గూటి పక్షులు – గులాబి ముళ్లు

అందమైన లోకమనీ రంగురంగు లుంటాయని అందరూ అంటుంటారు రామరామ అంత అందమైన కానే కాదు చెల్లెమ్మా….. చెల్లెమ్మ

ఈరోజు ఉదయం ఈ విషయం విన్నప్పటి నుండి ఈ పాట నా మదిలో మెదులుతూనే ఉంది. పాట చిత్రీకరణకు, నేను విన్న విషయానికి ఏ విధమైన సంబంధం లేకపోయినా అందులోని భావం ఈ సంఘటనకు చక్కగా సరిపోలడమే అందుకు కారణం.

నేను ఈ పాటపై విశ్లేషణ రాయడం లేదనీ, సంఘటనను విశ్లేషించడానికి ఆ పాటను ఒక నమూనాగా స్వీకరించాననే విషయాన్ని పాఠకులు గమనించవలసిందిగా మనవి.

ఒక పాటను గేయ రచయిత ఒక సంఘటనకు ఆధారంగాగానీ, స్పందించి గానీ రచించి ఉండవచ్చు. దానిని ఒక దర్శకుడు తెరకెక్కించి ఉండవచ్చు కానీ ఆ చిత్రం విడుదలై జనంలోకి వెళ్లిన తర్వాత, శ్రోతలు దానిని విన్నప్పుడు కొన్నికొన్ని సార్లు అది తమను చూసే, తమ గురించే వ్రాసారా అన్నంతగా భావానికి లోనవుతారు. అందులోని సాహిత్యం వారి అనుభవాలకు , పరిస్థితులకు అద్దం పట్టడంతో ఆ విధమైన అనుభూతికి లోనవుతూ ఉంటారు.

అందులో భాగంగానే ఈ సంఘటన చూసిన తక్షణం నా మనసులో ఈ పాట మెదలడంతో దీన్ని అన్వయిస్తూ ఈ రచనను కొనసాగించాను.
తెల్లవారుజామున ఐదు గంటలకి రావాల్సిన పనిమనిషి ఏడున్నరైనా రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందాని ఆ గృహిణి ఆలోచిస్తూండగానే గేటు తీసుకుని లోపలికొస్తున్న పనిమనిషి కనిపించింది.ఎప్పుడూ హుషారుగా పనులు చేస్తూ, కబుర్లు చెప్పే సుజాత ఈరోజు ముభావంగా ఒకదాని వెంట ఒకటిగా పనులన్నీ చేసుకుంటూ వెళ్లడం చూసి, ఏదో విషయం ఉండే ఉంటుందన్న నిర్ణయానికి రావడానికి ఆ ఇంటి ఇల్లాలికి పెద్దగా సమయం పట్టక పోవడానికి కారణం గత ఇరవై సంవత్సరాలుగా ఆమె ఆ ఇంట్లో పని చేస్తూనే ఉంది. కాబట్టి మనస్తత్వాలైనా, పరిస్థితులైనా, ఇంటి వ్యవహారాలైనా ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుందన్న విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (ఇంటి విషయాలు పని వాళ్లకు తెలియకుండా వ్యవహరించడం కుటుంబ సభ్యుల బాధ్యత మరియు నేర్పు అనే విషయం కొంతమందిలో తలెత్తవచ్చు.అది నూటికి నూరు పాళ్ళు నిజం. నేను దాన్ని కాదనడంలేదు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎంతో కొంత తెలియకుండా ఉండడమనేది అసాధ్యం. ఆ విషయం గురించి మాట్లాడాలంటే చాలా లోతుగా చర్చించాల్సి ఉంటుంది. పలు కోణాలలో విశ్లేషించాల్సి ఉంటుంది. నాణానికి మరో పార్శ్వమైన ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేసి , ప్రస్తుత అంశాన్ని కొనసాగిస్తాను)

ఇంతకీ ఆ పాటకి ఈ విషయానికి ఉన్న సంబంధం ఏమిటో ఓసారి చూద్దాం.

ముభావానికి కారణమేమిటని అడిగిన ఆ ఇల్లాలికి సుజాత చెప్పిన సమాధానంతో కళ్ళు బైర్లు కమ్మాయి.
“ఈడ్చి దవడ పగలగొట్టక పోయావా?”
“వాడి జీవితం బాగుండాలని రెక్కలు ముక్కలు చేసుకొని మీరిద్దరూ ఇంత కష్టపడితే వాడు చేసిన సన్మానం ఇదా?”
“ఇప్పుడే ఇలా మాట్లాడుతున్న వాడు రేపు ఉద్యోగం వెలగబెడితే ఇంకెలా ఉంటాడో ?”

“ఏ హోటల్ లోనో పనికి పెడితే చిప్పలు కడుక్కుంటూ ఉంటే,వాడి రోగం కుదిరేది” అంటూ ఆవేశంతో ఊగిపోతోంది. ఆమె గొంతు గద్గదమ వడంతో విషయం ఏమిటా అంటూ లోపలికి వెళ్ళిన నాకు ఇద్దరి కళ్ళలోంచి నీళ్లు టపటపా రాలిపోవడం కనిపించింది.
ఇక్కడ ఈ ఇల్లాలి గురించి కాస్త వివరించాల్సిన అవసరం ఉంది. ఈమె కోపం వెనుక ఒక చక్కని న్యాయం, ఈమె ఆవేశం వెనుక గొప్ప ఆశయం ఉంది. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అన్నీ ఉన్న తల్లిదండ్రుల కూతురుగా ఒక సాధారణ కుటుంబం నుండి సంపన్న కుటుంబంలోనికి అతి చిన్న వయసులో కోడలిగా అడుగు పెట్టింది. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సాదక బాధకాలుగానీ , రెండు కుటుంబాల్లోని ఆర్థిక అసమానతలకు సంబంధించిన విషయాల్లోగానీ ఈమెకు చాలా అనుభవాలున్నాయి.

స్వతహాగా ఈవిడ ఒక ప్రేమమూర్తి. తన వారినే కాకుండా బంధువులను,స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, చివరికి ఇంట్లో పని వారిని కూడా చాలా గొప్పగా ప్రేమిస్తూ ఉంటుంది.ఎవరికి ఏ కష్టం వచ్చినా అది తనదే అన్నంతగా విలవిల్లాడటమే కాకుండా,శాయశక్తులా తన వంతు సహాయాన్ని అందజేస్తూ ఉంటుంది.

మనుషుల్ని ఎంత గొప్పగా ప్రేమిస్తుందో , ఆమెకు కోపం వస్తే అంత వేడి, వాడి ఆమె మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి విషయలు విన్నప్పుడుగానీ, ఇటువంటి సంఘటనలు ఎదురు పడినప్పుడు గానీ ఆ వేడి చాలా తీక్షణంగా ఉంటుంది. బహుశా ఆమె అనుభవాల్లోంచి, అసమానతల్లోంచి వచ్చిన సెగే ఆమెలోని ఆవేశానికి కారణమై ఉండవచ్చని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను.

ఇద్దరు పిల్లల తల్లిగా వారికి చక్కని విలువలు నేర్పించి, ప్రయోజకులుగా తీర్చిదిద్దింది.

ఇక్కడ ఈ ఇల్లాలికి సంబంధించిన వివరణ ఇంతగా అవసరమా? అనే ఆలోచన పాఠకుల్లో కలుగవచ్చు. నేను ఈ విషయాన్ని ఇంత లోతుగా చర్చించడానికి కారణం ఇటువంటి వ్యక్తులు తమ చుట్టూ ఉండే సమస్యలను తమదైన కోణంలో చూస్తూ , తమకు చేతనైన విధంగా ఆ సమస్యకు పరిష్కారాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఏ పత్రికలకు గానీ, మరే సామాజిక మాధ్యమాలకుగానీ తెలియని అజ్ఞాత సంఘ సంస్కర్తలు వీరు.

మంచినీ, మంచి వ్యక్తులని తెర వెనుక నుంచైనా సరే సమాజానికి తెలియజేయాలనే ప్రయత్నమే నేను ఈ విషయాన్ని ఇక్కడ ఇంతగా విశ్లేషించడానికి కారణం.

ఇంతకీ ఈ వ్యాసానికి కేంద్ర బిందువైన విషయం కొత్తదేమీ కాదు. పత్రికలు, బుల్లితెర, వెండి తెరలపై కెక్కడమే కాకుండా, జనాల నాలుకలపై నాట్యమాడిన సాధారణ విషయమే. కాకపోతే ఇది నిత్యనూతనం. పాత సీసాలోని కొత్త సారాయి.

సుజాత పదహారేళ్ళ వయసులో పెళ్లి చేసుకొని , భర్త చిటికెన వేలు పట్టుకొని కాపురానికి రావడం, రెండేళ్ల ఎడంతో వరుసగా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. భార్యాభర్తలిద్దరూ నిరక్షరాస్యులు కావడం, అందువల్ల వారు పొందిన అవమానాలు, చేదు అనుభవాలే పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలనే గట్టి సంకల్పానికి కారణమనీ, దానికోసం వారు పడిన పాట్లు అన్నీ ఆ ఇంటి ఇల్లాలికి కొట్టిన పిండే.
సుజాత భర్త చక్కటి మేస్త్రి. భవన నిర్మాణంలో అతని అనుభవం, మెళకువలు చూసి కాంట్రాక్టర్లు ముచ్చట పడేవారు. పదిమంది పని వాళ్ళను బృందంగా సంఘటిత పరిచి , వారితో కలిసి పనులు కుదుర్చుకునేవాడు. చెప్పిన సమయానికి పని పూర్తి చేసి అప్పగించడంతో అందరి మెప్పును పొందగలిగేవాడు. అయినప్పటికీ కేవలం ఆ పని మీదే ఆధారపడకుండా, ఎంత చిన్న పనైనా చేయడానికి వెనుకాడేవాడు కాదు.
ఒక బహుళ అంతస్తుల భవనాన్ని కట్టే సమయంలో అతను పైనుండి కింద పడటంతో తలకు, కాళ్లకు,చేతులకు బలమైన గాయాలయ్యాయి. అసలు పనులు చేయగలుగుతాడా? అనే అనుమానం అందరిలో కలిగింది కానీ అతను ధైర్యాన్ని కోల్పోకుండా కాస్త కోలుకోగానే, జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునే దిశగా తల్లిదండ్రుల ద్వారా సంక్ర మించిన కొద్దిపాటి ఆస్తిని అత్యంత నేర్పుతో విక్రయించి, ఆ తర్వాత
ఎప్పటి మాదిరిగానే పని చేయడం మొదలుపెట్టాడు.

మరో సందర్భంలో సుజాత ఆరోగ్యం కూడా బాగా దెబ్బ తినడంతో, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భర్త, దానికి తోడు క్షీణించిన తన ఆరోగ్యం ఎక్కడ పిల్లల చదువులకు ఆటంకంగా మారుతుందో అనే బాధ బాగా కృంగదీ తీయడంతో, అతను ఆమెకు అన్ని రకాలుగా భరోసా నందించి ముందుకు నడిపించాడు.

సుజాత నాలుగిళ్లలో పని చేసేది. గర్భం ధరించిన సమయంలో కానీ, చంటి పిల్లల్ని సాకే సమయంలో గానీ ఎన్ని ఇబ్బందులె దురైనప్పటికీ , అన్నిటినీ చక్కగా సమన్వయ పరచుకునేది. ఇద్దరు పిల్లల్ని స్కూలుకు పంపించి, చిన్నవాణ్ణి సెల్లార్లో పడుకోబెట్టి, ఒక సీసాలో పాలు, మరో సీసాలో నీళ్లు పెట్టి, అపార్ట్మెంట్ వాచ్మెన్ ని “అన్నా! నా కొడుకు లేస్తే ఒకసారి నన్ను పిలుస్తావా? అనీ, అదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్న మరో పని మనిషిని “అక్కా! నా కొడుకు లేచి ఏడిస్తే , ఈ సీసాలో పాలు పోసి పెట్టాను, పట్టిస్తావా? ” , “తొందరగానే వస్తాను. ఇక్కడే ఫలానా ఇంట్లో పని చేస్తూ ఉంటాను” అని అభ్యర్థించి , పనికి వెళ్లి మధ్య మధ్యలో వచ్చి పిల్లాడిని చూసుకుంటూ ఉండేది.
ఒకానొక సందర్భంలో మామూలు కాలేజీల్లో చదవడానికి పిల్లలు వ్యతిరేకించడంతో, భార్యా భర్తలిద్దరూ ఏమాత్రం వెను కడుగు వేయకుండా, వారిని కార్పొరేట్ కాలేజీల్లో చదివించారు.

వారికి తెలిసిన విషయం ఒక్కటే. తమకు మల్లే తమ పిల్లలు కష్టపడకూడదని. వాళ్ల ముందున్న లక్ష్యం ఒక్కటే. ఎన్ని ఇబ్బందులు పడైనా సరే తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని.

దానికి తగ్గట్టుగానే వారి శ్రమ,కల రెండూ కూడా అత్యద్భుతంగా ఫలించాయి. పిల్లలిద్దరికీ ఒకరికి ఇంజినీరింగ్ సీటు , మరొకరికి మెడికల్ సీటు దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేవు.

“ఒక మెరుపు వెంట పిడుగూ… ఒక మంచి లోన చెడుగూ……..చెల్లెమ్మ అన్నట్టుగా వారి సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు.

ఇంక విషయాన్ని ఎక్కువగా సాగదీయకుండా విషయంలోకి వచ్చేస్తాను.
పెద్దవాడి స్నేహితులు ఓ 10 మంది దాకా షాపింగ్ మాల్ లో ఎంజాయ్ చేసి, పక్కనే ఉన్న వీళ్ళ ఇంటికి రావడంతో (వాళ్ల ఇల్లు ఎలా ఉంటుందన్న వివరణ నేను ఇవ్వడం అనవసరమనుకుంటాను) సదరు పుత్రరత్నం వాళ్లతో మాట్లాడటానికి బయటికి వెళుతూ, వాళ్ళమ్మను బయటకు రావద్దనీ, వాళ్ళు వెళ్ళేంత వరకూ లోపలే ఉండాలంటూ చెప్పాడనీ, అలసిపోయి ఇంటికి వచ్చిన తన భర్త ఈ విషయం తెలిసి నిశ్శబ్దంగా పడుకుని, తెల్లవారాక ఏమీ తినకుండానే పనికి వెళ్లాడనీ కళ్ళలో నీళ్ళు తిరిగుతుండగా అతి కష్టం మీద చెప్పగలిగింది.

“గడ్డి మేసి ఆవు పాలిస్తుంది. పాలు తాగి మనిషీ విషమవుతాడు. అది గడ్డి గొప్పతనమా ….. ఇది పాల దోష గుణమా ……చెల్లెమ్మ”

పాటలోని మరో చరణం వెంటనే నా స్మృతిపథంలో మెదిలింది.

కార్పొరేట్ కాలేజీలో సీటు వచ్చేసరికి, ఆధునిక వస్త్ర ధారణ లో, అనర్గళంగా పలు భాషలు మాట్లాడుతూ, సెల్ఫ్ డ్రైవింగ్ లో అధునాతన కార్లు నడుపుతూ వచ్చే తల్లులను చూసేసరికి అంట్లు తోమే అమ్మను, తాపీ పట్టిన తండ్రిని తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి వాడికి నామోషి అనిపించింది.

ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదని నేనననుగానీ(ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఒకదాని కంటే ఒకటి ఎంత దారుణంగా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం) . అత్యంత బాధాకరమైన పలు సంఘటనలలో ఇది ఒకటి.

“ముద్దు గులాబీకీ ముళ్లుంటాయి మొగిలి పువ్వు లోనా నాగుంటాది………చెల్లెమ్మ

గులాబి పువ్వును చూసుకున్నంత అపురూపంగా పెంచారు. కానీ ఇప్పుడు దాని రంగుల సోయగం గానీ, దాని సౌకుమార్యం గానీ వారిని మురిపించడం లేదు,దానికున్న కంటకాలే వారి గుండెను గుచ్చుతున్నాయి.

ఇటువంటి పిల్లలకు తెలియాల్సిన కొన్ని విషయాలు:

1. ఉన్నత స్థాయిలో ఉన్న తల్లిదండ్రులను చూసి,నీ తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి నువ్వు అవమానంగా భావించడం కాదు.
2. పాతికేళ్లు వాళ్ళ కండలు కరిగితే గానీ నువ్వు ఈ స్థాయికి రాలేదన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.
3. నిన్ను ప్రయోజకుడిని చేయాలననే ఆలోచనే వారి శ్రమ శక్తికి అంకురమై, నీకు చక్కని జీవితాన్ని అందించాలనే ఆశయమే వారి సంకల్ప బలానికి ఊతమైందనే విషయాన్ని నువ్వెన్నడూ విస్మరించకూడదు.
4. వారి పరిస్థితులు సాన అయితే వారిద్దరూ గంధపు చెక్కలై ఆ సాన మీద అరిగితేనే నువ్వు ఈ స్థాయికి రాగలిగావు.
5. సానకు,చెక్కకు నడుమ లభించిన పరిమళ ద్రవ్యానివే నువ్వు.
6. వీరు నా తల్లిదండ్రులు అని గర్వంగా వారిని ప్రపంచానికి పరిచయం చేసి చక్కని పుత్రునిగా, ఉత్తమ పౌరుడిగా నిన్ను నువ్వు నిలబెట్టుకుంటావో, సంకుచితత్వంతో నీ స్థాయిని దిగజార్చుకుంటావో నీ చేతుల్లోనే ఉంది.
7. నీ ప్రజ్ఞాపాటవాలను అద్భుతంగా నిరూపించుకున్నావు. సంతోషమే. కానీ నీ వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
8. వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసికవేత్తలు ఎంతోమంది కేవలం సమాజ శ్రేయస్సు కోసమే చక్కని పుస్తకాలు రచించారు.
9. ఆ పుస్తకాలు చదివి సమాజానికి ఒక చక్కని నమూనాగా నిన్ను నువ్వు మలుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

సర్వేజనా సుఖినోభవంతు. లోకాస్సమస్తా సుఖినోభవంతు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

ఎడారి కొలను