విధి నిర్వహణలో నా అనుభవాలు-3

నేటి భారతీయమ్

     డా. మజ్జి భారతి

మాది కొత్తగా మొదలుపెట్టిన పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి. నైట్ డ్యూటీలో వున్నాను. కడుపు నొప్పితో వచ్చిన ఒక పేషెంటును చూస్తున్నాం. చెప్పాను కదా కొత్తగా మొదలు పెట్టిన ఆసుపత్రని. స్కానింగ్ సదుపాయమింకా రాలేదు. అందుకని యే కంప్లైంటైనా, ముందుగా క్లినికల్ స్కిల్స్ మీద ఆధారపడేవాళ్ళం. క్లినికల్ స్కిల్స్ అంటే పేషెంటుని బాగా పరీక్ష చేసి, డయాగ్నోసిస్ చెయ్యడం. ఇప్పుడంటే స్కానింగ్ మిషన్లు, సిటిలు వచ్చాయి గాని, ముప్పయ్యేళ్ల క్రిందట, క్లినికల్ స్కిల్స్ మీద ఆధారపడే, జబ్బేమిటో కనుక్కునేవాళ్ళం. క్లినికల్ స్కిల్స్ బాగా వుంటే వాళ్ళు మంచి డాక్టరన్నమాట.
కడుపునొప్పి రావడానికి రకరకాల కారణాలుంటాయి. అజీర్తి చేసినా, వాంతులు విరేచనాలైనా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమున్నా, ఆడవాళ్లకు నెలసరిలో వచ్చే నొప్పి, కౌకు దెబ్బలు (దెబ్బ బయటకు కనిపించదు, కాని కండరాలకు దెబ్బ తగిలి నొప్పి వస్తుంది)… యివన్నీ సాధారణ కారణాలు. అపెండిసైటిస్, పేగు మలబడడం, ఆడవాళ్లలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అబార్షన్ (అబార్షనులో రక్తస్రావం బయటకు కనిపిస్తుంది, కాని ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అబార్షనులో రక్తస్రావం కడుపులోనే వుంటుంది), ఒవేరియన్ సిస్ట్ మెలితిరగడం… ఇటువంటివి ప్రమాదకరమైన కారణాలు. వెంటనే డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ (సాధారణంగా ఆపరేషనే పడుతుంది) చెయ్యకపోతే ప్రాణానికే ప్రమాదం. కాలం గడుస్తున్న కొద్దీ ఆ ప్రమాద శాతం పెరుగుతుంటుంది.
ఇంతలో కరెంటు పోయింది. చీకట్లోనే, టార్చ్ లైట్ వెలుగులో, పేషెంటుని పరీక్షించి, ట్రీట్మెంటు మొదలుపెట్టి, పేషెంట్ కొంచెం సర్దుకున్నాక, నా సీట్లో కూర్చున్నాను. ఇంతలో కరెంటొచ్చింది.
మాది పది పడకలున్న క్యాజువాలిటీ. ఇప్పుడు చూస్తున్న పేషెంటుతో కలుపుకుంటే ఐదుగురిని అడ్మిట్ చేసాము డ్యూటీలో. కరెంటు వచ్చాక చూస్తే ఆరుగురు పేషెంట్లున్నారు. ఇదేమిటి ఐదుగురు పేషంట్లనే కదా చూశాను. ఆరో పేషెంటెక్కడినుండి వచ్చాడు? నేనా పేషెంటునెలా మిస్సయ్యానని కన్ఫ్యూజయ్యాను. నేను చెప్పకుండా ఈ పేషెంటునెవరు అడ్మిట్ చేశారని స్టాఫునర్సుని కేకలేశాను. “మాకూ తెలియదు మేడం” అంటూ కేస్ షీట్లు చెక్ చేసింది. ఐదే వున్నాయి.
పేషెంట్ దగ్గరికి వెళ్ళి, వివరాలు కనుక్కుంటే “మీరందరూ ఆ పేషెంట్ దగ్గరున్నారు. బెడ్ ఖాళీగా వుంది. పడుకున్నాను. గ్లూకోజ్ బుడ్డీ యెక్కించండి. అందులో పసుపు రంగు ఇంజక్షన్ కలపడం మర్చిపోకండి” ఆర్డరేశాడు స్టాఫునర్సుకి. మాట్లాడుతుంటే గుప్పున ఆల్కహాల్ కంపు.
ఓపి టికెట్ తీసుకోలేదు. డాక్టరుకి, అంటే నాకే చూపించు కోలేదు. నేనేమి చెయ్యాలో పేషెంటే చెప్పేస్తున్నాడు. హాస్పటలు, వైద్య సిబ్బందంటే ప్రతివాడికీ లోకువైపోయిందని బాగా మండింది.
“అదేమన్నా పిప్పర్మెంట్ బిల్లా అడగ్గానే పెట్టడానికి. ముందు నీ బాధేమిటో చెప్పన్నాను” గట్టిగా.
“బుడ్డీ పెట్టించుకుంటే ఒంట్లో బాగుంటుంది. మొన్న వచ్చినప్పుడు ఆ డాక్టర్ పెట్టాడు. మీరు కూడా పెట్టేయ్యండంటూ” డిమాండ్ చేసాడు.
పేషెంట్ వైటల్స్, అంటే పల్స్, బిపి, రెస్పిరేటరీ రేటు అన్నీ బాగున్నాయి.
“మేడం! క్రానిక్ ఆల్కహాలిజం కేస్. మొన్న కూడా యిలాగే వచ్చి గొడవ చేస్తే, వీడి బాధ పడలేక నైట్ డ్యూటీ డాక్టరుగారు గ్లూకోజ్ బాటిల్ లో బి కాంప్లెక్స్ కలిపి పెట్టారు మేడం. ఇప్పుడూ అలాగే పెట్టమంటున్నాడంటూ” అసలు విషయం చెప్పింది స్టాఫ్.
“అక్కడ బుడ్డీల మీద బుడ్డీలు తాగి, లేనిపోని అనారోగ్యాన్ని కొనితెచ్చుకొని, నువ్వడగ్గానే బుడ్డీలు పెట్టడానికి యిక్కడ మేమేమైనా ఖాళీగా కూర్చున్నామా? ముందు బెడ్ దిగి యిక్కడికొచ్చి నీ బాధేమిటో చెప్పన్నాను”.
“కాళ్లు చేతులు పీకేస్తాయి. ఒకటే తిమ్మిర్లు. చేతులు చాపితే వణికిపోతాయి. మీరా బుడ్డీ పెట్టేస్తే అన్నీ తగ్గిపోతాయి. నర్సమ్మకు చెప్పండని” నాకొక సలహా పడేసాడు.
ఆ పేషెంటుని చూస్తే నవ్వాలో, తిట్టాలో అర్థం కాలేదు. ప్రతిరోజు మందు తాగే వాళ్ళకి పెరిఫెరల్ న్యూరోపతి అనే నరాల జబ్బొచ్చి, కాళ్లు చేతులు వణకడం, తిమ్మిర్లెక్కడం జరుగుతుంది. మందు తాగడం మానేసి మంచి ఆహారం తీసుకుంటే అవి తగ్గుతాయి. అంతేగాని మందు తాగడం నా హక్కు, మందులివ్వడం మీ బాధ్యతన్నట్టు పేషెంట్ మాట్లాడితే… తల పట్టుకొని… గట్టిగా యేమనడానికి వీల్లేదు… “ఇంటికెళ్లి ముందు శుభ్రంగా తిను. ఇదిగో ఈ మాత్రలు వేసుకో” అని బి కాంప్లెక్స్ మాత్రలిచ్చి వెళ్లమంటే వెళ్లడే. సెక్యూరిటీని పిలిపించి బయటికి పంపించాను. పావుగంటలో పదిమందిని వెంటేసుకొచ్చాడు, ట్రీట్మెంటివ్వకుండా పంపించేసారన్న కంప్లైంటుతో.
“పేషెంటుకెవరూ లేరనుకున్నారా? మేమంతా వున్నాం ట్రీట్మెంట్ మొదలుపెట్టండి” అన్నాడొకడు.
“హమ్మయ్య! ఇంతవరకు పేషెంటుని పట్టించుకునే వాళ్ళెవరూ లేరనుకున్నాను. మీరున్నారు కదా! ఇలా రండని” మందు తాగడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి క్లాసు పీకి, “నేను చెప్తే వినడం లేదు. గట్టిగా చెప్పండి మీరైనా! ఇలాగే తాగితే ఒళ్ళూ, యిల్లూ గుల్లైపోతాయి. యింతమందుండి యిలాగే వదిలేస్తారా? తాగిన మత్తులో రేపే లారీ కిందో పడిపోతే ప్రాణాలు తెచ్చివ్వగలరా? ఆ కుటుంబానికెంత నష్టం? పెద్ద డాక్టరుగారికి లెటర్ రాసిస్తాను. రేపు దగ్గరుండి డి -అడిక్షన్ సెంటరుకి తీసుకెళ్లండి. ట్రీట్మెంట్ దగ్గరుండి చేయించాలి సుమా! మధ్యలో వదిలెయ్యకూడదు. నాదేముంది గ్లూకోజ్ బాటిల్ పెట్టెయ్యమంటే పెట్టేస్తాను. ఆయన ఆరోగ్యమే పాడైపోతుంది. రేపు కాలేయం దెబ్బతినో, యాక్సిడెంటులోను చచ్చిపోతాడు. పరవాలేదంటే మీ యిష్టమనేసరికి,”
“ఏరా! డాక్టరమ్మగారు యింత బాగా చెప్తే, పట్టించుకోలేదని మాకు చెప్తావా? తాగుబోతు యెదవా! మా పని చెడగొట్టావు కదరా!” అని పేషెంటుని నాలుగు తిట్టి బయటకు పోయారు. వాళ్ల వెనకే పేషెంట్ కూడా. తగువుకైతే వస్తారు గాని, పేషెంటును పట్టించుకోవాలంటే మాత్రం యిలాగే జారుకుంటారందరూ. ఎంతమందిని చూడలేదు?
“వీళ్ళందర్నీ చూస్తే ఎంత పెద్ద గొడవవుతుందో అనుకున్నాను. బాగా డీల్ చేశారు మేడం” అంది స్టాఫ్ నర్స్.
“ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన డ్యూటీ మనం కరెక్టుగా చేసినప్పుడు, యెవరికీ భయపడనక్కర్లేదంటూ” రౌండ్స్ వేయడానికి బయలుదేరాను. తేలిక పడ్డ హృదయాలతో నన్ననుసరించారందరూ.
*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నమ్మకం

కమలా దేవి హారిస్ – పోరాట యోధురాలు – strong lady