దొరసాని –

ధారావాహికం – 47 వ భాగం

అంతకుముందే ఫ్రెష్ కావడానికి అలేఖ్య సుధీర్ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు సాగర్.

రెండు కార్ల నుండి సుధీర్ తల్లిదండ్రులు మరియు సౌదామినీ తల్లిదండ్రులు దిగి లోపలికి వచ్చారు ..అలేఖ్యకి సుధీర్ సౌందర్య లకి మంగళహారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకొని రావాలి కాబట్టి వాళ్లని బయట నిలబడమని చెప్పారు… సౌందర్య సామాన్లు కొన్ని తీసుకొని సౌదామిని వాళ్ళ బెడ్ రూమ్లో పెట్టడానికి లోపలికి వచ్చింది..సౌందర్య సామాను సర్దుతూ నిలబడింది సౌదామిని… ఇంతలో బాత్రూంలో నుండి బయటకు వచ్చిన సాగర్ సౌధామిని చూసి మెల్లగా వెనక నుండి వచ్చి

” సౌ” అని పిలిచాడు..

ఒక్కసారిగా ఉలిక్కిపడిన సౌదామిని వెనకకు తిరిగి చూసింది…

” సాగర్” అని గట్టిగా పిలిచింది.

” నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అసలు ఊహించలేదు” అన్నది సంతోషంగా సౌధామిని.

” నేను కూడా ఊహించలేదు బావగారు లాప్టాప్ మర్చిపోయినందువల్ల ఇవ్వడానికి బయలుదేరాను నేను వేరే రూట్ లో వచ్చాను అందుకే ఇక్కడ వరకు వచ్చి ఇచ్చి వెళ్దామని వచ్చేసాను అలాగే నిన్ను కూడా కలవచ్చు అనుకున్నాను ఏంటో మనసు అదోలా అయిపోయింది..నువ్వు వెళ్ళాక.” అన్నాడు సాగర్..

” నాక్కూడా అలాగే అనిపించింది సాగర్ సరే, మనము తర్వాత మాట్లాడుకుందాం ఇలా లోపల ఉంటే బాగుండదు” అని బయటకు వచ్చింది సౌదామిని.

అలేఖ్య అత్తగారు దిష్టి తీసి హారతి ఇచ్చి మనవరాలిని కోడల్ని లోపలికి ఆహ్వానించింది…

” ఇద్దరూ గదిలోకి వెళ్లి మొహం కాళ్లు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకోండి తల్లి” అని చెప్పింది.

అలేఖ్య సుధీర్ పాపను తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు.

” ఏదైనా హెల్ప్ చేయనా వదినా ‘ అని అడిగింది సౌదామిని..

” మీ అన్నయ్య చేస్తారు లే సౌదామిని” అని చెప్పింది అలేఖ్య.

సౌదామిని సుధీర్ నాయనమ్మ తాత దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ దగ్గర కూర్చుంది.

కాసేపు అందరితో మాట్లాడి లోపలికి వెళ్ళింది సౌదామిని.

అందరికీ జ్యూస్ చేసుకుని తీసుకుని వచ్చి ఇచ్చింది.

తర్వాత అందరూ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి గదులలో వెళ్ళిపోయారు..

సాగర్ సౌధామిని ఇద్దరూ మేడ మీదకి వెళ్లి కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు.. ఇద్దరికీ ఒకరి మనసు ఒకరికి పూర్తిగా అర్థమయిపోయింది ..అందుకని సౌదామిని కూడా ఒక వారం రోజుల లోపల గోపాలపురం వస్తానని చెప్పింది…

సాయంత్రం ఊరికి వెళ్తానని అందరి దగ్గరకు వెళ్లి వస్తానని చెప్పి సౌందర్యనీ కాసేపు ఎత్తుకొని ముద్దు పెట్టుకుని బయలుదేరాడు సాగర్.

అలా కొన్ని రోజులు అలేఖ్య సౌందర్య సాగర్ అక్కడే ఉండిపోయారు…

అనుకున్నట్లుగానే వారం రోజుల్లో గోపాలపురానికి వచ్చింది సౌదామిని.

అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని నవ్వుల ఒడి బాలసదనంకు వెళ్లి వస్తుంది సౌదామిని.

మరో వారం రోజులకి సాగర్ అమెరికా వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు..

సౌదామినికి సాగర్ కి ఈ ఎడబాటు బాధగానే ఉంది..

ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇద్దరు చాలా సేపు మాట్లాడుకున్నారు ఇక్కడికి వస్తే సాగర్ ఏం చేయాలి అనేది ఆలోచించుకున్నాడు.. కొన్ని సౌదామిని సలహాలు కూడా తీసుకున్నాడు.

రోజు బాలసదనంకి సౌదామినితో పాటే వెళ్లి వస్తున్నాడు సాగర్..

ఇదంతా ఓకంట గమనిస్తూనే ఉంది నీలాంబరి.. కానీ! అడిగితే బాగుండదు అని సంశయంతో అలాగే ఊరుకుంది..

సౌదామిని సాగర్ కూడా ఇంట్లో చెప్పాలని అనుకున్నారు.

ఆరోజు సాయంత్రం సౌదామిని తొందరగా వచ్చింది…

సాగర్ కూడా సౌదామిని కోసం ఎదురు చూస్తున్నాడు…

నీలాంబరి భూపతి ఇంట్లోనే ఉన్నారు…

రాగానే సౌదామిని ఇంట్లో కట్టుకునే జార్జెట్ చీర కట్టుకొని వచ్చింది..

వైట్ చీర మీద అక్కడక్కడ వంకాయ రంగు పువ్వులు ఉన్నాయి. అదే రంగు బ్లౌజ్ వేసుకుని మెడలో సింపుల్గా గొలుసు వేసుకొని సాధారణంగా ఉంది సౌదామిని. కానీ ఆమె అందం వ్యక్తిత్వం రెండూ పోటీ పడుతున్నాయి.

అందరికీ కప్పుల్లో కాఫీ తీసుకొని వచ్చింది… నీలాంబరి భూపతి సోఫాలో కూర్చుని ఉన్నారు..

” అత్తయ్యా! అంకుల్ కాఫీ తీసుకోండి” అని కాఫీ తో పాటుగా బిస్కెట్ల ట్రే కూడా పెట్టి తను ఒక కప్పు తీసుకొని సాగర్ కి ఒక కప్పు ఇచ్చి కూర్చుంది.

కాఫీ తాగుతూ సాగర్..

” అమ్మా! నాన్నా! మీకు ఒక విషయం చెప్పాలి” అన్నాడు మెల్లగా.

ఏ విషయమో అప్పటికే ఊహించగలిగింది నీలాంబరి కానీ భూపతికి ఏ విషయము తెలియదు..

” చెప్పు నాన్నా!” అన్నది నీలాంబరి.

సాగర్ సౌదామిని వైపు చూశాడు… సౌదామిని కళ్ళల్లో కొంచెం భయం కనబడుతుంది పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అని…

సాగర్ సౌదామిని కళ్ళల్లోకి చూసి ఏం కాదు అన్నట్టుగా సైగ చేసి చెప్పాడు..

అక్కడే కూర్చున్న భూపతి “ఏమైంది సాగర్ ఏంటో చెప్తానన్నావు చెప్పడం లేదు దేని గురించి” అన్నాడు.

చెప్పడానికి కొంచెం తటపటా స్తూ తల్లి నీలాంబరి మొహంలోకి చూసాడు సాగర్..

” ఏంట్రా అమెరికాకు వెళ్ళకముందే ఏదైనా పెళ్లి సంబంధం చూడమంటావా పెళ్లి చేసుకుని వెళ్తావా” అన్నది చిలిపిగా సాగర కళ్ళలోకి చూస్తూ…

కంగారు పడ్డ సాగర్ “అయ్యో అది కాదమ్మా నేను చెప్పాలనుకున్నది” అన్నాడు.

” మరి ఏంటో చెప్పు ఎందుకు ఇంత నానుస్తున్నవ్ విషయం చెప్పడానికి?” అన్నది నీలాంబరి.

” నువ్వు చెప్పిన దాంట్లో కొంచెం నిజమే కానీ బయట సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు” అన్నాడు సాగర్..

” అవునా నువ్వే అమ్మాయిని చూసేసుకున్నావా? ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి?” అన్నది నీలాంబరి..

మౌనంగా కూర్చుని వీళ్ళనే గమనిస్తుంది సౌదామిని..

” పోనీ నువ్వు చెప్పు సౌదామిని సాగర్ ఎవరినైనా అమ్మాయిని చూసుకున్నాడా” అన్నది నీలాంబరి.

సౌదామని తల అడ్డంగా నిలువుగా ఊపింది…

పిల్లలు సిగ్గు పడుతున్న విషయం అర్థం చేసుకున్న నీలాంబరి…

” సాగర్ సౌదామిని అంటే ఇష్టమా నీకు”? అని అడిగింది.

గబ గబా అవును అన్నట్లు తల ఊపాడు..

సౌదామిని వైపు చూసిన నీలాంబరి..” మరి నీకు మా అబ్బాయి అంటే ఇష్టమా!” అని అడిగింది.

ఒక్కసారి కళ్ళు ఎత్తి నీలాంబరి కలలోకి చూసి సిగ్గుతో తలదించుకుని అవును అన్నట్లుగా తల ఊపింది…

భూపతి వీళ్లందరినీ ఆశ్చర్యంగాను సంతోషంగానూ చూస్తున్నాడు..

” నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది? మీరంతా ఒకటయ్యారా!” అన్నాడు నవ్వుతూ..

సాగర్ సౌధామిని సోఫాలో నుండి లేచి నీలాంబరి కాళ్లకు భూపతి కాళ్లకు నమస్కారం చేశారు..

నీలాంబరి ఇద్దరినీ చెరో చేయితో దగ్గరికి తీసుకొని..

” ఇలాంటి శుభవార్త మీరేదో చెబుతారని నేను ముందే ఊహించాను నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సౌదామిని లాంటి అమ్మాయి నా కోడలు కావడం నా అదృష్టం మీ అమ్మానాన్న గార్లకు ఈ విషయం నేను చెప్తాను వాళ్లు ఒప్పుకుంటే త్వరలోనే మీ వివాహం చేస్తాము” అన్నది సంతోషంగా..

సాగర్ సౌధామిని సంతోషానికి హద్దే లేదు…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు – గిది మీకు తెలుసా?

మధురవాణి