“నర్మదా! ఈ రోజు క్షీరాబ్ధి ద్వాదశి కదా! ఇక్కడ ఉసిరి కొమ్మ దొరుకుతుందా”? అని అడిగింది రాజ్య లక్ష్మి.
“దొరుకుతుంది అత్తయ్యా! మీ అబ్బాయి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడు” అన్నది నర్మద.
“పెరటి చెట్టు నుండి కొమ్మ విరుచుకుని వచ్చి చేసుకోవడం అలవాటాయేమన ఇంట్లో. ఇక్కడ అన్నీ కొనుక్కోవాలి”అన్నది రాజ్యలక్ష్మి విచారంగా.
“మన ఊరు కానప్పుడు అంతే కదా అత్త య్య! ఇప్పుడు ఊళ్ళల్లో కూడా అందరి ఇళ్లల్లో ఈ చెట్లు ఉండటం లేదు”అన్నది నర్మద.
“ఏమో, ఇక్కడ ఉంటే నాకు ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది. అసలు నువ్వు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేస్తావా? ఏం చేస్తావులే, ఇండియాలోనే అందరూ మర్చిపోయారు”అంటూ నిట్టూర్పు విడిచింది రాజలక్ష్మి.
మొదటిసారి కొడుకు, కోడలు దగ్గరికి వచ్చిన రాజ్యలక్ష్మి కి అన్ని చిత్రంగానే అనిపిస్తున్నాయి., సాంప్రదాయం పోయిందని పద్ధతులు లేవని సనుగుతూనే ఉంది.
ఇదంతా చూస్తూనే ఉన్న కోడలు నర్మద చిరునవ్వుతో ఊరుకుంది. రాజ్యలక్ష్మి వచ్చి వారం రోజులు మాత్రమే అయ్యింది.
ఆ వారం రోజులలో రెండు రోజులు జెట్ లాగ్ సరిపోయింది. ఆ తర్వాత అక్కడి వాతావరణం అడ్జస్ట్ కావడానికి మరో నాలుగు రోజులు పట్టింది. ఇంత లోపల క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది.
సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళ బ్యాగ్ షెల్ఫ్ లో పెట్టుకొని, కాళ్లు చేతులు కడుక్కుని, బట్టలు మార్చుకొని, బయటకు వచ్చారు.
ఇప్పుడు మాత్రం రాజ్యలక్ష్మి పిల్లలను సంతృప్తిగా చూసింది .
“పర్వాలేదు. పిల్లలు శుచి శుభ్రత అలవాటు చేసుకున్నారు”అని మనసులోఅనుకొని,
“ఇలా రండిరా!నా దగ్గర కూర్చోండి”అని పిలిచింది.
“ఈరోజు లంచ్ బాక్స్ లోకి ఏం తీసుకెళ్లారు?”అని అడిగింది.
“ఈరోజు భోజనాలు సాయంత్రమే చేయాలని అమ్మ చెప్పింది. ఈరోజు తులసి పండగ అని చెప్పింది”అన్నారు మనవరాలు, మనవడు.
ఆశ్చర్యపోవడం రాజ్య లక్ష్మి వంతయింది.
కోడలు నర్మద వారం రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది. బయటకు వెళ్తే అత్తయ్య ఒంటరిగా ఉండలేదని చెప్పి వర్క్ ఫ్రం హోం పర్మిషన్ కూడా తీసుకుంది.
“ఏంటి మీరు సాయంత్రం భోజనాలు చేస్తారా? ఏం తిన్నార్రా?” అన్నది రాజ్యలక్ష్మి.
“అమ్మ సగ్గుబియ్యం కిచిడి బాక్స్ లో పెట్టింది. అదే తిన్నా ము” అని చెప్పారు పిల్లలు.
ఆఫీస్ నుండి తొందరగా వచ్చిన కొడుకు నరేష్ “ఏమ్మా ఉపవాసమా? ఏమైనా తిన్నావా మరి”? అని అడిగాడు.
“నర్మద సగ్గుబియ్యం కిచిడీ చేస్తే తిన్నాను. పిల్లలు కూడా అదే తిన్నారట రా”అన్నది రాజ్యలక్ష్మి.
“ఏ పండుగ వచ్చినా పూజ అంతా అయ్యేవరకు అందరమూ ఇలాగే ఉంటాము”అన్నాడు నరేష్.
కొన్ని కవర్లలో నుండి రెండు మూడు రకాల పువ్వులను తీసి, ఒక ప్లాస్టిక్ షీట్ వేసి దానిలో పోశాడు నరేష్.
ఇంతలో సూది దారం తీసుకొని నర్మ ద వచ్చింది. పిల్లలు పూలు అందిస్తుంటే అన్నిటిని చక్కగా దండలుగా గుచ్చింది. ఒక్కొక్క దండను గుమ్మాలకు, తులసి కోటకి నాలుగు వైపులా వేసి, మధ్యలో గుత్తి లాగా వేలాడదీసింది.
నరేష్ తెచ్చిన ఉసిరి కొమ్మను, తులసి కోట మధ్యలో పాతింది.
నర్మద స్నానం చేసుకుని, మడి పట్టు చీర కట్టుకొని ప్రసాదాలను సిద్ధం చేసింది.
ఆశ్చర్యంగా చూడ సాగింది రాజ్యలక్ష్మి.” వేరే దేశంలో ఉంటూ కూడా మన ఆచారాలను పాటిస్తున్నారా” అని ఆశ్చర్యపోయింది.
తాను ఏమీ ప్రసాదాలు తయారు చేసేదో అవన్నీ చేసింది.
రాజ్యలక్ష్మి కూడా మడి కట్టుకొని తులసి కోట దగ్గరికి వచ్చింది. తులసి కోట చుట్టూ జ్యోతులు వెలిగించి, పూజ పుస్తకం చదువుతూ తులసి కల్యాణం చేశారు. పంచామృతము, జీలకర్ర బెల్లము అమర్చుకుని శాస్త్రోక్తంగా కళ్యాణము చేశారు.
కోడలును అలాగే గమనిస్తూ కూర్చుంది రాజ్యలక్ష్మి. పేరుకే పుస్తకం పట్టుకుంది కానీ చాలా వరకు నోటికే చదివేస్తుంది స్తోత్రాలన్నీ.
పూజ అయ్యాక, నైవేద్యం పెట్టి అందరూ రాత్రి భోజనాలు చేశారు.
ఆ ప్రసాదాలన్నీ తింటూ ఉంటే, తన తల్లి చేసిన వంటలు గుర్తొచ్చాయి రాజ్యలక్ష్మి కి.
పులిహోర, పాయసం, పెసరపప్పు పచ్చడి, దోసకాయ పప్పు, భ పచ్చి పులుసు చేసింది నర్మద.
“అమ్మా! ఈ పూజంతా నీకు ఎలా వచ్చు? నీకు అసలు ఏమీ తెలియదని అనుకున్నాను. వేరే దేశాల్లో ఉండి మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించరని నేను అనుకున్నాను. మీరు ఉపవాసం ఉండటమే గాక పిల్లలతో కూడా చేయించడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అందులో కూడా అన్ని స్తోత్రాలు గడగడా చదివేస్తున్నారు పిల్లలు. నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేశానమ్మ. అందుకు నాకు చాలా బాధనిపిస్తుంది”అన్నది రాజ్యలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా.
“అలా ఏం కాదు అత్తయ్య! మీరు ఏం బాధపడకూడదు. నాకు చిన్నప్పటినుండి పూజలన్నీ అలవాటే. పెళ్లి కాగానే ఇక్కడికి రావడం వల్ల ,మీకు నా గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. కానీ మీ అబ్బాయి మీ గురించి అన్ని ఎప్పటికప్పుడు నాకు చెబుతూనే ఉంటాడు .మీరు చేసే పద్ధతులు అన్నీ నాకు నేర్పించాడు .అవన్నీ నేను నేర్చుకున్నా. ఇంచుమించు మా ఇంట్లో కూడా ఇలాగే చేస్తారు. ఇక్కడు న్నప్పుడే ఇంకా సాంప్రదాయాలు మీద గౌరవం పెరుగుతుంది అత్తయ్యా! విదేశాలలో ఉన్న వాళ్ళు మన దేశ సంస్కృతిని ఇంకా ఎక్కువగా పాటిస్తారు. ఎందుకంటే మన దేశంలో ఉండకుండా ఎక్కడో ఉన్నాము అని చిన్న బాధ వారిని మరింత పద్ధతిగా ఉండేలా చేస్తుంది”అని చెప్పింది నర్మద.
అదంతా వింటున్నా నరేష్,
“నిన్ను నేను గమనించానమ్మ .మేము ఏ పద్ధతులు పాటిస్తలేమని నువ్వు అనుకుంటున్నావని అర్థమైంది. నేను చెప్పడం ఎందుకని, ఈ రోజు నువ్వే చూస్తావని నేను ఏమీ చెప్పలేదు. నీకోడలు కూడా నీలాగే దైవభక్తి, దేశభక్తి ఉన్న ఇల్లాలేనమ్మా” అన్నాడు నవ్వుతూ.
రాజ్యలక్ష్మి తృప్తిగా పిల్లలతో ముచ్చట్లు పెడుతూ, వారి మాటలన్నీ వింటూ, సంతృప్తిగా భోజనం చేసింది.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని..