అందరికీ శనార్థులు.
మనసు, మనసు, మనసు అని అందరం అంటం, ఇంటుంటం కదా!
మనసు ఏడుంటది, ఎట్లుంటది? చెప్పుండి.
గుండె దగ్గర చెయ్యి పెట్టుకుంటరు కదా.. అంటే మనస్సు గుండెల ఉంటదా!
నేనైతే చెవుల ఉంటది అంట..! అప్పుడప్పుడు కండ్లల్ల సుత ఉంటది.
ఇప్పుడు చెవుల మనస్సు ఎట్లుంటదో చెబ్తా ఇనుండి ముచ్చట ఇగ!
ఇద్దరు మనుషులు- వాళ్లు ఎవరన్న గాని.. తల్లి దండ్రీ -పిల్లలు,భార్య -భర్త, దోస్తులు,ఉద్యోగం చేసే కాడ, చుట్టుపక్కల ఇరుగు పొరుగు, ఇట్ల ఎవ్వలన్న గాని,ఒక మనిషి ఇంకొక మనిషికి దగ్గరవుడు అంటే ఏంది?! వాళ్ళు ఒకరితోని, ఒకరు మాట్లాడుకుని సంతోషం, బాధ, విచారం ఇట్ల ఒకరితో ఒకరు పంచుకొనుడే కదా!
మనము ఒకళ్ళ తోని మాట్లాడుతున్నమంటే ముందు ఏడికెల్లి మొదలయితది సంభాషణ నోటికెల్లి, వినాలంటే చెవులతోనే.. మొదలైతది.
అందుకే చెవులను మనసు చేసుకో అంట నేను!
కుటుంబ సభ్యులు గానీ, చుట్టుపక్కలోల్లు గాని, నీ కింద పని చేసేటోళ్ళు గానీ,అది ఎవ్వరన్న గానీ, నీ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తే మనసు పెట్టి వినాలి. అంటే చెవులు మనసు చేసుకొని శ్రద్ధగ వినాలి.
నువ్వు ఎంత శ్రద్ధగ వింటే చెప్పేటోళ్లకి అంత నిమ్మతం అనిపిస్తది!
ఇంక నీకు చెప్పుకో బుద్ధి అయితది. మాట్లాడ బుద్ధి అయితది. నువ్వు వాళ్ళకు ఆత్మీయ బంధం అనే భావన కలుగుతది.
మంచిగ మాట్లాడాలంటే ముందు మంచిగ వినాలి అంటరు. అనుబంధాలు ఆత్మీయతలు పెరగాలన్న, మనకు ఒక గౌరవము ఇజ్జతూ… దక్కాలన్నా ఎదుటోళ్లు చెప్పేది శ్రద్ధగ వినాలి. ” వానికి చెప్పుకున్న.. గోడకు చెప్పుకున్న ఒకటే” అని అనిపియ్యొద్దు మనల్ని చూస్తే ఎవ్వళ్లకు గూడా!
చెవులల్ల అనుబంధాల శబ్ద తరంగాల లెక్క పోవాలన్నా, వాటికి యాంటీనాలేందో ఎర్కనా కండ్లు
అర్థమయితుందా తమ్మి..! నేను చెప్పేది. ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఏదన్న చెప్పుకుంటే మంచిగా కళ్ళల్ల చూసుకుంటా, చెవులతో శ్రద్ధగ విని వాళ్లతోని మంచిగ సంభాషణ చెయ్యాలి.
ఇదే చెవులను మనసు చేసుకొని ఇనుడు అంటే! అట్ల యింటే సగం దుఃఖము తగ్గిపోతది తెలుసా! మాట్లాడుతుంటే.. అనుబంధాలు పెరుగుతయి. మంచిగ మాట్లాడుకోవాలి అంటే.. ముందు మంచిగ ఇనాలి! వినుడు అనేదే కరువైపోతుంది ఈ పొద్దులల్ల. ‘నేను చెప్తా, అందరి వినాలి’ అనేదే ఎక్కువైంది అందరికీ! ఇంకొకళ్ళు చెప్పేది వినుడే అలవాటు లేకుండా పోయింది. గిదేం లెక్క. ఇట్ల ఉండదు. ప్రకృతి ఇటువంటి తరీకను ఒప్పుకోదు.
వినాలి. మంచిగ వినాలి. శ్రద్ధగ వినాలి.
ఇంకొక గమ్మత్ విషయం చెప్తా….. చానా మంది అర్థం చేసుకోనికి వినరు, ఆన్సర్ చెప్పనీకి వింటరు. వాళ్లు అన్నదానికి నేను నా బాణం లెక్క ఆన్సర్
ఏమి ఇయ్యాలె, ఎట్ల నోరు మూపియ్యాలే అనే సూస్తరు. ఇది నేను చాలా మంది దగ్గర చూసిన గమ్మతనిపిస్తది నాకు. గీ తరీఖల బుద్ధుంటే.. ఇగవాళ్ళు కొత్త విషయాలు ఎట్ల నేర్చుకుంటరు?! వాళ్ళ దగ్గర ఉన్న సగం – సగం దిమాక్ తోనే జీవితమంత బతుకుతరు. వీళ్లు మంది నోరుమూపిస్తమనుకుంట..వాళ్ల దిమాఖ్ వాళ్ళు మూసుకునే మూర్ఖులు!
“Listening is an art that requires attention over talent, spirit over ego, others over self.
వినుడు ఒక కళ! చెవులను మనసు చేసుకొని మనమందరం విందాము! ఈ కళల మనము ఎక్స్పర్ట్ అవుదాము!
అహంకారము, నేనే గొప్ప అన్న భావాలు పక్కన పెడితే మనమందరికి నచ్చుతం, మనకు అందరు నచ్చుతరు!!
ఏమంటరు మరి? కండ్లతోని చదివి, చెవులనే మనసు ద్వారా హృదయంల పెట్టుకుంటరా ఈ మాట!
ఇగ ఇప్పుడు చెవులను మనసు చేసుకోని ముందుగాల్ల మీ ఇంట్లోల్లు చెప్పింది ప్రేమగ శ్రద్ధగ వినుండి.
పైలం మరి ఉంటా!
ప్రేమతో
మీ
రమక్క