బాధ్యత The responsibility

20-9-2024 తరుణి పత్రిక సంపాదకీయం

దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే పెద్ద ముళ్ళకంప అడ్డువస్తే గుచ్చుకున్న ఆ ముండ్లను తీసి అక్కడే పెట్టం, పక్కన దూరంగా పడేస్తాం. ఇది ఎవరు నేర్పక్కర్లేదు సహజసిద్ధంగా ఒక బాధ్యతగా చేస్తారు ఎవరైనా. నాకు గుచ్చుకుంది కదా మరొకళ్ళ గుచ్చుకుంటే ఎలా అనే ఒక మంచి ఆలోచనతో…
– నాకు ఎలాగూ గుచ్చుకుంది కదా ఇంకొకళ్ళకి కూడా గుచ్చుకోవాలి అని అక్కడే పెట్టడం అనే ఉద్దేశంతో ఉండే వాళ్ళు మూర్ఖులు. బాధ్యతకు, బాధ్యత రాహిత్యానికి ….మంచికి , చెడుకు …మధ్యన ఇటువంటి విషయాల ప్రస్తావన వస్తుంది.

– చుట్టూ ఉన్న ప్రకృతిని పాడు చేయవద్దని పౌరులు గా చేయవలసిన పనులు చేయాలి అనీ… చేయకూడని పనులు అనీ… కొన్ని ఉన్నాయి. చెడ్డ పనులు చేయకూడదనే జ్ఞానం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి.
ఒక చిన్న ఉదాహరణ గా చెప్పుకుంటే…నలుగురున్న కుటుంబంలో అన్నం గిన్నెలో ఉన్న అన్నాన్ని ఒక్కరే మొత్తం తినేయకుండా తన వాళ్ళ కొరకు అట్టే పెట్టడం అనే బుద్ధి సహజసిద్ధంగా వస్తుంది రావాలి.
కుటుంబంలో నిర్వహించాల్సిన బాధ్యతలు ఒక రకమైనవి ఉంటే పౌరులుగా నిర్వహించాల్సిన బాధ్యతలు మరికొన్ని ఉంటాయి.
వ్యక్తిగత బాధ్యతలే కాకుండా సమాజం పట్ల , ఈ దేశం పట్ల , పరిసరాల పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఏ దేశస్తులైనా వాళ్ళ దేశ సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకుంటూ, బాధ్యతతో జీవించాలి.
విదేశాలలో కూడా వారి వారి దేశ సంస్కృతి వెల్లివిరిసేలా ఎన్నెన్నో పండుగలను, ఉత్సవాలను, జాతరలను చేస్తారు. ఒక క్రిస్మస్ తీసుకోండి ఒక థాంక్స్ గివింగ్ డే తీసుకోండి…
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలాంటివి చాలా ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద పెద్ద procisions తీస్తారు . చక్కగా అలంకరించిన carnivals అంటే రథ యాత్ర వంటి వి కనువిందు గా నిర్వహిస్తారు. వివిధ పురాణ పాత్రలు ( ఆయా దేశాల్లోనివి) వేషం ధరించి మరీ ప్రదర్శనలు చేస్తారు. ఎన్నో రంగులు ఎన్నో రకాల అలంకరణలు ఉపయోగిస్తారు వాటికి ధర్మకోల్ లాంటివి పెట్టక తప్పదు. ఇవేవీ కూడా పర్యావరణానికి మంచిది కాదు వాళ్లకు తెలుసు .కానీ ,వాటిని తీసుకువెళ్లి నీళ్లలో పడవేసే పద్ధతి లేదు. ఒక వేళ వేసినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వాటిని ప్రిజర్వ్ చేయడమో … లేకుంటే డిస్ట్రబ్ చేయడమో! అది వాళ్ళ నిర్ణయం . కానీ నేచర్ దెబ్బతినకుండా చూస్తారు. ఇలా చైనా జపాన్ ఫ్రెంచ్ జర్మనీ , లండన్ ఏ దేశస్తులైనా ఘనమైన పండుగలను చేస్తుంటారు . ఎందుకు చేస్తున్నారు? కేవలం వాళ్ళ దేశ సంస్కృతిని భావితరాలకు అందజేయడం కొరకు నిర్వహించారు, నిర్వహిస్తున్నారు.ఇది తప్పు లేదని అనుకున్నప్పుడు … తప్పు ఎక్కడ చేస్తున్నామో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని మన దేశంలో జరుగుతున్నది ఏంటి? ఎందుకు జరుపుతున్నాం ఎలా జరుపుతున్నామని చూడాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి.
బతుకమ్మ పండుగ జరుపుకునే ఉద్దేశ్యం ఎంతో గొప్పది. పూల పండుగ. సామూహిక ఉత్సవం. బతుకమ్మ పేర్చడానికి ఉపయోగించి ఈ పూల బతుకమ్మ ను నీళ్లలో నిమజ్జనం చేయడం వలన నీటికి ఏకలుషితమూ అంటదు.
అలాగే వినాయక చవితి ఉత్సవాల తర్వాత వినాయకుడి పూజలో ఉపయోగించిన పత్ర పుష్పాలు పర్యావరణానికి ఏ విధమైన హాని చేయవు నీళ్లలో నిమజ్జనం చేసిన ఏం కాదు. వినాయకులను మట్టితో చేసి పూజించే సంప్రదాయం నుంచి ఇప్పటికీ ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయో తెలుసు కాబట్టి వీటినించి మనం ఏం నేర్చుకుంటున్నాము అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. గణపతితో ఏ చిక్కు లేదు. నీళ్లలో వేయగానే కరిగిపోతుంది. చెరువులు నిండి ఇబ్బందులు కలగవు. కానీ ప్రస్తుతం చేస్తున్న వినాయకులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ చేస్తున్నారు. ఇది కాబట్టి, ఉపయోగించే రంగులు కూడా ప్రమాదకైన కరమైన రంగులు కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత పౌరుల మీదనే ఉంటుంది.
పోటీలు పడి పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి పెట్టడమే గొప్ప అనుకునే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది?దిగుమతి చేసుకున్నాం? దీనివల్ల లాభాలు ఎవరికి జరుగుతున్నాయి? ఈ ఆలోచన చేయడం లేదు యువత.
చెరువులో వేయగానే ఆ విగ్రహాలను తీసే బాధ్యత ప్రభుత్వాల పనయింది. డైరెక్టుగానో ఇండైరెక్టుగానో పన్నుల రూపంగానే మరే రూపంగానో ప్రజల పైన ఈ భారం పడుతుంది అని తెలియనిది ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? ఈ ప్రశ్నలు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు వేసుకోవాలి. తల్లిదండ్రులు ఆత్మ విమర్శ చేసుకుని పిల్లలకు చెప్పాలి. గణపతి పూజ చేయడం మంచిది కానీ ఆ పద్ధతులను అవలంబిస్తున్నామా లేదా? వేదికల ముందు డీజే పాటలు పెట్టి డాన్సులు చేయడం ఎంతవరకు సభ్యత అనిపిస్తుంది?
దేవుడికి సంబంధించిన పూజా విశేషాల విషయాలను చెప్పడం కీర్తనలు పాడడం పురాణాలు చెప్పడం మాతృభాష వచ్చేలాగా భక్తి పూర్వకమైన పాటలు పాడడం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలి కానీ భక్తి పాటలు పాడించాలి,సినిమా పాటల డీజే గోలల్లో భక్తి ఎక్కడైనా కనిపిస్తుందా? ఇటువంటి డీజే డాన్సులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కదా ! అది సరిపోవడం లేదా? భక్తితో పూజ చేయాల్సినటువంటి దేవుడి విగ్రహం దగ్గర మత్తు పదార్థాలు తీసుకొని భక్తి ఉన్నట్టు నటించడం ఎందుకు?

మన పిల్లల బాధ్యత మనదే అని అనడం ఎందుకు అంటే…. సిగరెట్ తాగడం ప్రాణాలకు హానికరం అని డబ్బా మీద ప్రింట్ వేసినా తాగేటువంటి అలవాటు ఉన్నటువంటి జనులు….. ఏదీ లెక్కకు తీసుకోరు! కానీ… కుటుంబ సభ్యులు తప్పకుండా లెక్కలు తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే వినాయకుడి ఉత్సవాలకు వెళ్లేప్పుడు వాళ్ళు ఎవరిని చూస్తున్నారు ఎలా చూస్తున్నారు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారని గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నపిల్లలప్పటినుంచి ఇవే చూసి చూసి పెరిగిన పిల్లలు వాళ్ళు యుక్త వయస్సు కు రాగానే అలాగే చేయాలి కావచ్చు అలా చేస్తేనే ఎంజాయ్ చేస్తాము కావచ్చు అని వాళ్ళు నేర్చుకుంటున్నారు.ఇవన్నీ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఉండదు. మొక్కై వంగనిది మానై వంగదు .కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవకుంటే భవిష్యత్తులో ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. తల్లిగా బాధ్యత ఏంటి అని ప్రతి స్త్రీ తనంతాను ప్రశ్నించుకోవాలి సూక్ష్మంగా పరిశీలించాలి . విస్తృతంగా అధ్యయనం చేయాలి చుట్టుపక్కల వాడిని పరిశీలించాలి ఎవరు తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు అనేది గమనించాలి. తల్లిగా తనే ఒక మహా పరాక్రమశాలిగా అవతారం ఎత్తాలి భర్తని బెదిరించాలి కొడుకులకూ కూతుళ్లకు చెప్పాలి వినకుంటే ఏ అస్త్రాలనైనా ఉపయోగించాలి! కానీ కాపాడుకోవాలి!!
సంస్కృతిని కాపాడుకోవాలి, తమ సంతానం సుగుణశీలాన్నీ కాపాడుకోవాలి. స్త్రీలు శక్తి సంపన్నులు. తలుచుకుంటే ఏదైనా చేయగలరు. కాబట్టి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అయినా సంస్కృతిని కాపాడే బాధ్యత అయినా తల్లిగా తనదే బాధ్యత! తండ్రి బాధ్యత ను గుర్తు చేసి దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదే. ఇది ముమ్మాటికి నిజం!! ఎందుకంటే దారిలో ముళ్ళను ఏరిపారేయాలి దాచుకోవద్దు!! This is our responsibility.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జాతీయాలు

ఎడారి కొలను