యూరోప్ ట్రిప్ – 4

హైగేట్ సిమెట్రీ 

కిందటి వారం తరువాయి భాగం…. 

లండన్ చేరటం, హోటల్ ఆంట్రియమ్ హిత్రో లో చెకిన్ అవటం జరిగింది. డబుల్ బెడ్ రూం నుంచి రెండు సింగల్ బెడ్స్ ఉన్న రూముకి మారగానే, హమ్మయ్య ఫ్రెష్ అయి మంచి నిద్రపోవాలి అనుకున్నాను. మరి వీడికి తిండెలా ఇక్కడ ఏమి దొరికేలా లేదు. ‘మనం తెచ్చిన స్నాక్స్ ఏదైనా తిను ఈరోజుకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సిక్స్ కల్లా ఉంటుంది కదా‘ అన్నాను. ‘ఓ… నో, నాకు మంచి ఫుడ్ కావాలి. చాలా ఆకలేస్తుంది విజయా.‘ అన్నాడు జాలిగా. ఆకలికి, అలసటకి ముఖం వాడి పోయింది. అప్పుడు గుర్తొచ్చింది కాబ్లో వచ్చేటప్పుడు డ్రైవర్ అలీ, ఊబర్ ఇక్కడ కూడా ఉందని చెప్పాడుగా. అక్షర్కి ఫోన్ చేసి అడుగుదాం. అన్నాను. ‘విజయా! మనం హోటల్ చేరాక అక్షరన్న ఫోన్ చేసి చేరినట్టు చెప్పమన్నాడు కదా. మనం మరచి పోయాం. అలాగే ఊబర్ నంబర్ కూడా తీసుకుందాం.‘ అన్నాడు. నా మనవడు నన్ను విజయా అనడం మీకు వింతగా అనిపిస్తుందికదా! ఏంలేదండి నన్ను పేరు పెట్టి పిలవటం వాళ్ళకు చిన్నప్పటి నుండి అలవాటు. మా అమ్మా వాళ్ళింట్లో నేను ఆఖరి దాన్నవటం, అందరూ నన్ను పేరుపెట్టి పిలవటం వల్ల తరువాత జనరేషన్ కూడా వరుసతో కాక విజయా అనే పిలవటం అందరికీ అలవాటైపోయింది. 

‘అవును రేపటి ప్రోగ్రాం కూడా ఫిక్స్ చేయాలి కదా!‘  అంటూ, వాడికి ఫోన్ చేసి హోటల్ చేరినట్టూ, రేపు ఎప్పుడు నీకు వీలవుతే అప్పుడు బయలు దేరుదాం అంటూ, ‘హోటల్ ల్లో డిన్నర్ ఇప్పుడు ఉండదట. డ్రైవర్ ఇక్కడ కూడా ఊబర్ సర్వీసెస్ ఉన్నాయట కదా. నంబర్ ఫార్వర్డ్ చేయమన్నాను. ‘అవును మీకు డిన్నర్ ఇప్పుడు హోటల్లో ఉండదు అందుకే నీకు వెజ్ కర్రి అన్నం, వాడికి బిర్యాని, చికెన్ సిక్టిఫైవ్ ఆర్డర్ చేసాను. పదినిముషాల్లో మీకు రిసెప్షన్ నుంచి ఫోన్ వస్తుంది. కలెక్ట్ చేసుకొండి. చాలా అలసి పోయారు కదా రెస్టు తీసుకొండి. పదింటికల్లా వస్తాను రెడిగా ఉండండి.‘ నన్నుమాట్లాడనీయకుండా ఫుడ్ ఆర్డర్ చేసాడు. ఇంకేం బిర్యాని అనగానే ప్రణయ్ ఎగిరి గంతేసాడు. వెంటనే ప్రణయ్ స్నానంచేసి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. నేనూ ఫ్రెష్ అయి ఫుడ్ రాగానే భోజనం చేసి పడుకున్నాము. పొద్దట ఆరువరకు మెలుకువ రాలేదు. అంత గాఢంగా నిద్ర పట్టింది.  

              సిమెట్రి మాప్

 ఉదయం అక్షర్ వచ్చేకంటే ముందే తొమ్మిది కల్లా రెడీగా ఉన్నాము. రూంలోకి రాగానే నన్ను చూసి ‘విజయమ్మమ్మఅంటూ కౌగలించుకున్నాడు. పాపం పదిహేనేళ్ళుగా తన వాళ్ళని చూడక ఒంటరిగా బతుకుతున్నాడు. ఒకటి రెండు సార్లు చిన్నన్నయ్య కొడుకు ఉదయ్ ఆఫీస్ పనిమీద లండన్ వచ్చినప్పుడు కలిసాడట. అక్షర్, చాలా రోజుల తరువాత అంబర్ పేట అన్నయ్య వాళ్ళింట్లో పుట్టిన పిల్లాడు, అన్నయ్యకి మొదటి మనవడు. వాణ్ణి అందరం చాలా ముద్దు చేసేవాళ్ళం. అన్నయ్య వాడితో చాలా గడిపేవాడు. అప్పుడు నా ఆఫీసు శని ఆది వారాలు సెలవు కాబట్టి, ప్రతీ శనివారం అన్నయ్య రమ్మనడం, అక్కడికి నేను రంగనాథం పిల్లలు వెళ్ళే వాళ్ళం. అందరం వాడి ఆటపాటలు చూస్తూ మురిసి పోయే వాళ్ళం. తరువాతి కాలంలో ఎవరి బిజీ లైఫ్ వాళ్ళం అయిపోయాము. ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత వాణ్ణి చూస్తుంటే కళ్ళు చెమర్చాయి.  

 ప్రణయ్ని చూసి ‘హాయ్ బ్రో, నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నీకు మాటలే రాలేదు. ఇప్పుడు చూడు 6 ఫీట్ అయ్యావు‘ అంటూ దగ్గరికి తీసుకున్నాడు. నేను 6.2 అన్నా‘. అంటూ తన హైట్ చెప్పుకున్నాడు. వదిన వాళ్ళు పంపిన పచ్చళ్ళు చేగోడీలు స్వీట్లు చూసి చాలా సంతోష పడ్డాడు. అక్షర్ కి బాబాయి శ్రీధర్ (జ్వాలా రెండవ కొడుకు. 2021 లో హార్ట్ఎటాక్ తో చనిపోయాడు) కూతుళ్ళు పంపిన రాఖీలు ఎంతో సంతోషంగా చూసుకున్నాడు. ఆరోజే రాఖీ పూర్ణిమ కావటం మరో ప్రత్యేకత. అవన్ని రాత్రికి రిటర్న్ లో తీసుకెళ్తాను కాని, మనం బయలు దేరుదాం. లేటవుతుంది అన్నాడు. మెట్రో అయితే రెండు మూడు మారాల్సి వస్తుందని కాబ్ అరేంజ్ చేసాడు. వాడి ఫ్రెండ్ అవినాశ్ అనే అబ్బాయి కూడా వచ్చాడు. అతను బెంగుళూరు నుంచి చదువు కోసం వచ్చి అక్షర్ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడట.తను కన్నడ యాసలో తెలుగు మాట్లాడుతుంటే బలే గమ్మత్తుగా అనిపించింది. మొదట మేము గంటన్నర ప్రయాణం చేసి నార్త్ లండన్ స్వైన్ లేన్ లో ఉన్న హైగేట్ సిమెట్రీ ఈస్ట్కార్ల్ మార్క్ సమాధిని చూడ్డానికి వెళ్ళాము. ఆయన సమాధిని చూడటానికి ఎంతో తాపత్రయ పడ్డాను. 

లారెన్స్ బ్రాడ్ షా – శిల్పి

కార్ల్ మార్క్స్ 5 మే 1818 జర్మనీలో జన్మించిన తత్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త, ఆర్థికవేత్త, చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, పాత్రికేయుడు మరియు సోషలిస్టు. అతని అత్యంత ప్రసిద్ధ రచనలు కమ్యూనిస్టు మానిఫెస్టో, దాస్ కాపిటల్ మూడు వాల్యూమ్స్, పెట్టుబడిదారీ విధానాలు, చారిత్రక భౌతికవాదాల గురించి ఫెడ్రిక్ ఏంగిల్స్ తో కలిపి వ్రాసారు. ఆయన మార్క్సిస్టు వాద రచనలు ఆర్థిక రాజకీయ చరిత్రపై అపారమైన ప్రభావాన్ని చూపాయి. జర్మనీ లో ఆయన జన్మించిన కార్ల్ మార్క్స్ హౌజ్ ని చూడలేక పోతున్నాననే బాధ ఉన్నా ఈ యూరప్ ట్రిప్ వల్ల ఆయన సమాధినైనా చూడాలని లండన్ కి ఒకరోజు ముందుగా వచ్చాను. ఆ ఆశ తీరే క్షణం నా కళ్ళముందు కనబడుతుంటే ఉప్పొంగి పోయాను. 

ఈహైగేట్ సిమెట్రీ రెండు భాగాలుగా ఉన్న అత్యంత ఖరీదైన శ్మశానం. మరో వేపు వెస్ట్ సిమెట్రీ ఉందట. కాబ్ దిగగానే రోడ్డుకు ఒకవేపు మార్క్స్ మెమోరియల్ బిల్డింగ్ కనబడింది. మరోవేపు సిమెట్రీ. ముందు ఆయన సమాధి చూడటానికి గేటు దగ్గరికి వెళ్ళాము. అక్కడే ప్రవేశానికి టికెట్స్ అమ్ముతున్నారు. పెద్దవారికి పది పౌండ్స్ చిన్న పిల్లలకైతే ఆరు పౌండ్స్ టికెట్టు ధర. ఈ సిమెట్రీ, హైగేట్ N6, వాటర్లూ పార్క్ పక్కన లండన్ బోరో ఆఫ్ కామ్డెన్ లో 15 ఎకరాల విస్థీర్ణంలో విస్తరించి ఉంది. చెస్టర్ రోడ్ దగ్గర మరో గేట్ కూడా ఉందిట కాని వాడకంలో లేదని చెబుతారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో వస్తే C 11 బస్, బ్రూక్ఫీల్డ్ పార్క్ స్టాప్ లో దిగి సిమెట్రీకి రావచ్చు.  హైగేట్ స్మశానవాటిక, లండన్ యొక్క అత్యంత ప్రసిద్ధ శ్మశానవాటిక, హైగేట్ కొండ వాలుపై, 19వ శతాబ్దంలో లండన్ లో వేగంగా పెరుగుతున్న జనాభా ఫలితంగా, మునుపటి శ్మశాన వాటికలపై ఒత్తిడిని తగ్గించడానికి రాజధానిలో మరిన్ని శ్మశాన వాటికల అత్యవసర అవసరానికి ప్రతిస్పందనగా ఇది సృష్టించబడింది. 1836లో పార్లమెంటు చట్టం ప్రకారం లండన్ స్మశానవాటిక కంపెనీ ఉత్తర, దక్షిణ, మహానగరానికి తూర్పున శ్మశానవాటికలను ఏర్పాటు చేసింది. 

కంపెనీ స్థాపకుడు, వాస్తుశిల్పి, స్టీఫెన్ గేరీ లండన్ మొదటి జిన్ ప్యాలెస్‌ను రూపొందించినట్లు చెబుతారు. హైగేట్ వద్ద స్మశానవాటికను ప్లాన్ చేశారు, అతను 1854లో మరణించినప్పుడు అతనిని కూడా ఇక్కడే ఖననం చేశారు. గార్డెన్ డిజైనర్ డేవిడ్ రామ్‌సేను ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌గా నియమించారు. సమాధులు, స్మారక చిహ్నాలు, ఈజిప్షియన్-శైలి స్తంభాలు, స్థూపాలు, విస్తారమైన చెట్లు, అద్భుతమైన సమాధుల మధ్య చుట్టుపక్కల ఉన్న మార్గాలతో ల్యాండ్‌స్కేపింగ్ అందంగా చేయబడింది. స్మశానవాటిక 1839లో ప్రారంభించి, అతి త్వరలోనే సంపన్నులకు ఆకర్షణీయమైన శ్మశానవాటికగా మారింది. 1880లో మరణించిన ది అబ్జర్వర్ వార్తాపత్రిక యొక్క ఫైనాన్షియర్, యజమాని జూలియస్ బీర్ కోసం నిర్మించబడిన ప్రపంచంలోని అసలైన ఏడు వింతలలో ఒకటైన హాలికర్నాసస్  సమాధి నకలు అత్యంత విశేషమైన స్మారక చిహ్నాలలో ఒకటి. 

            మార్క్స్ మొదటి సమాధి

హైగేట్ స్మశానవాటిక మొదటి నుండి పర్యాటక ఆకర్షణ. అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం కార్ల్ మార్క్స్‌ సమాధి.  క్రిస్టినా రోసెట్టి మరియు ఆమె కుటుంబంలోని చాలామంది హైగేట్‌లో ఖననం చేయబడ్డారు, డాంటే గాబ్రియేల్ రోసెట్టి భార్య, ఎలిజబెత్ సిడాల్‌తో సహా, తత్వవేత్త హెర్బర్ట్ స్పెన్సర్ నుండి రచయిత జార్జ్ ఎలియట్, శాస్త్రవేత్త మైఖేల్ ఫెరడే, చార్లెస్ డికెన్స్ భార్య, కేథరీన్, సంగీతకారుడు హ్యారీ థోర్న్టన్, నటుడు సర్ రాల్ఫ్ రిచర్డ్సన్, శాస్త్రవేత్త, రచయిత జాకబ్ బ్రోనోవ్స్కీ, టీవీ కుక్ ఫిలిప్ హర్బెన్ ఇక్కడే ఖననం చేయబడ్డారు. ఆ సమాధులు అద్భుతమైన విగ్రహాలు, బొమ్మలు, దేవదూతలు, విరిగిన వయోలిన్‌లు, ఇతర మరణాల చిహ్నాలతో అలంకరించబడిన స్మారక చిహ్నాలతో ఉన్నాయి.  అలాగే ప్రైజ్‌ఫైటర్ టామ్ సేయర్స్ పెంపుడు కుక్కతో సహా జంతువుల సమాధులూ కనబడతాయి.  

స్మశానవాటిక 1930లలో శిథిలావస్థకు చేరుకుంది, 1960ల నాటికి క్షీణత ఎక్కువకాగా పునరుద్ధరణ పనులు 1970ల మధ్యలో ప్రారంభమయ్యాయి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ స్మశానవాటికను పర్యాటకుల కోసం తెరిచి ఉంచటమేకాదు ఇంకా మిగిలిన కొద్ది స్థలాలను సమాధుల కోసం కూడా ఏర్పరిచారు. ఆ జాగాల విలువ చాలా ఖరీదైనదిగా పేర్కొనబడింది. హైగేట్ సిమెట్రీ ఈస్ట్ లో ఒక సమాధి ప్లాటు ధర 20,000/- పౌండ్లు. అదే వెస్ట్ లో దానికంటే రెట్టింపు ఖరీదు 

అంతా ఒక పార్క్ లాగా సహజమైన వృక్షసంపదతో పచ్చగా ఉంది. లోపల అడుగు పెట్టగానే భాషకు అందని ఒక అనిర్వచనీయమైన ఆనందం, ఉద్వేగం కలిగింది. మామూలుగానే చల్లగా ఉన్న వాతావరణం మరింత చలి అనిపించింది. అప్పటికే చలిగా ఉందని లాంగ్ స్వెట్టర్ వేసుకున్నాను. చక్కటి సిమెంటు రోడ్డు ఇరువైపుల సమాధులు చెట్లూ ఉన్నాయి. సినిమా యాక్టర్స్, సైంటిస్టులు, రచయితలు, రాజకీయ ప్రముఖుల సమాధులు ఈ శ్మశాన వాటికలో ఉన్నాయట. అంతే కాక చాల సినిమాలు కూడా ఇక్కడ షూట్ చేశారట. ఆ సిమెట్రీ నిర్వాహకులు టికెట్ తో పాటు ఒక మాప్ కూడా ఇచ్చారు. ఏ సమాధి ఎక్కడుందో గుర్తించటానికి అనువుగా.  

గ్రేవ్ యార్డ్ 1839 లో స్థాపించ బడిందని రాసారు. దీనికి ఆర్కటెక్ట్ స్టీఫన్ గేరీ. మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్ వైపుల్లోని సిమెట్రీలో సుమారు 1,70,000 మందిని ఖననం చేస్తే, 53,000 సమాదులున్నాయట. మనకు కనుచూపు మేర అంతా సమాధులే కనబడతాయి. హైగేట్ సిమెట్రీ చాలా ప్రముఖంగా చెప్పుకుంటారు. ఒకటి గొప్ప గొప్ప వ్యక్తుల సమాధులైతే, మరో ప్రత్యేకత ప్రకృతి సహజంగా ఏర్పడిన వనం వల్ల. లండన్ లో ఉన్న ప్రముఖ పది సిమెట్రీలలో ఇది నంబర్ వన్ గా పేర్కొనబడింది. దీనిలో కార్ల్ మార్క్స్ సమాధి ఉండటం వల్ల ఆ ప్రాముఖ్యత ఏర్పడిందని చెబుతారు. 

దారి వెంబడి వెతుక్కుంటూ వెళుతుంటే అల్లంత దూరాన ఉండగానే మార్క్స్ బస్ట్ సైజ్ విగ్రహాన్ని, సమాధిని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. జీవితాంతం పాలోవర్స్ గా ఉన్న అన్నయ్య, రంగనాథం రాలేని ఈ సమాధిని, నేను చూడగలిగానని అనిపించింది. దగ్గరికి వెళ్ళి ఆ సమాధి పీఠాన్ని చేయితో స్పృశించగానే…. అది బాధో, సంతోషమో అయిన ఉద్విగ్నతా భావం. ఆయన ముఖం చాలా ఎత్తుగా ఉండటం, నాకు చేతితో తాకే వీలుకలగలేదు. విపరీతమైనా భావోద్వేగంతో కన్నులు చెమ్మగిల్లాయి. పిల్లకు అర్థంకాక దగ్గరికి వచ్చారు. పోటోలు తీసారు. మొదట ఆయనను ఖననం చేసిన సమాధి ఉందని, అక్కడికి వెళదామని నేను అనడంతో, మాప్ చూస్తూ కొంచెం లోపలికి వెళ్ళాము. కొంచెం ఇరుకుగా ఉన్న మట్టి దారి వెంబడి వెతుక్కుంటూ వెళ్ళాము. వంద గజాల దూరంలో కనబడింది. సమాధి పై భాగమంతా పగుళ్ళు ఉన్నాయి. చాలా పాతబడి ఉంది.  

ఆయన విగ్రహం ఉన్న సమాధి కాక అసలైన, ఆయన 14 మార్చ్ 1883 రోజు చనిపోయినపుడు  అతని భార్య జెన్ని వోన్ వెస్ట్ ఫాలెన్, ఇతర కుటుంబ సభ్యులు, మార్క్స్ హౌస్ కీపర్ హెలెన్ డెముత్ మృతదేహాలతో కలిపి ఖననం చేసారు. (హెలెన్ డెమూత్ మార్క్స్ రచనల్లోను సహాయపడిందని ఏంగిల్స్ ఆమె గురించి రాసిన రచనలో పేర్కొన్నాడు). అంత్యక్రియలకు పదమూడు మంది మాత్రమే హాజరయినారు. 

ఒక సమకాలీన వార్తాపత్రిక ఇరవై ఐదు నుండి ముప్పై మంది బంధువులు మరియు స్నేహితులు అంత్యక్రియలకు హాజరయ్యారని పేర్కొంది. ది గ్రాఫిక్ అనే పత్రికలో ‘ఒక విచిత్రమైన తప్పిదంతో … అతని మరణం రెండు రోజుల వరకు ప్రకటించబడలేదు, ఆపై పారిస్‌లో జరిగినట్లు. మరుసటి రోజు దిద్దుబాటు పారిస్ నుండి వచ్చింది. అతని స్నేహితులు, అనుచరులు హేవర్స్టాక్ హిల్ లోనిఅతని ఇంటికి అంత్యక్రియల గురించి తెలుసుకోవటానికి వెళ్ళారని, అతను అప్పటికే భూమాత ఒడిలో శాశ్వతనిద్రలో ఉన్నాడని తెలుసుకున్నారు. అందువల్ల అతని సమాధివద్ద పెద్ద ప్రదర్శన జరిగింది.‘ అనే వార్త ప్రచురించారట. విల్ హెల్మ్ లైబ్నెచ్ట్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌తోసహా అంత్యక్రియల్లో అతని సన్నిహిత మిత్రులు చాలా మంది మాట్లాడారు. ఎంగెల్స్ ప్రసంగంలో భాగం: 

మార్చి 14వ తేదీ, మధ్యాహ్నం మూడు గంటల సమయంలో, జీవించి ఉన్న గొప్ప ఆలోచనాపరుడు ఆలోచించడం మానేశాడు. అతను కేవలం రెండు నిమిషాలు ఒంటరిగా మిగిలిపోయాడు, మేము తిరిగి వచ్చేసరికి అతడు కుర్చీలో శాంతియుతంగా నిద్రపోయాడు – కానీ ఎప్పటికీ.  

మార్క్స్ జీవించి ఉన్న కుమార్తెలు ఎలియనోర్, లారా అలాగే మార్క్స్ యొక్క ఇద్దరు ఫ్రెంచ్ సోషలిస్ట్ అల్లుళ్ళు చార్లెస్ లాంగ్యూట్, పాల్ లాపార్గ్ కూడా హాజరయ్యారట.    

ఆతరువాత 1954లో, మార్క్స్ మునిమనవళ్లైన ఫ్రెడరిక్, రాబర్ట్ జీన్ లాంగ్వెట్ అనుమతితో మార్క్స్ మెమోరియల్ కమిటీ, అతని మృతదేహాన్ని వెలికితీసేలైసెన్స్ కోసం హోమ్ ఆఫీస్ కు అప్లై చేసింది.అసలు సమాధుల నుండి మార్క్స్ మృతదేహాన్ని విడదీసి, 100 గజాల దూరంలో ఉన్న కొత్త స్థలంలో 26/27 నవంబర్ 1954, ఎటువంటి గొడవలు జరగకుండా రాత్రి సమయంలో కొత్త సమాధి పునరుద్దరణలు జరిపించారు.  1930 నుండి కమ్యూనిస్ట్ పార్టి మెంబర్ అయిన లారెన్స్ బ్రాడ్ షా మంచి ఆర్టిస్ట్, స్కల్పటర్. ఆయన రూపొందించిన, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ నిధులు సమకూర్చినకార్ల్ మార్క్స్ సమాధి నిర్మాణం జరిగింది 

3.7 మీటర్ల (12 ఫీట్ల) ఎత్తుగా నిర్మించిన పీఠాన్ని గ్రానైట్‌ తోనూ, పైభాగాన మార్క్స్ తల కంచుతోను చేయబడింది. తల “భారీ” గా, ‘మార్క్స్ మేధస్సు యొక్క డైనమిక్ శక్తిని తెలియజేయాలని అది ప్రజలకు కంటి స్థాయిలో కనిపించాలని  బ్రాడ్‌షా కోరుకున్నారట. దాని మీద ఆయన, అతని కుటుంభ సభ్యుల పుట్టిన, మరణించిన తేదీలతో పాటు కమ్యూనిస్ట్ మానిఫెస్టో మాటలు వర్కర్స్ ఆఫ్ ఆల్ లాండ్స్ యునైట్‘ అని లారెన్స్ బ్రాడ్ షా నే రాశారు.  ఆయన సమాధి  15 మార్చి 1956న జరిగిన ఆవిష్కరణ వేడుకకు పార్టీ ప్రధాన కార్యదర్శి హ్యారీ పొలిట్ నాయకత్వం వహించారట. దీని నిర్మాణం నుండి, ఈ సమాధి మార్క్స్ అనుచరులకు గౌరవప్రదమైన ప్రదేశంగా మారింది. ఆంటి అపార్తీడ్ ఆక్టివిస్ట్ యూసుఫ్ దాడు, నాటింగ్ హిల్ కార్నివాల్ ఫౌండర్ క్లాడియా జోన్స్ లాంటి కొంత మంది మార్క్సిస్ట్ నేతల సమాధులు మార్క్స్ సమాధి సమీపంలోనే ఉన్నాయి 

“కార్ల్ మార్క్స్ కొత్తసమాధి”

 ఈ సమాధి మార్క్స్ గ్రేవ్ ట్రస్ట్ ఆధీనంలో ఉంది. ఫ్రెండ్స్ ఆఫ్ హైగేట్ స్మశానవాటిక ట్రస్ట్, నిర్వహణ, నిర్వహణ ఖర్చులను కవర్ చేయడానికి స్మశానవాటికకు ప్రవేశ రుసుమును వసూలు చేస్తుంది. ఇది కొంత వివాదాన్ని సృష్టించిందిట. మార్క్స్ సమాధి హైగేట్ వద్ద అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి. “ప్రపంచంలోని అత్యంత గుర్తించదగిన సమాధులలో ఒకటి”గా కూడా చెప్పబడింది. అంతే కాక ఎంతో మంది ప్రముఖులు, దేశాధ్యక్షులు, ప్రధానులు కార్ల్ మార్క్స్ సమాధి సందర్శనార్థం వస్తుంటారు. అందువల్లే ఈ హైగేట్ సిమెట్రి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 

ఇలా ఆయన ప్రాముఖ్యతను గురించి ఒక వేపు ప్రచారంలో ఉంటే మరో వైపు, మార్క్సిస్ట్ వాద వ్యతిరేకులు ఆయన సమాధిమీద 1960, 1970 లలో రెండు సార్లు బాంబు దాడులకు పాల్పడ్డారు. పాత సమాధి పైన ఉన్న గ్రానైట్ ముక్కలుగా పగిలి కనబడుతుంది.  

 ఏమిటో చాలా భావావేశానికి లోనయ్యాను. అది చూసి పిల్లలు అతని గురించి అడిగారు. నాకు తెలిసింది వచ్చేముందు ఈ సిమెట్రీ గురించి చదివింది వారికి వివరించాను. అది విని అక్షర్ ప్రెండ్ అవినాశ్ “చాలా సంతోషంగా ఉంది. మీరు దా ఒక గొప్ప మనిషిని పరిచయం చేస్తిరి. నాకు మనసు నిండా సంతోషం అయ్యింది. అసలు నాకు ఇంతవరకు ఇలాంటి ఆయన ఉన్నాడని తెలియదు. వినలేదు. మీరు ఇక్కడికి రావాలని అన్నప్పుడు నేను అక్కి అన్న నెట్ లో ఎలా వెళ్లాలా అని దారి వెతికితిమి.” అంటూ పసిపిల్లాడిలా బెంగుళూరు యాసలో అంటూంటే ముచ్చటేసింది.   

 అక్కడ్నుంచి నేరుగా గ్రీన్విచ్ మెరీడియన్ కి వెళ్ళాము. దానిగురించిన వివరాలు వచ్చేవారం.  

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దసరా ఉత్సవాలు

దొరసాని