఉన్నది, ఫంక్షన్ బడలిక తగ్గిపోతుందిలే,” అంటూ, “ ఓసేయ్ అప్పూ! ప్రసాద్ వచ్చాడు రావే ,” అంటూ పెద్దగా కేకేసి చెప్పింది.
అపూర్వ ఆ పిలుపుకి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చింది. సీ గ్రీన్ కలర్ కుర్తి , నేవీ బ్ల్యూ ప్లాజో లో చూడ ముచ్చటగా అనిపించింది అపూర్వ ప్రసాద్ కి. ప్రసాద్ కొద్దీ సేపు చూపు మరల్చుకోలేక పోయాడు.
“ఏంటి బాస్, అలానే చూస్తున్నావు, దిష్టి తగిలెను,” అంటూ వచ్చి ప్రసాద్ చుట్టూ చేతులేసి హగ్ ఇచ్చి పక్కనే కూర్చుంది. ఆమె అందంగ ఉన్నది కానీ, తన మసుకి మాత్రం ఏ భావన లేదు. ఒక తెలిసిన అమ్మయిని చూస్తునట్లే ఉన్నది తప్ప, ఆమెతో తనకు వివాహం అయిందన్న ఆలోచనే మనసులోకి రాలేదు ప్రసాద్ కి. బయటి కెళ్లిన చంద్రమౌళి గారు కూడా వచ్చాక అందరు కలిసి డిన్నర్ చేసారు.
సుమతి లేస్తూ “మీరిద్దరూ అపూర్వ రూమ్ లోకెళ్ళి పడుకోండి , “ అంటూ “ పదండి, పదరా బుజ్జి,” అంటూ అందరిని తనతో పాటె తీసుకెళ్లింది వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించటం కోసం. ఆమె ప్రయత్నం చుస్తే ప్రసాద్ కి కొంచం నవ్వు కూడా వచ్చింది.
“ అపూర్వ , నేను నీతో మాట్లాడాలి,” అన్నాడు కాస్త సీరియస్ గా.
“ నాకు తెలుసు నువ్వేం అడగాలనుకుంటున్నావో,” అంది.
“ఏంటి?”
“ నేను జాబ్ కి రిజయిన్ చేసిన విషయం, అలాగే వేరే కంపెనీలో చేరిన విషయం , నీకు ఎందుకు ముందుగా చెప్పలేదనేగా?”
“ అంతే కాదు, ఈ విషయం మీ అమ్మ నాన్న వాళ్లకు చెప్పవా ?”
“ ఎప్పుడో చెప్పాను. నీక్కూడా ఇష్టమే అని కూడా చెప్పాను. ఎం నీకిష్టం లేదా?” కొంటె గా అడిగింది.
“ నా ఇష్టం తో పనేముంది. నీ జాబ్ నీ ఇష్టం.” అంటూ “నేను వెళతాను , నాకు ఆఫీస్ పనుంది, రేపు సాయంత్రం వస్తాలే ,” అంటూ మౌనంగా వెళ్లి పోయాడు. వెళ్లి పోతున్న అతన్ని ఆమె ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రసాద్ వెళ్లిపోయాడన్న విషయం, ఉదయం కానీ సుమతి కి తెలియలేదు.
ఆ విషయం తెలిసాక, ప్రసాద్ వాళ్లతో ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడేమో అనుకోని, “ఏమండి, మనం వీళ్ళ చేత కాపురం పెట్టిద్దాము,” అంది చంద్రమౌళి తోటి.
“ అలాగే సుమతి, మంచి రోజు చూడు,” అన్నాడాయన. ఆమె వెంటనే అయ్యగారికి ఫోన్ చేసి మంచిరోజు అడిగి తెలుసుకుంది.
సాయంత్రం ప్రసాద్ రాగానే, “ప్రసాద్ , గురువారం మంచి రోజట, అపూర్వ ని కాపురానికి పంపుతాము, ముందు పాత ఫ్లాట్ కె వెళతారా, లేక నేరు గ కొత్త ఫ్లాట్ లోకే వెళతారా ,” అడిగింది.
ప్రసాద్ చెప్పే ముందే, “మేము కొత్త ఫ్లాట్ కి వెళ్తాము అమ్మ, నాకింకా నెల రోజులుంది కదా , కొత్త ఆఫీస్ లో చేరడానికి ,” అంది అపూర్వ.
“అలాగే,” అన్నాడు ప్రసాద్. కానీ అపూర్వ వాలకం సుమతికి అస్సలు నచ్చడం లేదు.
“ముందుగా ఒకసారి నన్నా ఫ్లాట్ కి తీసుకెళ్ళు ప్రసాద్,” సామాన్లన్నీ సర్ది పెడతాను అన్నది సుమతి. “అలాగే ఆంటీ! మీరు ఎప్పుడంటే అప్పుడే ,” అన్నాడు.
“ అయితే రేపే వెళదాము .” “ అలాగే” అంటూ “ఆంటీ! నాకు చాల ఆఫీస్ పని పెండింగ్ ఉన్నది , రేపుఉదయం వచ్చి మిమ్మల్ని ఫ్లాట్ కి తీసుకెళ్తాను,” అని ప్రసాద్ వెళ్ళిపోయాడు.
ఉదయాన్నే తొమ్మిదింటికల్లా వచ్చేసాడు. సుమతి అప్పటికే సామాన్లు కారులో పెట్టించేసింది. అపూర్వ ,” నాకు బోర్ మాం, నువ్వే వెళ్లి అన్ని సర్దించే సేయ,” అంటూ తప్పించుకున్నది. ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటావే, నిన్ను అక్కడ దింపిన తరువాత అన్ని నువ్వే సమర్ధించుకోవాలి, నేను రమ్మన్నా రాను,” అంటూ బెదిరించి ప్రసాద్ తో కలిసి వెళ్లి పోయింది.
కార్ వాళ్ళ ఫ్లాట్స్ దగ్గర పార్కింగులో ఆగగానే, అక్కడున్న ఓనర్స్ , రెసిడెంట్స్ నేమ్స్ ఉన్న బోర్డు కనిపించింది. బ్లాక్ -బి 201, ప్రసాద్ అపూర్వ , అని ఉంది. అది చూసి ఆమె ఏంతో తృప్తి గ తలాడించింది. అలా చూస్తుండగా , బ్లాక్ -బి 210 మిస్ భవ్య కుమార్, టెనెంట్ ,అని రాసి ఉంది. అది ప్రసాద్ కూడా చూసాడు. కానీ అది చూడగానే సుమతికి ఎవరో పేగులు మెలేసినంత బాధ అనిపించింది.
(ఇంకావుంది)