గత వారం విజయదశమి పండుగను మనందరం జరుపుకున్నాం. ఆ సందర్భంగా పండుగ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం.
ఆశ్వయుజశుద్ధ దశమిని విజయదశమి అని దసరా అని వ్యవహరిస్తాం. మన శాస్త్రాలలోనూ పురాణాలలోనూ కావ్యాలలోనూ మన దేశంలో ప్రజల పరంపరాగత జీవితంలోనూ విజయదశమి కి ఉన్న గౌరవ మర్యాదలు ప్రాముఖ్యత మరొక పండుగకు లేదంటే అతిశయోక్తి కాదు. ఆ సేతుశీతాచలం, భారతదేశమంతా, ప్రతీ ప్రాంతంలో ఈ పండుగను మహాపర్వంగా ఘనంగా జరుపుకొనే దసరా పండుగ ఇది.
ఉపనిషత్తులలో ఒక కథ ఉంది. రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు జయించారు. అప్పుడు దేవతలకు ఆ విజయం ఎక్కడ లేని అహంకారాన్నితెచ్చిపెట్టింది. ఇంద్రుడు అగ్ని,వరుణుడు, వాయువూ మొదలగు వారంతా ఆసీనులై ఎవరికి వారే తమ పరాక్రమం వల్లనే అసురులు ఓడిపోయారని చెప్పుకుంటున్నారు. ఇంతలో ఆకాశంలో ఒక మూల తటిల్లతా మెరుపు మెరిసింది. ఆశక్తి పుంజం కళ్ళకు మిరుమిట్లు కొలిపింది. సమస్త శక్తులకు, అధిష్టానమూర్తులైనదిక్పాలకులు ఆ తేజస్సుకు తమ ప్రతిభలను కోల్పోయారు. అగ్ని,వాయువు ఒకరి కొకరు ఆ దివ్య వెలుగు ఏమిటో చూడటానికి వెళ్లి చూసి నోరు పెకలక చేష్ఠలుడిగి పోయారు. అగ్నిని చూచి ఎవరు నువ్వు అని ప్రశ్నించిందా తేజో మూర్తి.,, “నన్ను ఎరుగవా. అగ్నిని. జాతవేదుడ్ని. సృష్టిలో నా ఆజ్ఞకు బద్దం గానిదేదీ లేదు. సమస్త లోకాలలో గల స్థావర జంగమ పదార్థాలను కాల్చి బూడిద చేయగల సమర్థున్ని. నా అంశలేనిదే జీవి బ్రతకదు. “అని చెప్పుకున్నాడు.
అప్పుడు ఆ తేజోమూర్తి అదంతా వద్దులే. అంటూ అగ్ని ముందు ఒక గడ్డిపరకను ఉంచింది. అగ్ని మహాగ్ని జ్వాలలను కురిపించినా గడ్డిపోచరూపం చెడలేదు. కందలేదు. వడలిపోలేదు అగ్ని తలదించుకున్నాడు. అప్పుడు
వాయుదేవుడు ప్రభంజనుడై వెళ్లాడు.”మాతరిష్రుడను. ముల్లోకాలలో సంచారం చేసేవాడిని. నేను లేనిదే చైతన్యం లేదు. M ప్రాణం లేదు సమస్త భువనాలలో గల స్థావర జంగమాలను సృశింప చేసేవాణ్ణి. నా పేరు మహాబలుడు” అని గొప్పగా చెప్తున్నప్పుడు అదంతా ఎందుకు కానీ ఈ గడ్డిపోచని ఎగర కొట్టు నాయనా అని ఆ తేజ మూర్తి అంది
వాయుదేవునికి భరింపరాని అవమానం అనిపించింది. గడ్డి పోచను ఎగరకొట్టలేనా అంటూ తన ప్రతాపం మొదలుపెట్టాడు. అది కదలలేదు. ఎగరలేదు. చెమటలు కక్కాడు. ఇదంతా చూస్తున్న
ఇంద్రునికి ఆశ్చర్యమై తానే స్వయంగా బయలుదేరి దిక్కులు వెతికాడు. ఆ దివ్య తేజం వెలువడ్డ వైపు దృష్టిని నిలిపి సమాధిలో ప్రవేశించాడు. ఆమె రూపం విద్యుల్లతలా మెరిసిపోతుంది. ఇంద్రుడు ఆమెను ఉమాదేవిగా గుర్తించాడు.
ఆమె ఇంద్రునితో అసుర విజయానికి తామే కారకులమని అగ్ని, వాయువు అహంకారంతో ఉన్న నీ సమస్త దేవతలకు గుణపాఠం నేర్పటానికి వచ్చాను. దేవాసురులు ప్రజాపతి పుత్రులే. అసురులు మీ కన్నా బలవంతులు. అయినా మీకెందుకు విజయం లభించింది. మీలో పరమేశ్వరుడు ప్రవేశించాడు మీరు అసురులవలె కేవలం శరీర జీవులు కారు. ఐహికములైన కోరికలు స్థిరమని నమ్మేవారు కారు. కాని విజయాహంకారంతో నేనూ నాది అనే రాక్షసత్వం ఇప్పుడుఎందుకు మీలో ప్రవేశించింది. దానినుండి మిమ్మల్ని తప్పించడానికి మీ శక్తిని జ్ఞప్తి కి చేయడానికి తిరిగి,ఇదం న మమ’ అనే మంత్రాన్ని ఉపదేశించడానికి పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చాడు. అహంకారం స్వార్థం అసుర భావాలు. అవి మీలో కూడా ప్రవేశిస్తే ఇక వారికీ, మీకు తేడా ఏమిటి?
అని అంతర్ధానమైంది లోక పావని.
మనకు ఇదీ ఆదర్శం. సకల చరాచరంలో ఒక మహత్తర శక్తి, పరమేశ్వరుని దివ్య సంపద నిండి ఉంది అని నమ్మే తత్వం మనది.
సర్వ సృష్టిలో సమత్వాన్ని, ఈశ్వర శక్తిని గుర్తించి దానికి అనుగుణంగా జీవించ సంకల్పించుకున్న మన స్వభావ మనుగడ అది. ఈ ధర్మాన్ని వ్యవస్థను కాదన్న వారిని, దీన్ని నిరోధించి నష్టపరచదలచుకున్న వారిని సామ దానాదులతో అవసరమైతే దండంతో నిగ్రహించడానికి చేసిన చరిత్ర విజయదశమి చరిత్ర. దీనికై శక్తిని ఉపాసించడానికి హైందవ జాతి చేసిన తపస్సే విజయ దశమీ వ్రతం.
ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత నిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.
ఆశ్వయుజ శుద్ధ విదియనాడు దేవిని నిలిపి తొమ్మిది రాత్రులు పూజింతురు. శరన్నవరాత్రులు గడచిన మరుసటి రోజు విజయదశమి.
దశమికి ముందు నవరాత్రులు జరుగుతాయి. అంటే పాడ్యమినుండి నవమి వరకు సకల లోక జనని అయిన అవతారాలను రోజుకొక్కొక్కటి చొప్పున పూజిస్తారు. పదవనాడు విజయదశమి. ఈ ఆదిశక్తి అపరాజితా దేవి. అంటే పరాజయం తెలియనిది. అప్రతిహత. అనగా ఎదురులేనిది. జయంతి అనగా విజయశీలమైనది. వైజయంతి. విజయములనిచ్చునది. ఈ విధంగా ఆ పరాశక్తిని రకరకాలుగా కొలుస్తాము.
కొందరీ పండుగకు మొదటి మూడు రోజుల పార్వతి దేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతిదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండవ రోజు గాయత్రీ దేవి అలంకారంగా, మూడవరోజు అన్నపూర్ణాదేవి అలంకారం, నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరీ అలంకారము, ఐదవ రోజు మహా చండీ అలంకారము, ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి రూపం ఏడవ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకారం, ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారము, 9వ రోజు శ్రీ మహిషాసురమర్దిని అలంకారములో అమ్మ వారు దర్శనమిస్తారు.
పదవరోజు అనగా దశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా దర్శనం ఇస్తారు.
నవరాత్రులలో మొదటి మూడు రాత్రులు తామసికమైనవి వాటికి ప్రతీకలు దుర్గా కాళీ మాత లు. తర్వాత మూడు రోజులు లక్ష్మి కి సంబంధించినవి. ధన కనకనక వస్తు వాహనాలకు ఆధారమైనది. ఆఖరి మూడు రోజులు సరస్వతి కోసం ఉద్దేశింపబడినది అదే సత్వగుణం. అదే జ్ఞానం జ్ఞానోదయానికి సంబంధించినది. తర్వాత రోజు విజయదశమి. అనగా మనం ఈ మూడు గుణాలను జయించామని అర్థం.
పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు అమరత్వం పొందటానికి తపస్సు చేసి బ్రహ్మ దేవుని ప్రసన్నం చేసుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు నిరాకరించగా మహిషాసురుడు స్త్రీ అబల తనని ఏమీ చేయలేదనే భావంతో పురుషుని వలన తనకు మరణం సంభవించకుండా వరం పొందుతాడు. ఆ తర్వాత వర గర్వంతో, అహంకారంతో ప్రజలందరినీ హింసిస్తూ చివరకు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. అతని ఆగడాలను తట్టుకోలేక ముక్కోటి దేవతలు త్రిమూర్తుల వద్దకు వచ్చి విన్నవించుకున్నారు. అప్పుడు త్రిమూర్తుల తేజము ఒకచోట కూడి ఒక స్త్రీ మూర్తిగా జన్మించింది. శివుని తేజం ముఖంగా, విష్ణువు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదాలుగా కలిగిన మంగళ మూర్తిగా 18 బాహువులను కలిగివుంది. ఆమెకు శివుడు త్రిశూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షరమాలను హిమవంతుడు వాహనముగా సింహమును ఇచ్చెను. సర్వ దేవతల ఆయుధములను సమకూర్చుకొని సకల సైన్యాన్ని సమకూర్చుకొని మహిషాసురుని పక్షమున యుద్ధంలో పాల్గొన్న అనేకమంది రాక్షసులను భీకరముగా పోరాడి సంహరించి తుదకు మహిషాసురునితో యుద్ధానికి సిద్ధపడింది. ఆశక్తి. ఈ యుద్ధంలో దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపం, సింహరూపం, మానవరూపంతో భీకరంగా పోరాడి చివరికి తిరిగి మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు. అప్పటినుండి మహిషాసురుని సంహరించిన రోజు దసరా. జగన్మాత అయిన దుర్గా దేవి మహిషాసురుడు అనే రాక్షసుని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంగా జరుపుకునే పండగ విజయదశమి.
నవరాత్రి చెడును, విశృంఖలత్వాన్ని నిర్మూలించడానికి అదేవిధంగా జీవితంలో అన్ని అంశాల పట్ల మన శ్రేయస్సుకు దోహదపడే వస్తువుల విషయాల పట్ల కూడా కృతజ్ఞతా భావంతో ఉండటానికి సంబంధించినది.
ఈ పండగను పది రోజులు ఎందుకు జరుపుకుంటారంటే శరదృతువు, వసంత రుతువు ప్రకృతిలో అత్యంత మార్పులను తెచ్చే సమయం. వాతావరణంలో మార్పుల వల్ల మానవుల్ని అనేక రోగాలు పీడిస్తాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి. మానసికంగా కూడా మనిషి శక్తి క్షీణించే సమయం గనుక మనలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ చేసుకోవాలి. అందుకే ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులు శరన్నవరాత్రుల పేరుతో అమ్మవారిని రోజుకొక రూపంలో కొలుస్తాం. అంతరిక్షంలో గ్రహాలు, నక్షత్రాల కదలికలతో అనుసంధానమై ప్రకృతిలో జరిగే మార్పులకు ప్రతిగా మనలో మనం చేసుకునే సాధన ఈ పండుగ.
దుర్గాదేవి, రక్తబీజ,శుంభనిశుంభ, మధుకైటబ, చండ ముండాసర ఇలా తొమ్మిది రోజులు 9 మంది రాక్షసులను సంహరించి దశమి రోజు మహిషాసురుని సంహరించి రాక్షసులపై విజయం సాధించింది. మనలో ఉన్న అవలక్షణాలను నిర్మూలించి వీటిపై మనం సాధించే పట్టు అమ్మవారి నవరాత్రి దీక్షా వ్రతం.
తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మను ఆడతారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. ఈరోజు బొమ్మల కొలువులు కూడా పెట్టుకుంటారు.
విజయదశమిలో దేవి పూజ ఆయుధ పూజ,
పొలమేర దాటుట, పారువేట, జమ్మి( బేతాళ) పూజ. మొదలగునవి ఆచారంగా పాటిస్తాము.
ఈరోజు గృహములను పచ్చటి తోరణాలతో కడప లకు పసుపు కుంకుమలతో వాకిళ్ల యందు చిత్రవిచిత్రములైన ముగ్గులతో చక్కగా అలంకరించెదరు. మేళతాళ నృత్య గీతాదులతో బంధుమిత్రులతో దేవి పూజ చేయుదురు. రకరకాల పిండి వంటలతో అనేక పక్వాన్న విశేషములతో నైవైద్యములు అర్పించెదరు.
దశమినాడు ఉదయము వారి వారి వృత్తి పనిముట్లను శుభ్రపరచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మంచి గంధం రాసి ధూప దీప నైవేద్యములతో పూజించెదరు.
ఈనాటి సాయంకాలము మేళ తాళములతో దేవి నూరేగిస్తూ మల్ల యుద్ధములు, సాము గరిడీలు, మొదలగు వీర ప్రదర్శనలతో పొలిమేరకు వెళ్తారు.
జమ్మి చెట్టు మీద బేతాళుడుండునని కొన్ని ప్రాంతాల వాళ్ళు నమ్మదురు.
అర్జునుడు ఉత్తర గోగ్రహణ సందర్భంలో ‘శమీ పూజ’ ‘ఆయుధపూజ’ చేసి విజయము పొందెను. కాబట్టి దీనికా పేరు వచ్చెనని కొందరు అందరు. శ్రీరామచంద్రుడు సీతను వెదకుచు ఋష్యమూక పర్వతము నందు నారద మహర్షి చేత బోధితుడై అచట శరన్నవరాత్ర దేవీ పూజలు గావించి దశమి దినమున ముగించుకొని లంకపై దాడి వెడలి విజయము పొందెను. అందుచేత ఇది విజయదశమి అని కొందరి అభిప్రాయం.
వర్షాకాలం పోయి శీతాకాలం ప్రారంభం ఈ ఆశ్వయుజ మాసము. శరదృతువు అగుటయును శీతాకాలంమగుటచేత జలాశయం నందలి నీరు బురద విరిగి నిర్మలోదకములుగా మారును. జల ప్రవాహములు తగ్గును. రాకపోకల సౌకర్యము కలుగును. భూమి సస్యశ్యామలమై కన్నుల పండువగా వుండును. ప్రకృతి ఆనందదాయకమై విరాజిల్లుచూ సమస్త ప్రాణికోటులను సంతోష సంభ్ర మాలతో ఓలలాడించును.
మన పూర్వపు రాజులు దండయాత్రలు చేయుటకు ఉపయుక్త కాలముగా ఊహించి ఆయుధ పూజ చేయుచుండిరి. ఈ పర్వదినమునకు ముందు ఆశ్వయుజశుద్ధ విదియ మొదలు దశమి లోపున బాల బాలికలు తమ గురువులతో జయీభవ, విజయీభవ అని నినాదములు చేయుచు మహోత్సవముతో కొన్ని పద్యములను ముందు కొందరు చెప్పుచుండగా వెనుకనున్నవారు జయ జయ అను నినాదములతో వెంబడించుచుందురు. విజయదశమి రోజు సంధ్యాకాలం దాటిన తర్వాత సమయమే విజయకాలం. సంధ్యాకాలం దాటిన తర్వాత 48 నిమిషాల వరకు పరాశక్తి అనన్య శక్తి మంతురాలవుతుంది. కాబట్టి ఆ సమయమన ఏ పని ప్రారంభించినా విజయపథంలో దూసుకుపోతుంది అని మన విశ్వాసం.
ఈ పండుగ సందర్భంగా శస్త్రాస్త్ర పూజలు జరుగుతాయి.. సాయంత్రం కాగానే సీమోల్లంఘనం చేస్తారు. అంటే పొలిమేరలు దాటడం. ఈనాడే శమీ వృక్షాన్ని(జమ్మి) పూజిస్తారు. జమ్మిని అగ్నిగర్బ అని కూడా పిలుస్తారు ‘ఆనాడు శమీశమీయతే పాపం’ ‘శమీ శత్రువినాశినీ’ అని స్మరిస్తారు. ఈరోజు జమ్మి చెట్టును పూజిస్తే లక్ష్మీ ప్రదమని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. అలాగే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో నగదు పెట్టెలో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుందని నమ్మకం. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి జమ్మి ఆకులను ఒకరికొక నేర్చుకుంటారు.
ఈ పండుగలో శమీ చెట్టు తో పాటు పాలపిట్ట కి ప్రాధాన్యత ఉంటుంది. ఆరోజు పాలపిట్టని చూస్తే చాలా మంచి శఖునంగా భావిస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించుకొని తిరిగి వెళుతుంటే పాలపిట్ట కనిపించింది. అది చూసినప్పటి నుంచి వారికి అన్ని శుభాలే కలిగాయట. శ్రీరాముడు కూడా రావణాసురునితో యుద్ధానికి బయలుదేరిన సమయంలో పాలపిట్ట కనిపించింది తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించాడు.
దసరా పండగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం చెడుపై మంచి విజయం.
పొలిమేరలు దాటి గరుడ దర్శనం చేసుకొని తిరిగి వస్తారు. గరుడుడు మహా స్వత్వశాలి. అయినా తన తల్లిని దాస్య బంధనాల విముక్తురాలిగా చేయడానికి మహా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. సీమోల్లఘనం చేసి అమృతాన్ని సాధించాల్సి వచ్చింది అందుకే గరుడ దర్శనం జయిష్ణువైన మహావీరుని దర్శనంగా, విజయ స్ఫూర్తి కరంగా భావిస్తాం.
విజయదశమి సందర్భంగా రామ లీలలు ప్రదర్శించటం కూడా ఆనవాయితీ. రావణాసురుని బొమ్మను ఆరోజు తగలబెడతారు. రాజపుత్ర స్థానంలో విజయదశమి ఉత్సవాన్ని మహోత్సవంగా జరుపుకుంటారు. ఆయుధ క్రీడలు వగైరాలు జరుగుతాయి. పూర్వం నుండి కూడా ఈ విజయదశమి నాడు శస్త్ర కౌశలాల పరీక్ష, ఆరితేరిన జ్యోదులను గౌరవించడం పరిపాటిగా ఉంది.
పరంపరాగతమైన మానవ మర్యాదను ఉల్లంఘించి ఏ బలము తన నిర్ణయాన్ని ప్రపంచం మీద రుద్ధ లేదు.
అతి ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఏటా శరత్కాలం తెచ్చే చాంద్రీమయ మాధుర్యామృతంతో పాటు విజయదశమి కూడా ఒక దివ్య సందేశాన్ని అందుకొమ్మని మనలను ఆహ్వానిస్తుంది. మనలో ఉత్సాహాన్ని నింపి ముందుకు నడిపిస్తుంది. మన సంస్కృతీ చరిత్రకు విజయదశమి సజీవ సాక్షి. మన జాతీయ వికాసాన్ని అచ్చంగా చూపే దర్పణం. మనలోని స్వార్థాన్ని, దుర్భలత్వాన్ని, తామసాన్ని తొలగించి నడిపించే శక్తి. విజయదశమి చరిత్ర హిందూ జాతి చరిత్ర. ఈ పండుగ ఇచ్చే సందేశం మన జాతిని సనాతనంగా చిరంజీవి గా నిలిపే అమృత సందేశం.
ఏదైనా శుభకార్యాన్ని తలపెట్టినప్పుడు తిధి వార యోగకరణాలు, రాహుకాలం, దుర్ముహూర్త యమగండాలు లేకుండా మొదలుపెడ్తాం. కానీ విజయదశమి రోజు ఇవేవీ చూడకుండా ఏ పనైనా విజయవంతం అవుతుందని మనం విశ్వసిస్తాం. దానికి కారణం విజయదశమి రోజు ఏ కార్యమైనా సిద్ధించడానికి ఒక బలమైన, శక్తివంతమైన ముహూర్తం ఉందని మన నమ్మకం. ముఖ్యంగా దసరాను విజయదశమిగా ఎందుకు జరుపుకుంటామంటే దైవం దుష్టశక్తులపై సాధించిన విజయానికి సంకేతంగా మనం దసరా జరుపుకుంటాం. జగజ్జనని దుర్గామాత మహిషాసురున్ని అంతమందించిన రోజు,శ్రీరాముడు రావణాసురుడు సంహరించింది కూడా ఇదే రోజు. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీ వృక్షంపై దాచి సంవత్సరం పాటు విరాటు ని కొలువులో అజ్ఞాతవాసం చేసి ఆ తర్వాత ఈ శమీ వృక్షాన్ని పూజించి తిరిగి తమ ఆయుధాలను పొందుతారు. ఈ ఆయుధాలతోనే కురుక్షేత్రంలో కౌరవులపై విజయం సాధించారు.
అలాగే పది తలల రావణదహనం కూడా మనదశ దుర్ఘుణాలను దగ్ధం చేసే ప్రతీక. అందుకే ఈ పది రోజులను దశ హర లేదా దసరా అంటాం. పూజలో భాగంగా భక్తులు తమ ఆయుధాలు, యంత్రాలు, వాహనాలు పని సాధనాలను పూజ చేస్తారు. అంటే మనలోని రాజసిక తామసిక గుణాలను సత్వ గుణం ఆయుధంగా జయించామని అర్థం.
దశమి విజయానికి సంకేతం. జ్యోతిశ్శాస్త్ర ప్రకారం దశమితో శ్రవణానక్షత్రయోగాన్ని విజయ అని వ్యవహరిస్తారు.
ఈరోజు అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది కాబట్టి పురాణ విజయాన్ని గౌరవించడమే కాకుండా ఎంత శక్తివంతమైన చెడు అనిపించినా చివరికి ధర్మమేగెలుస్తుందనే విశ్వవ్యాప్తి సందేశాన్ని కూడా బలపరుస్తుంది.
ఈ విజయదశమి నాడే సంఘ స్వరూపం ఆవిష్కరించడం హేతుబద్ధమే కాక చరిత్ర తపించిన ఒక అవసరం. సంఘటన శక్తిని తిరిగి ఉద్గమింప చేయగల ఈ మహత్కార్యానికి కల్పాంతం నుండీ భారత వర్షం రాక్షసులతో జరుపుతున్న సంఘర్షణ చరిత్రలో తుది ఘట్టాన్ని సాక్షాత్కరింపచేసుకోగల శక్తిని ప్రసాదించమని సీమోల్లంఘన వ్రతంతో సమిష్టిరూపుడైన సమాజ పరమేశ్వరున్ని మనస్ఫూర్తిగా పూజిద్దాం.