జాతర

కథ

పోచం సుజాత

రాజయ్య ,నాగమణి అవసరమైన వస్తువులను హడావుడిగా సర్దుతున్నారు .

సారమ్మ ! ఇట్లా రావే పొద్దుపోతుంది .
అంటూ పిలిచింది సారమ్మను తల్లి నాగమణి.

ఏంటమ్మా .. ఈ ఆత్రం అన్నది అప్పుడే బడికి పోయి వచ్చిన సారమ్మ .

ఎటిలేదు తల్లి…! మనము ,మీ ఆత్తోళ్ళు కల్సి
బండి కట్టుకొని సమ్మక్క, సారలమ్మ జాతరకు రేపు పొద్దుగాల పోతున్నాము అన్నది నాగమణి కూతురుతో…అందుకే అన్ని సర్దుతున్న….
ఆడికి పోయి అమ్మోర్లకు నీ మొక్కు చెల్లించాలి.
ఆ బంగారం అందుకో అన్నది నాగమణి .

ఏదమ్మా… బంగారం అన్నది సారమ్మ .

అదేనే తల్లి అంటూ.. బెల్లం ముద్దని చూపింది నాగమణి .

ఇది బెల్లం కదా బంగారం అంటున్నావు .అన్నది ఆశ్చర్యంగా ….?? సారమ్మ .

అయ్యో అట్లా అనొద్దు తల్లి కళ్ళు పోతాయి .
అది బంగారమే….. నీ బరువంతా తూకం అమ్మోరుకి మొక్కు ఇయ్యాలి.

ఆ సమ్మక్క ,సారలమ్మ తల్లులు చానా దయకల తల్లులు . నువ్వుపుట్టక ముందు మాకు బిడ్డలు పుట్టాలని ఎన్నో దవాఖానాలు తిరిగాము .
కానీ చానా రోజుల దాక మాకు పిల్లలు పుట్టలేదు. ఆఖరికి మీ మేనఅత్త మమల్ని సమ్మక్క ,సారలమ్మ జాతరకి తీసుకపోయింది .
అప్పుడు ఆ అమ్మలకి మొక్కిన మొక్కుకి నువ్వు పుట్టినావు. అందుకే నీకు సారమ్మ… అని పేరు పెట్టుకున్నాం అన్నది నాగమణి .

నా పేరు ఏమి బాగాలేదు… అని బుంగ మూతి పెట్టింది సారమ్మ .

అట్లా అనొద్దు తల్లి….ఆ అమ్మోరు బిడ్డవి నువ్వు అన్నది నాగమణి.

అక్కడ ఏమి వుంటాదమ్మా…అని అడిగింది సారమ్మ.

అప్పుడే అక్కడికి వచ్చిన నాగమణి తమ్ముడు రాము ఊరి సర్పంచ్. నేను చెప్తారా కోడలా అని సారమ్మని పిలిచాడు రాము.

అది మన భారత దేశంలో గిరిజనులు చేసే పెద్ద జాతర. అక్కడ విగ్రహాలు లేని జాతర .
సమ్మక్క ,సారలమ్మ జాతరలో గిరిజనుల సంప్రదాయం ,సంస్కృతి కనిపిస్తుంది .
రెండు సంవత్సరాలకి ఒకసారి ఫిబ్రవరిలో
మాఘ శుద్ధ పౌర్ణమికి మొదలై ,నాలుగు రోజులు ఈ జాతర మేడారంలో జరుగుతుంది .
ఓరుగల్లు కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి పై కోయ గిరిజనుల కోసం యుద్ధం చేసి సమ్మక్క ,సారలమ్మలు వీర మరణం చెందారు.
మేడారంని అప్పుడు పడిగిద్ద రాజు పాలించేవాడు. ఇతను కాకతీయులకు సామంత రాజు. అతని భార్య సమ్మక్క .
వీళ్లకు సారలమ్మ ,నాగులమ్మ జంపన్న అని ముగ్గురు పిల్లలు .

మేడారం ప్రజలు పన్ను చెల్లించనందుకు కాకతీయ రాజు వాళ్లపై సైనికులను యుద్దానికి పంపాడు . ఆ యుద్ధంలో పడిగిద్ద రాజు, అతని పిల్లలు పోరాడి వీర మరణం పొందారు .
కొడుకు జంపన్న వాగులో మరణించడం, తన వాళ్లంతా చనిపోవడంతో.. అప్పుడు సమ్మక్క బాధపడి  సైన్యంతో  ధైర్యంగా పోరాడి వీర మరణం పొంది అదృశ్యమయ్యింది .
దేవతగా అదృశ్య మవ్వడం చూసిన కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోయాడు.
ఆ తర్వాత నుండి ప్రతాప రుద్రుడు వాళ్లకు భక్తుడై ఈ విధంగా జాతర జరిపించేవాడు అని చెప్పాడు రాము.

ఆడవాళ్లు కూడా యుద్దాలు చేస్తారా…?? మామయ్యా అన్నది సారమ్మ .

మామ చెప్పేది గమ్ముగా విను అన్నది తల్లి .

అడగని అక్క మన సారమ్మ కూడా మరో వీరవనిత కావాలిగా అన్నాడు నవ్వుతు…రాము.
అక్కడ కుంభ మేళ జరిగాక  కులాలకు అతీతంగా భారీగా  భక్త జనం వస్తారు.
ఈ జాతరను మన రాష్ట్ర పండుగలాగా చేశారు . మేడారం జాతరలో భక్తి తో ,పూనకాలు ఊగి మొక్కులు చెల్లిస్తారు .
అక్కడ నైవేద్యంగా అమ్మవార్లకు బంగారము [ బెల్లము] అందిస్తారు .అని చెప్పాడు .రాము.

ఆడపిల్లలమని కాకుండా అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా నీతిని ,ధర్మాన్ని కాపాడాలి .అప్పుడు అందరి మనస్సులో ఉంటామూ. అంతేగా మామయ్యా… అన్నది సారమ్మ .

రాము ,నాగమణి సారలమ్మ ధైర్యంతో మాట్లాడే మాటలకి మనసులోనే ఆనందపడుతూ నవ్వుకున్నారు.
పా.. ఇక పడుకో.. రేపు తెల్లారక ముందే మేడారం జాతర పోవాలి అని చెప్పింది నాగమణి .

మరునాడు తెల్లవారుజామున అందరూ లేచి స్నానాలు చేసుకుని తయారై,
సమ్మక్క, సారలమ్మ జాతరకి బయలుదేరారు.
అపారమైన నమ్మకంతో అమ్మవార్లకి బంగారాన్ని నైవేద్యంగా ప్రసాదించి కుటుంబమంతా సంతోషంగా కలిసి పండగ చేసుకున్నారు.

Written by Pocham Sujatha

పోచం సుజాత
రచయిత్రి, కవయిత్రి, గాయని.
యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు గ్రామమునందు పుట్టి పెరిగారు.
ప్రస్తుతం గృహిణిగా ఉంటూ సాహిత్య సేవ చేస్తున్నారు
సాహితీ వనంలో చైతన్యవంతంగా పనిచేస్తూ ఎన్నో అవార్డులను, పురస్కారాలను, బిరుదులను పొందారు
తెలుగు విద్యాలయంలో ఎంపికైన "సుజాత సుమాలు" కావ్య సంపుటి రచించి ప్రముఖులచే ఆవిష్కరించారు
ప్రతిలిపిలో మూడు ధారావాహిక నవలలు రాసి పాఠకుల ఆదరణ పొందారు
భక్తి గేయాలు, సామాజిక గేయాలు, జానపద గేయాలు తన కలం నుండి జాలువారాయి.
చరవాణి:7799114450

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

దివ్య వెలుగుల దీపావళి