అందరికీ శనార్థులు
మంచిగున్నరా!
దసర అయ్యింది. దివులె పండుగ వచ్చింది. అందరు పైలం మల్ల.
రావణాసురుని, నరకాసురుని సంపిన రోజు దివులే పండుగ చేసుకుంటున్నమని మనందరికీ ఎర్కనే!
అప్పట్లే దేవుండ్లు,రాజుల కన్నా మనమే గొప్పోలం వారి. గంత మాట అంటున్నవ్ ఏంది అక్క అంటున్నావ్. ఆడికే వస్తున్న చెప్త ఉండు. త్రేతాయుగంలఒక్క రావణాసురుడు, ద్వాపర ల ఒక్క నరకాసురుడు, ఒక్క దుర్యోధనుడు ఉండే.ఆళ్ళను సంపుడు అల్క గయ్యింది అనిపిస్తది నాకు.
ఇంకో ముచ్చట ఏందంటే…ఆళ్ళు, ఆళ్ల లెక్కనే కనబడ్డరు అంటే… నెగిటివ్ వాడు నెగిటివ్ లెక్కనే కనపడ్డడు. విలన్…విలన్ లెక్కనే కనపడ్డడు. గుర్తుపట్టుడు అల్క గయ్యింది సంపుడు గూడ అల్క గయ్యింది. నిషాని మంచిగ దొరికింది అన్నమాట. అవునా కాదా చెప్పు తమ్మి!
ఇంగ ఇప్పుడు ఎట్లున్నది దునియా.
దొంగ ఎవడో? దొర ఎవడో? మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో అస్సలు ఎరుకైతలేదు. పూర్తాగ.. ముంచేదాకా తెలుస్తనే లేదు. ఆడుగడుక్కు రావణాసురులాయే అడుగడుక్కు నరకాసుర్లాయే…!
అందుకే ఈ జమానాల ధర్మ యుద్ధం చేసుడు చాన కష్టం ఉన్నది.
రాముండ్లు – సత్యభామలు చాలా మంది రావాలి. ప్రతి ఇంట్ల మనము రాముని క్వాలిటీలు, సత్యభామ క్వాలిటీలు నేర్పాలే! లేకుంటే అడుగడుగున ఉన్న దుర్మార్గులను ఎదుర్కొనుడు కష్టం అయితది… ఏమంటవ్ చెల్లె!
అప్పట్ల విలన్లు అనుకునేటోళ్లు వాళ్ళు ముందు నుంచే ” మేము విలన్లము” అనే బ్రాండ్ ఏస్కోని గట్లనే బతికిండ్రు. అంటే విలన్ లాగా ఉండేటోడు విలన్ లెక్కనే బతికిండు. అంతేగాని మంచోనీ ముసుగు తొడుక్కోని దొంగబుద్ధుండి గూడ దొర లెక్క చేలామణి గాలే! ఇప్పుడు చెప్పుండి,ఈ కాలంల నరకాసురులను, రావణాసురులను దుర్యోధనుల్ని ఎతుకుడు ఎంత కష్టం.
అప్పుడు రావణాసురుడు సీతమ్మను ఎత్కపోయి అశోకవనంల పెట్టిండు గాని బలాత్కారము చెయ్యలేదు.
ఆడే నయం వారి. ఇప్పుడు ఎట్లున్నరు చిన్నపిల్లలని గూడ సూస్తలేరు. ‘థు’ వాల్ల బతుకు చెడ!. చీడపురుగుల లెక్క, దోమల లెక్క ఏడ పడితే ఆడనే ఉన్నరు.
అందుకే మనమే హుషారుండాలె. పిల్లలను రాముడి లెక్క అన్యాయం ఎదుర్కునే ధీరుని లెక్క, ఆడబిడ్డల్ని సత్యభామ లెక్క తయారు జెయ్యాలే!
ఆల్లను ఆళ్ళు కాపాడుకుంట, పక్కోల్లకు గూడ ఆసరా అయ్యేటట్టు.. వాళ్ల వ్యక్తిత్వంని తీర్చిదిద్దాలె! అదే మనము ఈ దివులె పండుగకు తీసుకోవాల్సిన సంకల్పం! మీకు నచ్చితే మీరు కూడా పాటించండి. ‘ థాంక్యూ రామక్క’ అని చెప్పుండి. ఇట్లా అడిగి థ్యాంక్స్ చెప్పించుకుంటున్న అనుకోకండి. కృతజ్ఞత అందరం ఒక్కలకు, ఒక్కళ్ళము చెల్లించుకోవాలే! నమ్ముత నేను అందుకే అడుగుతున్నా! మీక్కూడా… వారం వారం సదువుతున్నందుకు, నాకు మంచి కామెంట్లు పెడుతున్నందుకు చానా,చానా పెద్ద థాంక్యూలు! శనార్థులు! దీవెనార్థులు!.
“హర్ ఘర్ మే బచ్చా బచ్చా రామ్ హై” అన్నట్టు ఉండాలి మన ఇంట్ల బిడ్డలు!
ఇంకో మాట దివిలే పండుగ అంటే మొత్తం దీపాలు పెడుతం.ఎంత మంచిగుంటయి ఇండ్లు, గుడులు అన్ని.
ఒక్క దీపంతోని ఎన్నన్న వేల దీపాలు వెలిగించొచ్చు కదా. ” ఒక దివ్వె వెలిగించు వేవేయి దీపాలు ”
ఇంట్ల బాహ్యంగా దీపాలు పెట్టినట్టే లోపల అంతరంగంల కూడా దీపాలు వెలిగించాలి. వెలిగించే దీపం కి నమ్మకం అనే ప్రమిదల భక్తి అనే నూనె పోసి, జ్ఞానం అనే ఒత్తి వేసి వెలిగిస్తే ప్రేమ అనే దీపం వస్తది. అదే వసుదైక కుటుంబం అనే భావనను అంతటా నింపుతది.
దుర్మార్గం, మోసం, కుళ్ళు కుతంత్రం అనేటి చీకట్లను తరుముతది. అదే దివులే పండుగ. అదే దీపావళి పండుగ.
దీపాల వరుస, బయట లోపల ( మనస్సులో ) రెండు తావులల్ల వెలిగిస్తే..
మన బతుకు తొవ్వ దేదీప్యమానంగ ఉంటది.
తమ్మీ.. శెల్లె..! మన భారతదేశంల చేసుకునే ఏ పండుగైన సరే “కమ్మగ వండుకొని తినుడు కాదు”.
దాని వెనుక అంతరార్థం ఉంటది. లోతుగ ఇంకో అర్థం ఉంటది. అది తెలుసుకొని మనము, మన పండుగలు చేసుకోవాలె.
మనం మన బాల్ బచ్చాలకి కూడా గదే నేర్పాలె. అప్పుడు భావి భారతం సల్లగ ఉంటది.
ఇంగ పోతే టపాకులు!! టపాకులు కూడా మంచిగ కాల్సుకోండి.
ఏంగాదు.మంచిగ మస్తు కాల్సుకోండి.కానీ కాళ్లు,చేతులు మూతలు కాల్చుకోకండి.
జెర పైలం. తెల్లారి కూడా అంత కాల్షి పాడేసిన టపాకుల కాగితం ముక్కలు గుడా.. ఊడ్చి పారేసి ఆ జాగల మంచిగ పెండ సాన్పి గొట్టుండి.
కొందరి ఇండ్లల్లకు కొత్త అల్లుళ్లు వస్తరు. ఆ సంబురమే వేరు ఉంటది! అందరూ ప్రేమగ, గౌరవంగ మసులుకోండి. ఈగోలకు, పనికిమాలిన కోపాలకు పోకుండి. జర పెట్టి పోతలల్ల ఎన్క ముందైనా అల్లుండ్లు సుత సర్దుకోండి. మనసు ఖరాబ్ జెస్కోకుండ ” యే మనోల్లె తీ…!” అనుకోండి.
భారతదేశంకి సంపద సౌభాగ్యం రావాలి అని లక్ష్మీ పూజలు చేద్దాం దేశమంత సంపదతోని ఉంటే మన ఇంట్ల కూడా సంపద ఉంటది.
పండుగంటే గిదిమల్ల. పండుగ అంటే గిట్ల చేసుకోవాలి అనేటట్టు మనందరం పండుగ మస్తు ఖుషీగ జేసుకుందాం!
అందరికీ మరొక్కసారి థాంక్స్ చెప్తున్నా
దివులే పండుగ శుభాకాంక్షలుతో
మీ రమక్క