కలల గూడు

రచన లక్ష్మి మదన్

_______

వంటింట్లో నుండి రెండు చాయ్ కప్పులు పట్టుకొని వచ్చి ఒకటి భర్త రాజారాంకు ఇచ్చి, తాను కూడా ఒక సోఫాలో కూర్చుంది రాజేశ్వరి.

ఇద్దరూ టీవీలో భక్తి గీతాలు పెట్టుకుని చూస్తూ, చాయ్ తాగుతున్నారు. పేరుకు టీవీ చూస్తున్నారన్నమాటే కానీ, వారి మనసులో ఒకే విధమైన ఆలోచనలు చెలరేగుతున్నాయి. వారిద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.

అందమైన పెద్ద ఇల్లు. ఎన్నో కొత్త వస్తువులు ఇంటి నిండా అమర్చబడి ఉన్నాయి. సౌకర్యాలకు లోటు లేదు. ఇంటి మనుషుల కన్నా పని మనుషులు ఇంట్లో ఎక్కువగా ఉన్నారు. వంట మనిషి, ఇద్దరు పని మనుషులు, తోటమాలి, కార్ డ్రైవర్. అంత ఇంటిని మెయింటైన్ చేయాలంటే మనుషులు కావాల్సిందే కదా. డబ్బుకు కొదవలేదు. కానీ లేనిదల్లా ప్రశాంతత. ఒంటరితనంతో స్నేహం చేస్తున్నారు.

మెల్లగా నోరు విప్పింది రాజేశ్వరి.

“ఏమండీ! పిల్లలు ఎప్పుడు వస్తారు? మీతో ఏమైనా చెప్పారా ?నేను ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉంటున్నారు. ఇంకా ఎన్నేళ్లండి ఈ ఎదురు చూపులు?”అన్నది రాజేశ్వరి మనసులో బాధ సుడులు తిరుగుతుండగా.

“నీతో మాట్లాడని వాళ్ళు నాతో మాట్లాడతారా? ప్రతిరోజు ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాను. వారితో మాట్లాడడానికి. కానీ ఎవరికీ తీరుబాటు లేదు .అసలు ఫోన్ ఎత్తితే కదా? అయినా ఇది మన స్వయంకృతాపరాధమే. ఫారిన్ చదువులు అని చెప్పి, చిన్నప్పటినుండి వాళ్ళని ట్యూన్ చేసాము. ఇప్పుడు అక్కడి సంపాదనకు, వాతావరణానికి అలవాటు పడి ఇండియాకి రమ్మంటే వస్తారా?”అన్నాడు రాజారామ్.

“పోనీ మనమే వెళ్లి, చిన్నోడి దగ్గర ఆరు నెలలు ,పెద్దోడి దగ్గర ఒక ఆరు నెలలు ఉండి వచ్చేద్దామండి. పిల్లలని మనవళ్ళని చూడాలనిపిస్తుంది”అన్నది రాజేశ్వరి బాధగా.

“ఇన్నేళ్లు వెళ్లి వస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనకు వెళ్లే ఓపిక ఉందా? ఒకవేళ వెళ్లినా, అక్కడ జరిగేది ఏంటో మనకు తెలుసు కదా ,వాళ్ళందరూ బిజీగా ఉంటారు. పొద్దున లేస్తే ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లిపోతారు. మళ్ళీ మనమిద్దరమే కదా! కనీసం ఇక్కడ పని వాళ్ళైనా ఉంటారు. అక్కడ నీకు మాట్లాడాలంటే ఒక మనిషి కూడా దొరకడు. అదే కాకా ఇంటెడు పని నువ్వే చేయాల్సి వస్తుంది. నువ్వు వచ్చావని ధీమాతో పని అంతా నీ మీదకే వదిలేస్తారు. అసలు నీకు విశ్రాంతి దొరుకుతుందా?”అన్నాడు రాజారాం.

“అది నిజమేనండి. ఇప్పుడు పని చేసే ఓపిక కూడా లేదు. మీరన్నట్లుగా మనం చేసుకున్న కర్మ ఇలా మనకు బాధని మిగిల్చింది”అన్నది రాజేశ్వరి.

ఇద్దరూ అలాగే కూర్చున్నారు. వారి మనసంతా జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది.

“అసలు పిల్లలు ఎలా ఉండేవాళ్ళు? ఎలా చదువుకున్నారు?” అని అనుకుంటూ గతంలోకి వెళ్లిపోయారు.

“ఒరేయ్ చిన్నోడా లేవరా! అన్నయ్య లేచి స్నానం చేసి, స్కూలుకు రెడీ అయిపోయాడు .నువ్వేంటి రా ,ఇంత ఆలస్యంగా లేస్తావు?”అన్నది రాజేశ్వరి చిన్న కొడుకు వినీల్ ను లేపుతూ..

“అబ్బా కాసేపు ఆగమ్మా! నిద్ర వస్తుంది. ఈరోజు ఒక్కరోజు మాకు ఇన్స్టిట్యూట్ లేదు. లేకుంటే పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి. ఆ తర్వాత స్కూల్ కి వెళ్ళాలి .అసలు రెస్టే దొరకడం లేదు”అన్నాడు వినీల్ మళ్లీ కళ్ళు మూసుకుని.

“అలా అంటే ఎలారా? నీకు మంచి మార్క్స్ వచ్చి, మంచి కాలేజీలో సీటు వస్తే ,రేపు అమెరికా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే ఇక్కడే చదువుకోవాల్సి వస్తుంది. లే త్వరగా” అన్నాడు రాజారామ్.

“మళ్లీ మొదలు పెట్టావా నాన్న ?నేను ఇక్కడే చదువుకుంటాను. వేరే కంట్రీ కి అసలు వెళ్ళను. ఎందుకు ప్రతిరోజు ఇదే చెప్తావు నా ముందు”అన్నాడు వినీల్.

అప్పుడే అక్కడికి వచ్చిన సునీల్ “అమ్మా,నాన్న చెప్పినట్లు వినొచ్చు కదరా! వాళ్ళు మన భవిష్యత్తు గురించే చెప్తున్నారు. అక్కడ అయితే మంచి అవకాశాలు ఉంటాయి. మంచి సంపాదన కూడా ఉంటుంది .ఇక్కడే ముంది రా వేస్ట్”అన్నాడు చిరాగ్గా సునీల్.

“అలా చెప్పరా, వీడికి అర్థం కావడం లేదు. మేము ఎంత కష్టపడుతున్నామో, వీడికి ఏమీ తెలియడం లేదు. మీరు ఇద్దరు విదేశాలకు చదువులకు వెళితే, మాకు నలుగురిలో హోదా ఉంటుంది. మీకు సంపాదన కూడా ఉంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది” అన్నాడు రాజారామ్

ఇక ఇవన్నీ వినే ఓపిక లేక ,లేచి వినీల్ స్కూల్ కు తయారయ్యాడు.

స్కూల్ కి వెళ్ళాడు కానీ, మనసంతా బాధతో ములుగుతుంది. ఎందుకు అమ్మ నాన్న వేరే దేశంలో వెళ్లి చదువుకోమంటారు? వాళ్ళని వదిలి నేను ఉండగలనా? అయినా ఇక్కడే చదువుకొని, ఉద్యోగం చేస్తే నష్టం ఏంటి? అక్కడికి వెళ్లి ఏం చేయాలి ?ఇష్టం లేని బ్రతుకు ఎందుకు బ్రతకాలి” ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు.

పిల్లలు ఇద్దరూ చదువులో మంచి మార్క్స్ తెచ్చుకుంటూనే ఉన్నారు. సునీల్ కి తల్లి, తండ్రి చెప్పింది బాగా వంట పట్టింది. అందుకని అతను చిన్నప్పటినుండి ఈ దేశాన్ని చిన్నచూపు చూస్తూనే, వేరే దేశానికి వెళ్లడానికి సంసిద్ధమయ్యాడు.

కానీ వినీల్ కు మాత్రం అన్యమనస్కంగా ఉంది. అసలు వెళ్లాలనినిపించడం లేదు. కానీ తల్లిదండ్రుల బలవంతం అతన్ని ముందుకు నెడుతుంది.

అనుకున్నట్లుగానే రెండేళ్ల తేడాలో ఇద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడ వాళ్ళ చదువులు ఉద్యోగాలు అన్ని జరిగాయి. ఇక్కడ రాజారామ్ వారికి కావలసినవి అన్ని పంపిస్తూనే, రోజు ఫోన్లలో మాట్లాడుతున్నారు. బంధువులలో అందరికీ ‘మా పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు’ అని గొప్పగా చెప్పుకుంటున్నాడు.

మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దామని అనుకున్నారు. బంధువులలో కొంతమంది అమ్మాయిలను చూసుకొని, పిల్లలకు ఫోన్లు చేశారు.

పిల్లలు ఇద్దరికీ చూసిన సంబంధాల గురించి చెప్పారు. వెంటనే సునీల్ అన్నాడు”ఏంటి నాన్న! పెళ్లిళ్లు కూడా నువ్వు చెప్పినట్లే చేసుకోవాలా? పెళ్లి విషయంలో మాకు ఆప్షన్ ఉండదా?”అన్నాడు.
సునీల్ మాటలు కొత్తగా అనిపించాయి. “ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి” అని అనుకున్నాడు రాజారామ్

“అది కాదురా, మంచి సంబంధం ఉందని మీ అమ్మ చెప్పింది”అన్నాడు రాజారామ్.

“నేను ఇక్కడే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నాన్న! పెళ్లి వచ్చే నెలలో చేసుకుందామని అనుకుంటున్నాను. నీకు చెప్పాలని అనుకున్నంతలోనే నువ్వు ఫోన్ చేశావు. మీకు టికెట్స్ బుక్ చేస్తాను. మీరు ఇక్కడికే వచ్చేయండి”అన్నాడు సునీల్.

రాజేశ్వరి, రాజారాం ఇద్దరు ఆశ్చర్యపోయారు. కళ్ళనుండి జలజల నీళ్లు రాలిపోయాయి.

“అమ్మాయిని చూసుకొని పెళ్లి నిశ్చయించుకున్న తర్వాత, అది మనం అడిగితే వాడు పెళ్లి గురించి చెప్పాడు. మనం అంత కాని వాళ్ళం అయిపోయామా?”అన్నాడు రాజారాం బాధగా.

రాజేశ్వరి కి ఏం చెప్పాలో తోచలేదు. ఆ మాట విన్నప్పటి నుండి ఏడుస్తూనే ఉంది.

ఆ తర్వాత చిన్న కొడుకు వినీల్ కు ఫోన్ చేశాడు రాజారామ్.

“ఏరా అన్నయ్య లాగా నువ్వు కూడా ఎవరైనా అమ్మాయిని వెతుక్కున్నావా? పెళ్లి నీ అంతట నువ్వే చేసుకుంటావా? మేము చూసిన సంబంధం చేసుకుంటావా?”అని అడిగాడు రాజారాం.

“నేను ఏ సంబంధం చూసుకోలేదు నాన్న! అయినా నీ ఇష్టంతో నేను ఈ దేశం వచ్చాను. అలాగని ఇక్కడే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటానా? మీరు చూసిన సంబంధమే చేసుకుంటాను”అన్నాడు వినీల్.

కొంతలో కొంత ఊరట కలిగింది రాజేశ్వరి , రాజారామ్ లకు.

పెద్దబ్బాయి అలా పెళ్లి చేసుకుంటున్నాడు అనే కోపంతో వారి పెళ్లికి వెళ్లలేదు రాజేశ్వరి, రాజారాం.

చిన్న కొడుకు వినీల్ కు వీళ్ళు చూసిన సంబంధమే ఖాయం చేసి, పెళ్లి ఘనంగా చేశారు. సునీల్ మాత్రం తమ్ముడి పెళ్లికి రాలేదు.

వినీల్ భార్యను తీసుకొని అమెరికాకు వెళ్ళిపోయాడు.

ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. రోజు ఫోన్ చేసే పిల్లలు వారానికి చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెల, తర్వాత సంవత్సరం ,ఆ తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంతగా మారిపోయారు. మొదట్లో వీరిద్దరిని అప్పుడప్పుడు అక్కడికే పిలిపించుకున్నారు. పిల్లల పురుళ్లు అన్ని రాజేశ్వరిని చేసింది. పిల్లలు కాస్త పెద్దవారు అయ్యేవరకు రాజేశ్వరి అవసరం వారికి బాగానే ఉంది. ఆ తర్వాత కమ్యూనికేషన్ తగ్గించేశారు.

ఇదంతా గుర్తు చేసుకుని ఒక నిట్టూర్పు వదిలారు. అన్ని సమయానికి అమర్చపెట్టే పనివాళ్ళు ఉన్నారు. కానీ మనసంతా ఒంటరితనంతో బాధపడుతుంది.

ఆస్తమానం టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సిందే. రోజులు మారిపోయాయి. ఒకరింటికి ఒకరు వచ్చి యోగక్షేమాలు కనుక్కునే స్థితి దాటిపోయింది .ఎవరి ఇళ్లలో వాళ్లే బిజీ అయిపోయారు. అయినా ఎవరి పిల్లలు వాళ్ళనే పట్టించుకోవడంలేని రోజులలో మరెవరో ఎందుకు చేస్తారు!

ఇలా ఆలోచిస్తున్న రాజారామ్ కి సడన్ గా గుండెలో నొప్పి వచ్చినట్లుగా అనిపించింది. చెమటలు పట్టేసాగాయి. అక్కడే ఉన్న రాజేశ్వరి కంగారు పడి హాస్పిటల్ కు ఫోన్ చేసింది. అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్లారు. పరీక్ష చేసిన డాక్టర్స్ ఆపరేషన్ చేసి తీరాలన్నారు. ఏమి తోచని రాజేశ్వరి పిల్లలకు మళ్ళీ ఫోన్ చేసింది.

చిన్న కొడుకు వినీల్ ఫోన్ ఎత్తాడు.

“ఏంటమ్మా ఈ వేళప్పుడు ఫోన్ చేసావ్?”అన్నాడు వినీల్.

“నాన్నకి గుండెలో నొప్పి వచ్చింది రా , హాస్పిటల్ లో అడ్మిట్ చేశాను. ఆపరేషన్ చేయాలట”అని ఏడుస్తూ చెప్పింది.

“అవునా ఆపరేషన్ ఎప్పుడు చేయాలట? వెంటనే చేసేది ఉంటే చేయమని చెప్పు. దగ్గరుండి చూసుకునే కొడుకులను అమెరికా అంటూ పంపించేశారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నారు. నేను మాత్రం ఇంత దూరంలో నుండి ఏం చేస్తాను. అక్కడికి రావాలన్నా బోలెడు ఖర్చు. అయినా వెంటనే సెలవు కూడా దొరకదు. డబ్బు పంపిస్తాను ఆపరేషన్ చేయించేసేయమ్మ ప్లీజ్ . నువ్వు ధైర్యంగా ఉండు సరేనా!”అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

అలాగే బాధగా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది రాజేశ్వరి.

కాసేపటి తర్వాత తేరుకుని, హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి, సర్జరీకి ఏర్పాటు చేసింది. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు రాజారాం.

రాజారామ్ కోలుకున్న కొన్ని రోజులు తర్వాత, భార్యతో సంప్రదించి, ఒక నిర్ణయం తీసుకున్నాడు.

“రాజేశ్వరి, ఇంతకాలంగా ఉద్యోగం, పిల్లల చదువు అని ఇక్కడే ఉండిపోయా ము,ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఒంటరిగా జీవిస్తున్నాము. ఇక్కడే ఉండే బదులుగా మన ఊరికి వెళ్ళిపోయి, అక్కడే మన పాత ఇంటిని రిపేర్ చేయించి, వ్యవసాయం పనులు కూడా చూసుకుంటూ ఉంటే, కొంచెం గాలి మార్పుతో మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి .అందులో ఇప్పుడు మన ఊరు అంత చిన్నది ఏం కాదు. వైద్య సదుపాయాలు కూడా ఉన్నాయి .కనీసం పలకరించే మనుషులైనా ఉంటారు. మరి నగరాల్లో ఉన్నంత అన్యాయం ఇంకా ఊళ్ళల్లో లేదు. ఏమంటావు”?అన్నాడు రాజా రామ్.

“మీఆలోచన నాకు నచ్చిందండి. మీరు కాస్త కోలుకున్న తర్వాత ,మన ఊరికి వెళ్ళిపోదాం. ఈలోపలే ఎవరినైనా మాట్లాడి ఇల్లు రిపేరు చేద్దాం. మళ్లీ ఆ దుమ్ములో మీకు అనారోగ్యం కలుగుతుంది”అని చెప్పింది రాజేశ్వరి.

ఇంతలో చిన్న కొడుకు వినీల్ నుండి ఫోన్ వచ్చింది.

“అమ్మా! నాన్న డిశ్చార్జ్ అయ్యాడా? ఇంటికి వచ్చేసారా ఇద్దరు? జాగ్రత్తగా ఉండండి .నేను పని తొందరలో అలా మాట్లాడేసాను. ఆ రోజు ఆఫీస్ లో ప్రాబ్లం వచ్చింది. అది సాల్వ్ చేసుకున్నానీరోజే చాలా టెన్షన్ గా ఉండే అమ్మా! మీరు ఏమీ అనుకోవద్దు. అయినా మీకు తెలుసు కదా ! నాకు అక్కడ ఉండడమే ఇష్టమని. మీ బలవంతం మీదే నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. సరే జరిగిందాని గురించి మాట్లాడితే ఏముంది”అన్నాడు వినీ ల్.

వినీల్ తో మాట్లాడుతూ విషయం అంతా చెప్పింది రాజేశ్వరి “ఊరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. అక్కడే ఉండి వ్యవసాయం చూసుకుందామని అనుకుంటున్నాము” అన్నది రాజేశ్వరి.

“మీరు రిపేరు గురించి ఆలోచించకండి. పదిహేను రోజుల తర్వాత మీరు చక్కగా ఊళ్లో మన ఇంటికి వెళ్ళండి. అంతా నేను చూసుకుంటాను”అన్నాడు వినీల్.

ఆ మాటలకు ఎంతో పొంగిపోయారు రాజేశ్వరి , రాజారామ్.

అనుకున్నట్లుగానే పదిహేను రోజుల తర్వాత ఊరికి బయలుదేరారు. ఊరు అప్పటిలా లేదు. చాలా మారి పోయింది. అన్ని సౌకర్యాలు వచ్చాయి. అయినా కూడా పల్లెటూరి ఛాయలు కనబడుతూనే ఉన్నాయి. ఊరిలోకి కాదు వెళ్ళగానే ఒక ప్రశాంతమైన భావన వచ్చింది రాజేశ్వరి, రాజారామ్ కు.

“రాజీ! ఇన్ని రోజులు పరుగు పందెం లాగా గడిచిపోయింది జీవితం. ఇప్పటికైనా ప్రశాంతంగా బ్రతికినన్నాళ్లు ఇక్కడే ఉందాం”అన్నాడు రాజారామ్.

ఊళ్లోకి వెళ్ళగానే కారు మెల్లగా వెళ్ళసాగింది. వీరిద్దరిని గుర్తుపట్టిన ఊరి ప్రజలు అందరూ పలకరించసాగారు.

“ఎన్నో ఏళ్లకు ఊరికి వస్తున్నారు అయ్యా! నాలుగు రోజులు ఉంటారా? వెళ్ళిపోతారా?” అని అడిగారు.

“లేదు ఇక్కడ ఉండడానికి వస్తున్నాము” అన్నది రాజేశ్వరి.

“అందుకనా ఇల్లు బాగు చేస్తున్నారు “అన్నారు కొందరు ఊరివాళ్లు.

“వినీల్ చేయిస్తున్నాడేమో?” అనుకున్నారు ఇద్దరు.

“మీ ఇంట్లో ఎవరో ఉన్నారమ్మ! మీ పిల్లలు వచ్చారా?” అని అడిగారు కొందరు.

“మా పిల్లలు విదేశాలలో ఉన్నరు. వాళ్లు రావడం కష్టం. పని జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఉన్నారేమో” అన్నాడు రాజారాం
ఇలా ఎవరో ఒకళ్ళు ఏదో పలకరిస్తూనే ఉన్నారు ఊళ్ళోకి వస్తూంటే!

కారు వెళ్లి ఇంటి ముందు ఆగింది.

కారు దిగిన ఇద్దరు ఆశ్చర్యపోయారు. అసలు ఇది వాళ్ల ఇళ్లేనా అనిపించింది.

చక్కని రంగులతో పూల తోరణాలు కట్టి, ఇల్లంతా ఎంతో సుందరంగా కనిపిస్తుంది.

ఇంతలో లోపల నుండి వినీల్ , వినీల్ భార్య వినీత బయటకు వచ్చారు.

ఒక్కసారి రాజారాం , రాజేశ్వరి విస్తుపోయారు.

“మీరేంటి ఇక్కడ? “ఇద్దరూ ఒకేసారి అడిగారు.

“ముందు లోపలికి రండి అన్ని తర్వాత చెప్తాను” అన్నాడు వినీల్.

లోపలికి వెళ్ళిన రాజేశ్వరి, రాజారామ్ కు ఇంకా ఆశ్చర్యమేసింది. అంతా చాలా చక్కగా అమర్చబడి ఉంది. అన్ని సౌకర్యాలు చేయించారు. పడక గదిలో మంచాలు, హాల్లో డైనింగ్ టేబుల్, సోఫాలు, ఫ్లోరింగ్ అంతా మార్చి ఇల్లంతా కొత్తగా చేయించారు.

“ఇవన్నీ ఎప్పుడు చేయించావు రా? ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?”అని అడిగింది రాజేశ్వరి ఆ త్రంగా.

“నువ్వు ఫోన్ చేయ కన్నా ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. దాదాపు ఆరు నెలల క్రితం ఇక్కడ మన వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే రాజయ్య తో మాట్లాడి, ఇంటి రిపేర్ పని మొదలు పెట్టాను. మీకు చెప్పొద్దని చెప్పాను. ఇంత లోపల నాన్నకి ఇలా అయ్యిందని నీ ఫోన్ వచ్చింది. అప్పుడే నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఇంకా అమెరికాలో ఉండొద్దని నిర్ణయించుకుని ఇక్కడే ఏదైనా సొంత బిజినెస్ పెట్టుకుందామని అనుకున్నాను. దానికి కూడా ఒక ప్లాన్ చేసుకున్నాను. మాకు పిల్లలు పుట్టి పెరిగే వరకు ఇక్కడ స్కూల్స్ కూడా బాగు ంటాయి. ఇప్పటికే ఇక్కడ స్కూల్స్ బాగున్నాయని అందరూ చెప్తున్నారు. మన ఊరికి నగరానికి పెద్ద దూరం లేదు. కాబట్టి నా పనులను ఇక్కడ నుండి చూసుకుంటూ అక్కడికి వెళ్లి వస్తుంటాను. ఇంక మీరు నిశ్చింతగా, ప్రశాంతంగా ఈ ఇంట్లో ఉండండి. మీ కోడలు నేను ఇక్కడే ఉంటాము”అన్నా డు వినీల్.

రాజారామ్, రాజేశ్వరి ఒక్కసారిగా దుఃఖంతో ఏడ్చారు. “ఒకనాడు ఇక్కడేముంది ?అమెరికా వెళ్ళండి, అని ప్రోత్సహించిన మేము ఎంత కష్టపడ్డామో, మాకు అర్థమయింది .ఉన్నచోట ఉపాధి వెతుక్కుని, బ్రతికితే ఎంత ఆనందంగా ఉంటుందో అర్థం చేసుకోలేకపోయాను. అక్కడికి వెళితే సంపాదన బాగుంటుంది అని తలచా నే తప్ప, మిమ్మల్ని దూరం చేసుకుంటున్నామని ఆలోచించలేదు. ఇప్పుడు అర్థమైంది నాకు, మమ్మల్ని అర్థం చేసుకుని మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దవాడినైనా క్షమించమని అడుగుతున్నాను రా! నిన్ను నేను బలవంతంగా పంపించాను”అన్నాడు కొడుకును దగ్గరకు తీసుకొని.

“అవన్నీ మర్చిపోండి మామయ్య! నాకు కూడా ఈ ఊర్లో ఉండటమే ఇష్టం. నేను పెరిగిందంతా కూడా పల్లెటూరులోనే.మా ఇంట్లో కూడా అమెరికా సంబంధం అంటూ పంపించారు. దేవుడు మా మనసులు గ్రహించి మా ఇద్దరిని మళ్లీ ఇక్కడికి పంపించాడు”అంటూ అత్తగారి దగ్గరికి వెళ్లి కూర్చుంది వినీల.

నలుగురు సంతోషంతో అలాగే కూర్చున్నారు. ఆకలి సంగతే మరిచిపోయి ఆనందాన్ని రుచి చూస్తున్నారు.

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కవితా సాగర మధనం

రమక్క తో ముచ్చట్లు -15