మన మహిళామణులు -అనూరాధ మెరుగు

అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నర్సంపేట హైస్కూల్ విద్యార్ధిని అనూరాధ సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వెయ్యి రూపాయల బహుమతి పొందారు.నేడు హిందీ అధ్యాపకురాలిగా జాతీయ భాష పై అవగాహన పట్టు పిల్లలలో కల్గించాలని క్లాస్ రూం లో హిందీ అక్షరాలు వ్యాకరణం ఆకర్షణీయంగా చిత్రాల రూపంలో అలంకరిస్తారు.మరి ఆమెను గూర్చి ఇంకా తెల్సుకుందాం…

 


నా పేరు అనూరాధ మెరుగు.
పుట్టిన ప్రాంతం నర్సంపేట ,వరంగల్ జిల్లా ,తెలంగాణ రాష్ట్రం . అమ్మ పేరు సుజాత.నాన్న పేరు కుమారస్వామి.నాకు ఒక చెల్లి , ఇద్దరు తమ్ముళ్ళు.నా వివాహం 1999 వ సంవత్సరంలో జరిగింది.
మావారి పేరు ప్రవీణ్ కుమార్.
నాకు ఇద్దరు అమ్మాయిలు ప్రణవిప్రియాంక ,వైష్ణవికృతి.
బాల్యంలోనే బాలమిత్ర చందమామ కథలు వంటి పుస్తకాల పట్ల ఆసక్తి.
ప్రాథమిక స్థాయిలోనే నానమ్మ తాతయ్యలకు దినపత్రిక చదివి వినిపించానని వారు చాలా సంతోషించేవారని అమ్మ అపుడపుడు చెప్పిన మధురానుభూతి.

చిన్నప్పుడు నేను రాసేదాన్ని ఏమంటారో కూడా తెలియని వ్రాతలను అమ్మ మెచ్చుకోవడంతో ఉత్సాహంతో అంతర్గత భావాలను ఇష్టమైన రీతిలో రాసి చూపించడమే కానీ వాటిని దాచుకోవాలని అవగాహన లేని బాల్యం.
వెరసి మది భావకళికలు వయసు పెరుగుతున్న కొద్దీ విప్పారిన కుసుమాలై విరిసి… పదవ తరగతిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర అనే వ్యాసం జిల్లా స్థాయికి ఎంపికై పత్రికలో ప్రచురించబడడం , రాష్ట్రస్థాయికి ఎంపికై వేయి రూపాయల నగదు బహుమతిని గెలుచుకోవడంతో రాయాలనే తపన రెట్టింపై నేను ఒక రచయిత్రిగా మారడానికి దోహదం చేసాయి.

తర్వాతి రోజుల్లో పై చదువుల కోసం అమ్మమ్మ తాతయ్య (హిందీ అధ్యాపకుడు)గారింట్లో ఉండి డిగ్రీ , టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసాను.
అడపా దడపా మనసాగక రాసిన చిన్న వాక్యాలు అప్పుడప్పుడు చదువుకునేదాన్ని.
ఆ తర్వాత దేవుని అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం , నా ప్రయత్నం తో డి.ఎస్.సి.2000(జడ్.పి.హెచ్.ఎస్. కల్వల) లో ఉపాధ్యాయురాలిగా నియమితురాలినయ్యాను.
ట్రైన్ జర్నీ , పిల్లల చదువులు, మావారి ప్రోత్సాహంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ , బి.యిడి.(ఇన్ సర్వీస్) పూర్తి చేయడం , ఇంటి బాధ్యతలతో సమయందొరికేది కాదు.అయినా
మనసు సంవేదన చెందినప్పుడు , ఆనందంలో విహరించినపుడు… ఆటవిడుపుకు కొన్ని , ఆందోళనతో మరికొన్ని నాదైన శైలలో అక్షరీకరించుకుని , నోట్బుక్స్ వెనకాల లేదా డైరీలో రాసుకొని , తోటి ఉపాధ్యాయులకు చూపించి వారందించిన ఉత్సాహాన్ని ఉద్దీపనగా చేసుకున్నా.

మళ్లీ ఎందుకో ఉరుకుల పరుగుల జీవితంతో నా కలానికి కొంత వ్యవధి వచ్చింది.
అయినా ఆక్రోశంతో గుండె మండినప్పుడు, సంతోష భావోద్వేగాలలో మది నిండినప్పుడు కలము కరములో ఒరిగి ,వేళ్ళ మధ్యలో ఒదిగి నా ఉప్పొంగే భావాల ఝరిని జాలువార్చింది.

ఆ తర్వాత సహజంగానే‌ సమకాలీన సమాజంలో అందరిలాగే ఒడిదుడుకుల జీవితాన్ని చవిచూసాను. కన్నతండ్రి ఆకస్మిక మరణం మానసికంగా నన్నెంతో కుంగదీసింది .అదే సమయంలో ఉద్యోగజీవితంలో ఏర్పడిన సమస్యలు ,
భర్త అనారోగ్యము ఇలా వరుస కష్టాల నుండి బయటపడడానికి చాలా సమయం పట్టింది.
అటువంటి విపత్కర పరిస్థితుల్లో నాకు తోడైనవి నాకు అండగా నిలిచినవి నా అక్షర మాలికలే.
సాహిత్యాన్ని వీలైనంతవరకూ చదవడం…రాయడం చేస్తూ నన్ను నేను సమాధానపర్చుకున్నాను.
దిగులు మబ్బులు కమ్ముకుని, ఆక్రోషపు అకాల వర్షంలో తడిపి తల్లడిల్లేలా చేసింది విధి. నిషీధి రాత్రులు కార్చిన నాకన్నీటి ధారలను తలనిమిరి తలగడ పీల్చుకుంది.

దుఃఖాలు కలకాలం ఉండవనీ , వచ్చేపోయే అతిథులనీ… ధైర్యపు కవచాన్ని ధరించమనీ… నా ఆత్మవిశ్వాసం గుండెను నిమిరింది.
మేరు పర్వతమోలే ప్రతిభను మెరుగు పరచుకొమ్మని మనోధైర్యాన్ని మదిలో నింపింది.
కవనపు అక్షరాల కళాస్ఫూర్తి కవచాన్ని కానుకిచ్చింది.
కాలాన్ని నిందించొద్దని ,నెమ్మదిగా ఆత్మీయుల మమతానురాగపు స్పర్శతో సాగిపొమ్మని సలహా ఇచ్చింది.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతిబంధకాలైన సంవేదన సంఘర్షణలను తట్టుకుని , అక్షర ప్రతినిధినై , సాహితీక్షేత్రంలో కార్యకర్తనై కొందరి కన్నీళ్ళైనా తుడిచి , కొందరి కలలైనా నెరవేర్చి, సమాజహిత సాహిత్యాన్ని అందించాలనే ఆకాంక్షతో ముందుకుసాగుతున్నాను.

సమకాలీన మానవ జీవన సంవేదనకు ప్రతిబింబమైన కవిత్వాన్ని సమ సమాజానికి సాహితీ ప్రతినిధినై అందించాలనే నా కల ఇలపై నెరవేర్చుకోవాలని అభిలాష.

 

చిన్న జీతమైనా పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని పోషించి , మా ఉన్నత చదువులకు వ్యయ ప్రయాసలకోర్చిన మా డాడీ యొక్క అనిర్వచనీయమైన స్ఫూర్తిదాయక మాటలు నా చెవుల్లో ఇప్పటికీ గింగురుమంటూనే ఉంటాయి.

చూసే కళ్ళని బట్టి ప్రకృతి సౌందర్యం రెట్టింపుతుంది .సమాజ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనే వారి మాటలను సోపానాలుగా కవిత్వం వ్రాయడం ప్రారంభించాను .కలం పొదల్లోనే సేదదీరే నా ఆలోచనలు స్వేచ్ఛాపూరిత కాంక్ష పక్షులు.
ప్రకృతి ప్రతి అణువుకి ప్రతిస్పందననందిస్తూ… మాతృభాష తలపులతో తేజరిల్లే తెలుగునెపుడూ వదలని చెలిమి చేస్తానని మాట ఇస్తూ…
నన్ను ప్రోత్సహించి , కవితా సంపుటిని వెలువరించడంలో మార్గదర్శిగా నిలిచిన గురువర్యులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారి చరణకమలాలకు వందనమొనరుస్తూ….
మీ అనూరాధ మెరుగు

 

కవయిత్రి పరిచయం

పేరు:అనూరాధ మేరుగు
కలం పేరు : వీణాప్రియాకృతి
తల్లిదండ్రులు: సుజాత , కుమారస్వామి
సోదరులు : వేణు గోపాల్ , నందకిషోర్
సోదరి:స్నేహలత
ధర్మ పతి : శ్రీ పిండి ప్రవీణ్ కుమార్
వంతెనలు ( పిల్లలు) : ప్రణవి ప్రియాంక, వైష్ణవి కృతి

జన్మస్థలం. : నర్సంపేట( వరంగల్ జిల్లా)
పెరిగిన ప్రదేశం: కాజీపేట (అమ్మమ్మ తాతయ్య గారిల్లు)
నివాసం: రెడ్డి కాలని, హనుమకొండ.

విద్య. :M.A.(హిందీ),M.Sc.(వృక్ష శాస్త్రము).H.P.T. ; B.Ed.

వృత్తి. : ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.
ప్రవృత్తి. : సాహిత్య రచనా వ్యాసంగం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం. విద్యా .ఆధ్యాత్మిక సాహిత్య వ్యాప్తికి కృషి సల్పుట మాతృభాష తెలుగు, జాతీయ భాష హిందీ ని పరిరక్షించుట… ప్రోత్సహించుట.

బిరుదులు. :కలంభూషణ్., సున్నితం కవయిత్రి., హైకూ దివ్వె., హైకూ మిత్ర., శత శ్రీ పదయిత్రి.,శతాక్షరీ మిత్ర.

రచనలు ఆముద్రితాలు :కవితలు. కథలు . పాటలు. సమీక్షలు సున్ని తాలు. వ్యాసాలు. శ్రీ పదాలు., హైకూలు., ఏక,ద్వి.,త్రి.,పదులు., చిరు కవితలు., ట్యూన్ లిరిక్స్., అలంకార కవితలు.హిందీ బాల్ గీత్.

తెలుగు భాషను పరిరక్షించుకునే కొరకు రచనలు,వ్యాసంగాలురాయడం… పర్యావరణ పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహించడం గ్రంథాలయ ఉద్యమం కోసం అవగాహన కల్పించడం. సాహిత్య సామాజిక సాంస్కృతిక సేవలు అందించడం ముఖ్య ఉద్దేశం.
విద్యార్థులను స్కౌటింగ్ అండ్ గైడింగ్ లో శిక్షణ ఇవ్వడం… పాఠశాల లో జాతీయ పండుగలను ఘనంగా నిర్వహించడం. విద్యార్థులచే హిందీ నాటకాలు వేయించడం..

పురస్కారాలు సన్మానాలు

డా.సామాజగన్ మోహన్ ప్రతిభా పురస్కారం.
ప్రతీ మండలంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
నేషనల్ గ్రీన్ కోర్ (ఎన్.జి.సి.)కో ఆర్డినేటర్గా జిల్లాస్థాయి గ్రీన్ టీచర్ పురస్కారం.
SLTA ఆధ్వర్యంలో ఉత్తమభాషా పండితురాలిగా జిల్లా పురస్కారం.
మట్టి గణపతి విగ్రహాల తయారీ సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ టీచర్ పురస్కారం.
తెలుగు వెలుగు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో బాలసాహిత్యగేయ పురస్కారం.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు మధురిమ పురస్కారం.
సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో విజ్ఞాన జ్యోతి పురస్కారం.
శ్రీమతి సరోజినీ నాయుడు ఎక్స్లెన్స్ అవార్డు.
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుబ్రహ్మ బిరుదు.
తెలుగు వెలుగు సాహిత్యవేదిక దీపారాధన పురస్కారం.
తెలుగు భారతి సాహిత్య సేవా సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కవితా దినోత్సవ పురస్కారం.
కణిక సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు.

పున్నమి
మొలక
నవతరంగాలు
మెట్రో ఉదయం
అంతర్జాల పత్రికలలో అనేక కవితలు అచ్చయినవి.

వెలువడినసంపుటిలు:-

కరోనా పై నా కలం
ప్రకృతి పరిరక్షణ పై నా కలం (వెలువడాల్సి ఉంది)
కవిత్వ సవ్వడులు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్…. లో స్వతంత్ర్య్ తా కా శోభా హిందీ…

జనదీపిక సాహిత్య వేదిక ద్వారా ప్రశంసాపత్రాలు.
మహతీ సాహితీ సంస్థ ద్వారా ప్రశంసాపత్రాలు.
ప్రజా సేవలో మనం సేవా సంస్థ ప్రశంసా పత్రం.
ఐక్య వేదిక డిజిటల్ టీం ద్వారా ప్రశంసాపత్రం.
హృదయభారతి ఛారిటబుల్ ట్రస్ట్ గానోత్సవ వేడుకలలో ప్రశంసా పత్రం.
కవిసేన అక్షర సేద్యం ద్వారా అభినందన పత్రాలు.
నెల్లుట్ల శకుంతల వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా ప్రశంసా పత్రం.
శ్రీరామనవమి సందర్భంగా…..
కళాశ్రీ సాహితీ వేదిక
మహతీ సాహితీ కవి సంగమం
అభినందన పత్రాలు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సూరేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత దేశ భవిత అంశానికి ప్రశంసా పత్రం.
బతుకమ్మ సంబరాల్లో ఉట్నూర్ సాహితీ వేదిక ద్వారా ప్రశంసాపత్రం.
సిద్ధిపేట సాహిత్య అకాడెమీ ప్రశంసా పత్రం.

జాతీయ పురస్కారం బెస్ట్ టీచింగ్ ఎక్స్లెన్స్ అవార్డు.

ప్రేరణ పౌండేషన్ హైదరాబాద్ వారిచే సావిత్రిబాయి పురస్కారం.

సాహిత్య రంగంలో కృషిని గుర్తిస్తూ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా
కవి సమ్మేళనం లో సాహిత్య సన్మాన పురస్కారం.

సాంస్కృతిక వేదికలకు వ్యాఖ్యాతగా, సభ సమావేశాలకు వ్యాఖ్యాతగా
రంగవల్లి పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సామాన్యుని మనస్తత్వం – కథ

విషయసూచిక (Content)