రమక్కతో ముచ్చట్లు -12

పండుగంటే ఏంది?

అందరికీ
శనార్థులు!
బతుకమ్మ, దేవి నవరాత్రులు దసరా అన్ని పండుగలు మస్తు జెరుపుకున్నరా??
పండుగల శుభాకాంక్షలు మీ అందరికీ!
నేను సుత పూల పండుగ మల్లా..దేవి పండుగలల్ల మస్తు ఎనర్జి తీసుకున్న!
పండుగలు అంటే ఎట్ల చేసుకుంటరు.
పొద్దుగాలనే లేస్తము. నెత్తి మీదికెల్లి తానం జేసి, కొత్త బట్టలు కట్టుకుంటం, పూజ చేస్తం, గుడికి పోతం, రకరకాల పిండి వంటలు వండుకోని కమ్మగ తింటము. సుట్టాలొస్తరు.. గిట్ల అందరం కలుస్తము. బతుకమ్మ అందరం కలిసి మెలిసి వాడవాడల ఆడ్తం. మంచి వైబ్రేషన్ వస్తది. ఇదే కదా మనకు తెలిసిన పండుగ అంటే! అవ్ అంతే. ఇట్ల శానా బాగుంటది తమ్మీ..! కాకపొతే మన పండుగల గొప్పతనం గురించి ఇంకా తెల్వాలె మనకు మన పిల్లలకు!
పండుగంటే వండుకొని తినుడు కాదు
మన సంస్కృతిల పండుగల పరమార్థం తెలుసుకోవాలే..! ప్రతి పండుగ ఎనుక పెద్ద అర్థం ఉంటది. దాన్నుంచి ప్రకృతికి కనెక్ట్ అవ్వుడే మనం చేసే ప్రతి పండుగ.
మన జాతి పరంపరగా మనకు నేర్పిస్తున్న ఆచారము. తెలంగాణ ప్రాంతం కొస్తే బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ నిషాని, మన తెలంగాణ గౌరవం బతుకమ్మ. తెలంగాణ ప్రాంతపు జీవనాడి బతుకమ్మ పండుగ. బతుకమ్మని పేర్శే ప్రతి పువ్వు గూడా ఔషధ గుణాలు కలిగిన పువ్వులు. ఆడబిడ్డలు అందరు తొమ్మిదొద్దులు ఆడి పాడి గంగమ్మల గల్పుడంటే… బతుకమ్మ పూల లోని ఔషధ గుణాలను ఆ గంగమ్మల కలిపి, ఆ నీళ్లను శుద్ధి జేసుడు.
ఆనాటి నుంచి గ్రామీణంల పాడుకుంటున్న ప్రతి బతుకమ్మ పాటలు గొప్ప అర్థాన్ని ఇచ్చే జీవిత తత్వాలను తెలియజేస్తయి. బతుకమ్మ పండుగ గొప్పతనం మీద ఒక గ్రంథమే రాయచ్చు శెల్లె .!
పూల పండుగ,ఆడబిడ్డల పండుగ పువ్వులెక్క ఉండాలె, అవుస్రమైతే పూల దగ్గరుండే ముళ్ళు లెక్క కూడా ఉండాలె.. ఆమె తోడబుట్టినోళ్ళు ఆమెకు పోతురాజు లెక్క నిలబడాలె అని ఎర్క జేస్తది.
బతుకమ్మ పొంటే జేస్కున్న దేవి నవరాత్రులు తొమ్మిదొద్దులు దేవిని తొమ్మిది అవతారాలల్ల కొలిశినం. ఇక్కడ ఒక పరమార్ధం చెప్తా! ప్రతి మనిషి శరీరమే ఒక శ్రీచక్రం లెక్క! అమ్మవారు ఉన్నదే
శ్రీచక్రం. అంటే ప్రతి గుండెల ఆశ్రీ చక్రంల ఉండే అమ్మవారే ఉంటది అని అర్థం. మరి అమ్మవారు మన దేహం లనే ఉంటే.. దేహమును, మన మనసును ఎంత మంచిగ పెట్టుకోవాలి మనం. గిది తెల్వాలే. గిదే సాధన జెయ్యాలే! ప్రతి మనిషి దేహంల షట్ చక్రాలు ఉంటయి.
అమ్మవారి అన్ని అవతారాలు ఒక్కొక్క చక్రంల ఒక్కొక్క అమ్మ కొలువై ఉంటది. అంటే మన దేహంల ఉన్న ప్రతి చక్రాన్ని మనము సకారాత్మకమైన ఆలోచనలతోని నింపి శక్తివంతం చేయాలి. అట్లా చేస్తే మన హృదయంలోనే అమ్మ వచ్చి శాశ్వతంగా కూసుంటది. ఇదే మరి దేహమే దేవాలయం అవ్వుడు అంటే! మనలో ఉన్న స్త్రీ శక్తిని, పురుష శక్తిని మేలుకొలిపి మన దేహాన్ని, మనస్సును, బుద్దిని, ఆత్మను ఆరోగ్యవంతము, శక్తివంతం చేసుకొనుడే ఆధ్యాత్మికత అంటే! అట్లా ఆధ్యాత్మికత రక్షణ ఉంటే అమ్మ అనుగ్రహం మనకు ఉంటది. అమ్మ గుడిలోనే కాదు గుండెల కూడా ఉంటది. అప్పుడు మనమే అమ్మ అయితము.
ఇదే మన పండుగల గొప్పతనం. ఇదే మన పండుగల పరమార్థం. ఇట్ల తెలుసుకుని జేసుడే పండుగ అంటే. ఇదే సాధన అంటే. ఆ “అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ” మన అందరి మీద అమ్మదయ పూర్తిగా ఉండంనీ, దేశము మన జాతి సల్లగ ఉండాలని అమ్మని కోరుకుంటున్నా!!
శ్రీ మాత్రే నమః!!

పండుగ శుభాకాంక్షలతో
మీ రమక్క

Written by Rama devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిత్రం భళారే విచిత్రం

యూరోప్ ట్రిప్-2