నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం 15వ భాగం

జరిగిన కథ…

పిల్లల కోరిక మీద అమెరికా వచ్చిన, సుభద్ర, అర్జున్ లు కొడుకు ఇల్లు మినియాపోలీస్ నుంచి కూతురు దగ్గరకు అట్లాంటా వస్తారు. మనవడు, మనవరాలు, అల్లుడు కలిసి ఫర్నీచర్ అసెంబుల్ చేసుకోవటము వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కాలనీలో జరిగిన పాట్ లక్ డిన్నర్ కు వెళుతారు. అక్కడివారితో పరిచయం చేసుకుంటారు. కూతురు స్పూర్తి వారిని అట్లాంటాలోని సీనియర్ సెంటర్ కు తీసుకెళుతుంది.

ఇక చదవండి…

స్పూర్తి వెళ్ళిపోయిన తరువాత, ఎలిజా అర్జున్, సుభద్రలను కార్డ్స్ రూం లోకి తీసుకెళ్ళింది. ఒక పెద్ద హాల్ లో ఓ పక్క కొంతమంది బ్రిడ్జ్, కొంతమంది పోకర్ అలా రకరకాలా కార్డ్స్ గేంస్ ఆడుకుంటున్నారు. అర్జున్ బ్రిడ్జ్ టేబుల్ దగ్గర చేరాడు. సుభద్ర పోకర్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఒకావిడ, “మీరు ఇందులో జాయిన్ అవుతారా?” అని అడిగింది.

అవునంది సుభద్ర.

“నా పేరు పెగ్గీ. నేను ఈ గేం కు కోఆర్డినేటర్ ను. వీళ్ళూ…” అని మిగితావాళ్ళను పరిచయం చేయబోతుండగా, హడావిడిగా ఒకావిడ వచ్చింది.

ఆమెను చూడగానే “హాయ్ గెర్రీ, ఏమయింది? చాలా రోజుల నుంచి రావటం లేదు” అడిగింది ఎదురుగా కూర్చున్నావిడ.

“ఏం చెప్పమంటావు? మా అమ్మ, బయట వాకింగ్ చేస్తూ, సడంగా సృహ తప్పి పడిపోయింది. పక్కవాళ్ళు చూసి నాకు కాల్ చేసారు. వెంటనే ఎమర్జెన్సీ కి తీసుకెళ్ళాము. నాలుగురోజులు ఎమర్జెన్సీలో ఉంచి, ట్రీట్మెంట్ ఇచ్చారు. వర్టిగో ప్రాబ్లం అని మెడిసెన్స్ ఇచ్చి పంపేసారు” అంది గెర్రీ.

“ఇప్పుడు ఎట్లా ఉంది?” ఎవరో అడిగారు.

“బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే మా దగ్గరకు వచ్చి ఉండమంటే రానంటుంది. పోనీ మేమయినా వచ్చి ఉంటామంటే వద్దంటుంది. నేనొక్కదానినే ఉంటానని మొడిపట్టు పడుతోంది” నీరసంగా జవాబిచ్చింది గెర్రీ.

“మరేమి చేస్తున్నారు? ఏదైనా హోం లో చేర్పించకపోయారా?”

“అదీ వద్దట. తనింట్లోనే ఉంటుందిట. తొంభై ఏళ్ళ ఆవిడ. ఒక్కదాన్ని వదిలేయలేము. వద్దంటుంటే బలవంతాన ఉండలేము. నేనూ, మా చెల్లి రోజుకు ఒకరము ఏదో ఒకటి చేసుకొని తీసుకొని వెళ్ళి చూసి వస్తున్నాము. ఇప్పుడు నేనూ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలి. ఏమి చేయాలో అర్ధం కావటం లేదు” నిస్పృహగా అంది గెర్రీ.

“మనం ఏమి చేయగలం గెర్రీ. మీ అమ్మనే కాస్త మీ మాట వింటే బాగుంటుంది. కానీ ఈ పెద్దవాళ్ళు వినరు. మనమేమీ చేయలేము.”

అందరూ మాటలాపి, ఆటలో పడ్డారు.

వాళ్ళ మాటలు వింటూ ఆడుతున్నసుభద్రను పక్క టేబుల్ ఆవిడ, సుభద్ర దగ్గరగా వచ్చి, హాయ్ అని పలకరింపుగా నవ్వింది. “నీ బ్యూటీస్పాట్ బాగుంది. అవునూ ఇది జారకుండా ఎట్లా ఉంది?” సుభద్ర కొంగును చూపిస్తూ అడిగింది.

“ఇదీ బ్యూటీస్పాట్ కాదు. దీనిని మేము బొట్టు అంటాము. ఈ స్టికర్ తీసి, పెట్టుకోవచ్చు. కొంగుకు జారకుండా పిన్ పెట్టాను” జవాబిచ్చింది సుభద్ర.

ఈజ్ ఇట్” అంటూ ఇంకా ఏదో అనబోతున్న ఆమెను, “ఏయ్ జుడీ నీ అల్లరి ఆపు. ఆటకు రా” పక్క టేబుల్ నుంచి పిలిచారు. నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న జుడీని బిత్తరపోతూ చూసింది సుభద్ర.

అందరూ ఆటలో పడ్డారు. వాళ్ళ టేబుల్ దగ్గర పెగ్గీ కాక, ఇంకో ఇద్దరు ఆడుతున్నారు. వాళ్ళిద్దరు సుభద్రను చూసి చిన్నగా నవ్వి, వారి పేర్లు చెప్పారు కానీ సుభద్రకు అర్ధం కాలేదు.

అప్పుడే ఒక పెద్దావిడను వీల్ చేర్ లో ఒకబ్బాయి తీసుకొచ్చాడు. అటూఇటూ చూసి అర్జున్ ఉన్న టేబుల్ వైపు తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెను వదిలి, అర్జున్ వైపు చూసి “హాయ్నువ్వు కొత్తగా వచ్చావా? ఇండియనా?” అడిగాడు.

“అవును, ఈరోజే చేరాము. నాపేరు అర్జున్. తను నా వైఫ్ సుభద్ర” జవాబిచ్చాడు సుభద్ర వైపు చూపిస్తూ అర్జున్.

“నా పేరు రిచర్డ్. ఈవిడ మా అమ్మ. రోజూ నేను తీసుకొచ్చి ఇక్కడ దింపుతాను. అదో పెగ్గీ వచ్చినప్పుడు తను రిటర్న్ తీసుకొస్తుంది. లేకపోతే నేనే వచ్చి తీసుకెళుతాను” అని పరిచయం చేసుకొని, కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయాడు.

రెండు గంటల సమయముకు విజయ్ వచ్చాడు. సుభద్ర, అర్జున్ అందరికీ బై చెప్పి విజయ్ తో ఇంటికి బయలుదేరారు. మీటింగ్ పూర్తి చేసుకొని, అప్పుడే టేబుల్ మీద ప్లేట్స్ పెడుతోంది స్పూర్తి. “ఇక్కడ ఎట్లా ఉంది?” వీళ్ళను పలకరింపుగా అడిగింది.

“వస్తున్నాముండు” అని ఇద్దరూ వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చారు.

“ఇవ్వాళ మీ అమ్మను రాగింగ్ చేసారు” నవ్వుతూ అన్నాడు అర్జున్.

చిన్నగా నవ్వి సెల్ లో ఏదో మెసేజ్ వచ్చిందే అనుకుంటూ చూసుకుంది. “పెగ్గీ టెక్స్ట్ మెసేజ్ పెట్టింది” అంది సుభద్ర.

“అబ్బో నిన్ను రాగింగ్ చేయటమూ, మెసేజ్ పెట్టటమూ భలే ఉన్నారే” నవ్వింది స్పూర్తి.

భోజనం ముగించి, పెగ్గీ మెసేజ్ తీసింది.

“హాయ్ సుభా. ఈరోజు మిమ్మలిని కలవటము చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీతో ఆడినవారు నేను కాక, మిగితా ఇతర ఇద్దరు గెర్రీ షెరాఫ్ మరియు కేథరిన్ బోలెన్.

నేను కెంటకీలో పెరిగాను. నేను కాలిఫోర్నియాలో పదిహేను సంవత్సరాలు, టెక్సాస్ లో నాలుగు సంవత్సరాలు, జార్జియాలో ఇరవై ఆరు సంవత్సరాల నుంచీ ఉన్నాను. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకరు Charleston, SCలో, మరొకరు Gainesville, GAలో ఉంటారు. నేను 2015 వేసవిలో రిటైర్ అయ్యాను.సుమారు పది నెలల తరువాత, 2016 స్ప్రింగ్ లో నేను మొదటిసారి పోకర్ ఆడటం నేర్చుకున్నాను.

నేను 2016 స్ప్రింగ్ లో కేథరిన్ ను కలిశాను. ఆమె భర్త ఆరేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు జార్జియాలో ఒక కుమార్తె, రాలీలో ఒక కుమారుడు, పెన్సిల్వేనియాలో మరో కుమార్తె ఉన్నారు. ఇక్కడ తను ఒక్కతే ఉంటుంది.

గెర్రీ విషయము విన్నావు కదా! తను, భర్త ఉంటారు. తను వాళ్ళ అమ్మ, చెల్లి అందరూ ఒకటే కాలనీ లో ఉంటారు. అమ్మను చూసుకుంటుంటారు.

ఇక మీ భర్తతో ఆడిన, వీల్ చేర్ లో వచ్చినామె పేరు లిలియన్. ఆమె బోస్టన్ లో ఉండేది. ఇక్కడికి వచ్చిన తరువాత మాతో ఆడటం మొదలుపెట్టింది. ఆమెకు తొంభైనాలుగు సంవత్సరాలు. డెభై సంవత్సరాలుగా ఆమె ఆడుతోందట. మా ఇంటికి కొంచం దూరంలో ఉంటారు. కొడుకు రిచర్డ్ తీసుకొస్తాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు తిరిగి తీసుకెళతాను.

ఇంతకు ముందు చాలామంది ప్లేయర్స్ ఉండేవారు. కోవిడ్ తరువాత తగ్గిపోయారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఒకవేళ నువ్వు మాతో రెగ్యులర్ గా ఆడేటట్లవుతే, నువ్వు రాలేని రోజు నాకు చెపితే చాలు. ఇక్కడ నేనే ఆర్గనైజ్ చేస్తుంటాను. మేము ప్రత్తిరోజూ రాము. మంగళ, శుక్రవారాలు మటుకే వస్తాము.

నీకు ఆసక్తి ఉంటే Sexton లో ఇంకో సీనియర్ సెంటర్ ఉంది. అక్కడ జెన్నీ ఆర్గనైజ్ చేస్తుంది.అక్కడ ఒక గ్రూప్ గా చేసుకున్నారు. ఎవరైనా రాకపోతే ఆరోజు గ్రూప్ లో చెపుతారు.  నిన్ను ఆ గ్రూప్ లో చేరుస్తాను. అక్కడ వాళ్ళు ఇక్కడిరోజులలో కాకుండా వేరే రోజులలో ఆడతారు. కాబట్టి నీకు క్లాష్ అవదు. కొంతమంది రెండుచోట్లా ఆడుతారు.నీకు తెలవాలని ఈ ఇంఫర్మేషన్ చెప్పాను” అని టెక్స్ట్ మెసేజ్ లో ఉంది.

“ఏమండీ అక్కడ కూడా చేరుదామా? వీళ్ళందరినీ కలుసుకోవటమూ, మాట్లాడటమూ కొత్తగా, సరదాగా ఉంది” ఉత్సాహంగా అడిగింది సుభద్ర.

“అట్లాగే. వీక్ డేస్ పిల్లలు బిజీ కదా! మనం వెళ్ళి రావచ్చు. స్పూర్తీ కాబ్ గురించి కూడా తెలుసుకుందాము. అది ఉంటే మీతో పని ఉండదు” అన్నాడు అర్జున్.

“అలాగే డాడీ. పొద్దున రిసెప్షనిస్ట్ ఇచ్చిన పాంప్లెట్ తెచ్చాను కదా! సాయంకాలం చూద్దాం” జవాబిచ్చింది.

“స్పూర్తీ వీకెండ్ కు మౌంట్ రష్మోర్ వెళుదామనుకున్నాము కదా, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసావా?” అడిగాడు విజయ్.

“లేదు. ఆఫీస్ లో సెలవు, పిల్లలకు పర్మిషన్ తీసుకొని బై రోడ్ వెళుదామన్నావు కదాని  చేయలేదు. అక్కడ కాటేజ్ బుక్ చేసాను” అందిసెల్ లో ఏదో చూసుకుంటూ.

“నేనేదో సరదాగా అన్నాను. అంతమాత్రాన కార్ లో నాలుగురోజులు పోనూ, నాలుగురోజులు రానూ ఎట్లా వెళుతాము? ఎన్ని రోజులు సెలవ తీసుకుంటావు?” కొంచం సీరియస్ గా అన్నాడు.

“బాప్ రే బాప్! అంత కోపం ఎందుకు? నేనూ సరదాగే ఉన్నాను. గురు శుక్రవారాలు సెలవు తీసుకుందాము. గురువారం వెళ్ళి ఆదివారం రాత్రికి రావచ్చు. గురువారం కు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసానులే! ఇక కాస్త నవ్వు బాబూ”

“ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా?” అన్నాడు అర్జున్.

“అదేమిటి డాడీ అట్లా అంటావు. ఇంత దూరం వచ్చి, ఇక్కడ ఏమీ చూడకుండానే వెళుతావా? ఇంకా నయగారా, లాస్ వేగాస్ కూడా వెళ్ళాలి మీరు. అంతా మేము రాలేము కానీ మీరు ఇద్దరూ వెళ్ళండి. టికెట్స్ బుక్ చేస్తాను” అంది స్పూర్తి.

“న్యూయార్క్, వాషింగ్ టన్, నయగారాకు బుక్ చేస్తాను వెళ్ళండి అని అభి కూడా అన్నాడు. అవన్నీ ఈసారి వచ్చినప్పుడు చూస్తాములే, ఇప్పుడు మీతోనే గడుపుతాము అని చెప్పాను. అయినా ఎక్కడ చూసినా అవే బిల్డింగ్స్, అవే దృశ్యాలు. నయగారా వేరు, పెద్ద జలపాతం అనుకో” అన్నాడు అర్జున్.

“నాకు నీ సంగతి తెలుసుకదా డాడీ అందుకే మౌంట్ రష్మోర్ కు బుక్ చేసాను” అంది స్పూర్తి.

“అదేమిటమ్మా? అక్కడి ప్రత్యేకత ఏమిటి?” అడిగాడు అర్జున్ ఆసక్తిగా.

“నువ్వన్నట్లు ఊరులన్నీ ఒకే రకంగా ఉంటాయి కానీ ఇది స్పెషల్. నేషనల్ మెమోరియల్. చూస్తావుగా నేను చెప్పటం ఎందుకు? నువ్వు ఎంజాయ్ చేస్తావు” జవాబిచ్చింది స్పూర్తి.

(సశేషం)

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

యాత్రా చరిత్ర – travelog