మారుతున్న నిర్వచనం

కథ

క్రిష్ణకుమారి

” ఏంటి విజయా, రెండు రోజులు పని లోకి రాలేదు? ఈ నెలలో ఇది నాలుగో సారి నీవు మానేయటం” కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సాధ్యమైనంత శాంతంగా అడిగింది మధుమతి, పనిమనిషి విజయని.
“మా పాలేళ్ళం అందరం కలిసి కొండగట్టు పోయినాం మేడం. అందుకే రాలేదు” అంది విజయ అంట్ల గిన్నెలు తోముతూ.
” అలా చెప్పా పెట్టకుండా మానేస్తే‌ ఎలా విజయా? వస్తావో,రావో తెలియదు. ఉదయం పూట హడావిడి నీకు తెలుసు కదా! రాలేని రోజు చెపితే నేను చేసుకుంటాను” ఈసారి కాస్త కోపంగా అంది మధుమతి.
” అనుకోకుండా పోయినాం మేడం. అక్కడికెళ్లి ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు” అంది చాలా కూల్ గా.
పిచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకుంది మధుమతి. ప్రతిసారి ఇలాగే చెప్పకుండా మానేయటం, అడిగితే ఒకసారి ఊరెళ్ళానంటుంది, మరోసారి ఆరోగ్యం బాగోలేదని సమాధానం చెప్పటం మామూలు అయిపోయింది.
నెలకి రెండు రోజు కంటే ఎక్కువ రోజులు మానేస్తే జీతం కట్ చేయవచ్చు కదా అంటాడు మధుమతి భర్త దామోదరం. అలా చేసినా, ఏమన్నా గట్టిగా అన్నా మానేస్తుందేమో అనే భయం మధుమతికి.
పనివాళ్ళలో ఐకమత్యం చాలా ఉంటుంది. జీతాలు, పని గంటలు మొదలైన వాటికి సంబంధించి అందరివీ ఒకటే రూల్స్. ఏ కారణం చేతనైనా పనిమనిషిని తీసివేస్తే, వేరే పని వాళ్ళని చేయనివ్వరు. ఈ రూల్స్ గవర్నమెంట్ పెట్టినవేమీ కాదు. వాళ్ళలో వాళ్ళే పెట్టుకున్నవే. ఇవన్నీ తెలిసే మధుమతి విజయ ఎలా చేసినా సర్దుకుపోతుంది.
మధుమతి ఒక ప్రైవేటు స్కూల్ లో టీచర్. భర్త దామోదర్ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్. ఇద్దరు మగ పిల్లలు ఒకళ్ళు నైన్త్ క్లాస్, మరొకరు ఇంటర్.
ఉదయం ఎనిమిదిన్నరకే స్కూల్ కి చేరుకోవాలి. ఊరి శివార్లలో ఉన్న సొంత ఇల్లు నుంచి ఆమె పని చేసే స్కూల్ కి అరగంట ప్రయాణం. దాంతో ఏడున్నరకే బయలుదేరాలి. తెల్లవారుజామున నాలుగున్నరకి లేస్తే, ఇల్లు చిమ్ముకుని,వంట చేసి, బాక్సులు సర్ది అంతా పని చేసుకుని, హడావిడిగా తినీతినక స్కూలుకు పరిగెడుతుంది. టైం కి బస్టాపుకి చేరుకోలేక పోతే బస్ మిస్ అవుతుంది, లేట్ మార్క్ పడుతుంది. మూడు లేట్ మార్కులకి హాఫ్ డే సీఎల్ కట్ చేస్తాడు ప్రిన్సిపల్.
పొద్దున్నే వాకిలి చిమ్మి, ముగ్గు వేసి, గిన్నెలు తోమటానికి పనిమనిషిని పెట్టుకుంది. కానీ ఆ అమ్మాయి ఏరోజు వస్తుందో, ఏరోజు మానేస్తుందో తెలియదు.టైం కి రాదు. నెలలో ఏదో ఒక వంకతో ఐదారు రోజులు మానేస్తుంది. ఆరున్నర దాకా చూసి, అప్పుడు రాదు అని తెలిసాక, పని చేసుకునే సరికి స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది. జీతం కట్ చేస్తే ఊరుకోదు.
“అమ్మా, ఇవేనా గిన్నెలు, చాయ్ గిన్నె రాలేదు” ఆలోచనలో మునిగిపోయి, వంట హడావిడిలో ఉన్న మధుమతి ,విజయ పిలుపుతో ఈలోకం లోకి వచ్చింది. దాని మాటలకర్ధం చాయ్ ఇంకా ఇవ్వలేదు అని. స్టౌమీద నుంచి టీ గ్లాసులో పోసి తీసికెళ్ళి ఇచ్చింది.
‘ నాకు టైం అయిపోతున్నా, దీనికి టీ ఇవ్వటం మాత్రం తప్పదు’ గొణుక్కుంటూ తన పనిలో మునిగిపోయింది మధుమతి.
“ఆ అమ్మాయికి కాఫీలు, టీలు, టిఫెన్లు , పాత బట్టలు అంటూ అలవాటు చేసింది నీవు. అనుభవించు” అన్నాడు దామోదర్.
అతనికి చాలా కోపం ఈవిషయంలో. పనికి డబ్బులు ఇస్తాం. మళ్ళీ ఇవన్నీ అనవసరం అని అతని ఉద్దేశం. మనతో పాటే పనివాళ్ళు కూడా అనేది మధుమతి సిధ్ధాంతం.

*. *. *

మధుమతికి కొన్ని నెలలుగా ఆరోగ్యం సరిగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది .అది గైనిక్ ప్రాబ్లం, అర్జెంటుగా సర్జరీ చేసి, యుటైరస్ రిమూవ్ చేయాలి అన్నది డాక్టర్ . జనవరిలో ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంది.అయితే టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి తనది ముఖ్యమైన మ్యాథ్స్ సబ్జెక్టు. లీవ్ ఇవ్వడానికి ప్రిన్సిపల్ ఒప్పుకోలేదు.
మధుమతికి కూడా అయిష్టంగానే ఉంది ఇప్పుడు సర్జరీ చేయించుకోవటానికి. కానీ డాక్టర్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం చేస్తే వేరే దానికి దారి తీస్తుంది అంది.
మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే,ఈస్కూల్ మానేసి సర్జరీ తర్వాత మరో స్కూల్ లో చూసుకోవచ్చు అన్నాడు దామోదర్.
కానీ పిల్లల భవిష్యత్తు తన వల్ల పాడుకాకూడదు. అని ఒక బాధ్యత గల టీచర్ గా ఆలోచిస్తున్నది మధుమతి .ఏం చేయాలో అర్ధం కావటంలేదు ఆమెకి.
ఒక నెల మాత్రమే సెలవు తీసుకుని, తర్వాత ఎలాగైనా స్కూల్ కి వస్తాను అని చెప్పిన మీదట ఒప్పుకున్నాడు ప్రిన్సిపాల్ .
దామోదర్ కి అతి కష్టమ్మీద మూడు రోజుల సెలవు దొరికింది. మధుమతిని చూసుకోవటానికి ఆమె తల్లి వచ్చింది. నెల కాగానే కేవలం టెన్త్ క్లాస్ వాళ్ళ కోసం స్కూల్ కి వెళ్ళి వచ్చేది. ప్రిన్సిపాల్ శాలరీ కూడా ఒక గంటకే ఇచ్చాడు . పిల్లలు ఇద్దరి పరిక్షలు కాగానే రెస్ట్ తీసుకోవటానికి తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది .

*. *. *

” సమాజంలో కొన్ని వర్గాలు ఆర్ధికంగా , శారీరకంగా దోపిడీకి గురి కావటానికి కారణం నిరక్షరాస్యత. విద్యావంతులైన వారిలో తమ హక్కుల గురించి అవగాహన ఉంటుంది కాబట్టి వారికి చెందవలసిన ప్రయోజనాలు, తదితరాలను పొందగలుగుతారు.కానీ నిరక్షరాస్యులకి అవగాహన ఉండదు కాబట్టి, వారే ఎక్కువ దోపిడీకి గురి అవుతున్నారు”

టీవీలో ఏదో విషయమై చర్చా కార్యక్రమం చూస్తున్న దామోదర్ పెదవులపై చిన్న చిరునవ్వు కదలాడింది అది వినగానే.‌
” ఏంటోయ్, నీలో నీవే నవ్వుకుంటున్నవు? కామెడీ ప్రోగ్రాం వస్తోందా?” అంటూ లోపలికి వచ్చాడు రాధాకృష్ణ.
” రా కూర్చో.‌ ఇంత పొద్దున్నే వచ్చావు మీ చెల్లాయి ఊర్లో లేదు కాఫీ ఇవ్వటానికి” అన్నాడు దామోదర్ .
” మా చెల్లాయి లేకపోతే నీవు ఇవ్వొచ్చుగా!”
అన్నాడు కూర్చుంటూ రాధాకృష్ణ.
“నా చేతి కాఫీ ఒక్కసారి తాగావంటే జీవితంలో మళ్ళీ కాఫీ మొహం చూడవు” అన్నాడు దామోదర్.
” ఆ సంగతి నాకు, మీ చెల్లాయికీ ఇద్దరికీ తెలుసు. అందుకే మా చెల్లాయి ఊరి నుంచి వచ్చేదాకా వంటలపై నిన్ను అనవసరమైన ప్రయోగాలు చేసి, ఆరోగ్యం పాడుచేసుకోవద్దని చెప్పింది. రోజు అన్నం ఒక్కటి వండుకో. మిగిలినవి తను చేసి ఇస్తుంది. అన్నట్లు ఈరోజు ఆదివారమేగా భోజనానికి ఇంటికి పిలుచుకు రమ్మంది” అంటూ చెప్పాడు రాధాకృష్ణ.
” ఎందుకోయ్ అనవసరమైన శ్రమ. ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా నెల రోజులు. నేను ఎలాగో తిప్పలు పడతాలే” అన్నాడు దామోదర్.
“ఈ అగ్రిమెంట్లన్నీ మన హోమ్ డిపార్ట్మెంట్ వాళ్లు ముందే చేసేసుకున్నారుట కాబట్టి నీ మాట, నా మాట చెల్లదు త్వరగా డ్రెస్ మార్చుకో వెళదాం. ఇంతకీ నేను వచ్చేసరికి ఎందుకు నవ్వుతున్నావో చెప్పనేలేదు?” అడిగాడు రాధాకృష్ణ .
“ఏమీ లేదు, పుస్తకాలలో రాసేవాటికి , స్టేజి మీద మాట్లాడే వాటికి , ప్రాక్టికల్ గా సమాజంలో జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన లేదు అని నవ్వుకుంటున్నాను. నిరక్షరాస్యులలో దోపిడీ ఎక్కువ ఉంటుంది అని ఇందాక టీవీలో ఒక విశ్లేషకుడు చెప్తున్నాడు.
నెలలో కనీసం వారం రోజులు చెప్పాపెట్టకుండా మానేస్తుంది మా పనిమనిషి .కానీ ఆ అమ్మాయికి మొత్తం జీతం ఇవ్వాల్సిందే .ఇవ్వకపోతే ఊరుకోదు, మానేస్తాను అని బెదిరిస్తుంది .అదే చదువుకున్న మా ఆవిడకి నెలకి ఒకటే లీవు. అది కూడా ముందు చెప్పి పెట్టాలి . లేదంటే ఆ ఒక్క సెలవు కూడా జీతం కట్ చేస్తాడు .
ఒక టైం అంటూ లేకుండా తన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటుంది మా పని అమ్మాయి. ఒక్కొక్కసారి సగం గిన్నెలు మా ఆవిడే తోముకోవాల్సి వస్తుంది. కానీ మా ఆవిడ స్కూల్లో మూడు సార్లు ఆలస్యంగా వెళితే హాఫ్ డే సీ.ఎల్ కట్ చేస్తారు.
కిందటి నెల మా ఆవిడని చూసుకోవటానికి మా అత్తగారు వచ్చింది. ఒక మనిషి ఎక్కువ వచ్చిందని జీతం ఎక్కువ తీసుకుంది. ముఫ్ఫై ఐదు మంది ఉండాల్సిన క్లాస్ లో యాభై మంది పిల్లల్ని పెట్టి చదువు చెప్పాలి . ఈ 15 మందికి ఎక్స్ట్రా జీతం అంటూ ఏమీ ఉండదు . అదీకాక రెమిడీయల్ క్లాసెస్ పేరుతో సాయంత్రం ఏడుగంటల దాకా వారంలో ఒకసారి ఉండాల్సి వస్తుంది. ఆదివారాలు కూడా స్కూల్ కి వెళ్లాల్సిందే. వీటన్నిటికీ ఎక్కువ జీతం ఏమి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి .
తనకే కాదు నాకు కూడా అదే పరిస్థితి. తన సర్జరీ అయినప్పుడు నాకు అతి కష్టం మీద మూడు రోజుల సెలవు దొరికింది. ఇప్పుడు చెప్పు టీవీలో వాళ్ళు చెప్పే బలహీనులు, నిరక్షరాస్యుల దోపిడీ లాంటి వాటికి అర్థం ఏమిటి? ఎవరు బలహీనులు?” అడిగాడు దామోదర్.
దామోదర్ అన్నది నిజమే. చాలా మంది మధ్యతరగతి వాళ్ళు ఉబుసుపోక సర్వెంట్స్ ని పెట్టుకోవటం లేదు. టైం ఎడ్జస్ట్ మెంట్ కోసం వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తున్నది. హౌస్ మెయిడ్స్ అనే కాదు. ఈమధ్య తన స్నేహితుడు ఇల్లు కట్టించుకున్నాడు. పని మొదలు పెట్టనప్పటినుంచి, మేస్త్రీ, కూలీలు, ప్లంబర్స్,పెయింటర్స్ ఇలా అన్ని రకాల పని వాళ్ళతో నానా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

” కాలంతో పాటు,పరిస్థితుల్ని బట్టి నిర్వచనాలు మారుతూ ఉంటాయి దామోదర్. ఒకప్పుడు పనివాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఒకరు కాకపోతే మరొకరు వచ్చేవారు. కాబట్టి వాళ్ళు భయంతో యజమానుల చెప్పుచేతల్లో ఉన్నారు. నేడు విద్యాధికులు ఎక్కువ ఉన్నారు. శ్రామిక పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. కాబట్టి రాజ్యం వాళ్ళదే ఇప్పుడు. విద్యాధికులలో ఒకళ్ళు మానేస్తే,పదిమంది, తక్కువ వేతనాలకి కూడా చేయటానికి సిద్ధంగా ఉండటంతో, ఉద్యోగస్తులు యజమానుల కంట్రోల్ లో ఉంటున్నారు” అన్నాడు రామకృష్ణ.

” అంటే దోపిడీకి చదువుతో సంబంధం లేదు అనేగా అర్ధం. మరి బలహీనులు ఎవరూ”? అడిగాడు దామోదర్.
“కాలానికి అనుగుణంగా మానసిక బలహీనులు, ఆర్ధిక బలహీనులు అని ఉంటారు. అయినా , ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను కానీ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి అని మాత్రం చెప్పగలను ” అన్నాడు దామోదర్.

Written by PVS Krishnakumari

పీ.వీ.యస్.కృష్ణకుమారి.
ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్
శ్రీవాణి మోడల్ హైస్కూల్
9494510994

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

” కర్పూర హారతులియ్యరమ్మా…” మంగళహారతి

మన మహిళ మణులు- దీపా నిదాన కవి