నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం -13వ భాగం

జరిగిన కథ:

పిల్లల కోరిక మీద అర్జున్, సుభద్ర అమెరికా వస్తారు. ముందుగా కొడుకు అభిమన్యు దగ్గరకు మినియాపోలీస్ వస్తారు. కొడుకు కుటుంబముతో హాయిగా గడుపుతుంటారు. అక్కడ సీనియర్ సెంటర్ ఉందని, అందులో వివిధ రకాల కార్యక్రమాలు సీనియర్ సిటిజన్స్ కోసం నిర్వహిస్తుంటారని తెలిసి అందులో చేరుతారు. అక్కడ కలుస్తున్న  అమెరికన్స్ ద్వారా అమెరికా జీవనవిధానాలను ఆసక్తిగా తెలుసుకుంటుంటారు. సీనియర్ సెంటర్ స్నేహితురాలు హెలెన్ ఆహ్వానం మీద హెలెన్ ఇంటికి వెళుతారు సుభద్ర, అర్జున్. హెలెన్ దగ్గర ఉన్న మూడుకోతుల బొమ్మ గురించి, హెలెన్ ప్రేమ వివాహము, కుటుంబం గురించి తెలుసుకుంటారు…

ఇక చదవండి…

“స్పూర్తీ, వాకింగ్ కు వెళ్ళివస్తానమ్మా” స్పూర్తి తో అన్నాడు అర్జున్.

అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆలూ చెక్కు తీస్తున్న, సుభద్రను చూస్తూ, “ఈరోజుకు నువ్వు వద్దులే, కూతురితో నా మీద నేరాలు చెప్పుకో” అన్నాడు నవ్వుతూ.

“పర్మిషన్ ఇచ్చారుగా! అలాగే చెప్పుకుంటాను లెండి. అయినా మీ కూతురు మీమీద చెపితే ఊరుకుంటుందా?” జవాబిచ్చింది సుభద్ర. ముందురోజు శుక్రవారం నాడు, సుభద్ర, అర్జున్ లు మినియాపోలీస్ నుంచి, అట్లాంటా కూతురి దగ్గరకు వచ్చారు.

తల్లి, తండ్రుల వాదన వింటూ “డాడీ ఇదో కాఫీ తాగి వెళ్ళండి” అని అర్జున్ కు ఒక కప్ కాఫీ ఇచ్చి, ఇంకోటి తీసుకొని గ్యారేజ్ లోకి వళ్ళింది. స్పూర్తి వెనుకే తనూ వెళ్ళాడు అర్జున్. అక్కడ విజయ్, సౌమ్య, శౌర్య  ముగ్గురూ కలిసి ఏవో చెక్కలు చూస్తున్నారు. కాఫీ తాగుతూ “ఏమిచూస్తున్నారు?” ఆసక్తిగా అడిగాడు అర్జున్.

“నా రీడింగ్ టేబుల్, కుర్చీ పాడయ్యాయి తాతా. అవి పారేసి కొత్తవి బిగించుకుంటున్నాను. డాడీ, శౌరీ హెల్ప్ చేస్తున్నారు” చెప్పింది సౌమ్య.

వాళ్ళ మాటలు విని అటు వచ్చిన సుభద్ర, “హాండీ మాన్ ను పిలవలేదా? నువ్వే చేసుకుంటున్నావా?” అడిగింది.

“లేదాంటీ, వీలయినంత వరకు మేమే చేసుకుంటాము. వాళ్ళు చాలా కాస్ట్లీ కూడా” అన్నాడు విజయ్.

“కాస్ట్లీ అనే కాదమ్మా! పిల్లలకు వాళ్ళ పనులన్నీ సొంతంగా చేసుకోవటము కూడా రావాలికదా! అది నాకు మా డాడీ నేర్పిన సూత్రమే! కదా డాడీ అప్నా కాం అపనే ఆప్ కరో” నవ్వుతూ తండ్రి వైపు చూసింది.

“అవునవును. కానీ ఇవి కాస్త కష్ఠమయిన పనులు కదమ్మా” అన్నాడు అర్జున్.

“రెడీమేడ్ టేబుల్ అవీ ఏమీ దొరకవా? చిన్నపిల్లలు ఇంట్లో చేసుకోవలసిందేనా?” అంది పిల్లల వైపు చూస్తూ  సుభద్ర.

“అమ్మా ఇక్కడ అన్నీ విడివిడి భాగాలు, మంచంవి, కుర్చీలవి ఇలా ఫర్నీచర్ వి అన్నీ పాకేజెస్ లో దొరుకుతాయి. ఆ పాకేజ్ అంతా ఇంటికి తెచ్చుకుంటాము. ఆ తర్వాత వాటిని మనమే అందులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అసెంబుల్ చేసి బిగించుకోవాలి.  మంచం, అల్మారా, టేబుల్, చిన్నదైనా, పెద్దదైనా బరువైన విడిభాగాలు అలానే కష్టపడి చేసుకోవాలి. నువ్వన్న హాండీ మాన్ సౌకర్యం, ఇప్పుడు దొరుకుతోంది.  కాని ఎక్కువమంది సొంతంగా చేసుకోటానికే ఇష్టపడతారు, మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆ సౌకర్యం లేదు. మొదట్లో మా మంచం బిగించుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఇప్పుడవుతే  అలవాటు అయ్యింది. మా స్నేహితులు రాజా వాళ్ళవుతే  ఉత్త చెక్క ముక్కలు కొని, వాటితో కార్పెంటరీ ప్రాజెక్ట్  లాగా పిల్లలకి నేర్పిస్తూ, సొంతంగా చేసుకుంటున్నారు. అవన్ని వాళ్ళు  కొనుక్కోలేకో, లేకపొతే డబ్బులు ఆదా చేద్దామనో కాదు. పిల్లలకి చిన్నతనం నుండే పని విలువ, శ్రమ విలువ నేర్పేందుకు. మేము చెక్క ముక్కలు తేవటము లేదు కానీ ఇలా పాకేజ్ తెచ్చి, మాతో పాటు పిల్లలతోనూ చేయిస్తున్నాము. అది  వారి మీద వారికి confidence  పెంచటానికి. ఇంకా ముందుముందు భవిష్యత్తులో చిన్న చిన్న వాటికే బెంబేలెత్తిపోకుండా, సాధ్యమైనంత వరకూ ఎవరి మీదా ఆధారపడకుండా ఉండాలని అంతే కానీ వాళ్ళను మేమేమీ కష్ఠపెట్టటం లేదు. నీకొకటి చెప్పనా? అది విన్నావంటే ఏమంటావో? నేను పైప్ లీకులు, బాత్ రూంస్ లలో జుట్టూ అదీ పడి నీళ్ళు పోక బ్లాక్ అవుతే అవి క్లీన్ చేసి, ఫిక్స్ చేయటంలాంటి ప్లంబింగ్ పనులు కూడా చేస్తూంటాను” అంది స్పూర్తి.

“అవునా నిజమా?” ఆశ్చర్యపోయింది సుభద్ర.

“అవును ఆంటీ మేము ఇక్కడకు వచ్చి గొప్ప పనిమంతులము అయ్యాము. అక్కడ ఉన్నప్పుడు ఏ చిన్న రిపేర్ వచ్చినా పనివాళ్ళను పిలిచేవాళ్ళము. వాళ్ళు సమయానికి రాక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడైతే చాలా వరకు మేము ఇంట్లోనే చేసుకుంటాము. చిన్న చిన్న కార్ రిపేర్లు నేనే చేసుకుంటాను. మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మేము అసెంబుల్ చేసుకున్నవే. సౌమ్య చాలా వరకు హెడ్  బోర్డ్, ఫుట్ బోర్డ్, స్లాట్స్  లాంటి పార్టులు, నేను చెప్పినట్టు ఎత్తి పట్టుకోవటం, రెంచీ, స్క్రూ డ్రైవర్, మేకులు అందివ్వటం, తెచ్చిపెట్టటం అవీ సహాయం చేస్తుంది. ఇప్పుడిప్పుడే శౌరి కూడా వాడు చెయ్యగలిగినవి చేస్తున్నాడు. కాస్త బరువైనవి ఏవైనా చేయాలంటే స్పూర్తి సహాయం చేస్తుంది” అన్నాడు విజయ్.

“అవును ఇలా పిల్లలకు నేర్పించటమూ, ఇంటి పనులల్లో భాగస్వాములు చేయటము మంచి పద్దతి. అందరూ కలిసి చేసుకుంటుంటే పిల్లలకు, పేరెంట్స్ కు మధ్య మంచి స్నేహ వాతావరణం, అవగాహన కూడా ఏర్పడుతుంది. మా చిన్నప్పుడు మేమూ ఇలాగే మా తాతయ్యకు, నాన్నకూ సహాయం చేసేవారం. బజారు సామానులు తేవటము, మిల్ కు వెళ్ళి పిండి పట్టించుకు రావటము మగపిల్లలతో, ఇంటి పనులు ఆడపిల్లలతో చేయించేవారు. మా నాన్న బజారు సామాన్లు తెచ్చాక డబ్బు లెక్క సరిగ్గా కాగితం మీద రాయించేవారు. ఇప్పుడవుతే ఆడామగా తేడా లేదు. అన్ని పనులూ అందరూ చేసుకోవలసిందే” అని  తన చిన్నతనపు రోజులను గుర్తు చేసుకుంటూ అన్నాడు అర్జున్.

“నేనూ ఓ చేయి వేస్తాను. నాకూ పని చెప్పు అల్లుడూ” సరదాగా విజయ్ తో అన్నాడు అర్జున్.

“తాత హెల్ప్ చేస్తున్నారుగా, నేను వెళుతాను” అంటూ చిన్నగా జారుకోబోయాడు శౌర్య.

“నో నో… అదేం కుదరదు” అంటూ వాడిని వడిసి పట్టుకుంది సౌమ్య.

వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారులే అన్నట్లు,స్పూర్తి, సుభద్ర లోపలికి వెళ్ళారు.వెజిటబుల్ పలావ్ చేయటానికి అన్నీ తీసుకుంటున్న కూతురుకి, కాప్సికం, కారెట్, ఆలూ కట్ చేసిస్తూ కబుర్లు చెపుతోంది సుభద్ర. ఏదో గుర్తొచ్చినట్లు “ఇక్కడ కూడా సీనియర్ సెంటర్ లు ఉన్నాయా?” అడిగింది.

“మీకు ఇంట్రెస్ట్ ఉందని కనుకున్నానమ్మా. మనకు దగ్గరలోనే, Charles అనే చోట ఒకటి, Sexton అనే చోట ఒకటి రెండు ఉన్నాయి. బస్ లో అయితే రెండు డాలర్ లు, కాబ్ లో అయితే నాలుగు డాలర్ లు చార్జ్ చేస్తారు. మధ్యలో ఎక్కడ అయినా కావాలంటే దిగవచ్చు. కానీ మళ్ళీ కాబ్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ నాలుగు డాలర్ లు కట్టాలి. అవి కొంత పరిధి వరకూ సీనియర్ సిటిజెన్స్ ను ఇలా కన్సెషనల్ రేట్స్ లో తీసుకు వెళుతాయి. కాబట్టి ఒక్క సీనియర్ సెంటర్ కు అనే కాదు వాటి పరిధిలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఇంకా ‘వై’ లో కూడా మీకు మెంబర్షిప్ తీసుకున్నాను. ఫామిలీ మెంబర్ షిప్ అని మనందరికీ కలిపి తీసుకున్నాను” అంది స్పూర్తి.

“వై నా? అంటే అదేమిటి?” కుతూహలంగా అడిగింది.

“YMCA అక్కడ డాడీ జిమ్ లో ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. నీకు యోగా కూడా ఉంటుంది. మనం బాట్మెంట్ ఆడుకోవచ్చు. వాకింగ్ పాత్ ఉంటుంది. వాకింగ్ చేయవచ్చు. చలికాలం, ఇండోర్ ఆక్టివిటీస్ చాలా ఉంటాయి” వివరించింది.

“మనకు ఓపిక ఉండి వెళ్ళాలే కానీ ఇక్కడా బోలెడు ఆక్టివిటీస్ ఉన్నాయి” అంది సుభద్ర.

“అవును కాకపోతే వాటి గురించి తెలియాలి. వెళ్ళాలన్న ఆసక్తి ఉండాలి. మినియాపోలీస్ లో పటేల్ సాబ్ చెప్పటం తో తెలిసింది. ఇక్కడ మీకు ఇలాంటివి ఇష్టం అని తెలుసు కాబట్టి మేము కనుకున్నాము” బిరియానీ కోసం కూరముక్కలు పెద్ద గిన్నెలోని పోపులో వేస్తూ అంది స్పూర్తి.

“రేపు మన కాలనీ లోనే పాట్ లక్ డిన్నర్ ఉంది. రేపు ఏమి చేసి తీసుకెళుదాము?” అడిగింది.

“ఇండియన్స్ పార్టీనా?” అడిగింది సుభద్ర.

“కాదు. కొందరు ఇండియన్స్, కొందరు అమెరికన్స్. అందరూ ఉన్నారు ఇక్కడ. అందరమూ బాగా కలిసి ఉంటాము. ఇంక ఎండలు తగ్గి, వానలు, చలి మొదలవుతాయి కదా, అందుకని ఇక్కడే ఇళ్ళ మధ్య పాట్ లక్ డిన్నర్ పెట్టుకున్నాము. కాకపోతే BOC” అంటూ నవ్వింది స్పూర్తి.

“అదేమిటి?”

” ఏమీ లేదు ‘బ్రింగ్ యువర్ ఓన్ చేర్’ అన్నమాట. కుర్చీలు కావలనుకున్నవారు తెచ్చుకోవాలి మరి. లేకపోతే కింద హాయిగా కూర్చోవచ్చు.  మాములుగా BOD అంటారు. ‘అంటే బ్రింగ్ యువర్ ఓన్ డ్రింక్’ అన్నమాట. ఇలా అందరమూ కలిసి సరదాగా పాట్ లక్ చేసుకునేటప్పుడు ఎవరి డ్రింక్ వాళ్ళము తీసుకెళుతాము. ఊరికే సరదాగా అన్నానులే. ఇక్కడేగా కుర్చీలు తీసుకెళ్ళ వచ్చు. అట్లాంటా లో ఇండియన్స్ ఎక్కువగానే ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు అసోషియేషన్ లో కూడా చేరుస్తాను. మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాలకు వెళుతుంటాము. దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడా చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి” అంది స్పూర్తి.

“తెలుగు అసోషియేషన్ కు ఏమీ వద్దులే. మాకు అక్కడా చాలానే ఏవేవో కార్యక్రమాలు ఉంటాయి కదా. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి వాళ్ళతో కలుస్తే బాగుంటుంది. అమెరికన్స్ గురించి తెలుసుకోవచ్చు. దేవాలయాలల్లో ఏదైనా ఉంటే వెళుదాము. ఇక్కడి దేవాలయాలు ఎట్లా ఉంటాయో చూద్దాము. మీ ఫ్రెండ్స్ ను కలుద్దాము” జవాబిచ్చింది సుభద్ర.

“వచ్చే వారం మా ఫ్రెండ్ ప్రభ ఇంట్లో సత్యనారయణవ్రతం ఉంది. మిమ్మలిని తీసుకు రమ్మంది. ఇంకా ‘ మౌంట్ రస్మోర్ కు, డకోటా ‘ కు వెళుదాము. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను” అంది స్పూర్తి.

“ఫుల్ టైట్ ప్రోగ్రాంస్ పెట్టావా?” నవ్వింది సుభద్ర.

“మరి ఇంట్లో కూర్చోబెడతానా?” అంటూ రైయితా కోసం సుభద్ర తురిమిన కీరా తురుము తీసుకుంటూ తమాషాగా అంది.

“ఏమిటీ తల్లీకూతుళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారా? వంట ఏమైనా చేసారా లేదా?” అడుగుతూ లోపలికి వచ్చాడు అర్జున్.

“మామ్… హంగ్రీ” పిల్లలు అరుస్తూ వచ్చారు.

“అప్పుడే చేసేసారా?” ప్లేట్స్ పెడుతూ అడిగింది సుభద్ర.

“టేబుల్ చేసాము. ఇంకా రెండు కుర్చీలు చేయాలి. ఆకలి వేస్తోంది. తిన్నాక చేస్తాము” జవాబిచ్చింది సౌమ్య.

“చెమటలు కారిపోతున్నాయి. వెళ్ళి ఫ్రెషప్ అయి రండి. అంతా రెడీనే” టేబుల్ మీద డిషెస్ పెడుతూ అంది స్పూర్తి.

హో మామ్… అని అరుస్తూ లోపలికి పరిగెత్తారు పిల్లలు!

(సశేషం)

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మధురవాణి 

జాతీయాలు