నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం 16వ భాగం

జరిగిన కథ…

పిల్లల కోరిక మీద అమెరికా వచ్చిన, సుభద్ర, అర్జున్ లు  మినియాపోలీస్ నుంచి కూతురు దగ్గరకు అట్లాంటా వస్తారు. మనవడు, మనవరాలు, అల్లుడు కలిసి ఫర్నీచర్ అసెంబుల్ చేసుకోవటము వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కాలనీలో జరిగిన పాట్ లక్ డిన్నర్ కు వెళుతారు. అక్కడివారితో పరిచయం చేసుకుంటారు. కూతురు స్పూర్తి వారిని అట్లాంటాలోని సీనియర్ సెంటర్ కు తీసుకెళుతుంది. అక్కడ సుభద్రను కాస్త ఆట పట్టిస్తారు. అది కాకుండా అట్లాంటాలో ఆ సెంటర్ కు దగ్గరలోనే ఇంకోక సెంటర్ ఉందని తెలుసుకుంటారు. స్పూర్తి మౌంట్ రష్మోర్ వెళ్ళేందుకు ప్లాన్ చేస్తుంది.

ఇక చదవండి…

ఎటు చూసినా ఎత్తైన చెట్లు. పచ్చని ఆకులతో మెరిసిపోతున్నాయి. ఆకాశాన్ని ముద్దాడుతున్నాయాఅనట్లున్నగా ఉన్న కొండలు వివిధాకృతులలో గంభీరంగా, అందంగా ఉన్నాయి. రంగురంగుల అడవి పూలు సువాసనలు వెదజల్లుతూ సొగసుగా ఉన్నాయి. కార్ దిగుతూనే చుట్టూ చూసి, పరవశించిపోతూ, తన కాళ్ళ దగ్గర ఉన్న లేత వంకాయరంగు పూలను సుతారంగా తాకింది సుభద్ర. అవి సుభద్ర స్పర్శకు ముద్దుగా తలలూపాయి.

“లోపలికి రావా? ఇక్కడే మకామా?” అడిగాడు అర్జున్.

“అబ్బా వస్తున్నానుండండి” అంటూ లోపలికి నడిచింది. మూడు గదులు, అటాచెడ్ బాత్ రూంస్, ఓ పక్కగా కిచెన్ ప్లాట్ఫాం, ఫ్రిడ్జ్, చక్కని ఫర్నీచర్ తో ముచ్చటగా ఉన్న కుటీరం నుసరదాగా చూసింది. పిల్లలు, విజయ్ గదులల్లోకి సామాన్లు చేరేస్తున్నారు.

“కాసేపు రెస్ట్ తీసుకుంటే బయటకు వెళుదాము” అంది స్పూర్తి.

సరేఅన్నారే కానీ ఎవరికీ రెస్ట్ తీసుకునే ఉద్దేశం లేదు. ఫ్రెషప్ అయ్యి, అద్భుతమైన ఆ పర్వత కట్టడాన్ని చూసేందుకు వెళ్ళారు. వీళ్ళను రా… రండి… అని పిలుస్తున్నట్లుగా ఆ ఎత్తైయిన పర్వతం మీద నుంచి వీళ్ళనే చూస్తున్నట్లున్న నలుగురిని ఆశ్చర్యంగా చూస్తూ “అబ్బ అంత ఎత్తున ఎవరు చెక్కారో? ఎన్ని సంవత్సరాలు పట్టిందో? అసలు అలా చెక్కించాలన్న అయిడియా ఎవరికి వచ్చిందో?” అన్నది సుభద్ర.

“అవును కదా? చాలా గ్రేట్ వర్క్” మెచ్చుకుటున్నట్లు అన్నాడు అర్జున్.

“పర్వతంపై శిల్పాలు చెక్కించాలనే ఆలోచన ముందుగా సౌత్ డకోటా చరిత్రకారుడు జోన్ రాబిన్ సన్ కి వచ్చింది. దానికి సుప్రసిధ్ధ శిల్పి గుట్జ్ న్ బోర్ గ్లమ్ ని  శిల్పి అవుతే బాగా చేస్తాడని అతనిని సంప్రదించాడు. సౌత్ డకోటోలో టూరిజం పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ కొండమీద పొడుగాటి స్తంబాలు, వాటిమీద కొందరు ప్రసిద్ధుల శిల్పాలు చెక్కించాలనుకున్నాడు. కానీ అనేక చర్చల తరువాత ఆ మెమోరియల్ దేశ భక్తిని, దేశ పురోభివృధ్ధిని తెలియచేసేదానిలా ఉంటే బాగుంటుందని అనుకొని  అమెరికా చరిత్రలో మొదటి 150 సంవత్సరాలలో అమెరికా అభివృధ్ధికి పాటుపడిన ప్రెసిడెంట్స్ లోనుంచి నలుగురిని ఎంచుకున్నారు” సుభద్ర ప్రశ్నలకు సమాధానంగా చెపుతూ ఆగాడు విజయ్.

“ఆ నలుగురూ ఎవరు డాడీ?” ఆసక్తిగా ప్రశ్నించింది సౌమ్య.

“వాళ్ళు ఎవరంటే…

ఫాదర్ ఆఫ్ ది అమెరికాగా పిలవబడే, వాషింగ్టన్ అమెరికా మొదటి ప్రెసిడెంట్ జార్జి వాషింగ్టన్, ఈయన అమెరికా మొదటి ప్రసిడెంట్. అంతే కాదు ఈయన అమెరికా ఇంగ్లండ్ నుంచి స్వతంత్రం పొందటానికి కృషి చేసిన వ్యక్తి కూడా. అదో అదే ఆయన శిల్పం” అని చూపించాడు.

“ఇక రెండవ ఆయన ధామస్ జెఫర్ సన్ అమెరికాకి మూడవ ప్రెసిడెంట్ గా చేసాడు. ఈయననే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ వ్రాసాడు. ఈయన ముందు చూపుతో లూసియానా టెరిటరీని కొనటంతో దేశం అంతకు ముందుకన్నా రెట్టింపు విస్తీర్ణతను సంతరించుకుంది.

ఇక మూడవ ఆయన ధియోడర్ రూజ్ వెల్ట్. ఈయన అమెరికాకి 26వ ప్రెసిడెంట్. ఈయన పనామా కెనాల్ ని పూర్తి చేసి, అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను అనుసంధానం చేసినవాడు.

ఇక నాలుగ ఆయన అబ్రహం లింకన్, అమెరికా 16వ ప్రెసిడెంట్. ఈయన  సివిల్ వార్ సందర్భంగా దేశంలో చీలికలు రాకుండా సంఘటితం చేసిన లీడర్” వివరించాడు విజయ్.

వాటిని పరిశీలనగా చూస్తూ “అసలు వాటిని అంత ఎత్తున ఎట్లా చెక్కారంటావు? ఎన్ని సంవత్సరాలు పట్టిందో? అసలు అంత పైకి వెళుతూ ఎందరు కింద పడిపోయి ఉంటారో కదా!” అన్నాడు అర్జున్.

“ఈ శిల్పాలు చెక్కటానికి 4-10-1927 నుంచి 31-10-1941 దాక 400 మంది శిల్పులు కష్టపడ్డారు. ఫండ్స్ సరిగ్గా లేక పోవటం, దేశ రాజకీయ, ఆర్ధిక పరిస్ధితులు, వాతావరణ సమస్యలు అన్నీ ఎదుర్కొని నిలిచిన ప్రపంచంలోనే పెద్దదైన ఈ శిల్పాలు,  అమెరికా ప్రజల దేశ భక్తికి ప్రతీకలు. ఎన్ని ఆటంకాలు ఎదురు అయినా ఆ శిల్పులు అకుంటిత దీక్షతో చేసారు. ఈ అద్భుతాన్ని సృష్టించిన శిల్పకారులు గుట్జ్ న్ బోర్ గ్లమ్, ఆయన కుమారుడు లింకన్ బోర్ గ్లమ్.  ఈ భారీ శిల్పాలు చెక్కటానికి  సౌత్ డకోటా, కీస్టోన్ లోని బ్లాక్ హిల్స్ లోని హార్నీ పీక్ ను ఎన్నుకోవటానికి కారణం, ఈ రాయి శిల్పాలు చెక్కటానికి వీలుగా  వుండటమేగాక, వాతావరణ ఆటుపోట్లకు తట్టుకునే శక్తి కలది కూడా కావటం. అంతే కాదు సూర్య కిరణాలు ఈ ప్రదేశంలో ఎక్కువ సేపు పడటం వల్ల శిల్పులకు తమ పని చేసుకోవటానికి, తర్వాత దర్శకులు వాటిని సందర్శించటానికి వీలుగా ఉందనికూడా.

దీనికిన్యూయార్క్ న్యాయవాది చార్లెస్ ఇ. రష్మోర్ పేరు మీద “మౌంట్ రష్మోర్”అని పేరు పెట్టారు.ఆయన 1885 లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. చార్లెస్ ఇ. రష్మోర్ తర్వాత $5,000 ను మౌంట్ రష్మోర్ ప్రాజెక్ట్ ప్రారంభించటానికి సహాయపడటానికి విరాళం ఇచ్చారు.ఈ ప్రాజెక్టుకు ప్రైవేట్ డబ్బును అందించిన మొదటి వ్యక్తిగా పేరు పొందారు. దీనిని ‘ప్రెసిడెంట్ మౌంటెన్’  అని కూడా పిలుస్తారు.

ఈ శిల్పాలు చెక్కేందుకు సుమారు4500 టన్నుల రాళ్ళను తొలిగించారు.400 మంది కార్మికులు ప్రమాదకర పరిస్తితులలో కూడా ఈ శిల్పాలను నిర్మించారు. ఇది కఠినమయిన, ప్రమాదకరమయిన పని అయినప్పటికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంకా ఈ శిల్పాలు ఎంత దృఢంగా చెక్కరంటే, ఎన్ని ఆటుపోటలను తట్టుకొని అయినా సుమారు 500,000 సంవత్సరాల తరువాతనేముఖాలు వాటి రూపాన్ని కోల్పోయే అవకాశం ఉందిట.అంత వరకు చెక్కుచెదరవట! దీనిని శిక్షణ పొందిన పర్వతారోహకుల చేత శుభ్రం చేయిస్తుంటారు” అని జవాబిచ్చిందిస్పూర్తి.

“ఇంత ఎత్తున ఎంతబాగా చెక్కారు కదా! నిజంగా అలా వాళ్ళను అంత ఎత్తున నిలబెట్టి, ఇదొక మెమోరియల్ పార్క్ లా, టూరిస్ట్ ప్లేస్ లా చేసి గుర్తు చేసుకోవటం నాకు చాలా మంచిగా అనిపిస్తోంది. చెప్పొద్దూ మన దగ్గర ఊరూరా కూడలిలలో చేతులూ కాళ్ళూ విరిగిపోయి, రంగులెలిసిపోయి దీనంగా ఉండే మన నాయకుల విగ్రహాలు గుర్తొచ్చి దిగులుగా ఉంది. ఇలా ఒక చోట ఉంచి అందరూ చూసి, గర్వంగా గుర్తు చేసుకునేటట్లు చేస్తే ఎంత బాగుంటుంది. చక్కగా సెలవలల్లో పిల్లలను తీసుకొచ్చి చూపించి, మన చరిత్రను చెప్పవచ్చు. గర్వంగా వీళ్ళు మన నాయకులు అని తలెత్తి చూపిస్తే ఆ గొప్పదనమే వేరబ్బా! అరే అండీ ఇటు చూడండి,  ఏఏ రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయో తేదీలతో సహా వివరంగా ఒక్కో పలక మీద వ్రాసి, ఈ దారంతా పెట్టారు చూడండి. భలే అయిడియా కదా!” అంటూ అన్నీ ఉత్సాహంగా చదివింది సుభద్ర.

ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉంది. చిన్న పిల్లలను భుజాల మీదికి ఎత్తుకొని ఉన్నారు కొంత మంది. పిల్లలూ, పెద్దలూ ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఫొటోలు తీసుకుంటున్నారు. వీళ్ళూ చాలా సేపు తిరుగుతూ, ఫొటోలు తీసుకున్నారు. ఇక అలిసిపోయి, కుటీరంకు వెళ్ళారు.

అర్జున్ స్నానం చేసి వచ్చేసరికి, విజయ్, స్పూర్తి డెక్ కింద నెగడు వెలిగిస్తున్నారు. పిల్లలు వాళ్ళకు సహాయం చేస్తున్నారు. దాని చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి. పక్కనే టేబుల్ మీద విస్కీ, సోడా, కూల్ డ్రింక్ బాటిల్స్, గ్లాస్ లు, పెట్టి ఉన్నాయి. సుభద్ర ఏదీ అని చుట్టూ చూసాడు. డెక్ మీది రెయిలింగ్ ను ఆనుకొని నిలబడి, అప్పుడే వస్తున్న చంద్రుడిని చూస్తోంది. చంద్రుడు సుభద్రతో దోబూచులాడుతున్నట్లుగా మబ్బులను చాటు చేసుకుంటున్నాడు. అంతలోని మబ్బు చాటు నుంచి బయటకు వస్తూ వెన్నెల కిరణాలతో సుభద్ర చెక్కిలిని స్పృషిస్తున్నాడు కొంటె చందురుడు. హన్నా అని చదురునికి వేలు చూపించాడు అర్జున్!

సుభద్ర దగ్గరగా వస్తూ,  “మబ్బులో ఏముంది? నీ మనసులో ఏముంది?” అని పాడుతూ, “చూసావా నీ పాటలు నాకూ అంటించావు. చూసింది చాలు కానీ అటు పద. పిల్లలు ఏదో ఏర్పాట్లు చేస్తున్నారు చూద్దాము” నవ్వుతూ అన్నాడు అర్జున్.

అర్జున్, సుభద్ర రాగానే “తాతా, అమ్మమ్మా ఇంత సేపా? ఇటు చూడండి ఎంత బాగుందో! దా అమ్మమ్మా డాన్స్ చేద్దాము” అని సుభద్ర చేయి పట్టుకొని పిలిచింది సౌమ్య.

నెగడు వెలుగు, పైన చందురుని దోబూచులు, కొండపై నుంచి వీస్తున్న గాలి, అది చేసే చిరు సవ్వడి చాలా ఆహ్లాదంగా ఉంది. అర్జున్ చిన్నగా పక్కన ఉన్న బల్ల మీద దరువు వేయసాగాడు. స్పూర్తి లేచి, డాడీ దరువుకు అనుగుణంగా పాదాలు కదుపుతూ, ఒక చేత్తో అమ్మనూ, ఇంకో చేత్తో సౌమ్యనూ లేపి, విజయ్ ను, శౌర్యనూ లేవమన్నట్లు సైగ చేస్తూ…

“మోరినీ బాగామే బోలే ఆధీ రాత్ మా

ఛన్ ఛన్…చూడియా…

ఖనక్ గయీ…

దేఖో సాయిబా…” అని పాట పాడుతూ డాన్స్ చేస్తోంది. స్పూర్తి తో సౌమ్యా, సుభద్రా అడుగులు కలిపారు.

పాటలు, డాన్స్ లతో హోరెత్తించారు అందరూ! అలాగే అక్కడే డిన్నర్ కూడా ముగించి, గాలి ఎక్కువ అవుతుండటముతో నెగడును ఆపి అందరూ లోపలికి వెళ్ళారు. బాటిల్స్, గ్లాస్ లు పట్టుకొని వస్తూ…

“మౌంట్ రష్మోర్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడటానికి?” అడిగాడు అర్జున్.

“ఇంకా అంటే…

లింకన్ బోర్ గ్లమ్ మ్యూజియం అని ఉంది. దాని మీద నుంచి ఏ అడ్డం లేకుండా ఈ శిల్పాలను చూడవచ్చు.మ్యూజియంలో ఇక్కడిఈ శిల్పాల చరిత్ర, పురోభివృధ్ధి గురించి ఉంది. మ్యూజియంలో 125 మంది కూర్చునేందుకు వీలుగా 2 ధియేటర్స్ వున్నాయి.  వీటిలో ఒక దానిలోఈ శిల్పాలు ఎందుకు, ఎలా చెక్కారు అనే విషయం గురించి 13 నిముషాల ఫిల్మ్, రెండవ దానిలో ఈ నేషనల్ పార్కు లోపలగల జంతువుల గురించి 12నిముషాల ఫిల్మ్ చూపిస్తారు. ఇంకా యాంఫి ధియేటర్ అని ఉంది. అందులో రోజూ రకరకాల ప్రోగ్రాంలు జరుగుతాయి. ఆ రోజు జరిగే ప్రోగ్రాం గురించి ఇన్ఫర్మేషన్ సెంటర్ లో గానీ మ్యూజియంలోగానీ వివరాలు తెలుసుకోవచ్చు.  ఇవి కాక ప్రతి రోజూ యాంఫి ధియేటర్ లో మెమోరియల్ నిర్మాణం, అక్కడ చెక్కబడిన నలుగురు ప్రెసిడెంట్ల గురించి హైలైట్స్ చూపిస్తారు” అని చెప్పాడు విజయ్.

“ఇంకా ఓపిక ఉండి, నడవగలుగుతే, ప్రెసిడెన్షియల్ ట్రైల్ లో నడిస్తే ఈ శిల్పాల చుట్టు పక్కల దృశ్యాలని చూడవచ్చు” చెప్పింది స్పూర్తి పక్కలు సద్దుతూ.

“అబ్బా ఇప్పుడు అవన్నీ చూడాలా? ఈ కొండలూ, కోనలూ చూస్తే చాలదా?” గుణుపుగా అంది సుభద్ర.

“ఇప్పుడు కాదులే రేపు వెళుదాము. ఇక పడుకొని రెస్ట్ తీసుకో. అందరం పడుకున్నాక వెన్నెలా, కొండా అనుకుంటూ డెక్ మీదకు వెళ్ళకు. ఏ చిరుతపులో వస్తుంది” దడిపించాడు అర్జున్.

“అమ్మో అవునా? చిరుతపులి వస్తుందా?” గుండెల మీద చేయి వేసుకొని భయంభయంగా అడుగుతున్న అమ్మమ్మను చూసి పిల్లలు పెద్దగా నవ్వారు.

వాళ్ళ వైపు కినుకగా చూసి,” రేపైనా అలసిపోయాను బాబు. ఇప్పుడు అర్ధరాత్రి 12 కు పడుకొని మళ్లీ పొద్దునే లేచి వెళ్లాలా? నా వల్ల కాదు” అంది సుభద్ర.

“మరీ ముసలమ్మ లాగా మాట్లాడకు. చూసావా అసలు ఎంతమంది పెద్దపెద్ద వాళ్లు, 90 ఏళ్ళు దాటిన వాళ్లు కూడా వీల్ చైర్ లల్లో తిరుగుతున్నారు. వాళ్లేనా చూడు వికలాంగులు కూడా ఎంత బాగా వెళుతున్నారు. ఎంత ధైర్యంగా ఉన్నారు” మందలింపుగా అన్నాడు అర్జున్.

“అవును డాడీ ఇక్కడ అందరికీ చాలా ధైర్యం. అసలు ముసలి వాళ్ళము అయ్యామని కానీ, కాలులేదని, చేయిలేదని, లేవలేమని ఎవరు అనుకోరు. ప్రభుత్వం కూడా వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.అమెరికాలో వికలాంగుల కోసం తీసుకునే శ్రధ్ధ అంతా ఇంతా కాదు.  వారికి ప్రతి చోట ప్రత్యేక సౌకర్యాలు, వీల్ ఛైర్ లు వెళ్ళటానికి వీలుగా దోవలు, లిఫ్ట్ లు, వాష్ రూంలు, బస్ ఎక్కటానికి, దిగటానికి సౌకర్యాలు వారికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండ ఏర్పాటు చేస్తారు.  వారు మనిషి సహాయం లేకుండా బయట తిరిగి వారి పనులు వారు చేసుకునేందుకు వీలుగా వుంటాయి ఈ ఏర్పాట్లు” అంది స్పూర్తి.

“అవును సీనియర్ సెంటర్లో కూడా చూసేవాళ్లం కదా లేవలేనావిడ, పక్షవాతం వచ్చిన తను కూడా వీల్ చైర్ లో వచ్చి బ్రిడ్జ్ ఆడారు మాతోటి. వీళ్ళని చూసి మనము చాలా స్ఫూర్తి పొందాలి” అన్నాడు అర్జున్.

“ఆ… మరే మన దగ్గర పేపర్లలో 40 రాగానే 40 ఏళ్లు దాటిన ముసలి వాళ్లు అని రాసి లేని ముసలితనం తెప్పిస్తారు. మనకు ఇంకేం స్ఫూర్తి” నవ్వింది సుభద్ర

“సరే ఇంక మాటలు ఆపి పడుకోండి. రేపు అన్నీ చూడాలి” అన్నాడు విజయ్.

“డాడీ గుర్రం బగ్గీ ఉంది అక్కడ. రేపు అది ఎక్కించాలి” శౌర్య అడిగాడు.

“సరే… సరే ఇక గుడ్ నైట్” చెప్పాడు విజయ్.

ఇంటికి తిరిగి వచ్చేసరికి,నాలుగురోజుల ప్రయాణంలో అందరూ అలిసిపోయారు.

***

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, కాఫీ తాగుతూ, “అమ్మలూ ఈ వీకెండ్ మినియాపోలీస్ కు టికెట్ బుక్ చేసావా?” అడిగాడు అర్జున్.

“అప్పుడేనా డాడీ. ఇంకొన్ని రోజులు ఉండవచ్చు కదా?” గారంగా అంది స్పూర్తి.

“అప్పుడేనా ఏమిటీ? వై అనీ, సీనియర్ సెంటర్ అనీ, గెట్ టుగేదర్స్ అనీ, చుట్టు పక్కల వాటర్ ఫాల్స్ అని  తిరుగుతూ తిరుగుతూ చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి. అయినా మర్చిపోయావా? ఆ పై వారమే మేము హైద్రాబాద్ వెళ్ళేది” అన్నాడు అర్జున్.

“మీరు ఈ చుట్టుపక్కలనే చూసారు. చూడాల్సినవి చాలా ఉన్నాయి. మీ టూర్ ఇంకో రెండు నెలలు పెంచుకోని ఉండండి అంకుల్” విజయ్ కూడా అన్నాడు.

“లేదు విజయ్. ఇప్పటికే నాలుగు నెలలు నా పనులన్నీ ఆపుకొని ఉన్నాను. వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు వెళుదాములే. అయినా ద గ్రేట్ మెమోరియల్ మౌంట్ రష్మోర్ చూసాము కదా! అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చూడనిది. మిగిలిన సిటీస్ ది ఏముంది? అన్నీ ఒకేలా ఉంటాయి” జవాబిచ్చాడు అర్జున్.

“ఇక డాడీ ఆగరు. మరి నేనూ మమ్మీవాళ్ళతో మినియాపోలీస్ వెళ్ళి ఈ వారం అక్కడ గడిపి రానా?” విజయ్ నూ, పిల్లలనూ చూస్తూ అడిగింది స్పూర్తి.

బిక్క మొహాలు వేసిన పిల్లల ను దగ్గరకు తీసుకొని,”వెళ్ళు వెళ్ళు. మాకు ఫ్రీడం వస్తుంది. ఎంచక్కా మేము బోలెడు ఎంజాయ్ చేస్తాము. కదరా పిల్లలూ” అన్నాడు విజయ్.

(సశేషం)

 

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

దొరసాని