రమక్కతో ముచ్చట్లు -దిల్ ఖోల్కె….!!

శనార్థులు. ఎట్లున్నరు.

మా ఊర్లే సరోజనమ్మ అని ఉండే. మొన్న సచ్చిపోయింది.ఆమె తమ్ముడు గుర్నాదం. ఆయన కూడా పెద్దమనిషే అయ్యిండు, డెబ్భై ఏండ్ల సరోజనమ్మ సావుల 65 ఏండ్ల తమ్ముడు పొగిలి పొగిలి ఏడ్వ బట్టిండు.
“సూసినవా అక్క తమ్ముండ్ల అనుబంధాలు ఎంత మంచిగున్నయ్ గిట్లుండాలె అన్న నేను మా తమ్ముని తోని
ఆడు అప్పుడు గిట్లన్నడు ‘ నీ..మొకం ఆల్లిద్దరూ మాట్లాడుకోక 25 ఏండ్లయ్యిందంట, ఈ నడుమనే తను ఎంత తప్పు జేసినా అని బేజారాయ్యిండంట, అచ్చి మాట్లాడుదాము అనుకున్నాడంట, గంతల్లనే సావు కబురు అచ్చిందని, గుండెవలుగుతున్నడు ” అన్నడు.
నేనైతే.. పరేషాన్ అయిన ఇని గీ ముచ్చట
‘ఏమ్ మనుషుల్రా బాబూ అనుకున్న!
ఇది మనము మస్తు ఆలోచించాల్సిన ముచ్చటనే. శాన మందికి పనికిమాలిన పట్టింపులు ఉంటయి. ఏమటికని, కాలు నిండెనా కడుపునిండెనా.. జర జెప్పుండి. బేకారు రోషాలు. దునియాలా అన్నిటికన్నా పిరేం ఏందంటే..పానమే కదా!
పానం పోతే మల్ల తెచ్చుకుంటామా?
ఊకే పనికిమాలిన రేశాలకు పోయి కోపాలు పెట్టుకునుడు, మాటలు బంద్ చేసుడు చేస్తే గిట్టనే ఉంటయి లాస్ట్ కు.
ఇగో మనిషి చచ్చిపోతే పోయినట్టు కాదు.
వేరే దేశమే పోతరు ఇంకో జాగాలకే పోతరు, నీకు కలుసుడు కాదు.
ఇగో నేనైతే ఒక ముచ్చట చెప్తున్న మీకు.. మనోళ్ళు అనుకున్నోల్లతోనీ మాటలు బంద్ చేసుడు మంచి పద్ధతి కాదు. దిల్ ఖోల్కే మాట్లాడుండి. మీకు ఏం నచ్చుత లేదో చెప్పుండి, ఈ పొద్దుగాకుంటే రేపన్నా అర్థం చేసుకుంటరు. యాడనో ఆడ ఆల్లకు కూడా మనసు ఉండే ఉంటది. ఆ మనసు దాంక మనం పోవాలె. లోతుకు పోయిన మనసుకు జర తొవ్వ చేసుకోవాలె.
ఎందుకు పాడైన ‘ఈగోలు’ ఏమన్న కట్టుకపోతమా?!.
నువ్వు పెద్దోని వైతే క్షమించు, చిన్నోనివైతే క్షమాపణలు అడుగు. గంతే.! లొల్లి కతం దుకాన్ బంద్!!
అక్క మీద ఊకెనే కోపం పెట్టుకున్నడు మా గురునాథం మామ, నిజమేరుకయి క్షమాపణలు అడుగుదామనుకునేసరికి అక్క సచ్చేపాయే. ఇప్పుడు ఏం జేత్తడు చెప్పుండి. బతికినన్ని నాల్లు మనాది వడాలె. గా పరిస్థితి రావద్దు అంటే మన బుర్రకి జర తెలివి ఉండాలి. బుర్ర తోని బుర్రొక్కటే ఉంటే సరిపోదు మనసు కూడా ఉండాలె. ఆ మనసులా జెరంత తడి ఉండాలె. ఎదుటోళ్లని అర్థం చేసుకోవాలనే ఆలోచన ఉండాలె. “ఎప్పటికీ నేనే గెలవాలె. తప్పు చేసిన గుడ్క నేనే గెలవాలె. నాకందరు ‘సారీలు’ చెప్పాలె నేను మాత్రం ఎవ్వల్లకు సారీ జెప్ప అనుకునేటోల్ల కన్న పెద్ద మూర్ఖులు ఎవ్వల్లు లేరు దునియాల!
రోడ్లు ఊసేటోళ్ల నుంచి రాజ్యమేలేదా ఎవలైనా సరే.. తప్పు చేస్తే ఒప్పుకోవాలె.
అంతే తప్ప ఆత్మీయులను మనుషులను పోగొట్టుకోవద్దు. శిన్న శిన్న పట్టింపులకు పోయి మాటలు బంద్ జెయొద్దు.
పానం ఉండంగనే అందరికీ ప్రేమను పంచుదాము. అందరి ప్రేమను గౌరవాన్ని పొందుదాము. మీకు ఎరుకనా… ఇంతకుమించిన పూజ ఏం లేదు తమ్మీ -శెల్లె.
మీకు నేను చెప్పింది నచ్చితే, ఒక పాలి మీరు ఓలతోని మాటలు మానేసిన్రో వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడి సూడుండి ఎట్లుంటదో…! శానా బరువు దిగినట్టు ఉంటది. మీరే చెప్తరు ‘అక్క నువ్వు చెప్పిన మాట నిజమని ‘ ఇంటరా మరి అందరూ..!
దిల్ ఖోల్కే మాట్లాడుండి. మాటలు బంద్ చేసినోళ్ల దగ్గరికి పోయి మాట్లాడి ఎట్లా అనిపిస్తదో నాకు చెప్పండి.
ఉంట మరి
ప్రేమతో
మీ రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బతుకమ్మ పాట

వృక్షమాత