” ముఫ్ఫై సంవత్సరాల క్రితం కాశీకి , ఇప్పటి కాశీకీ ఎంతో వ్యత్యాసం కనపడుతున్నది” అన్నాడు ఫణిచంద్ర, తన స్నేహితుడు రాఘవతో.
” అభివృద్ధి క్రమంలో మార్పు సహజం” అన్నాడు రాఘవ.
” నేను అంటున్నది డెవలప్ మెంట్ గురించి కాదు. అప్పట్లో ఇంతమంది యాత్రికులు ఉండేవారు కాదు. ఇప్పుడు పుట్టలు పుట్టలుగా ఉన్నారు జనాలు. కాశీ అంటే కేవలం పెద్ధ వాళ్ళే వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ అన్ని వయసుల వాళ్లూ, చిన్న పిల్లలతో సహా కనపడుతున్నారు. భక్తి ఇంత పెరిగిపోయిందా?” అడిగాడు ఫణిచంద్ర.
” వసతులతో పాటు టూరిజం పెరుగుతన్నది” అన్నాడు రాఘవ.
వ్యక్తిగత పనులపై అమెరికా నుంచి మూడు వారాల సెలవుపై ఇండియా వచ్చాడు ఫణిచంద్ర . అక్కడ ఒక పేరొందిన యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అతనికి , అనుకోకుండా బెనారస్ యూనివర్సిటీలో జరుగుతున్న ఒక సెమినార్ కి విశిష్ట అతిథిగా ఆహ్వానం అందింది. అతనితోపాటు అతని మిత్రుడు రాఘవ కూడా వచ్చాడు.
ఒకరోజు ముందే వారణాసి వచ్చి, విశ్వేశ్వరుని దర్శనానంతరం, గంగాహారతి కోసం బోటులో బయలు దేరారు.
మాట్లాడుతూ ఉన్నాడే కానీ ఫణిచంద్ర మనసులో మరో వ్యక్తి రూపం, జ్ఞాపకాలు కదలాడుతున్నాయి. ఎక్కడ ఉందో ఆమె?
పడవ వాడు మణికర్ణికాఘాట్ దగ్గర ఆపి,
” సార్, ఇది మణికర్ణికాఘాట్. ఇందులో స్నానం చేస్తే మంచిది, ఇది స్నానం చేసే సమయం కాదు కాబట్టి ఆ చితి మంటలకు నమస్కారం చేసి కాళ్ళు కడుక్కురండి, తర్వాత గంగాహారతికి వెళ్దాం” అన్నాడు.
” మన హిందువులందరికీ సాంప్రదాయాల మీద బాగానే అవగాహన పెరిగింది” వ్యంగ్యమో మరేదో తెలియకుండా నవ్వుతూ అన్నాడు ఫణి చంద్ర.
” సార్, నమ్మకాలు ఒక మతంలోనే ఉంటాయి అనుకోవద్దు. నేను మహమ్మదీయుడిని” అన్న పడవ వాడి మాటలకి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
పడవ దిగి, నాలుగు మెట్లు పైకి ఎక్కారు. చుట్టూ పదిహేను దాకా చితి మంటలు వెలుగుతున్నాయి. వాటికి నమస్కారం చేసుకుని, తిరిగి గంగానదిలో దిగి కాళ్ళుచేతులు కడుక్కుందాం అనుకుని వెనుతిరుగుతుండగా, ఒక చల్లని వీచిక తనకి తగిలినట్లు అయి ఉలికిపాటుతో పక్కకి తిరిగాడు ఫణి.
తెల్లని చీరెలో ఒకామె తనని ఇంచుమించుగా ఆనుకుని నిలబడి, అటువైపు తిరిగి, పురోహితుడితో ఏదో మాట్లాడుతున్నది. ఆమె వైపు చూస్తూ క్షణం సేపు అలాగే నిలబడ్డాడు ఫణిచంద్ర. మాట్లాడటం అయిపోయి వెనుతిరిగిన ఆమెను పరీక్షగా చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు ఫణిచంద్ర.
” ఫాతిమా!” అప్రయత్నంగా అతని నోటినుంచి వెలువడింది మాట.
” ఫణీ!’ కాసేపు తదేకంగా చూసి,అంతే ఆశ్చర్యంగా అంది ఆమె కూడా.
” నీవు వారణాసి సెమినార్ కి వస్తున్నావని తెలుసుకానీ ఇలా , ఇక్కడ కలుసుకోవటం చిత్రంగా ఉంది” అంది.
“నీకు ఎలా తెలుసు నేను వస్తున్నట్లు?” ఆశ్చర్యంగా అడిగాడు ఫణి.
” నేను ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తున్నాను. ఈ సెమినార్ ఆర్గనైజర్స్ లో నేను కూడా ఒకదానిని” అంటూ “సారీ ఫణీ, నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. స్థిమితంగా మాట్లాడే సమయం కాదు. రేపు ఉదయం మా ఇంటికి రావాలి. అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేసి సెమినార్ కి అటెండ్ అవుదువు . మిస్ చేయవు కదా! ” అన్నది ఫాతిమా.
ఇద్దరూ ఒకరి నెంబర్ మరొకరు తీసుకున్నారు. ఫణిచంద్ర, రాఘవ తిరిగి పడవ ఎక్కారు.
అప్పటిదాకా ఇదంతా చూస్తున్న రాఘవ అడిగాడు “ఎవరు ఆమె, నీకు తెలుసా? ” అని అడిగాడు.
ఏం చెప్పాలి ఆమె గురించి? ఎవరిని చెప్పాలి? మనసులో అనుకుంటూ , మెల్లగా చెప్పటం మొదలు పెట్టాడు ఫణిచంద్ర.
*. *. *
” ఫణీ, మెడికల్ షాపు నుంచి అటూ ఇటూ వెళ్ళకుండా ఇంటికి వచ్చేయి. ఊర్లో పరిస్థితులు బాగా లేవు”
తండ్రికి జ్వరంగా ఉండటంతో మందుల కోసం బయటికి వెళుతున్న కొడుకు ఫణిచంద్రతో అన్నది అనసూయ.
ఆంధ్రా బ్యాంక్ లో చేసే శేఖర్ కి రెండు సంవత్సరాల క్రితం అయోధ్యకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడే డిగ్రీ పూర్తిచేసిన ఫణిచంద్రని బెనారస్ యూనివర్సిటీలో పిజీలో జాయిన్ చేసాడు. ఫణిచంద్ర అక్కడ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. సెలవులు రావటంతో అయోధ్య వచ్చాడు.
ఆరోజు డిసెంబర్ ఆరవతేదీ. రామజన్మ భూమి కోసం చేపట్టిన ర్యాలీ ముందు ప్రశాంతంగానే సాగి ఊహించని విధంగా హింసాత్మకంగా మారి బాబ్రీమసీదు కూల్చివేతకు దారితీసింది.
ఈవార్త తెలిసిన మరుక్షణమే ముస్లింలు రంగంలోకి దిగారు. ఇరువర్గాల మధ్య హింస మొదలైంది. ఒకరినోకరు ఊచకోతకు గురిచేస్తున్నారు.
హఠాత్తుగా మొదలైన ఈపరిణామానికి బిక్కచచ్చిపోయాడు మందుల షాపులో ఉన్న ఫణిచంద్ర. ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తసాగాడు. అయోధ్య కొత్త . అల్లరిమూకలు తరుముతుంటే ఎటు పోతున్నాడో కూడా తెలియక సందులు గొందుల కుండా పరుగెడుతున్న అతనిని హఠాత్తుగా ,బురఖా వేసుకున్న ఒక చేయి ఇంట్లోకి లాగి తలుపేసింది.
ఆయాసంతో రొప్పుతున్న అతనికి “ఫికర్ మత్ కరో బేటా, పహలే పానీ లేలో” అంటూ ఒక గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చింది ఒక పెద్దావిడ. నీళ్ళు తాగిన తర్వాత రెండు నిమిషాలకి కాస్త సర్దుకున్నాడు. అప్పుడు చూసాడు తనని లోపలికి లాగిన అమ్మాయిని. అప్పటికి బురఖా తీసివేసింది.
ఎక్కడో చూసినట్లు ఉంది అనుకుంటుండగా ఆ అమ్మాయే అంది
“మనం యూనివర్సిటీలో కలుసుకున్నాం.నా పేరు ఫాతిమా” అంది ఆ అమ్మాయి. అప్పుడు గుర్తుకొచ్చింది, ఆ అమ్మాయి. పీజీ ఫిలాసఫీ చేస్తున్నది. రెండు సార్లు లైబ్రరీలో కలుసుకున్నారు.
ఎవరూ బయటికి రాలేని ఆపరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుని, పరిస్థితులు సర్దుబడ్డాక, ఆమె తండ్రి జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగి బెట్టాడు. కులమతాలకు అతీతంగా నిష్కల్మషమైన మనసుతో , మానవత్వంతో ఆ రోజు వాళ్ళు తనని చూసుకున్న విధానం ఇప్పటికీ మరువలేడు.
అప్పటినుండి యూనివర్సిటీలో తరచూ కలుసుకునే వారు. ఆమె సాన్నిధ్యం అతనికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఫణిచంద్రకి క్రమంగా ఆమెపట్ల ప్రేమో,ఆకర్షణో తెలియని ఒక భావం చిగురించసాగింది. అయితే అది బహిర్గతం చేయాలంటే ఏదో జంకు. అసలు ఆమె ఉద్దేశ్యం ఏమిటో తెలియదు. ఆ అంతర్మధనంలో ఉండగానే తమ చదువులు పూర్తి అయ్యాయి. చివరి రోజు ఫాతిమాకి తన మనసులో మాట చెప్పాలి అనుకున్నాడు.
అయితే ఆ రోజు ఫాతిమా కోరిక మేరకు ఇద్దరూ పడవలో గంగానదిలోకి వెళ్ళారు. అన్ని ఘాట్లు తిరిగారు. ఫణిచంద్రకి విసుగ్గా ఉంది. “ఘాట్లలో కాలుతున్న శవాలు,పడవని రాసుకుంటూ పోతున్న శవాల మధ్య ఈ విహారం ఏమిటీ ?” కోపంతో అడిగాడు.
” మనం ఏమిటి అనేది ఇక్కడే తెలుస్తుంది ఫణీ. మనలోని కామ,క్రోధ లోభ మోహాలు పోవాలంటే ఈ దృశ్యాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి” అంది వేదాంతంగా.
“నీవు పక్కా ముస్లిం అయి ఉండీ ఈ వేదాంతం ఏమిటీ? అందునా ఇంత చిన్న వయసులో? ” అడిగాడు ఆశ్చర్యంగా.
” వేదాంతానికి కులమతాలతో,వయసుతో పనేంటీ? ఫణీ, నాకు పీ.హెచ్.డీ చేసి ప్రొఫెసర్ గా చేయాలని కోరిక. ఎందుకో నాకు ఈ వారణాసి వదిలి మరెక్కడికీ వెళ్ళాలని లేదు. కులమతాలకు అతీతంగా నిరంతరం అందరికీ నీటిని అందిస్తూ, వారి పాపాలను ప్రక్షాళన చేసే ఈ గంగా తీరం నాకు ఎంతో ఇష్టం. ఇది నీకు పిచ్చిగా ఉండవచ్చు. కానీ ఈ పిచ్చే నాకు ఇష్టం. అన్నట్లు నీవు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నావు కదా! ఎంత వరకు వచ్చాయి ప్రయత్నాలు?” అడిగింది.
ఫణిచంద్రకి స్పష్టంగా అర్ధం అయింది ఆమెకి ప్రేమ వికారాలు లేవని. తామిద్దరికీ సరిపడదు అని పరోక్షంగా చెప్పటానికే ఇక్కడికి తీసుకువచ్చింది అని. ఇప్పుడు ఫణిచంద్రలో కూడా ఒక స్పష్టత వచ్చేసింది. సాంప్రదాయానికి పెద్ద పీట వేసే తమ కుటుంబంలోకి ఫాతిమాని ఆహ్వానించటం ఇద్దరికీ ఆరోగ్యకరం కాదు. ఒకవేళ ఫాతిమా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉంటే అటూ ఇటూ చెప్పలేక నలిగిపోవాల్సి వచ్చేది.
ఆ తర్వాత ఫణిచంద్ర అమెరికా వెళ్ళాడు. చాలా రోజులు ఫాతిమా జ్ఞాపకానికి వస్తూనే ఉండేది. ఆమె గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏదో అలజడిగా ఉండేది. అయితే కాలంతో పాటు ఆమె జ్ఞాపకాలు మరుగున పడిపోయాయి .
ఇన్నేళ్ల తర్వాత సెమినార్ కోసం వారణాసి అనుకోగానే, ఫాతిమాని చూడాలని మనసు ఆరాటపడసాగింది.
ఏ ఘాట్ దగ్గర చివరిసారిగా కలుసుకున్నారో అదే ఘాట్ దగ్గర మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత కలవటం చాలా యాదృచ్ఛికం.
*. *. *
” ప్రాక్టికల్ థింకింగ్ ప్రేమని పక్కకి నెట్టేసింది, అంతేగా?” ఆమె గురించి అంతా విన్న రాఘవ అన్నాడు.
సమాధానం చెప్పలేదు ఫణి. అతని ఆలోచనల నిండా ఫాతిమానే ఉంది. ఆమె పెళ్లి చేసుకుందా? చేసుకుంటే ఎవరు? ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు.
ఆ మర్నాడు ఫాతిమా చెప్పిన అడ్రసు వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఫణి.
అతని కోసమే ఎదురు చూస్తున్నట్టు, గేటు చప్పుడు కాగానే తలుపుతీసి లోపలికి ఆహ్వానించింది. చాలా అందంగా, నీట్ గా, నిశ్శబ్దంగా ఉంది ఇల్లు.
ఫణిని సోఫాలో కూర్చోబెట్టి ఒక ప్లేట్ లో బిస్కెట్లు, రెండు కప్పులు టీ పట్టుకుని వచ్చింది.
” చెప్పు ఫణీ, ఏమిటి విశేషాలు? ఎలా ఉన్నావు? వాట్ ఎబౌట్ యువర్ ఫ్యామిలీ?” అడిగింది టీ ఇస్తూ.
” ఇద్దరు పిల్లలు. పెళ్ళిళ్ళ కూడా అయ్యాయి, బాగానే సెటిల్ అయ్యారు. మా మిసెస్ కూడా వర్కింగ్. ప్రత్యేకంగా ఏమీ లేవు. నీ కబుర్లు ఏమిటీ? మీవారు ఎక్కడా?” అడిగాడు ఫణిచంద్ర.
“నిన్ననే మావారు, పనిమీద ఢిల్లీ వెళ్ళారు. ఇక నా సంగతంటావా, అందరిలాగే నాకు కూడా పీజీ కాగానే పెళ్ళి చేసారు. అసలు అక్కడిదాకా చదివించటమే మాలో ఒక రెవల్యూషన్. నా అదృష్టం కొద్దీ, అతనిది వారణాసే. నేను ఉద్యోగం చేయటంకూడా సమ్మతమైంది. నా కోరిక ప్రకారం ,ముందు పీ.హెచ్ .డీ . పూర్తి చేసి తర్వాత యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరాను.
లైఫ్ ఈజ్ సో హ్యాపీ. ముగ్గురు పిల్లలు వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు.
నాకు, నా భర్తకి చాలా వరకు ఆలోచనలు, అభిప్రాయాలు కలుస్తాయి . ఇద్దరం మతాలకతీతంగా అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. నీకు తెలుసు, మొదటినుండి నా మనస్తత్వం అందరికంటే భిన్నంగా ఉండటం. అది నాకు ఎలా అలవడిందో నాకే తెలియదు.
ఒకరోజు ఇద్దరం గంగా తీరం వెంట నడుచుకుంటూ వస్తుంటే, ఒక శవాన్ని నిర్దాక్షంగా గంగా నదిలో వదిలేస్తున్నారు. అది చూసి మాకు చాలా బాధేసింది. కాశీలో మరణం గురించి హిందువుల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం మాకు తెలసు. చివరి రోజులు ఇక్కడ గడపాలని,చివరి శ్వాస విడవాలని ఎంతోమంది వస్తుంటారు.
అయితే ఏ కారణములనైతే నేమి అనాధల్లా చనిపోయిన వారిని, ఈ విధంగా గంగా నదిలో తోసేయటం అనేది అమానుషం అనిపించింది. దానివల్ల గంగా నది కలుషితం కావటమే కాకుండా చనిపోయిన ఆత్మకు ముక్తి కలగదు కదా! అనిపించింది.
ఇక అప్పటినుంచి ఇదిగో, ఈ అనాధప్రేత సంస్కారం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము” ఫాతిమా చెప్పింది చాలా ఆసక్తికరంగా విన్నాడు ఫణిచంద్ర.
” నీవు ముస్లింవి .మరి ఇటువంటి హిందూ కార్యక్రమాలు చేస్తుంటే మీ కమ్యూనిటీ నుంచి ఎటువంటి ఇబ్బంది నీకు ఎదురు కాలేదా?” అడిగాడు.
“బంధు వర్గంలోనే కాదు ఇక్కడ హిందువుల నుంచి కూడా అవాంతరాలు అడ్డంకులు, విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది .వాటిని మేము లెక్క చేయలేదు. కానీ నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఒక మంచి పని చేయటానికి ఈ కులమతాలు ఎందుకు అడ్డంకి అవుతాయో నాకు అర్థం కాదు. మానవత్వానికి మతం ఉంటుందా? ” అంది ఫాతిమా.
ఫణిచంద్రకి ఫాతిమాని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. చిన్న వయస్సులోనే ఆమె మాట్లాడిన వేదాంతం మాటలు ఇప్పటికీ అతనికి గుర్తే . ఇప్పుడు మళ్లీ జాతీయ సమైక్యతకి ప్రతిరూపంగా నిలబడ్డ ఫాతిమా మీద అతనికి ఎంతో గౌరవం కలిగింది అదే మాట అన్నాడు ఫాతిమాతో.
” జాతీయ సమైక్యతకు మనదేశం ఉదాహరణ ఫణీ. నిజానికి ఈరోజు నువ్వు ప్రత్యేకంగా జాతీయత గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. కాశీ విశ్వనాథుడు మేల్కొనేది బిస్మిల్లా ఖాన్ షెహనాయి తోనే, అయ్యప్ప నిదురించేది జేసుదాస్ పవళింపు పాట తోనే కదా!” అంది మళ్ళీ ఫాతిమా.
ఆమె విశ్లేషణకి అబ్బురపడుతూ, ఆమె వ్యక్తిత్వం మీద గౌరవం ఇనుమడించగా అప్రయత్నంగా చేతులు జోడించాడు ఫణి చంద్ర.
చేతల్లో చూపించలేని తాను, జాతీయ సమైక్యత మీద ఏకంగా సెమినార్ లోనే మాట్లాడబోతున్నాడు. కానీ ఆమె చేతల్లో చూపిస్తున్నది దీనినే అంటారు ‘ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్’ అని” మనసులో అనుకున్నాడు ఫణి చంద్ర.
కథ హిందూ, ముస్లిం సమైక్యతతో డిఫరెంట్గా చాలా బాగుందండి.