యూరోప్ ట్రిప్-2

క్రిందటి వారం తరువాత…
ప్రయాణ ప్రహసనం ప్రారంభం

ఎయిర్ ఇండియా నుంచి మెసేజ్ రాగానే, త్వరగా వెళ్ళ గలమా అని మరింత కంగారు పడ్డాను. తెల్లవారుఝాము 4.20 కల్లా ఏర్పోర్ట్ లో ఉండాలి. ప్రణయ్, నేను తయారయి, కాబ్ బుక్ చేసుకొని గంటలో బయలు దేరగలనా? ఫ్లైట్ మిస్ అవుతుందా? హమ్మో…ఒక్కసారిగా భయపడి పోయాను.

నేను వెంటనే స్నానంచేసి ప్రణయ్ ని లేపాను. టైమ్కి చేరుకోగలమా. మొత్తం మీద కాబ్ లో 4.20కి బయలు దేరాము. అసలైతే 4 గంటలకల్లా చెకిన్ అవ్వాలి. నా కంగారుకు తోడు డ్రైవరు, కారులో డీజిల్ లేదని దానికోసం దారిలో చాలా చోట్ల ట్రై చేసాడు కాని ఎక్కడా డీజిల్ దొరక లేదు. ‘ముందు రోజే ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి కదా‘ అని డ్రైవర్ ని నిసుక్కున్నాను. ‘మేము టైముకి వెళ్ళగలమా? అసలే లేటైంది’ అన్నాను. ‘లేదు మేడమ్ నేను మిమ్మల్ని టైమ్ కి డ్రాప్ చేస్తాను. మీరేం వర్రీ అవకండి మేడమ్’. అని బరోసా ఇచ్చాడు. చివరికి ఓ చోట ఫిల్ చేసుకుని 5.20 కల్లా డిపార్చర్ గేటు దగ్గర ఆపాడు.

సామానుతో హడావిడి పడి కౌంటర్ దగ్గర కెళితే, అక్కడ ప్రయాణీకులు ఎవరూ లేరు. అయిపోయిందీ…. చెకిన్ టైమ్ అయిపోయినట్టుంది. కౌంటరులో ఉన్నావిడకి మా ఆన్ లైన్ చెకిన్ చూపించాము. ఆవిడ ‘యూఆర్ టూ లేట్‘ అంటే, మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుందో కనుక్కుని దానికి బుక్ చేసుకోవాలేమో. ఆ కౌంటర్ ఎక్కడుందో.. అయినా ముంబాయ్ కి ఫ్రీక్వెంట్ గానే ఫ్లైట్స్ ఉండొచ్చు. లండన్ కనెక్టెడ్ ఫ్లైట్ మధ్యాహ్నం 1.30 కి కాబట్టి పరవాలేదు వెళ్ళగలమేమో. అని ఊపిరి బిగబట్టి, పరిపరి విధంబుల యోచించు చుండ, ఆ వనిత మమ్ములను చిరునవ్వుతూ చూసి గుడ్మాణింగ్ అని మా ఫాస్పోర్ట్స్ తీసుకుని చెక్ చేసింది. హమ్మయ్య టైమవలేదన్నమాట…. కానీ చాలా సేపు ఆవిడ చెక్ చేస్తుంటే మళ్ళీ ఏం కొంపమునిగిందని.. ఏమైందని అడిగాను. చెకిన్ సరిగా చేయలేదని వీసా నంబరు యుకే బదులు యూరోప్ ది వేసారని అంది. ముందుగా మేము లండన్ వెళ్ళాలి. ఆ తరువాతే యూరోప్. నేను గుర్రుగా ప్రణయ్ వంక చూసాను. వాడు మాత్రం ‘డోంట్ వరీ నేనున్నాను కదా. ఐవిల్ టేక్ కేర్. నువ్వు రిలాక్సవు‘ అంటూ సైగ చేస్తూ, ఏదో పెద్దోడిలా పోజ్ పెట్టాడు. ‘ఒకే ఒక పని నీకు చెప్పాను ఆన్ లైన్ చెకిన్ చేయమని. అది కూడా సరిగా చేయలేదు చూడు‘ అని నేను అంటూంటే ఆవిడ ‘డోంట్ వర్రీ మెడమ్. సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్. ఐయామ్ డూయింగ్ ఎగైన్. యు రిలాక్స్‘ అంటూ మళ్ళీ చేసింది. ఆ తరువాత లగేజ్ …. వెయిట్ ఇంట్లో చెక్ చేసినా సరే ఇక్కడ కంగారే. ప్రణయ్ నన్ను టెక్షన్ పడవద్దని చెబుతున్నా సరే. కాని అన్ని బాగ్స్ తక్కువ బరువే ఉన్నాయి. కానీ ఏ బాగ్ మీద మార్క్ చేయలేదు. హాండిల్స్ కి ఎప్పుడో కట్టిన ఎఱ్ఱ రిబ్బన్స్ ఉన్నాయి. ఇంకో దానికైతే అదీ లేదు. అయ్యో ఈ హడావిడిలో చాక్ తో ఇనీషియల్ మార్క్ చేయటం నేను మర్చి పోయాను. జనరల్ గా ఎప్పుడూ రాస్తాను. దాంతో మనం బాగ్ కలెక్ట్ చేసుకునే టప్పుడు కష్టం కాదు. దాదాపు అందరి సూట్ కేసెస్ ఒకేలా ఉంటాయి. మొత్తం మీద లగేజ్ బరువూ, నా టెక్షన్ బరువు తగ్గించుకుని సెక్యూరిటీ చెక్ వైపు వెళ్ళాము.

‘విజయా! నేనెళ్ళి, కరెన్సి ఎక్సేంజ్ కౌంటర్లో పౌండ్స్ తీసుకొస్తాను నీవిక్కడే ఉండు.‘ అన్నాడు. అన్నీ యూరోసే ఉన్నాయి మా దగ్గర. పౌండ్స్ దొరక లేదు. థామస్ కుక్ వాళ్ళు ఏర్పోర్ట్ కౌంటర్ లో తీసుకోవచ్చని చెప్పారు. పైగా లండన్ లో కూడా యూరోస్ చెల్లుబాటు అవుతాయని ఎవరో అంటే వాటికోసం ముందుగా మళ్ళీ ప్రయత్నం చేయలేదు. కానీ ట్రూప్ మేనేజర్ వైదేహి, పౌండ్స్ ఉండాలని యూరోస్ ని అన్ని చోట్లా తీసుకోరని చెప్పటంతో మళ్ళీ పౌండ్స్ కోసం పరుగులు. ‘అయ్యో నీకు తెలుసో లేదో నేను వస్తా పదా‘. అన్నాను. ‘విజయా! నేను ఇప్పుడు గ్రోనప్…. యైటీన్ ఇయర్స్ క్రాస్ అయ్యాను. నన్ను ఇంకా చిన్నోడిలాగా చూడకు. యునో…. ఐ కెన్ డు. యు జస్ట్ రిలాక్స్.‘ అని స్టైల్ గా రెండు భుజాలు ఎగిరేస్తూ, ఓ పోజ్ ఇస్తూ, కరెన్సీ ఎక్సేంజ్ కౌంటర్ వెతుక్కుంటూ వెళ్ళాడు. చెప్పొద్దు అలా అంటూంటే నాకు బలే ముద్దేసింది. కానీ ఏమైనా అంటే ఇంకా రెచ్చి పోతాడని, ‘సరేసర్లే ఈ పోజ్లకేంగాని .. మేకిట్ ఫాస్ట్ .. త్వరగా రా టైమవుతుంది‘ వెనుకనుంచి చెప్పాను.

అప్పటికే సెక్యూరిటీ చెక్ క్యూ చాంతాడంత ఉంది. నేను క్యూలో నిలుచున్నాను. పౌండ్స్ దొరకలేదని ప్రణయ్ తిరిగి వచ్చేసరికి, నా సెక్యూరిటీ చెకప్ లైన్ లో నా వంతు వచ్చేసింది. ట్రే తీసుకుని, నా పాస్ పోర్ట్, బోర్డింగ్ పాస్ చేతిలోకి తీసుకుని, బాక్ బాగ్ లోని చార్జర్స్, ఫోను, నా వాచీ, చేతికున్న బాంగిల్, నా హాండ్బాగ్ అన్ని పెట్టి ముందు కెళ్ళి, నన్నూ చెక్ చేయించుకుని, స్కాన్ అయి వచ్చిన బాగ్స్ తీసుకున్నాను. మళ్ళీ అన్నీ సర్దుకునే సరికి ప్రణయ్ కూడా లైన్ లోముందు కొచ్చేసాడు.

ఆ హడావిడి నేను పడుతుంటే, అప్పటికే ఉజ్వల నుంచి ఫోన్… మోగుతుంది. హాండ్ బాగ్లోంచి ఫోన్ తీసి మాట్లాడాను. వాడి బాక్ బాగ్ లో ఉన్న షేవింగ్ ట్రిమ్మర్ అలో చేస్తారో లేదో అడిగి లేకపోతే చెకిన్ బాగ్ లో పెట్టమని సలహా. కానీ అప్పటికే బాగ్ లు వెళ్ళి పోయాయి. ఇక కారీ బాగ్ లో అలో చేయక పోతే ఇక్కడే పడేయాల్సిందే అన్నాను. అయ్యో అంది. కాని ఏ ప్రాబ్లమ్ కాలేదు. వాడిది అయ్యాక, కాస్త రిలీఫ్ అవటంతో అప్పుడు కడుపులో ఆకలి మొదలైంది. లాంజ్ ఎక్కడుందో వెతికి అక్కడ దోస ఆమ్లేట్ ఫ్రూట్ జూస్ తాగి బ్రేక్ఫాస్ట్ అయిందనిపించాం.

రాజీవ్ గాంధీ ఏర్పోర్ట్ లో ప్రణయ్ ప్లేన్ లో కూచుని

గేట్ దగ్గరికి చేరే సరికి 7.20 అయింది. వాడు ఫొటోలు తీయమని పోజులు పెడుతుంటే కొంత టైమ్ దాంలో గడిపేసరికి బోర్డింగ్ స్టార్ట్ అయింది. ప్లేన్ లో కెళ్ళి కూచుని అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను.

‘ఎందుకు విజయ అంత టెక్షన్ పడతావు? ఇన్ని సార్లు వెళ్ళావు కదా!‘ సీట్ లో సెటిల్ అవుతూ అడిగాడు ప్రణయ్. ‘ఎప్పుడూ కరెక్ట్ ప్లానింగ్ తో రెడీ అవుతాను. నాలుగైదు నెలల ముందే వికాస్ టికెట్స్ పంపుతాడు. నేను, నాకు కావలసిన వాటిని ప్రాపర్ లిస్ట్ చేసుకుని, సర్దుకుంటాను. అప్పుడు కరెక్ట్ టైమ్ కి ఏర్పోర్ట్ కి రావాలనే చింత తప్ప మరేదానికి దిగులు లేదు. ఇప్పుడు రెండురోజుల ముందువరకు ప్రయాణం నిర్ధారణ కాక, బాగ్ సర్దుకోవాలో లేదో తెలియక, చివరి నిముషంలో టికెట్స్ చేతికివచ్చి బయలు దేరాలంటేనే కొంచెం అనీజీగా ఉంటుంది. అప్పటికీ, వెళతే వెళతాం లేక పోతే లేదు అనుకుంటూ, సెన్జెన్ వీసా ఇద్దరికీ రాగానే బాగ్ సర్దుకున్నాను. కావలసిన అవసరమైయ్యే మెడిసెన్స్, డ్రెస్లు పెట్టుకున్నాను. ఇలా మన ప్రయాణం అంతా ఇంకొకరి చేతుల్లో ఉండటం, డాక్యుమెంట్స్ కోసం ఎదురుచూడ్డం, అన్నీ డౌట్ఫుల్ కండీషన్స్ ఉండటం నాకు ఎక్కువ టెక్షన్ కి గురి చేసింది. ఇక ఇప్పుడు బయలు దేరడమైతే జరిగింది. ఇంకా వీళ్ళు మనల్ని సరిగా తీసుకెళతారా, మంచి హోటల్స్ ఉంటాయా, మన ఆరోగ్యాలు సరిగా సహకరిస్తాయా లేదా లాంటి కొన్ని అనుమానాలున్నా… అడ్జెస్ట్ అయ్యే విషయాలవి. టేకిట్ ఈజీ పాలసీలో పోవాలి. ఎనీవే వి స్టార్టెడ్ ద జర్నీ. లెటజ్ హోప్ ఫర్ ద బెస్ట్.‘ అని సుదీర్గంగా ఎక్ప్లనేషన్ ఇచ్చుకున్నాను. ‘ఒకే ఒకే, ఇప్పుడు రిలాక్స్ అవ్వు. నిన్ను బాగా చూసుకోమని మమ్మి నాకు చెప్పింది. ఇక నుంచి నేనే నిన్ను టేక్ కేర్ చేస్తాను. అన్నీ మంచే జరుగుతాయి. నామీద వదిలిపెట్టు. డోంట్ వర్రీ, బి హపీ. ఎంజాయ్ ద జర్నీ.‘ అంటూ ధర్మోపదేశం చేశాడు.

నేను ప్రణయ్-ముంబాయ్ ఫ్లైట్ లో

వాడు పొడుగు కాబట్టి, కాళ్ళకు జాగా సరిపోవటం లేదు. అప్పటికే ఎక్కగానే ఏయిర్ హోస్టెస్ ని అడిగాడు. సీట్లు ఖాళీ లేవని చెప్పేసింది. గంట ప్రయాణానికి ఎందుకురా అడగటం. కాసేపు నిద్రపో ముంబాయ్ వచ్చేస్తుంది‘ అన్నాను. ఈ లోపు బ్రేక్ ఫాస్ట్ జూస్ ఆలూ పఫ్ ఇచ్చారు. కాసేపు పడుకునే సరికే ‘ప్లేన్ లాండ్ అవుతుంది సీట్ బెల్ట్స్ కట్టుకొండని‘ చెబుతుంటే మెలుకువ వచ్చింది.

పదింటికి ముంబాయ్ లో ప్లేన్ లాండ్ అయినా, మేము కిందకు దిగే సరికి పదిన్నర అయిపోయింది . చాలా దూరం నడిచి, పక్కనే ఉన్న కౌంటర్లో కొంత అమౌంట్ పౌండ్స్లోకి మార్చుకుని, సెక్యూరిటీ చెక్ కూడా అయ్యాక, పక్కనే ఉన్న మెక్డోనల్స్ లో వాడు బర్గర్ నేను ఫ్రెంచి ఫ్రైస్ తిన్నాము. అప్పటికే 12.30 అయింది. గేట్ నంబరు 78 నుంచి 73 కి మారిందని మెసేజ్ కాల్ వచ్చింది. ఏర్ఇండియా వాళ్ళు బాగానే అప్డేట్ చేస్తున్నారు. అప్పుడే ఉజ్వల ఫోన్ చేసింది. కొంచెం రిలాక్స్ అయినట్టుంది. కొద్దిగా నిద్ర కూడా పోయింది. ధైర్యం చెప్పాను. తన ఫ్రండ్ లుబ్నాహజ్బెండ్ ని ఇంటికి తెచ్చారు కాని లండన్ లో ఉన్న ఆయన బ్రదర్ వస్తారని మరునాటికి అంతక్రియలు వాయిదా వేసారట. రెండు రోజులు అలా చూస్తూ లుబ్నా ఎలా ఉంటుందో. తాను అసలే షుగర్ పేషంట్. మనసంతా అదోలా అయింది.

ప్లైట్ బోర్డింగ్ పాస్, పాస్పోర్ట్ పట్టుకుని గేట్ నంబర్ 73 ను వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే, చాలా మంది కూచుని ఉన్నారు. ఎక్కడా సీట్లు ఖాళీలు లేవు. ప్లేన్ ఫుల్ గా ఉన్నట్టుంది. అక్కడే పచార్లు చేస్తూ బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తూ కూచున్నాము.
…………. ఆగండి. వచ్చేసారి లండన్ వెళదా

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు -12

అంతర్ దర్శనం – Look inside