ఎవరైనా కష్టాలలో వున్నప్పుడు వారికి సహాయం అనగానే, అందరికీ ఆర్థికపరమైన అంశాలే గుర్తుకొస్తాయి. కాని సహాయమనే విషయం వచ్చేసరికి అది ఆర్థికసాయమే కానక్కరలేదు. ఒక మంచి మాట, ఓదార్పు, నీకోసం మేమున్నామనే మానసిక బలాన్ని అందజేయడం… వీటి పాత్రే యెక్కువుంటుంది.
కొన్ని విషయాలలో ఆర్థిక సహాయమనేది చాలా చిన్న పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు ప్రేమ వైఫల్యాన్నే తీసుకుంటే, ఆ సమయంలో యివ్వాల్సింది మనోధైర్యం. ప్రేమనేది, పరస్పర ఆకర్షణ మాత్రమే కాదు, ప్రేమికులు విడిపోయినంత మాత్రాన వాళ్లలోని ప్రేమను సమాధి చెయ్యనక్కరలేదు. అలాగని ఒక వ్యక్తికి సంబంధించిందే ప్రేమ కాదు. మన జీవితంలో నిత్యం మనతో కలిసి వుండే వ్యక్తులందరితో మనకున్న సంబంధం కూడా ప్రేమే. తల్లిదండ్రుల మీద ప్రేమ, ఏకోదరుల మీద ప్రేమ… ఈ రకంగా చెప్పుకుంటూ పోతే, ప్రేమనేది అనంతం. ఒక వ్యక్తితో మన ప్రేమ, ఫలించలేదని జీవితాన్నే కాదనుకోవడం మూర్ఖత్వం అనే విషయాన్ని, విఫల ప్రేమికులకు చెప్పగలిగితే, ప్రేమలో వైఫల్యం చెందామని ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.
ఇంకొక ఉదాహరణ: పరీక్ష పోవడం… ఆ సమయంలో పిల్ల/ పిల్లవాడిని తిట్టి కొట్టి లాభం లేదు. అప్పటికే విషయం జరిగిపోయింది కాబట్టి, యిప్పుడిక చెయ్యవలసిందేమిటన్న విషయానికి వాళ్లను మానసికంగా సంసిద్ధం చెయ్యాలి. జరిగిపోయినది వెనుకకు రాదు. కాబట్టి, యింకొకసారి యిటువంటి పరిస్థితి యెదురు కాకుండా చూసుకో. దీన్నొక గుణపాఠంలా తీసుకొని, భవిష్యత్తును జాగ్రత్తగా మలుచుకో, అని వాళ్లలో మనోధైర్యాన్ని నింపాలి. పెద్దవాళ్లు పిల్లల్లో ఆ భరోసా కల్పించగలిగితే, పరీక్ష పోయింది, అమ్మానాన్నకు ముఖమెలా చూపించాలనుకుని, ప్రాణాలు తీసుకునే వారి సంఖ్య తగ్గుతుంది.
ఇంకో ఉదాహరణ తీసుకుంటే: కొన్ని పరిస్థితుల ప్రభావం వలన భార్యాభర్తల మధ్య సామరస్యం లేకపోవడం… ఇటువంటి సమయాలలో చాలామంది చేసేదేమిటంటే, భార్యాభర్తల్లో యే ఒక్కరినో సమర్ధించడం. అప్పుడు సమస్య మరింత జటిలమవుతుంది. దాని నుండి వచ్చే ఫలితమేమీ వుండదు. దానికి బదులు యిద్దరినీ కూర్చోబెట్టి, జీవితంలో సమస్యలనేవి వస్తూనే వుంటాయి. అటువంటప్పుడే ఒకరికోసమొకరు నిలబడితే, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒకరినొకరు నిందించుకుంటే, ప్రయోజనమేమీ వుండదు, అని వారి దృష్టి కోణాన్ని మార్చగలిగితే, విడాకుల కోసం కోర్టు గుమ్మం తొక్కేవారి సంఖ్య తగ్గుతుంది. ఇలా యెన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు.
ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోయినప్పుడు, కావలసినది కేవలం ఓదార్పు మాత్రమే. నీకోసం మేమున్నామనే ధైర్యమివ్వగలిగితే డిప్రెషన్ నుండి ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. మనం చెయ్యాల్సిందేమిటంటే వారి కోసం కొంత సమయాన్ని వెచ్చించడం మాత్రమే. అదే వారికి జీవితంపై భరోసానిస్తుంది. వాళ్లు డిప్రెషన్ నుండి తొందరగా కోలుకోవడానికి దోహదపడుతుంది.
ఆర్థికంగా మనకన్నా తక్కువ స్థాయిలో వున్నవారికి చేతనైనంత ఆర్థిక సాయం చేయడం ఎప్పుడైనా హర్షణీయమే. అలా చెయ్యలేని పక్షంలో, ఆర్థికంగా వారికన్నా మనం స్థితిమంతులమనే విషయం వారు ఫీల్ అవ్వకుండా చూడగలిగి, మనమంతా ఒకటేనన్న భావం వాళ్ళలో కలిగించగలిగితే, అది కూడా మనం చేసిన సహాయం క్రిందకే వస్తుంది. ఎదుటి వాళ్ళని నొప్పించకుండా వుండగలగడమనేది ఒక రకంగా మనకి మనం చేసుకున్న సాయం క్రిందకి కూడా వస్తుంది.
వీటన్నిటిలో ముఖ్యమైన అంశమేమిటంటే, మీకోసం మేమున్నామనే ధైర్యాన్ని కలిగించటం. అన్నింటికన్నా అదే గొప్ప సహాయం. ఆ సహాయం కూడా చెయ్యలేని వాళ్లు, బాధపడుతున్న వారిని విమర్శించకుండా వుంటే, అది కూడా సహాయం క్రిందకే వస్తుంది. కనీసం ఆ సహాయం చేసినా చాలు. ఎంతోమందికి మనశ్శాంతి దక్కుతుంది. మనమొకరికి చేయి అందిస్తే, యింకో చేయి మనకండగా నిలుస్తుంది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకుంటే, యెంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని పరోక్షంగా మనము నివారించగలమనే విషయం మనకు అవగతవుతుంది.
మంచి ఎండలో, అడగకుండా మంచినీరు యిచ్చినా అది పెద్ద సాయమే. ఆకలితో వున్నవారికి ఒక పూట అన్నం పెట్టడం, అదే త్రోవలో వెళ్లే వాళ్లకి లిఫ్ట్ యివ్వడం, పుస్తకాలు కొనలేని వారితో మన పుస్తకాలను షేర్ చేసుకోవడం, ఒంటరిగా జీవిస్తున్న పెద్దవాళ్లను పలకరించడం, ఖాళీ సమయంలో చదువుకోలేని పిల్లలకు పాఠాలు చెప్పడం… యిలా చెప్పుకుంటూ పోతే యెన్నో, మన దైనందిన జీవితంలో చెయ్యగలం. అలాగే, అదే దారిలో మన పిల్లలు కూడా నడవగలిగేటట్లు చెయ్యగలిగితే, సమాజానికి మనమెంతో మేలు చేసిన వాళ్ళమౌతాం.. మరెందుకాలస్యం మన వంతు సాయాన్ని ఈ సమాజానికి అందిద్దాం. తద్వారా మన మనసును ప్రశాంతంగా వుంచుకొని మనమూ లాభపడదాం. సర్వేజనా సుఖినోభవంతు.