వర్థనమ్మ కష్టాలు

కథ

వర్ధనమ్మకు 60 ఏళ్లు వచ్చాయి. కానీ ఆమె మదిలో ఉన్న బాధ తగ్గలేదు సరి కదా, పెరిగిపోతుంది.

నిజానికి చూసే వాళ్ళకి ఏమీ బాధలున్నట్లు అనిపించదు. ఎందుకంటే ఆమె కొడుకులిద్దరూ చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వేరే ఊర్లో ఉద్యోగాలు చేస్తున్న పండగలకు మాత్రం తప్పకుండా వచ్చేవాళ్ళు.

ఇక కోడళ్ళ విషయానికి వస్తే ,చక్కని చుక్కలే కాకుండా, వాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తూ, ఇంటి బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ అత్తమామలను కూడా చక్కగా చూసుకుంటున్నారు.

మరి ఇక వర్ధనమ్మకు సమస్య ఏమిటి? తిన్నది అరగకనా ఏంటి? అని అప్పుడే మీరు మనసులో డిసైడ్ అయిపోయారా? అలా కాకండి .చూడడానికి సమస్య చిన్నదిగా అనిపించినా, అది చాలా పెద్ద సమస్య అని వర్ధనమ్మ లాంటి వాళ్లకు మాత్రమే తెలుస్తాయి.

సరే విషయాన్ని నాన్చకుండా పాయింట్లోకి వస్తున్నాను.

ఆమె పెళ్లయ్యాక అందరికి ఉన్నట్లే అత్తవారింట్లో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. సరే అవన్నీ చాలామందికి ఉండేవే. ఆ సోది చెప్పి సమయం వృధా చేయను.

భర్తది చిన్న ఉద్యోగమే అయినా అంచెలంచెలుగా పెరిగి మంచి స్థాయిలోకి వచ్చారు. ఆర్థికంగా కూడా బాగుండే స్థాయికి కూడా వచ్చారు.

ఇంకేం సమస్య? అన్ని బాగున్నాక అని తిట్టకండి బాబోయ్.

చెప్తున్నాను …
పొద్దున్నే లేచిన వర్ధనమ్మకి బ్రష్ ,పేస్టు కనబడవు. అక్కడ ఇక్కడ వెతుక్కు ని బ్రష్ చేసుకుని ,టీ పెడదామని లోపలికి వస్తే, వంటింట్లో తాను అందుబాటులో పెట్టుకున్న ఒక్క వస్తువు కూడా ఆ ప్లేస్ లో ఉండవు. అన్ని వేరే వేరే ప్లేస్ లోకి మారిపోతాయి.

మొదట్లో అంత అర్థం అయ్యేది కాదు. ఏంటిది సామాన్లు ఇటువటుగా వెళ్ళిపోతున్నాయి అనుకునేది.

మెల్లగా అర్థమయిపోయింది. ఇదంతా చేస్తున్నది వర్ధనమ్మ పతిదేవులు శ్రీనివాసరావు అని.

మొదట్లో సరేలే ఇటు నుండి అటు ఉన్నాయి. తీసుకుంటే తప్పేముందిలే అని అలాగే అడ్జస్ట్ అయిపోయింది. కానీ రాను రాను ప్రతి విషయంలో తలదుర్చడం మొదలయ్యేసరికి పని చేసుకోవడం కష్టమైపోయింది వర్ధ నమ్మకి.

మచ్చుకు ఇబ్బంది పెట్టేవి కొన్ని చెప్తాను.

టీ పెడదామని గిన్నెలో నీళ్లు పోసి, స్టవ్ మీద పెట్టి, టీ పొడి, చక్కర వేసి గిన్నెలో పాలు వేడి చేసి మరో గిన్నెలో చల్లార్చుకొని మళ్ళీ ఆ గ్లాసులో టీ పొద్దాము అని అక్కడ పెట్టి వెళ్లిందో లేదో, వచ్చేవరకు ఆ గిన్నె ఉండదు .అది సింక్ లోకి వెళ్ళిపోతుంది. పెద్ద గిన్నెలో కాచి న పాలు చిన్న గిన్నెలోకి వెళ్ళిపోయి, ఆ గిన్నె కూడా సింక్లోకి వెళ్ళిపోతుంది. ఇలా అవసరం ఉన్నా, లేకున్నా ప్రతిదీ ఒకదానిలో నుండి ఒకటి మార్చి అది సింకులో పడేయడం, పనిమనిషితో పెద్ద గోల.

“ఇన్ని గిన్నెలు పడుతున్నాయి ఏంటమ్మా” అని

సరే ఇది చిన్నదే అనిపించొచ్చు.

ఇంట్లో అందరూ అన్నంలోకి పొడులు ఎక్కువగా తింటారు. వర్ధనమ్మకు కూడా అలా అన్నంలో పొడి కలుపుకొని తినడం చాలా ఇష్టము. ఎప్పుడు ఇంట్లో అయిదారు రకాల పొడులు చేసి పెట్టేది.

అన్ని చక్కగా గాజు సీసాలో పోసి వంటగది దగ్గరున్న గోడమీద చక్కగా పేర్చుకొని పెట్టుకునేది.

రెండు రోజులు కదలకుండా సీసాలు అలాగే ఉండేవి. మూడవరోజు ఈ పొడులన్నీ ఒకే చోట మిక్స్ అయిపోయి, పెద్ద సీసాలోకి చేరిపోయేవి.

“పొడుల సీసాలు ఏమయ్యాయి? నాలుగు సీసాలు. ఒకటి కూడా కనిపించడం లేదు ఏంటి”?అని పొద్దున్నే టెన్షన్తో అరిచేది వర్ధనమ్మ.

“ఎందుకు నాలుగు సీసాలు? అన్నీ ఒకే చోట కలిపేసి, పెద్ద సీసాలో పోసి పెట్టాను. చూసుకో అల్మారా లో ఉంది”అనేవాడు భర్త శ్రీనివాసరావు.

“తల గోడకేసి బాదుకోవాలన్నంత కోపం వచ్చేది. కానీ ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. చెప్పి, చెప్పి తన తలవాచి పోతుందే తప్ప, ఒక్క మాట కూడా ఆయన పట్టించుకోడు. తను చేసేవి చేస్తూనే ఉంటాడు.

ఆయన ఏగదిలో ఉన్నా కూడా వర్ధని గుండె లబలబలాడిపోతుంది. ఎందుకంటే ఎక్కడ ఏం వస్తువుకు మూడుతుందోనని .ఏ వస్తువుకు ముప్పు తెస్తాడో అనే భయం.

ఎప్పుడైనా బద్దకించి వాషింగ్ మిషన్ లో బట్టలు వేయకుంటే ,వర్ధనమ్మ లేచే వరకు బట్టలన్నీ వాషింగ్ మెషిన్ లో వేసి, ఆన్ చేసి ఉంటాయి. దానికి టెన్షన్ ఎందుకు హాయిగా బట్టలు అతనే వేశాడు కదా, అని మీరు అనుకోవచ్చు. అయ్యో అక్కడే వచ్చింది చిక్కు.

కలరు పోయే బట్టలు, కలర్ పోని బట్టలు అన్నీ కలగా పులగం చేసేసి వాషింగ్ మిషన్ లో నిండా కుక్కేసి ఆన్ చేసేస్తారు. అప్పుడు తెల్ల బట్టలు పంచరంగులలోనూ, లైట్ కలర్ బట్టలు మురికి రంగులోను కనిపించి భయపడతాయి. పోనీ తన ఒక్కదాని బట్టలు అంటే పోనీలే అని సరిపెట్టుకుంటుంది. కానీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఊరుకుంటారా? వాళ్ళందరూ ఊకుమ్మడిగా వర్ధనమ్మ మీదనే దాడి చేస్తారు.

“బట్టలు ఇలా అయిపోయాయి ఏంటి? వేరువేరుగా వేయొచ్చు కదా ?అంటారు. భర్త చేశాడని ఎలా చెప్తుంది? నోరు మూసుకొని ఆ మాటలు పడాల్సిందే.

వంట చేసేటప్పుడు పోపు వేసిన , బాండ్లినీ మళ్ళీ ఏదైనా కూరకి వాడుకోవచ్చని వర్ధనమ్మ పక్కన పెట్టుకుంటుంది. అంతే ఆమె అటు నుండి ఇటు వచ్చేవరకు అది సింక్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే.

అప్పుడప్పుడు శ్రీనివాసరావు దేవుడి పూజ చేస్తారు. ఈమె పూజ చేసినప్పుడు అన్నీ ఒక పద్ధతిలో పెట్టుకుంటుంది. ఆరోజు భర్త పూజ చేశాడు కదా, అని ఆమె దూరంగా కూర్చుని పారాయణం చేసుకొని, తెల్లవారి తాను పూజ చేసుకుందామని దేవుడి మందిరం తలుపు తెరిస్తే ఇంకేముంది?

కొన్ని దేవుళ్ళు మాయమైపోతాయి. కొందరి దేవుళ్ళు ముందు నుండి వెనుకకు వెనుక నుండి ముందుకు వచ్చేస్తారు. అక్కడ కూడా వాళ్లందరికీ ట్రాన్స్ఫర్లు జరిగిపోతాయి.

సరే స్థానిభ్రంశం జరిగినా, పరవాలేదు. కానీ మాయమైన దేవుళ్ల సంగతేంటి?

“ఏమండీ కృష్ణ విగ్రహం కనిపించడం లేదు. శివయ్య ఫోటో ఎక్కడుంది?”అని అడిగితే “రెండురెండు విగ్రహాలు ఉన్నాయని తీసేసాను. ఒక్కొక్కటి ఉంటే సరిపోతుంది .రెండు రెండు ఎందుకు”అని సమాధానం వస్తుంది.

ఒకసారి ఇంటికి పెయింట్స్ వేయించారు. చక్కగా అన్నీ గోడలు వ
మి లమిలా మెరిసిపోతున్నాయి. ఇల్లంతా ఎంతో బాగుందని మురిసిపోయింది వర్ధనమ్మ.

ఒకరోజు పిల్లలు ఏదో పని మీద బయటకు వెళ్లారు. వర్ధనమ్మ ఎవరో పేరంటానికి పిలిచారని వెళ్ళింది. ఆరోజు సెలవు ఉండడం వల్ల శ్రీనివాసరావు ఇంట్లోనే ఉన్నారు.

“భోజనము పెట్టుకొని తినండి. అన్ని టేబుల్ పైన పెట్టాను”అని చెప్పి వెళ్ళిపోయింది వర్ధనమ్మ.

“నీకెందుకు నేను చూసుకుంటా కదా! నేను వడ్డించుకుంటాను”అన్నాడు శ్రీనివాసరావు.లో లోపల సంతోషిస్తూ. ఎందుకంటే ఏకాంతం దొరుకుతుంది కదా.

పేరంటం పూర్తయ్యాక ఇంటికి వచ్చిన వర్ధనమ్మకు ఇంటిని చూసి షాక్ అయిపోయింది. పెయింట్స్ వేశాక కొన్ని రంగులు మిగిలితే బాల్కనీలో పెట్టించింది వర్ధనమ్మ. వాచ్ మన్తో నిచ్చెన తెప్పించుకొని, అక్కడక్కడ డల్ గా కనిపించిందని, బ్రష్ తో ఇష్టం ఉన్నట్లుగా పూసేసారు శ్రీనివాసరావు.

ఇంటిని చూస్తే దిష్టిబొమ్మ కట్టినట్లు అనిపించింది. వర్థనమ్మకు. ఏడుపు కూడా వచ్చేసింది. ఆ ఉక్రోషంతో తలబాదుకుంది. ఎంతో అందంగా ఉన్న ఇంటిని వికృతంగా తయారు చేశాడు శ్రీనివాసరావు.

ఇలా చెప్పుకుంటూ వెళితే వర్ధనమ్మ బాధలు ఇన్నీ అన్నీ కావు.

“ఈయన ఆఫీస్ కి వెళ్తేనే ప్రాణం సుఖంగా ఉంటుంది బాబు “అని అనుకుంటూ ఉంటుంది వర్ధనమ్మ .కానీ ఎన్ని రోజులు ఆఫీస్ కి వెళ్తారు? రిటైర్ అయ్యి ఇంట్లోకి వచ్చారు .ఇక మొదలయ్యాయి వర్ధనమ్మ కష్టాలు.

పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. పోనీ తనకు అవసరం ఉన్న సహాయం ఏదైనా చేస్తాడా ?అంటే ఎంత చేతకాకున్నా ఆమె చేసుకోవాల్సిందే తప్ప, కనీసం ఒక్క కురోనారో తెచ్చి కోసి ఇవ్వడం కూడా ఉండదు.

గోడలకు సడన్గా మేకులు మొలుస్తాయి. కొన్నిచోట్ల ఉన్న మేకులు మాయమైపోతాయి. టూత్ బ్రష్ లు చెత్తబుట్టలోకి వెళ్ళిపోతాయి. అడిగితే “అవి పాత గయ్యాయని పడేసాను” అనే జవాబు వస్తుంది.

ఏదైనా వస్తువు పాడైపోతే రిపేర్ కిద్దాము అనుకున్నంతలోనే, దానిని ఓపెన్ చేసి ఆపరేషన్ చేసేసి, చిత్రవధ చేసి ఆ వస్తువును పనికిరాకుండా చేసే నైపుణ్యం ఇతనిలో ఉంది.

ఎన్నోసార్లు ఈ విషయంలో వివాదాలు జరిగాయి అయినా శ్రీనివాసరావు మారితే కదా! ఇలా ఆలోచించుకుంటూ కళ్ళ నీరు పెట్టుకుంటూ కూర్చున్న వర్ధనమ్మకు, ఇంట్లోకి వచ్చిన పనిమనిషి కనిపించలేదు.

“ఏమైందమ్మా అట్లా ఏడుస్తున్నారు” అని అడిగింది పనిమనిషి నరసమ్మ.

విషయమంతా నర్సమ్మకు తెలుసు. ఎన్నోసార్లు అనేది “ఈ బాబుతో ఎట్లా వేగుతున్నావో” అని

ఆరోజు వర్ధనమ్మ బాధ మితిమీరిపోయింది.

అప్పుడు నరసమ్మ చెవిలో ఒక సలహా చెప్పింది “ఇలా చేస్తే బాబు గారి తిక్క కుదురుతుంది” అని చెప్పింది.

తెల్లవారి నరసమ్మ చెప్పిన సలహా పాటిద్దాం అని.. కొన్ని పనులు చేసింది.

తను ఫైల్స్ పెట్టుకునే డ్రాలు, డబ్బులు పెట్టుకునే డ్రాలు అన్ని ఇటువటు అటు విటు చేసేసింది.

గట్టిగా అరిచాడు శ్రీనివాసరావు.

“నా ఫైల్స్, డబ్బులు ఇవన్నీ ఎవరు తీశారు? నేను ఎక్కడవి అక్కడే పెట్టుకుంటాను కదా? అసలు ఎందుకు ము ట్టారు?” అని అరుపులు మొదలుపెట్టారు.

భయమేసింది వర్ధనమ్మకి.

“నేనే తీశాను. ఎప్పుడూ నాకు వంటింట్లో అటు ఇటు పెట్టి ఇబ్బంది పెట్టడం లేదా ?ఒకసారి మీకు చేస్తే తెలుస్తుందని చేశాను” అన్నది.

అంతే కల్లు తాగిన కోతిలా అరవడం మొదలు పెట్టాడు. ఆ అరుపులకి వర్ధనమ్మకి కళ్ళు తిరిగి పోయాయి.

ఇలా కూడా లాభం లేదని, ఒక పేపర్ మీద ఏవేవి చేయకూడదు రాసి సంతకం పెట్టమని గట్టిగా అడిగింది .”ఇలా అయితే ఇంట్లో ఉంటాను. లేకపోతే నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాను” .అని పంతం పట్టుకుని కూర్చుంది.

“వెళ్ళిపోతే వెళ్ళిపో” అని అరిచాడు. చిలికి చిలికి ఆ గొడవ చాలా పెద్దదిగా అయ్యింది.

తర్వాత ఏమనుకున్నాడో శ్రీనివాస రావు సంతకం చేసాడు.

“హమ్మయ్య అని నిట్టూర్పు విడిచింది వర్ధని.

కానీ అర్భకప్రాణి వర్ధనమ్మ. పుట్టు బుద్ధి సంతకం చేసినంత మాత్రాన మారకుండా ఉంటుందా? ఓ వారం రోజులైతే తాను పెట్టుకున్న ప్లేస్ నుండి వస్తువులు స్థానభ్రంశం కాలేదు మరి. తర్వాత రోజుల్లో ఏమవుతుందో తెలియదు.

మీరే ఆలోచించండి వర్ధనమ్మ కష్టపడకూడదు అంటే అతను మారిపోయాడు అనుకోండి. ఆమె కష్టపడాలి అనుకుంటే అతను మారలేదు అనుకోండి .అంతా మీ చేతుల్లోనే ఉంది.

ఇక ఉంటాను…

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

అపురూప చిత్రాలు