చైనా మహాకుడ్యం

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజధాని అయినటు వంటి బీజింగ్ ను దర్శించటానికి మేమంతా అంటే సుమారు 70 మంది డాక్టర్లు కుటుంబాలతో సహా బయల్దేరి వెళ్ళాము. నేను మావారు, మా చిన్నబ్బాయి స్వాప్నిక్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరాము. అందరూ అక్కడే కలుసుకొని చైనా బయల్దేరతారు. చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో రాత్రి 9:25 ని॥లకు ఢిల్లీలోని టెర్మినల్ 3 నుండి షాంఘై బయల్దేరింది. షాంఘై నుండి బీజింగ్ కు మరొక విమానమెక్కాలి. విమానం పైకెగరగానే పై నుంచి ఢిల్లీ నగరం పాపిడి బొట్టు, వడ్డాణం, మెడనిండా హారాలు, కాళ్ళకు మువ్వలతో సహా సకల ఆభరణాలనూ ధరించిన నవ యవ్వనవతిలా ఉంది. ఢిల్లీ నగర సోయగాలను ఆస్వాదిస్తూ విమానంలో కిటికీ పక్కన సీట్లో కూర్చున్నాను. విమానం పెద్దదిగా 2-4-2 సీటింగ్ ఎరేంజ్మెంట్ తో ఉన్నది. చైనీస్ ఎయిర్ లైన్స్ కాబట్టి ఎయిర్ హోస్టస్ లు చైనీయులే ఉన్నారు. టీవీలో చైనీస్ లాంగ్వేజ్ వినిపిస్తున్నది. వారణాసి, ఢాకా నగరాలను దాటుకుంటూ ఉదయం 5-30కు షాంఘైలోని ‘పుడాంగ్ ఎయిర్పోర్టు’కు చేరుకున్నాం. విమానం నుంచి షాంఘై నగర లైట్లను చూసినప్పుడు ఢిల్లీ కన్నా భిన్నంగా కనిపించింది. అన్నీ ఒకే రంగుతో పసుపు రంగు లైట్లు కనిపిస్తున్నాయి. దాంతో కొన్ని ఎకరాల మేర బంగారం పంట పండినట్లుగా కనపడుతున్నది. ఢిల్లీ నగరమేమో నవరత్నాలతో సర్వాలంకార భూషితంగా ఉంటే షాంఘై నగరం మాత్రం కేవలం బంగారం పంట పండించినట్లుగా ఉన్నది. షాంఘై నుండి బీజింగ్ చేరే సరికి ఉదయం 10-30 అయింది.
బీజింగ్ కేవలం చైనాకు రాజధాని మాత్రమే కాదు. నేషనల్ పొలిటికల్ మరియు కల్చరల్ సెంటర్, మన హైదరాబాదు లాగానే దీనికి కూడా ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అని రెండు ఉన్నాయి. ఓల్డ్ సిటీ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఈ శతాబ్దంలోనే చైనా బాగా అభివృద్ధి చెందింది. చైనా దేశం జనాభాలో మొదటిస్థానం, భూ భాగంలో మూడవ స్థానాన్ని ఆక్రమించియున్నది. ఇక్కడి కరెన్సీని ‘యువాన్లు’ అంటారు. మేము వెళ్ళిన రోజు ఒక యువాన్ కు 72 భారతదేశ రూపాయలు. ఇక్కడ ఉష్ణోగ్రత ఈ కాలంలో మైనస్ డిగ్రీలలో ఉంటుంది. అలాగే ఎండాకాలంలో ఎండ కూడా చాలా తక్కువగా ఉంటుందట. రకరకాల నేలలు, పెద్దదైన భూభాగం వల్ల వాతావరణం ఎప్పుడూ నిలకడగా ఉండకపోవడం వల్ల సందర్శనకు ఇది అనువైన సమయమని చెప్పేందుకు లేదు.
యాంగ్జీనది చైనాను ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విడగొడుతుంది. చైనా భూభాగంలో మూడింట రెండు వంతులు పర్వతాలే ఉన్నాయి. దీని భూభాగ వైశాల్యం 9.6 మిలియన్ చ.కి. యాంగ్జీనది చైనాలో అతిపెద్దనది. ప్రపంచంలోని అతిపెద్ద నదులైన నైల్, అమెజాన్ల తర్వాతి స్థానం దీనిదే. చైనాలో నాగరికత వెల్లివిరియటానికి దేశంలోని రెండవ అతిపెద్ద నదైన పసుపునది కారణమని చెపుతారు. ప్రపంచంలోని అతి ప్రాచీన భాషల్లో ఒకటైన చైనీస్ భాషకు వర్ణమాల వ్యవస్థలేదు. ఇది చిత్రలేఖనం రూపంలో ఉంటుంది. ఈ భాష స్వర సంబంధిగా ఉండటం వల్ల మనకు అన్ని మాటలూ ఒకే రకంగా వినబడతాయి. చైనా అధికార భాషను ఇంగ్లీషులో ‘మాండరిన్’ అంటారు. చైనా వెళ్ళబోయే ముందే ట్రావెల్స్ వాళ్ళు సాధారణంగా మనకవసరమయ్యే మాటల్ని చైనా భాషలో ఏమనాలో పేపర్ ప్రింటవుట్లు ఇచ్చారు. వాటిని ఎంతసేపు చదివినా పేపర్ దగ్గరుంటే తప్ప ఏదీ గుర్తుండేలా లేదు. బాగా చదివి ‘థ్యాంక్ యూ’ అనే పదానికి ‘జీజీనీ’ అనాలని గుర్తుపెట్టుకున్నాం. ప్రతి చోటా అందరికీ ‘జీజీనీ’ అని చెప్తుంటే వాళ్ళు సన్నగా నవ్వుకుంటున్నారు. ‘ఎలా ఉన్నారు’ అని అడగాలంటే ‘ని హావో మా’ అనాలి. ఏదైనా వస్తువు కొనాలంటే ‘రేటెంత’ అని అడగాలి కదా దానికి ‘డుమో షావో కియాన్?’ అని అడగాలి. ఇలా వాళ్ళ భాష గురించి వివరాలు తెలుసుకున్నాం.
బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగి ఊర్లోకి వస్తుంటే ఆకాశాన్నంటే భవనాలు, అద్భుతమైన రోడ్లు కనువిందు చేశాయి. అన్ని ప్లైవోవర్లే. మేం ఎయిర్ పోర్టు నుంచి హెూటల్ కు చేరే వరకూ ఎక్కడా ట్రాఫిక్ సమస్య లేనే లేదు. ఏ బిల్డింగ్ చూసినా పది అంతస్థులకు తక్కువ కనిపించలేదు. మేము దిగిన ‘ఫీటియాన్’ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఇరవై అంతస్థుల భవనం. మా రూమ్ నంబరు 805 బీజింగ్ నగరంలో 16,000 కి.మీ మేర ఆరు రింగురోడ్డులు విస్తరించి ఉన్నాయని గైడ్ వివరించింది. అక్కడి పంటపొలాలు కొనుక్కోవటం గానీ, కొనుక్కున్నాక అవి మరల నా పిల్లలకు అని రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవట భూమి ఏదైనా ప్రభుత్వానిదే కావాలంటే 30 లేదా 40 సంవత్సరాలు కిరాయికి ప్రభుత్వం నుంచి తీసుకొని ఆ తరువాత మరల ప్రభుత్వానికే అప్పజెప్పాలి. వాళ్ళ పిల్లలకు ఇవ్వడానికి వీలు లేదు. పిల్లలు పెద్దవాళ్ళయి వ్యవసాయం చేసుకుంటానంటే మరల ప్రభుత్వం నుంచి కిరాయికి పొలం తీసుకోవాల్సిందే. ఎయిర్ పోర్టు నుండి హెూటల్ కు చేరేదాకా గైడు ఈ విషయాలన్నీ చెపుతూ కూర్చున్నది. బస్సులో ఓ మైకు ఉంటుంది. ఆ మైకు ద్వారా ఆమె ఇవన్నీ మాట్లాడింది. ఆ గైడు పేరు ‘అమీ’. తాను నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ జోకులు వేస్తూ విషయాలన్నీ చెప్పింది.
సాయంత్రం 6-30కు జనోషా థియేటర్ లో ‘ఆక్రో బాటిక్ షో’ చూపించారు. ఇది చాలా అద్భుతంగా ఉన్నదిద. దీంట్లో చైనా వాళ్ళ సాంప్రదాయక నృత్యంతో పాటు సర్కస్ ఫీట్లన్నీ ఉన్నాయి. ఒక ఇనుప గోళంలో మోటరు సైకిళ్ళతో స్పీడుగా నడపడం అంటే ఎంత కష్టం. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా చాలా ప్రమాదం. చూడటానికి చాలా ఆనందాన్నీ, సంభ్రమాశ్చర్యాల్నీ కలగజేసినా వాళ్ళ జీవితాలు ఎంత రిస్క్ కూడుకున్నవో తెలిస్తే, ఆ ఆనందమంతా ఆవిరై పోతున్నది. దాదాపు పది బంతుల్ని తెలిస్తే, ఆ ఆనందమంతా ఆవిరై పోతున్నది. దాదాపు చేతులతో పట్టుకుంటూ ఉండటం, తల మీద టోపీలను పైకెగరవేసి ఒకరిని మరొకరు పట్టుకోవటం వంటివి వారి హస్త నూపుణ్యానికి, ఏకాగ్రతకు నిదర్శనం. కొంతమంది రాజులుగా, జోకర్లుగా వేషాలు వేసుకొనీ, మరికొంతమంది అమ్మాయిలు అందంగా అలంకరించుకొని డాన్స్ చేయటం వారి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఇంకొందరు కుర్చీలను కింది నుంచి పైకి వంకరటింకరగా ఒకదానిపై మరొకటి పేర్చుకొని దానిపైకి ఎక్కుతూ, తల మాత్రమే వాటికి ఆన్చి శరీరమంతా గాల్లో తేలేలా చెయ్యటం చూస్తుంటే వాళ్ళు పడిపోతారేమో, పడిపోతారేమో అని మనకు టెన్షన్ అనిపిస్తుంది. ఇలా కుర్చీలపైకెక్కటం, రింగుల్లోంచి దూరి ఒకరిపై మరొకరు పడటం, మోటారు సైకిళ్ళు విన్యాసం- ఈ సర్కస్ ఫీట్లన్నీ ఎంత ప్రాణాంతకమో తెలిస్తే చాలా బాధనిపించింది. ఇలా ఒకసారి కాదు కదా! ప్రతి రోజూ రెండు మూడు షోలు ఇవ్వాలి. స్టేజి షో కాబట్టి తప్పు జరగడానికి లేదు. ఇలా జీవిత కాలం ప్రమాద పరిస్థితితో ఉండటమనే విషయాన్ని ఆలోచిస్తేనే విషాదం అనిపించింది. ఏది ఏమైనా పిల్లలూ, పెద్దలూ ఈ ప్రదర్శన చూసి ఆశ్చర్యంతో నోరు తెరవని వారు లేరు. ఇంకా కుంగ్ ఫూ ప్రదర్శన కూడా ఉంటుందట గానీ మాకు చూడటానికి టైమ్ దొరకలేదు.
ఆ మరునాడు ఫర్ బిడెన్ సిటీ టియాన్మన్ స్క్వేర్ చూడటానికి వెళ్ళాం. ఇవి రెండూ ఎదురెదురుగానే ఉంటాయి. ఫర్ బిన్ సిటీని 1407లో కట్టారు. దీని నిర్మాణంలో ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది పనివాళ్ళు పాల్గొన్నారు. దీన్లో మింగ్, కింగ్ రాజవంశాలు 500 సం॥ల పాటు నివసించాయి. ఈ భవనం లోపల ఒక రకమైన పసుపు రంగుతో లెక్కకు మిక్కిలిగా అలంకరణలు చేయబడ్డాయి. పసుపురంగు చైనా వారి సాంప్రదాయమైన రంగట. ఈ భవనాలన్నీ వారి వస్తు ప్రకారం కట్టబడినాయట.
టియాన్మన్ స్క్వేర్ యాభై హెక్టార్ల స్థలంలో వ్యాపించబడి ప్రపంచంలోని అతిపెద్ద ఖాళీ ప్రదేశాలలో ఒకటిగా పేరు పొందింది. దీనిని 1417లో మింగ్ రాజవంశం స్థాపించింది. సామాన్య ప్రజలంతా తమ రాజులు, రాణుల ఎదుట ఉత్సవాలను జరుపుకోవడానికి వీలుగా ఈ స్క్వేర్ ను ‘ఫర్ బిడెన్ సిటీ’ ఎదురుగా నిర్మించారు. ప్రస్తుతం ఇంకా విశాలం చేసి దాంట్లో ఎక్కువ మంది ప్రజలు పట్టే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు టియాన్మన్ స్క్వేర్ వద్ద ప్రతిరోజూ జెండా వందనం అద్భుతంగా జరుగుతుంది. దీనిని తిలకించటానికి ప్రతిరోజూ వేల మంది ప్రజలు హజరవుతారు. ఇది చూడాలంటే సూర్యోదయం కాకముందే లేచి అక్కడకు చేరుకోవాలి. ఐదు నక్షత్రాలున్న ఎర్రని చైనా జాతీయ జెండా ఈ స్క్వేర్ వద్ద ఆకాశంలోకి ఎగిరే దృశ్యం ప్రతి టూరిస్టు తప్పక చూడవలసినది. మలేసియా, చైనా, హంగ్ కాంగ్ వాసులు ఈ టియాన్మన్ స్క్వేర్ వద్ద మాతో ఫొటోలు తీయించుకున్నారు. హిందూ, హిందూ అంటూ నమస్కారాలు చేశారు. మేం చైనాలో ఉన్నపుడు ఆ దేశ అధ్యక్షుడు ‘హూ జింటావో” భారతదేశ పర్యటనలో ఉన్నారు.
ఆ మరుసటి రోజు బీజింగ్ నుండి బాడాలింగ్ హైవేలో గ్రేట్వాల్ ఆఫ్ చైనాకు బయల్దేరాం. దారిలో జేడ్ ఫ్యాక్టరీ చూపించారు. అవి పెద్ద పెద్ద గ్రానైటు బండల్లా ఉన్నాయి. వాటి నుంచి శిల్పాలు, ఫ్లవర్ వేజ్ లు అలంకారానికి ఉపయోగపడే ఎన్నో వస్తువులు తయారు చేయబడి ఉన్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గరవుతుంటే అందరిలోనూ ఒకటే ఉద్విగ్నత, ఈరోజు మనం ప్రపంచ వింతను చూడబోతున్నాం అని బస్సు దిగగానే పైకి చూస్తే మంచు తెరల్లోంచి చైనా మహాకుడ్యం ఒక కొండ మీద నుండి మరొక కొండ మీదకు వంకలు తిరుగుతూ పాక్కుంటూ వెళ్తున్న కొండ చిలువలా కన్పించింది. ఈ గోడ 25.6 ఫీట్ల ఎత్తుతోనూ, 16.4 ఫీట్ల వెడల్పుతోనూ కట్టబడింది. ‘క్విన్ షి హుయాంగ్’ అనే రాజు 220 బిసి నుంచి 200 మధ్యలో ఈ గోడను కట్టారు. మింగ్ రాజవంశం దీన్ని పునరుద్ధరించి 5వ శతాబ్దంలో బండ రాళ్ళతో కట్టారు. ఈ గోడనే మనం ఇప్పుడు చూస్తున్నది. ఈ గోడ పొడవు 6,400 కి.మీ.లు. 2,3 మిలియన్ల మంది సైనికులు వారి జీవిత కాలమంతా ఈ గోడను కడుతూనే ఉన్నారు. మంచూరియన్ల, మంగోలియన్ల దాడిని నివారించేందుకు, వారు చైనాలోకి చొరబడకుండా ఉండేందుకు కట్టారు. ఈ మహాకుడ్య శిఖరాగ్రాన ఒక మిలియన్ సైనికులు కాపలా కాసేవారంట. అక్కడ చాలా షాపులు ఉన్నాయి. ఓ షాపులో ఇత్తడి ప్లేట్ మీద మన పేరు చెక్కి ఈరోజు చైనా గోడను ఎక్కినట్లుగా చెక్కి ఇస్తారు. మేం కూడా దాన్ని చెక్కించుకున్నాం. ఇది మేం చూసిన రెండవ ప్రపంచ వింత. మొదటిది తాజ్ మహల్. రెండవది ఇది. ఇంకొక షాపు దగ్గర చైనా రాజ వంశీయుల దుస్తులు వేసి ఫొటోలు తీస్తున్నారు. మేం కూడా ఆ ఫొటోలను తీయించుకున్నాం. మనం ఈ మానవ నిర్మితమైన ప్రపంచ వింతను దర్శించినట్లు ఒక సర్టిఫికెట్తో పాటు మన ఫొటోనూ, మహాకుడ్యం యొక్క రకరకాల భంగిమల ఫొటోలనూ ఇస్తారు. దీనికి మనం వంద యువాన్లు చెల్లించాలి. ఇలా చైనా మహాకుడ్య విశేషాలను భద్రపరచుకొని తిరిగి ఇండియా ప్రయాణమయ్యాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు

ఎడారి కొలను