యాత్రా చరిత్ర – travelog

దేశ విదేశాలలోని ప్రదేశాలను చూడాలని ప్రపంచంలోని వింతలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలో ఉంటుంది అవకాశాలు ఉన్నవాళ్లు సాధిస్తారు. తరుణి పత్రిక రచయిత్రి విజయ రంగనాథం గారు యూరప్ దేశయాత్ర పెట్టుకున్నారు. ఆ యాత్ర విశేషాలను “యూరప్ ట్రిప్ ప్రహసనం” పేరుతో అందించనున్నారు. ఈ ప్రయాణ సన్నాహాలతో మొదలైన ఈ ట్రావెలార్ మీకోసం- సంపాదకులు, తరుణి పత్రిక.

 

యూరప్ ప్రయాణ – ఉపోద్ఘాతం

కొండన్న అదే మన నెల్లుట్ల రాంగోపాల్ గారు. మేమంతా కొండన్నా అని పిలుస్తాం లెండి. ఆయన భార్య శోభతో కలిసి యూరోప్ ట్రిప్వెళ్ళి వచ్చినప్పటినుండి నాకు వెళ్ళాలని ఎంతగానో అనిపించింది. ఎవరైనా వస్తారేమో కలిసి ప్లాన్ చేద్దామని అందరిని అడిగాను. కొండన్న అక్క వసంతకి కూడా రావాలని ఉందనికాని యు ఎస్ వెళ్ళాల్సి రావటంవల్లతరువాత ప్లాన్ చేద్దామంది. చివరికి అలా ఆలోచిస్తూ18 మే రోజునఎవర్నో అడగడమెందుకు మా ఉజ్వల కొడుకు ప్రణయ్ కి ఎలాగు సెలవులు ఇద్దరం వెళ్ళొచ్చుకదా అనుకున్నాము. కాని చాలా నడవాలంటున్నారు నేను మానేజ్ చేయగలనా? నా వల్ల ట్రూప్ మెంబర్స్నిఇబ్బంది పెట్టాల్సి వస్తుందా? కొంత ఆలోచనలో పడ్డాను. ‘ఆసంగతి తరువాత చూడొచ్చు ముందు డిటేల్స్ కనుక్కుందామని‘ ఉజ్వల అనటంతో,గూగుల్ సర్చ్ చేసాము. నా ఆరోగ్యం దెబ్బ తినకుండా, అనుకూలమైన బడ్జెట్ తో,తక్కువ రోజుల ట్రిప్ ఉండాలని డిసైడ్ అయ్యాను. ఆ తరువాత వెంటనే కొండన్నకి ఫోన్ చేసి అతని దగ్గర థామస్కుక్ ఎగ్జుక్యుటివ్ చంద్రశేఖర్ ఫోన్ నంబరు తీసుకున్నాను. కాని అనుకున్నంత ఈజీ కాలేదు. దినదిన గండంలా ప్రతీపనిలో అడ్డంకులే. హాయిగా ఉన్నచోట ఉండక లేనిపోని చికాకులు, టెంక్షన్ … ఎందుకొచ్చిన బెడదా అని దిగులేసింది. ‘ఎందుకు మమ్మి అంత కంగారు? మనలాంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేయటం, ఫారెన్ టూర్ లకు వెళ్ళడం అంటే ఇలాంటి కొన్ని కష్టాలు తప్పవు. అయినా ఇప్పుడు కాకపోతె ఎప్పుడెళ్తావు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలిగా. అయినా నీవు ఆరోగ్యంగానే ఉన్నావు. ఈట్రిప్ నీవు భయపడుతున్నంత బాధగా ఏమీ ఉండదు. నీవు వెళ్ళగలవు. ఇక ఫండ్స్ గురించి నీకు బెంగే లేదు. ఎఫ్ డిలు వాడుకో మిగిలిందానికి బాంక్ లోన్ వస్తుంది కదా. మరింకేం? అనవసరంగా టెక్షన్ వద్దు. అన్ని అయిపోతాయి.‘ అంటూ ఉజ్వలఎంకరేజ్ చేయటమే కాక చంద్రశేఖర్ తో తానే మాట్లాడింది. సేఫ్టీ మెజర్ష్ ఎలా ఉన్నాయో తెలుసుకుంది. చాలా మంది సీనియర్ సిటిజన్స్ వెళతారని, కొంత అలసట ఉన్నా అంతగా బాధ అనిపించదని చెప్పాడు.

కొండన్నేమో వాళ్ళు ఫోన్ చేయగానే వస్తారు, మనకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు అన్నాడు. మాకు ఆదిలోనే హంసపాదులాగా వీసాకు కావలసిన ఫైనాన్షియల్ బాంక్ బాలెన్స్లు తక్కువున్నాయని మీరే వీసాకోసం అప్లై చేసుకోండని చెప్పి మాకు ‘విజయ్‘ అనే వీసా ఏజెంట్ ని పరిచయం చేసాడుచంద్రశేఖర్.అతన్ని కాంటాక్ట్ చేసి ఆయన అడిగిన డాక్ అంతా పంపాము. వీసాల కోసం అప్లై చేస్తూ యుకె జూన్ 7న యురోప్28 జూన్ఇంటర్వూ డేట్స్ఫిక్స్ చేసాడు. వాటికోసం ఇన్సురెన్స్ కూడా చేయాల్సి వచ్చింది. సెన్జెన్(యురోప్) వీసాకి ఇన్సురెన్స్ తప్పనిసరి. వీసా రావాలంటే బాంక్ బాలెన్స్ చూపించాల్సి వస్తుందని, వీసా ప్రాసెస్ అయ్యేవరకు కొంతపెద్దమొత్తం బాంక్ లో ఉండేట్టు చూసుకోమని, సిక్స్ మంత్స్ బాంక్ స్టేట్ మెంట్స్ కూడా కావాలని చెప్పాడు. ఇదో కొత్త తలనొప్పా! అంత పెద్ద అమౌంటు బాంక్ లో ఎలా చూపించాలని ఆలోచిస్తుంటే పవన్ ట్రేడింగ్ అమౌంటంతా నా బాంకి ట్రాన్స్ఫర్ చేసాడు. ఆయిన ట్రాన్జాక్షన్స్ అన్ని ఒక నెల పాటు దెబ్బతినాల్సి వస్తుంది. కానీ నాకు అతన్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు. దాంతో వీసారావటానికి ఈ బాంక్ బాలెన్స్ ప్రాబ్లెమ్ తీరిపోయింది. ఇక ట్రిప్ అమౌంట్ రెడీ చేసుకోవాలనే ప్రయత్నం మొదలు పెట్టాను.

20 జూన్ కల్లా నాకు ఆరునెలల యుకే వీసా తో పాస్పోర్ట్స్ వచ్చాయి కాని ప్రణయ్ కి వీసా రాలేదు. సిల్లి రీజన్స్ తో రిజెక్ట్ చేసారు. మూడు నెలల సెంజెన్వీసా మాత్రం ఇద్దరికీ వచ్చింది. తరువాత మళ్ళీ జూలై 17 న ప్రణయ్ యుకే వీసా కోసం ఇంటర్వూకి వెళ్ళాడు. మొదటిసారి వీసా రిజెక్షన్కి ఏ రీజన్స్ చెప్పారో వాటన్నిటికీ క్లారిఫికేషన్స్ ఇస్తూ కవరింగ్ లెటర్ డాక్యుమెంట్స్ తో పాటు సబ్మిట్ చేసాము. ఇక ఫండ్స్ రెడీ చేసుకోవటానికినా పెన్షన్ మీద బాంక్ లోన్ అప్లై చేశాను. ఒక్కరోజులో కావలసిన అమౌంటు చేతికి వచ్చింది.

ఆరోజే చంద్రశేఖర్ ఫోన్ చేసి మీరు ట్రిప్ కోసం అడ్వాన్స్ పే చేయలేదని సెప్టెంబర్ వరకు కూడా ఖాళీలు లేవనిఅనడంతో వీసా ప్రాసెస్ అతను చెబితేనే కదా మొదలు పెట్టింది. మరి మాకోసంషెడ్యూల్ రిజర్వ్ చేస్తాడని అనుకున్నాము. ఇప్పుడు తను ఇలాగనటం చాలా నిరాశకు గురైనాను. జూలై లో వెళదామంటే ఎలాగూ వీసారాలేదు కనీసం ఆగస్టులో వెళ్ళక పోతే సెప్టెంబర్లో ప్రణయ్ కాలేజ్మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి వెళ్ళటం వీలవదు కదా. ఫైనల్ పరీక్షలు కాకపోయినా, ఆమార్క్స్ కూడా కలుస్తాయి. అందుకని మిస్ చేయలేము.ఆ తరువాత అక్కడ వెదర్ ఎలా ఉంటుందో ననే బాధ ఒకటి. పోనీ మానేద్దాం అంటే వీసాల కోసం చాలానే ఖర్చు చేసాం. యుకే వీసా రాకపోతే కనీసం యురోప్ వెళ్ళవచ్చని ఆగస్టు ఫస్ట్ వీక్ లో ప్రణయ్ వీసా సంగతి తెలుస్తుంది, వీసా రాకపోయినా పాస్పోర్ట్ అయితే అప్పటికల్లా వస్తుందని ఎలా అయినా ఆగస్టులో షెడ్యూల్ ఫిక్స్ చేయమని చెప్పాను. ఒక పక్క లండన్ లో అక్షర్ ని కలవలేనా, కార్ల్ మార్క్స్ సిమిట్రీ, గ్రీన్విచ్ ని చూడలేనా అని మదనపడ్డాను. అతను చెక్ చేసి ఆనెల18న బుక్ చేసుకోవచ్చని చెప్పాడు. మాతో కావాలని లేవని చెప్పి అలా గేమ్స్ ఆడాడో తెలియలేదు. మొత్తం మీద రెండు లక్షలు అడ్వాన్స్ పే చేసాము. వీసా,ఇన్సురెన్స్ మేమే చేసుకున్నాం కాబట్టి ఆ చార్జెస్ ని టోటల్ అమౌంట్ లో కట్ చేస్తానని చెప్పాడు.

ప్రణయ్ కి వీసా వచ్చినా రాకపోయిన వాడి పాస్పోర్ట్ వెళ్ళే టైమ్ కల్లా వస్తుందా? అని రోజు వీసా ఆఫీస్ నుంచి మెయిల్స్, మెసేజెస్ కోసం చూట్టం. వాడి ఈమెయిల్ కే వస్తుంది కాబట్టి వాడు కాలేజ్ కెళ్ళినా పదే పదే చెక్ చేసుకోమని వాడికి చెప్పాల్సివచ్చింది. ఇంతకు ముందు వీసాలన్ని రెండు వారాల్లో వచ్చినవి ఈసారేమో నాలుగు వారాలైన రాక పోయే సరికి చాలా హడావిడి పడిపోయాము. థామస్ కుక్ చంద్రశేఖర్ ఒకవేపు, వీసా ఏజెంటు విజయ్ ఓ వేపు ఫోన్లు చేస్తూ మమ్మల్ని ఇంకా కంగారు పెట్టేసారు. చివరికిఆగస్ట్ ఏడున కానీ ప్రణయ్ కి యుకే వీసా రెండు సంవత్సారాలకి ఇస్తూ పాస్పోర్ట్ రావటంతో ఇక ప్రయాణం ఖరారని నమ్మకం కుదిరింది.ప్రణయ్ కూడా యుకే వీసా వచ్చిందనిమామూలు పాకేజి యుకే యూరోప్ ట్రిప్కి బుక్ చేయండనిచంద్రశేఖర్ గారికి చెప్పాను. ఆగస్టు 19 నుండి 28 ఆగస్ట్ వరకు ట్రిప్ డేట్స్ అని చెప్పాడు. నేను ఒకరోజు ముందు అంటే 18 న మాకు టికెట్ బుక్ చేయమన్నాను. ఎందుకంటే నేను లండన్ లో మా అన్నయ్య జ్వాల మనమడు అక్షర్ని కలవటం ఒకటైతే, నేను చూడాలనుకున్నకార్ల్ మార్క్స్ సిమెట్రీ, గ్రీన్విచ్ రేఖాంశం థామస్కుక్ వాళ్ళ టూర్ పాకేజీలో లేదు. అంతేకాక జర్మనీలోని మార్క్స్ బర్త్ ప్లేస్ ని కూడా చూడలేము. వాళ్ళ సైట్ సీయింగ్ షెడ్యూల్ లో లేదు. పోనీ యుకే ముందుగా వెళుతున్నట్టు లాస్ట్ డేస్ ప్లాన్ చేద్దామంటే జర్మని లో ఒకేరోజు స్టే ఆతరువాత స్విట్జర్లాండ్ కి తీసుకెళతారు. అందుకని కనీసం లండన్లోమిగిలిన టూర్ మెంబర్స్ వచ్చేలోపే మేము చూడాల్సినవి చూసి మరునాటి నుండి వాళ్ళతో కలవచ్చని అనుకున్నాను. అంత కచ్చితంగా చూడాలా అంటే మరి మళ్ళీ వెళ్ళలేం కదా. ఎలాగో వెళుతున్నప్పుడు ఆమహానుభావుడి గుర్తులు పదిలపరుచుకుందామని.

లండన్ వెళుతున్నానని, అక్షర్ని కలుస్తానని వదినకు కాని, అక్షర్ తండ్రి వాసుకు కాని ముందుగా చెప్పలేనిపరిస్తితి. ప్రయాణం నిర్దారణ కాలేదు. ఇంకా కన్ఫ్యూజనే. చివరికి అక్షర్ కి, అంబర్ పేట లో వదినకి, వాసు కి చెప్పాను. ఏవైన పంపే వుంటే పంపమని చెప్పాను.ఆవకాయ, గోంగూర, వెల్లుల్లి కారం, చెగోడీలు, కాజుబర్ఫీ అడిగాడని అన్నిటిని పాక్ చేశాము. మా ఉజ్వల ఊరుకోదుగా మంచి లడ్డూలు కూడా పాక్ చేయించి మా కోసం కొన్ని స్నాక్స్ తెచ్చింది. నేను నాన్వెజ్ తిననుకదా, అక్కడేమో వెజ్ తక్కువ. నాకు ఆకలివేస్తే తినటానికనిరెడీ చేసింది. ‘వెజ్ నాన్వెజ్ అని పట్టించుకోకు. తినకపోతే ఆరోగ్యం పాడవుతుందని, అసలే ప్రయాణాల్లో లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటావని‘ ఉజ్వల అంటే, సబ్ట్యూట్ గా బోలెడెన్ని విటమిన్ టాబ్లెట్స్ రోజూ వేసుకొమ్మని పవన్ ఓ చిన్న బాగ్ తయారు చేశాడు. ఒక కాబిన్ బాగ్ నిండా సరిపోయాయి తినుబండరలతో.

ముందుగా ఏర్ టికెట్స్ కి అమౌంట్ ఆగస్టు 9న పే చేసాము. ఎయిర్ టికెట్స్ పంపాడు. తరువాత ఫైనల్ పేమెంట్స్ విడివిడిగా మా ఇద్దరిఅకౌంట్స్ నుండి పంపమన్నాడు. అలాగే చేసాము. మా ముందురోజు ట్రిప్ కోసం, హిత్రూ ఏర్పోర్టు నుండి హోటల్కి కాబ్, ఆ నైట్ హోటల్ బుకింగ్ కి ఎక్స్ ట్రా పే చేసాను.

ఆతరువాత చంద్రశేఖర్, సుమన్ అనే కోఆర్డినేటర్ కి నా ఫైల్ ఫార్వర్డ్ చేసాడు. ఆ తరువాత అతనే మా మిగిలిన విషయాలు చూసాడు. పదిహేడు వరకు సందిగ్దత ఎన్నో అనుమానాలు. ఏ క్లారిఫికేషన్స్ లేవు. చివరికి ప్రయాణానికి ఒక రోజు ముందు ఆగస్టు17 న, వైదేహి ట్రూప్ మేనేజర్ అని సుమన్ ఆమె ఫోన్ నంబరు పంపాడు. ఆమె అన్ని వివరాలు చెప్పి మా కంగారును తగ్గించింది. ఆమెతో మాట్లాడాక కాని మనసు కొంత కుదుట పడలేదు. ఆమేమో అక్కడ వర్షాలు పడే అవకాశ ముంటుందనిచిన్నగొడుగు, వాటర్ బాటిల్స్ చాలా కాస్ట్లీ కాబట్టి రీఫిల్ వాటర్ బాటిలు, కాఫీ టీలు అలవాటుంటే ఎలక్ట్రిక్ కెటిల్, ఫోన్ చార్జర్స్ వాటికోసం యూరోప్ లో వాడే అడాప్టర్స్ (ఇక్కడి ఎలక్ట్రిక్ అడాప్టర్స్ పనిచేయవు) అంటూ పెద్ద లిస్టే చెప్పింది, అదీ రేపు ప్రయాణం ఉందనగా. ఆల్రెడీ మాకు గూగుల్లో కొంత, అమెరికాలో ఉండివచ్చిన అనుభవంతో కొంతా తెలుసు కాబట్టి అన్ని ముందే పెట్టుకున్నాం. ఇంకాఏవో డాక్యుమెంట్స్ అడిగింది. అవి సుమన్ పంపుతారని చెప్పి ఆయన దగ్గర కలెక్ట్ చేసుకోమంది. మొత్తంమీద 17 రాత్రి వరకు టెక్షనే.

అయినా కొన్ని శేషప్రశ్నలే…18 రాత్రి వెళ్ళగానే హిత్రో ఎర్పోర్ట్ కి కాబ్ వస్తుందా? రాకపోతే? అక్షర్ చాలా దూరంగా ఉంటాడట, వాడికి ఇబ్బందని రావద్దన్నాను. కాబ్ లో ఆట్రియమ్ హోటల్ హీత్రూకి వెళ్ళినా అక్కడే19న మిగిలిన గ్రూప్ మెంబర్స్ అదే హోటల్ లో చెకిన్ అవుతారా? లేక మేమే మళ్ళీ హోటల్ షిఫ్ట్ అవ్వాలా? వెళ్ళగానే డిన్నర్ ఉంటుందా? ముందుగా వచ్చాం కాబట్టి మనమే బేర్ చేయాలి కదా! మరి యూరోస్ తీసుకున్నాం కానీ పౌండ్స్ లేవు. ఎక్కడ మార్చాలి? వాళ్ళే ఫారెన్ కరెన్సీ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ దాని గురించిన విషయాలేవి చెప్పట్లేదు. అసలు ఈ టూర్ అనుకున్నప్పటినుండి చాలా టెక్షన్ పడ్డాను. టూరుకి కావలసి వివరాలు పేపర్స్ ఏవి టైముకు అందడం లేదు. రాంగోపాల్ అదే మన కొండన్న చెప్పినంతగా థామస్ కుక్ వారు సరియైన సహకారాలు అందివ్వడం లేదనిపిస్తోంది.నేను టెక్షన్ తీసుకునే బదులు ఎలా అయితే అలా అవుతుంది,ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎదుర్కోవటం, అప్పటికి ఏంచేయాలో ఆలోచిద్దాం అని మనసుని స్థిమిత పరుచుకున్నాను. నాచేతిలో లేని దానిగురించి ఎంత ఆలోచించినా వేస్ట్. అనవసరంగా ఇప్పటినుంచే గబరా అనవసరం అని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను.

కానీ 17 సాయంత్రానికల్లా ట్రూప్ మేనేజర్ వైదేహి అన్నింటిని క్లారిఫై చేస్తూ మెసేజెస్ పంపింది.స్విట్జర్లాండ్ లో 11,333 ఫీట్స్ ఎత్తులో ఉన్న ‘యుంగ్ఫావ్యో‘ అనే గ్లేసియర్ టాప్ ఆఫ్ ది యూరోప్ కి వెళ్ళటం ఆప్షనల్ అని, దానికోసం సపరేట్ గా ఒక్కొక్కరికి 180 యూరోస్ అమౌంట్ పే చేయాలని, అంతే కాక రివర్సేన్ క్రూస్ అండ్ ఇల్యుమనేషన్ కి కూడా మరో 45 యూరోలు ఒక్కొక్కరి కట్టాలని చెప్పింది. అయ్యో అంత ఎత్తు ఎక్కగలనా అని కొండన్నకు ఫోన్ చేసాను. పైకి కేబుల్ కారు, ట్రైన్ ఉంటుందని, ఏం కష్టం కాదని, చాలా బాగుంటుందని దాన్ని వదులుకోవద్దని చెప్పాడు. కొంత ఊరట పొందాను. సరే డబ్బులు రుపీస్ లో ట్రాన్సఫర్ చేయొచ్చా అని అడిగితే,అక్కడే యూరోస్ లో కట్టాలని వైదేహి చెప్పింది.అయినా కలవరం తగ్గటం లేదు. ప్రణయ్ మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పెద్దగా చలేమి ఉండదు మాదగ్గర ఉన్న స్వెట్టర్స్ తో మానేజ్ చేయొచ్చని వాడిని జాకెట్స్ లాంటి షాపింగ్ లు చేయనీయలేదు. నేను నా దగ్గర ఉన్నవి మాత్రం తీసుకున్నాను. మొత్తం మీద మా ఇద్దరి రెండు లగేజెస్ఒక్కోటి ఇరవై కేజీలకు తక్కవే అయింది. కాబిన్ బాగ్ ఆరు కేజీలే. అయినా అక్కడ వాళ్ళ వెయింగ్ లో తేడా వస్తుందేమో అనే అనుమానం.

హాయిగా ఉన్న మనసుని అనవసరంగా ఇంత బాధ పెట్టుకోవటం అవసరమా? ఊసుపోక ఇందులో ఇరుక్కున్నానే అని అనిపించింది. అయినా చివరి నిముషాల్లో అన్నీ సమకూరుతున్నాయి. టికెట్స్ హోటల్ వివరాలు అన్ని వచ్చాయి. వదిన ఏవో రెడీ చేసింది ఉజ్వల కొన్ని స్వీట్స్ వాడికి, మాకు అవసరమైతే తినటానికి కొన్ని స్నాక్స్ ప్యాక్ చేసింది. అవును మరి అక్షర్ ని చూసి 14 సంవత్సారాలపైనే అయింది. అన్నయ్య జ్వాలా 2008 లోచనిపోతే వాడు చదువు కోసం 2010 లో లండన్ వెళ్ళాడు. అప్పటినుండి అక్కడే ఉన్నాడు. ఇంటి సభ్యులు ఈ పద్నాలుగేళ్ళలో అన్నయ్ మనుమడు లౌకిక్, మా అక్క, మా రంగనాథం, మా అమ్మ, అన్నయ్య రెండవ కొడుకు శ్రీధర్, వరుస మరణాలు వాడు వెళ్ళాక జరగటం, దూరంగా ఉండివాడువంటరిగా బాధను అనుభవించాడు. కుటుంభ సభ్యులం ఎవరం అతన్ని ఫోన్ లో తప్ప కలవలేదు. ఒకటి రెండు సార్లు మా చిన్నన్నయ్య రాము కొడుకు ఉదయ్,ఆఫీస్ పనిమీద లండన్ వెళ్ళి నపుడు కలిసాడని విన్నాను.వాడు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు మేము వస్తున్నామంటే. ఇంకే తప్పకుండా వెళ్ళి వాణ్ణి కలుస్తామనే భరోసా కలిగింది. ఆ సాయంత్రమే మరునాటి ప్రయాణానికి, ప్రణయ్ ఆన్ లైన్ చెకిన్ చేసాడు.

నా ప్రయాణ కంగారు ఒకవేపైతే, తెల్లవారుఝాముననాలుగింటికి బయలు దేరాలి. ఆరాత్రి పదకొండు గంటలకు ఉజ్వల స్నేహితురాలు లుబ్నా హజ్బెండ్ హార్ట్ ఎటాక్ తో కొలాప్స్ అయ్యారని తెలిసి మనసు చాలా వికలమైంది. ఏమిటో మొన్న యశోదకి ఇప్పుడు లుబ్నాకి ఇలా జరగటం చాలా బాధ వేసింది. ఉజ్వల హాస్పిటల్ కి పరిగెత్తింది. పాపం చాలా కదిలి పోయింది. రాత్రంతా నిద్ర లేదు. నేనే ఫోన్ చేసి లుబ్నా బంధువులు చేరుకున్నాక ఉజ్వలని వచ్చేయమని చెప్పాను. మళ్ళీ ప్రణయ్ వెళ్ళేటప్పుడు లేకపోతే తల్లీ కొడుకులు ఇద్దరూ బాధ పడతారు. ఇంటికి వచ్చినాపాపం ఏడుస్తూనే ఉంది, నిద్ర పోలేదు. తాను ఏర్పోర్ట్ కు రానక్కరలేదని, మేమే కాబ్ తీసుకుని వెళ్ళి పోతామని చెప్పాను.

రాత్రంతా ఎంత ప్రయత్నించినా నిద్ర లేదు. ఉజ్వల స్నేహితురాలు లుబ్నా గుర్తుకు వస్తుంది. ఆమె భర్త ఏజ్ బహుశా నలబై ఐదు ఏభై ఉంటాయేమో. ఇంత తొందరగా, ఏ రోగం లేకుండా,అప్పటిదాకా బాగుండి అలా చనిపోవటం చాలా బాధనిపిస్తోంది. ఎలాఉందో అసలే ఆమె ఆరోగ్యం బాగుండదు. మనసులో ఏదో టెక్షన్. ఎందుకో లేచి టైమ్ చూద్దామని ఫోన్ తీసుకోగానే ఎయిర్ ఇండియా నుంచి మెసేజ్ వచ్చింది. ఇండిపెండెన్స్డే సందర్భంగా సెక్యూరిటీ కారణాలవల్ల నాలుగు గంటల ముందే ఏర్పోర్ట్లో ఉండడాలని. అయ్యో ఇప్పుడు మూడు అవుతుంది. వెళ్ళ గలమా అని కంగారు పడిపోయాను. 8.20 కి ఫ్లైట్ అంటే 4.20 కల్లా ఏర్పోర్ట్ లో ఉండాలి. ప్రణయ్, నేను తయారయి, కాబ్ బుక్ చేసుకొని గంటలో బయలు దేరగలనా? నేను, రంగనాథం గోవా వెళ్ళేటప్పుడు ఫ్లైట్ మిస్ చేసుకున్నట్టు ఇది కూడా మిస్ అవుతుందా? హమ్మో…ఒక్కసారిగా భయపడి పోయాను.

తరువాత కథ వచ్చే వారం

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

శ్రీమద్రామాయణము