అష్టాదశ శక్తిరూపిణులుగా- బొడ్డెమ్మ, బతుకమ్మ

సమసమాజ దృక్కోణమే – బొడ్డెమ్మ
వసుధైక కుటుంబ బతకమ్మలారాధన !

బతుకమ్మ రూపున పరదేవతను కొలుతు !

దాక్షాయణి గా దండము పెట్టేము
దానిమ్మలనైవేద్యమిచ్చేము !
దరిచేరు బిడ్డలా దీవించుమమ్మ!

కామాక్షి గా నిన్ను కరములెత్తి కొలిచేము
కదంబ పుష్పములలంకరించేము!

శృంగళాదేవీ గా శృంగారముగను
గునుగుపువ్వులతో నినుపేర్చేము !

చాముండి దేవిగా నిన్ను పాడేము
చామంతి చావడీలు చక్కగా చేసేము!

జోగులాంబ తల్లీ! జాజిపువ్వులతో జాతరలు చేసేము
జాగు చేయక మమ్ము దీవించు బతుకమ్మ గాను!

భ్రమరాంబికాదేవి నిన్ను బంతి పువ్వుల దండలేసేము
కోలాట,భజనలు చేసేము- కోరినా కోర్కెలన్నీతీర్చు !

మహాలక్ష్మి నిన్ను బతకమ్మగా తలచి ఆడిపాడేము
ఎర్ర తామరల పూజ నీకు చేసేము! ఎనలేని సంపదలు మాకివ్వమ్మా!

ఏకవీరాదేవి కరవీర పుష్పాల నిన్నలంకరించి, బతకమ్మగా తలచి కరములు మోడ్చేము!

మహంకాళి దేవి మందార పూలతో మాతా నిన్ను వేడుకవేడెద !
బతకమ్మ గా మా బాధలన్నీ మాన్పు కన్నతల్లిగానూ !

పురుహూతికా దేవి పారిజాతమ్ములతో పూజింతుమమ్మ !
పునర్జన్మ లేకుండా దీవించుమమ్మా!

గిరిజా దేవి నిన్ను గులాబీ దొంతరల నిలిపి
బతుకమ్మగా నిను ఆడిపాడేము!
వైతరణి దాటించి దరి చేర్చు కొమ్ము!

మాణిక్యాంబ నీకు మల్లె పూల పూజ సేతు!
మనసైన మగని నాకిమ్ము!

కామరూపా దేవి కమలాలతో అర్చింతు!
కామితములీడేర్చి కాపాడవమ్మా!

మాధవేశ్వరి నిన్ను మాధవి పూలతో మనసారా ప్రార్ధింతు !
మంగళమ్ములు మాకు దండిగా ఇవ్వమ్మా!

వైష్ణవీ దేవి నీకు విరజాజులర్పింతు !
బతుకమ్మ గా నిన్ను విలక్షణముగా పూజింతు!

విశాలాక్షి నిన్ను అడవి విరులతో అందముగ పేర్తు
విధి విధానముగ అర్చనలుచేతు !

సరస్వతి దేవిగ నీకు సాష్టాంగము చేతు
తెల్ల తామరలతో పూజింతుతల్లీ!
చదువు సంస్కారమిచ్చి- చక్కంగా చూడు!

ఆనందముగా పూల పండగ చేసి,
ఆట పాటలతో ఆడి కొలిచేము!
శక్తిరూపముల నిన్ను పూజింతు!
బతుకమ్మ యని నిన్ను బాగుగా వేడేము!

రంగరాజు పద్మజ ✍

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వృక్షమాత

దసరా ( దశ -హర )