‘ఆశ్రిత’ అనురాధ ఆశయం

యలమర్తి అనురాధ గారితో తరుణి ముఖాముఖి

తరుణి     : నమస్తే యలమర్తి అనురాధ గారూ !

య.అ.   : నమస్తే అండీ

తరుణి     : మీరు స్వతహాగా రచయిత్రి కదా. ఈ సేవా కార్యక్రమాలలోకి ఎలా వచ్చారో తెలియజేస్తారా ?

య.అ.   : నాకే తెలియకుండా అదంతా జరిగిపోయిందండీ. మామూలుగా మాట సాయం చేయటం, సలహాలు ఇవ్వటం అలవాటే. 2012 అక్టోబరులో ఒకరోజు నేను ధ్యానం చేసుకుంటుంటే అందులో ఈ ఆలోచన రావటం జరిగిందండీ.

తరుణి     : ఓ! అవునా! అప్పుడే ప్రారంభించారా ?

య.అ.   : నాకు మళ్ళీ ధ్యానంలోనే ‘ఆశ్రిత’ అని పేరు కూడా వచ్చింది. రిజిస్ట్రేషన్‌ చేసుకుని ప్రారంభిద్దాం అనుకున్నాను. కానీ మా వారు బ్యాంకు ఉద్యోగి కాబట్టి కుదరదన్నారు. మామూలుగా మాకు తోచినది చేయాలని నిశ్చయించుకొని ‘విజయథమి’ రోజున మా డాబా మీదే తణుకులో నా తోటి కవుల సమక్షంలో మొదలు పెట్టేశాను.

తరుణి     : మీ మొదటి కార్యక్రమ విశేషాలు చెబుతారా ?

య.అ.   :  ‘అమృతవల్లి’ కొమ్మలను పంచిపెట్టాను. దీనిని అందరూ వాడుక భాషలో ‘తిప్పతీగ’ అంటారు. ఎన్నో ఔషధ గుణాలు కల్గినది. అందరికీ తెలిసిన విషయమే. రోజుకు రెండు ఆకులు పరగడుపున తింటే బీ.పీ., షుగరులు కంట్రోల్‌ లో ఉంటాయి. నా అభిమాని ఇది తెలుసుకొని హైద్రాబాదు మల్కాజగిరీలో తమ ఇంట్లో ఓ కార్యక్రమం చేసి అక్కడ కూడా పంచిపెడదాం అని ఆహ్వానించటంతో అక్కడ ఈ మొక్కలను చుట్టుప్రక్కల వారికి, సభకు వచ్చిన వారికి ఇచ్చాను.

తరుణి     : మంచి పనితో ప్రారంభించారు. మీరు మీ పుట్టినరోజు వేడుకలను మానసిక వికలాంగుల ఆశ్రమంలో గడుపుతారని విన్నాను. అవునా?

య.అ.   : అవునండి. ఇక్కడ ‘స్పందన’ మానసిక ఆర్గనైజేషన్‌, ప్రేమాన్విత ఉంది. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి పులిహోర, బిస్కెట్‌ ప్యాకెట్స్‌, స్వీట్స్‌ ఇలా ఏదో నాకు తోచినవి తీసుకెళ్ళి పంచి వాళ్ళతో ఓ రెండు గంటలు గడిపి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. వాళ్ళు మానసిక వికలాంగులైనా రెండవసారి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టడం ఓ మధురానుభూతి. రెడ్డి శ్రీనివాస్‌ అని నాకు సహకరిస్తూ ఉండేవాడు పనుల విషయంలో. ఇక మా వారు వై.యస్‌.ఆర్‌. సి.వి. ప్రసాదరావు గారి సహకారం సంపూర్తిగా అన్ని విషయాల్లో ఉంటుంది. కాబట్టే అటు రచనలు, ఇటు ఈ సేవా కార్యక్రమాలు చేయ గలుగుతున్నానని నన్ను తెలిసిన అందరికీ తెలిసిన విషయమే.

తరుణి     : వృద్ధాశ్రమాలకు కూడా వెళుతూ ఉంటారా ?

య.అ.   : అవునండీ. పిల్లల ఆలన పాలనలో శేషజీవితాన్ని హాయిగా గడపాల్సిన వాళ్ళు కొడుకులకు, మనవళ్ళకు దూరంగా ఉండటం, ఎన్నో ఆస్తులు గడించి కూడా చివరి థలో ఇలా ఆశ్రమాలకు చేరటం నా మనసును కలిచివేస్తూ ఉంటుంది. నేను సేద తీరటానికి, వాళ్ళకి ఆప్యాయతను అందించటానికి కూడా వెళుతూ ఉంటాను. వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళం కదా. ఆరోగ్యానికి మంచిదని పండ్లు పట్టుకెళ్ళే వాళ్ళం.

తరుణి     : తణుకులోనేనా, ప్రక్క గ్రామాలకు కూడా వెళ్ళేవారా?

య.అ.   : నిడదవోలు చర్ల సుశీల వృద్ధాశ్రమంకి కూడా వెళ్ళామండీ. మా పిల్లలు కూడా వస్తామంటే వాళ్ళను కూడా తీసుకువెళ్ళాం. ఒక పెళ్ళి వేడుకలా చేసుకున్నాం. కొన్ని కొత్తవి, మరికొన్ని పాతవి ఓ అరడజను సంచుల సామాగ్రితో! జనరల్‌ నాలెడ్జి, ప్రశ్నలు వేసి సమాధానం చెప్పిన వారికి బహుమతులు పంచాం. చీరలు, ప్యాంటూ, షర్టులూ, గాజులు, హెయిర్‌ బాండ్స్‌. చిన్న మొత్తం విరాళంగా కూడా! అమ్మ ఎల్‌. సీతారావమ్మ కూడా పాలు పంచుకుంది.

తరుణి     : ఓ! మీరు విరాళాలు తీసుకోరని విన్నాను.

య.అ.   : అవునండీ. మేము ‘ఆశ్రిత’ స్వచ్చంధ సంస్థ ప్రారంభించగానే మాకు తెలియకుండా విరాళాల సేకరణకి మా సంస్థ పేరు చెప్పి వచ్చారని తెలిసింది. అభిమానంగా కాదు, కూడదని ఇచ్చిన వారి దగ్గర తీసుకున్నాం కానీ ఆ అలవాటు లేదని అప్పుడే తెలియజేశాం. నాకు అది ఇష్టం ఉండదు కూడా. మేము మాకు తోచినవి చిన్న చిన్న సాయాలే చేశాం. అదీ మేము చేయగలిగినంత వరకే !

తరుణి     : అది మంచి అలవాటు. ప్రభుత్వ స్కూల్సుకు వెళ్లటం, అక్కడ కార్యక్రమాలు నిర్వహించటం లాంటివి ఏమన్నా చేశారా ?

య.అ.   : మా ఇంటి వెనకే మున్సిపల్‌ స్కూలు ఉండేదండీ. అక్కడ పిల్లలకు పెన్సిల్‌ బాక్సులూ, అందులో పెన్నూ, పెన్సిల్‌, రబ్బరు, షార్పునర్‌ లాంటివి వేసి పంచాం. స్కూలు ఫస్ట్‌ వంచ్చిన అమ్మాయికి స్కాలర్‌ షిప్‌ ముందుగా ఇస్తామని చెప్పి మంచి స్కూల్‌ బ్యాగ్‌ కొనిచ్చాం. అలాగే అక్కడే మొక్కలు నాటడం కార్యక్రమం చేసి పిల్లలలో ఆ అలవాటుని పెంపొందించే ప్రయత్నం చేసాం.

తరుణి     : పర్యావరణానికి కూడా ప్రాముఖ్యత నిచ్చారన్నమాట..

య.అ.   : అదే మన శ్వాసకి ఆధారం కదండీ అది మనమంతా తెలుసుకోవాలిగా.

తరుణి     : యువత చదువుకి…?

య.అ.   : నా చుట్టుప్రక్కల ఎవరి కన్నా తెలిసిన వాళ్ళకి అవసరంలో ఉన్నారంటే వారికి హాస్టల్‌ ఫీజుని, ఎగ్జామ్‌ ఫీజులని కడుతూ ఉంటాను.

తరుణి     : ఎక్కడో తెలియని వాళ్ళకి చేసే కంటే ఇలా తెలిసిన వాళ్ళకు సహాయపడటం చాలా మంచిది.

య.అ.   : ఆ మధ్య గోదావరి పుష్కరాలు వచ్చాయి కదండీ. అప్పుడు మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టామండీ ‘ముక్కామల’లో.

తరుణి     : ఏదీ వదిలిపెట్టరన్నమాట. మీ వారూ, పిల్లలకి కూడా ఈ దయాగుణం అబ్బిందంటారా ?

య.అ.   : లేకేమండీ. మావారు గుడుల నిర్మాణానికి ఇస్తారు. విజయవాడలో ఉన్నప్పుడు మా ఇంటి వెనుక కొండ మీద శివుని ఆలయం ఉండేది. దానికి మెట్లు వేయాలంటే ఐదువేలు ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు యలమర్తి రామాలింగేశ్వరరావు గారి పేరు మీద, ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా మా పెళ్ళి రోజునో, పుట్టిన రోజునో, లేక మా అత్తగారి మామగారి పేరునా అక్కడ అన్నదాన కార్యక్రమాలకి రిసీటు రాయకుండా రారు. అమ్మవారి గుడిని పెద్దది చేస్తుంటే మావంతుగా రెండువేలు ఇచ్చారు. మా అబ్బాయి అన్వేష్‌ ఇలాంటి వాటికి లక్ష పైనే ఇచ్చానని మాటల్లో చెప్పాడు. మా అమ్మాయి మానస తన నెల జీతంలో కొంత కేటాయిస్తుంది. అనాధాశ్రమాలకు తరచుగా వెళ్తుంది. స్నేహితులతో కలిసి కొందరి విద్యార్థులను చదివిస్తోంది కూడా. దానితో పాటూ మా అల్లుడు ‘మహిపాల్‌’ కూడా ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటాడు.

తరుణి     : ఓ! కుటుంబం కుటుంబమంతా సేవా ధ్యేయంతోనే ఉన్నారన్నమాట..

య.అ.   : ఏదో మాకున్న దానిలో తోటివారికి కొంత సాయంలా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే మనసుకు తృప్తి ఉంటుంది.

తరుణి     : అవునండీ. మనం సంపాదించిన దానిలో ఓ పది శాతం అన్నా ఇలాంటి కార్యక్రమాలకు ఖర్చు చేస్తే మంచిదని పెద్దలంటూ ఉంటారుగా. ఇంతకీ ‘ఆశ్రిత’ అంటే ఏమిటో చెప్పలేదు మీరూ….

య.అ.   : అవును కదా! మొదట్లోనే చెబుదామనుకున్నా.. ధ్యానంలోనే వచ్చిందని చెప్పానుగా అది

ఆ… ఆనందంగా

శ్రి…. సిరితో

త…. తపనతో

మానవత్వాన్ని చాటుకోవడమే ‘ఆశ్రిత’ ఆదర్శం !

తరుణి     : ఓ… గొప్పగా చెప్పారు.

య.అ.   : నాదేముంది? అదంతా భగవంతుని సంకల్పం. నా చేత ఇలా చిన్న చిన్న సహాయాలు అందించమని చేయిస్తున్నాడు అంతే అనుకుంటాను.

తరుణి     : సాయం చిన్నదా పెద్దదా కాదు కదండీ. అసలలాంటి భావన రావటమే గొప్ప అంటాను నేను..

య.అ.   : ఏమోనండీ. అది చాలా సహజమైన పని అని నేననుకుంటాను.

తరుణి     : మీలా అందరూ అనుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు తెలుగు భాష గురించి కూడా కృషి చేసారని విన్నాను. దాని గురించి చెబుతారా ?

య.అ.   : ఓ… అదా.. ఒక సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యకక్షురాలిగా చేసారు నన్ను బలవంతంగా. నేను పదవులకు ఎప్పుడూ దూరం. అప్పుడు తెలుగు భాష మీద ఉన్న మక్కువతో తణుకులో ఉన్న ఇంగ్లీషు మీడియం స్కూల్సుకి వెళ్ళి అక్కడ తెలుగు ప్రాశిష్టతను వివరించి వాళ్ళకు డిబేట్లు లాంటివి నిర్వహించి బహుమతులు ఇస్తూ ఉండేదాన్ని. మాంటిస్సోరీ, భాష్యం.

తరుణి     : ఇప్పుడు మీరు హైద్రాబాదులో ఉంటున్నారనుకుంటున్నాను.

య.అ.   : అవునండీ. మా వారి పదవీ విరమణ తర్వాత ఇక్కడికి వచ్చేశాము. ఇక్కడకు వచ్చాక పెద్ద కార్యక్రమాలు లా ఏమీ చేయటం లేదు. తుఫాను బాధితులకు, అనాధ పిల్లలకు డబ్బు, బట్టలు సహాయం చేస్తున్నాను.

తరుణి     : ఇక్కడ ఇబ్రహీంపట్నం, మాతా పితరుల సేవా సదనంకి వెళ్ళినట్లున్నారు. ఆ సంగతి చెప్పండి..

య.అ.   : అనుకోకుండా వెళ్ళామండీ. మా వారి బ్యాంకులో కొలీగ్‌ నాకు ఉగాది పురస్కారం ఇవ్వటానికి అక్కడికి తీసుకు వెళ్ళారు. సరే వెళ్ళాను కదా అని వాళ్ళందరికి బిస్కెట్‌ ప్యాకెట్స్‌ పట్టుకెళ్ళాను. ఓ వెయ్యి రూపాయలు మా సంస్థ తరఫున విరాళంగా ఇచ్చాను.

తరుణి     : పనిలో పనిగా మీ మానవత్వాన్ని కూడా చూపెట్టారన్న మాట. మరి చిమ్మపూడి ట్రస్టు వారికి పుస్తకాలు ఇచ్చారని విన్నాను..

య.అ.   : రచయిత్రిగా నాకు చాలామంది పుస్తకాలు పంపుతూ ఉంటారు. అవి చదివేశాక గ్రంథాలయాలకు యాభై, వంద అవగానే ఇచ్చేస్తూ ఉంటాను. అలా వారికి ఏడువేల రూపాయల విలువైన 107 పుస్తకాలను అందించాను. పిల్లలకు పోటీలు పెట్టి బహుమతులుగా ఇస్తానని శ్రీ చిమ్మపూడి శ్రీరామ మూర్తి గారు అడగటంతో. వారు మా తోటి రచయిత కూడా!

తరుణి     :  పుస్తకాలను ఇలా సద్వినియోగం చేయడం అభినందనీయం. మరి తణుకులో మీ ఇంటి ప్రక్కనే గ్రంథాలయం ఉండేది కదా. వారికి కూడా ఇచ్చారా ?

య.అ.   :  ఒక అట్ట పెట్టెడు పుస్తకాలు ఇచ్చాను. అందులో మంచి మంచి గ్రంథాలు కూడా ఉన్నాయి. నలభై ఏళ్ళుగా నేను దాచుకున్న పుస్తకాలు అన్నీ అక్కడ ఇచ్చేసాను. వారు కూడా ఓ బీరువాలో భద్రంగా ఉంచి చదువరులకు ఉపయోగపడేలా చూసుకోవటం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇది తరచుగా నేను చేసే పనే.

తరుణి     :  ఇంట్లో ఉంటే మన ఒక్కరిదే. అలా గ్రంథాలయాలకు ఇస్తే చాలామందికి ఉపయోగపడతాయన్న మీ ఆశయం ప్రశంసనీయం.

య.అ.   :  అవునండీ.

తరుణి     :  మీ నవల ‘ప్రేమ వసంతం’ కూడా అన్ని జిల్లా గ్రంథాలయాలకు చేరిందట కదండీ..

య.అ.   :  నిజమేనండీ. చిన్నతనం నుంచీ నేను ఏ ఊరు వెళ్ళినా ముందు గ్రంథాలయం ఎక్కడుందో చూసుకునే దాన్ని. నవలలు తెచ్చి చదువుకోవటానికి. యద్దనపూడి సులోచనారాణి నవలలా నా నవల కూడా అన్ని జిల్లా గ్రంథాలయాలలో చేరిందనటం నాకెంతో సంతోషాన్చిందో చెప్పలేను. ఇలా రచయిత్రి నవుతానని, నా నవల అలా అక్కడి అలా చేరుతుందని ఏనాడూ ఊహించలేదు. అంతా సరస్వతీ దేవి కృప. నా అదృష్టంగా దీనిని భావిస్తున్నాను.

తరుణి     :  ఇలా ‘అక్షర సేవ’ కూడా చేసేసారు మీరు. అభినందనలండీ మీకు. దైవ కార్యక్రమాలు కూడా మీరు చేస్తారా ?

య.అ.   :  అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించటానికి వచ్చినవారికి వెంకట సాయి గ్రీన్‌ సిటీలో మా ఎ, బి, సి బ్లాక్స్‌ వారి దగ్గరికి తీసుకు వెళ్ళటంతో నా ఉడుత భక్తిని కనపరిచానని నేను అనుకుంటున్నాను.

తరుణి     :  మీకు భక్తి కూడా ఎక్కువేనన్నమాట. మరి కరోనా వచ్చినప్పుడు ఎలాంటి సహాయాన్ని అందించారు?

య.అ.   :  ఒకేసారి మా ఇంట్లో మా అమ్మాయికీ, మా వారికీ కరోనా వచ్చింది. అప్పుడు నిస్వార్థంగా సహాయం చేస్తున్న ”రేవంత్‌” కి మా అత్తగారు యలమర్తి మహాలక్ష్మమ్మ గారి తరపున 5,000 రూ||లు అందించాము. అతను కరోనా వచ్చిన సమాచారం అందిస్తే మనకు కావాల్సిన అహారాన్ని అందించే వాడు. అలా మేము మూడు రోజులు పుచ్చుకున్నాం. తను మా నుంచీ ఇంత సహాయం లభిస్తుందని ఊహించలేదని చాలా ఆనందపడ్డాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవారికి కూడా చేయూత నివ్వాలన్నదే ‘ఆశ్రిత’ ఆలోచన.

తరుణి     :  ఇలా కరోనా ఉపద్రవంలో మీ ఆశ్రిత సహాయపడిందన్నమాట. బాగుందండీ. బ్రాహ్మణులకు ఏదో కిట్‌ ఇచ్చారని విన్నాను.

య.అ.   :  అప్పటికప్పుడు ‘మణికొండ’ గుడిలో బీద బ్రాహ్మణులకు వెయ్యి రూపాయల విలువ చేసే కిట్‌ ని మన ద్వారా ఇప్పిస్తారంటే వెళ్ళి మేమిద్దరం ఇచ్చి వచ్చాం. ఈ విషయం కూడా మీదాకా రావటం మాకాశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తరుణి     :  మేము అన్నీ తెలుసుకునే వస్తాము కదండీ.

య.అ.   :  అంతే కదా !

తరుణి     :  ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఊరికే అనలేదు. అన్నట్లు ఇక్కడ ‘ప్రశాంతి ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌’ కి కూడా వెళ్ళారట కద.

య.అ.   :  అవునండీ. జె.ఐ.హెచ్‌ వాళ్ళు ముఖ్య అతిథిగా అక్కడ వారికి పండ్లు పంచి పెట్టడానికి ఆహ్వానించారు. వారికి స్టీల్‌ సామానులు ఏవో లేవనుకుంటుంటే మా సంస్థ తరఫున నేను అందించాను.

తరుణి     :  స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లా…!?

య.అ.   :  అవకాశమున్నప్పుడు మానవత చూపాలి అని నేననుకుంటాను.

తరుణి     :  అవునండీ. ఇక్కడ మీ గాయత్రీ నగర్‌ సీనియర్‌ సిటిజన్‌ ఫోరమ్‌ కి కూడా ఇచ్చినట్లున్నారు.

య.అ.   :  ప్రభుత్వం వారి కోసం పెద్ద బిల్డింగ్‌ ఇచ్చిందండీ. అందులో కుర్చీలు కొనటానికి మేము 5,000 ఇచ్చామండీ. ఓ గోడ గడియారం కూడా !

తరుణి     :  బాగుందండీ. మీ సేవ కొనియాడ దగినది.

య.అ.   :  మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం. వరద బాధితులను ఆదుకోవటం మన బాధ్యత. అలాగే చుట్టుప్రక్కల ఉన్నవారికి, తెలిసిన వారు ఆపదలో ఉన్నారంటే మనకు తోచిన సహాయం చేయమని వేరే వాళ్ళు చెప్పాలా? చెయ్యాల్సిందే. అదే నేనూ చేస్తున్నాను.

తరుణి     :  ఎప్పటినుంచో అడుగుతుంటే ఇప్పటికి మీ ఇంటర్వూ ఇచ్చారు. కొందరికయినా స్ఫూర్తిగా నిలబడు తుందని మా ఆకాంక్ష.

య.అ.   :  ”తరుణి” మాగజైన్‌ ఎడిటర్ డాక్టర్ కొండపల్లి నీహారిణి గారి కృషికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.

తరుణి     : సంతోషమండీ.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

బతుకు చిత్రం లో నేను నా దీపలక్ష్మి