రామాయణాన్ని తెనుగీకరించిన తొలి కవియిత్రి ఆతుకూరి మొల్ల 

ప్రాచీనాంధ్రయుగంలో ప్రసిద్దులైన చాలామంది కవిపండితులు, స్త్రీలు, కవిత్వం రాయలేరని చెప్పారు. ‘తథ్య మిథ్యా విముక్తి ముగ్ధలకు గలదే‘  అనే శ్రీనాథుని ప్రశ్నను చాలా మంది అంగీకరించారు. స్త్రీలకు విధ్య అందునా కవిత్వం నిషిద్దమైన, ప్రతికూల పరిస్థితుల్లో కూడా కవిత్వం చెప్పిన కవయిత్రుల రచనలను నాటి చారిత్రక, సమాజిక, సాంస్కృతిక దృక్పథం గురించి విశ్లేషించి అద్భుతమైన పద సంపదను అందించిన అతి తక్కువ ప్రాచీన కవియిత్రులలో ‘మన మొల్ల‘  అనుకునే కవియిత్రి, తెలుగులోకందరామాయణం‘  రాశారు. దాన్నె మొల్లరామాయణం అనికూడా ప్రచారంలో ఉంది. పైగా ఆమె కిందికులంలో జన్మించటం వల్ల విపరీతమైన వ్యతిరేకతను కూడా కలిగించిందని తెలుస్తుంది.  

భూజన కల్పకంబగుచు, భుక్తికి మూలమంచు నా రాజువు దైవమైన రఘురాము నుతించిన దప్పుగల్గునే!‘ అంటూ నాటి సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కొంది మొల్ల. 

1440-1530 దశకంలో కడప జిల్లా గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. పరిశోధనల అనంతరం మొల్ల జీవితకాలం 1440-1530 గా నిర్ధించారు. చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం ప్రబంధయుగపు కవియిత్రి అని చెప్పవచ్చు. ప్రబంధకావ్య లక్షణాలలో ఒకటైన వర్ణనలకు ఈ కావ్యంలో అత్యధిక ప్రాధాన్యత నిచ్చారీమె.  

తెలుగులో మొల్లరామాయణంగా ప్రసిద్ధి చెందినరామాయణ రచనా శైలి చాలా సరళమైనది మరియు రమణీయమైనది. తాళ్లపాక అన్నమయ్య (అన్నమాచార్య) భార్య తాళ్లపాక తిమ్మక్క తర్వాత చెప్పుకోదగ్గ రెండవ తెలుగు కవయిత్రి మొల్ల. 

ఈమె ఇంటి పేరు ఆతుకూరివారు. కుమ్మరికుటుంబంలో జన్మించింది. కులాన్నిబట్టికుమ్మరి మొల్లఅని వ్యవహరించబడింది. తండ్రికేతనపెట్టి శివభక్తుడని, చిన్నతనం లోనే తల్లిని కోల్పోవటం చేత తండ్రి ఆమెను గారాబంగా పెంచారని, ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం కావడంతో పెళ్ళి కూడా చేసుకోలేదని స్దానికులు చెబుతారు. చివరి దాకా తండ్రి ఇంటి పేరునే ఉపయోగించడం మూలాన మొల్ల పెళ్ళి చేసుకోలేదని తెలుస్తుంది. వాఙ్మయ మూలాల ఆధారంగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని తెలుస్తుంది 

 మొల్ల స్వస్థలం గోపవరం గ్రామం, గోపవరం మండలం, కడప జిల్లా. ఈ గ్రామంకడప పట్టణానికి 56 కి.మీ దూరంలో, బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈమె ఈ ప్రాంతానికి చెందినదని మొల్ల రామాయణంలోని ఈ క్రింది పద్యం ద్వారా తెలుస్తుంది. 

గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రామం లేవియు నెఱుఁగ, విఖ్యాత గోపవరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత – నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి 

నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయం గోపవరంలోనే ఉంది. తరతరాలుగా గ్రామస్థులు అక్కడే ఉన్న మొల్ల బండకు పూజ చేస్తారని వినికిడి. శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకుచెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరుఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు కూడా ఉంది. పెద్దన, తెనాలి రామలింగడు కూడా గోపవరం వచ్చి మహా భక్తురాలైన కవయిత్రి మొల్లను దర్శించినట్లు ఆమెపై చేసిన దూషణను మన్నించవలసినదిగా ప్రాధేయపడినట్లు చెబుతారు. 

మొల్ల రామాయణము, సంస్కృతంలో, శ్రీ వాల్మీకివిరచితమయిన శ్రీమద్రామాయణమును ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. మొల్ల రామాయణంలోకందపద్యాలుఎక్కువగా ఉండడం వల్ల,కంద రామాయణం అని కూడాఅంటారు. తన గ్రంథంలో అనేకానేక తెలుగు సంస్కృత కవులను స్తుతించారు. వారి ప్రత్యేకతలను ప్రశంసించారు. దీనిని బట్టి వారికి సంస్కృతాంధ్ర భషలలో ప్రవేశ ముందని పేర్కొనవచ్చు.  

శ్రీ కృష్ణదేవరాయలు సమయంలో ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది. ఆమె రాసిన రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో రచించింది. ఈ కావ్యాన్ని కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. తెలుగులో వ్రాయబడిన అనేక రామాయణాలలో మొల్ల రామాయణం చాలా సరళమైనది. ఆమె రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉండేదని సాహిత్యకారుల అభిప్రాయం. 

మొల్ల ఎలాంటి సంప్రదాయ విద్యను అభ్యసించలేదని, తన సహజ పాండిత్యానికి ఆ భగవంతుడే కారణమని మొల్ల చెప్పుకొంది. తాను రచించిన రామాయణాన్నిఅప్పటి రోజుల్లో అనేక మంది కవులు చేస్తున్న విధంగా ధనము, కీర్తిని ఆశించక ఏ రాజులకూ అంకితము నివ్వలేదు. ఇది ఆమె రామభక్తికి నిదర్శనము.  అంతకు మునుపే చాలామందిరామాయణాన్ని గ్రంథస్తం  చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ తన పద్యకావ్యం మొదటి పద్యాలలో తాను రాసుకున్నది. 

రాజిత కీర్తియైన రఘురాము చరిత్రమున్ గవీశ్వరుల్
తేజ మెలర్ప చెప్పి రని తెల్సియు గ్రమ్మర జెప్పనే లనన్
భూజన కల్పకం బనుచు, భుక్తికి ముక్తికి మూలమంచు, నా
రాజును దైవమైన రఘురాము నుతించిన దప్పు గల్గునే? 

మొల్ల జీవిత కాలంపై పరిశోధకులలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనని కారణంగా ఆమె రాయలవారి సమయాని కంటే ముందుగానే కవయిత్రి అయి ఉంటుందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు బట్టి తెనాలి రామలింగడు సమకాలీకురాలని మరికొంతమంది పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడా అని మరికొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ‘సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి‘ దగ్గరనుండి ‘తిక్కకవిరాజు భోజు‘ వరకూ మొల్ల నుతించింది. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాథుడినిస్మరించటం చేత ఈమె శ్రీనాథుని తరువాత కాలమున ఉండేదని తెలుస్తుంది. చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. 

తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదంవల్లనే కవిత్వం చెబుతున్నాననీ ఆమె అన్నది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండి ఉండాలనిపిస్తున్నది. తనకు పాండిత్యం లేదని మొల్ల వ్రాసినది సంస్కృతిలో భాగమైన అణకువ, విధేయత వంటి లక్షణాల కారణంగానే తప్ప వేరే కాదని స్త్రీ రచయిత్రుల చరిత్ర వ్రాసిన నిడదవోలు మాలతి భావించారు. గ్రంథావతారికను బట్టి ఈమె తక్కిన కవయిత్రులవలె గురువునొద్ద విద్యనభ్యసించలేదని, గోపవరపు శ్రీకంఠ మల్లేశుకృపను కవిత్వం చెప్పనేర్చినదని తన రచనలో పేర్కొన్నది. ఈమె కావ్య లక్షణాదికములేమి తెలియక పోయినా నన్నయ్యతిక్కన వంటి కవుల గ్రంథములను మాత్రము క్షుణ్ణముగా చదివినదని, ఈమె పద్యాల తీరు నడకలను బట్టి చెప్పవచ్చునని విశ్లేషకుల అభిప్రాయం 

పద్యాలు చదివేవారికి సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండాలని, పొడిపొడిగా చెప్పడం కాదని, తెలుగు పలుకుబడులు, నుడులు, సామెతలు, చమత్కారాలతో కూడిన గద్యపద్యాలు చదువరులకు ఆహ్లాదాన్నిస్తాయని ఆవిడ అభిప్రాయం. అలాగే పాఠకులను అలరించే చమత్కారాలు మనసును ఆనందడోలికల్లో తేలియాడించే పద్యరచన ఆమె కవిత్వంలో కనిపించి తళుక్కున మెరిపిస్తాయని పాఠకుల ప్రశంస. తెలుగు భాషా అందాన్ని చాటిచెప్పే కవిత్వం రాసిన మొల్ల అహల్య, శబరి, మంధర, త్రిజట, కైక లాంటి ప్రతినాయక స్త్రీ పాత్రల గురించి ఎక్కడా అవమానకరంగా చెప్పకపోవడం ఆమె సంస్కారాన్ని తెలియచేస్తుందని పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందారు. రాముడు తాటకి మీద బాణం వేస్తున్నప్పుడు ఎలా ఆలోచన చేశాడో… మొల్ల కవితలో జాలువారించింది. 

‘ఈ యాడుదాని జంపగ/నా యమ్మునకేమిగొప్ప? నగరే వీరుల్ 

ఛీయని రోయుచు నమ్ముని/నాయకు భయమెరిగి తన మనమ్మున నలుకన్ 

రాజుల ఆస్థానంలో ఉన్న కవులకే కీర్తి ప్రతిష్ఠలు దక్కే కాలంలో స్వంత వ్యక్తిత్వంతో సమాజానికి ఎదురీది రామాయణం మనకు అందించిన ధీరకవియిత్రి మన మొల్ల.  

ఈమెపై పోతనకవితా ప్రభావము ఎక్కువగా కనిపిస్తుంది. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట…అని పోతన చెప్పినట్టుగానే ఈమె తన రామాయణంలో చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన, మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్‘ అంటూ పూర్వ కవులు, పెద్దల పట్ల వినయ విధేయతలు గౌరవాభిమానాలు భక్తి పూర్వకంగా తన పద్యాలలో తెలుపుకున్నారు. 

సర్వగుణాకరుడు శ్రీరాముని చరితమును ఎందరెన్ని విధముల రచన చేసినా నవ్యతకలిగి వీనులవిందై, యమృతపు సోనలపొందై యలరారుచుండుట తానీ గ్రంథమును రచించటానికి ముఖ్య కారణమని, అట్టి మహాత్ముని చరితమును కందువ మాటలను అందంగా కూర్చి పాఠకులకు, శ్రోతలకు విందును చేస్తానని పేర్కొన్నది. ఈమె పూర్వకవుల సంప్రదాయమునే అనుసరించి కావ్యారంభమున అయోధ్యాపుర వర్ణనతో ప్రారంభమై, దశరథుని పుత్రకామేష్ఠి, శ్రీరామచంద్రుని జననం మొదలుగా రావణ వధతో ముగిస్తుంది. ఉత్తర రామాయణాన్ని ఆమె స్పృశించలేదు. 

సాధారణంగా కవులు చేసే విధంగా కఠిన మైన వర్ణనలు , సుదీర్ఘమైన సమాసాలుచొప్పించి పాండిత్య ప్రకర్షను చూపిస్తారని, శబ్దాడంబరమునకు ప్రాధాన్యమిచ్చిన ప్రభంద యుగంలో పుట్టిన మొల్ల శబ్దాడంబరానికి లోనుగాక సులభమైన పదములతోనే రచన సాగించి పేరొందింది. చిన్ని చిన్ని గీతాల్లో పెద్ద భావాలని నిముడ్చుట ఈమె సహజ గుణమని సాహిత్యకారుల అభిప్రాయం.  

జడలు ధరియించి తపసుల చందమునను, దమ్ముడును దాను ఘోరదురమ్ములందు కూరగాయలుకూడుగాగుడుచునట్టి, రాముడేరీతి లంకకు రాగలడు.‘ అంటూ పదబంధాలలో ఈమెకు చక్కని నేర్పు ఉందని తెలుస్తుంది. 

తిక్కన వలె ఈమె పాత్రలను కండ్లకు కట్టునటుల చింత్రించ గలదని, హనుమంతుడు సముద్రాన్ని దాటేటపుడు ఈమె ఆప్రాంతమును చూసింది గాబోలు అనిపిస్తుందని, ఆసముద్రోల్లంఘనము ఎంత బాగా  వర్ణించిందో ఈ పద్య భాగాన్ని చూస్తే తెలుస్తుందని అనుభవజ్ఞుల వివరణ. 

మొగము బిగించి, పాదముల మొత్తముగానట నూదిత్రొక్కి, నీ
టుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున వార్చి బాహు ల
త్యగణితలీలమాచి, వలయంబుగ వాలముద్రిప్పి వ్రేగునన్
నగము సగంబు క్రుంగ గపినాథుడు నింగి దాటే రివ్వునన్!! 

ఇలా ఎంత గానో మృదుమధురమైనా కవితా పోకడలున్నాయని ఆమె కవిత్వాన్ని ఎందరో మహానుభావులు కీర్తించారు.  

ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యం, సంపుటి 2 లో మొల్లరామాయణంలో గద్యపద్యాలు 871 అని వ్రాశారు. కానీ అప్పటికి దొరికిన ప్రతులు సమగ్రం కాకపోవచ్చునని అన్నారు. అంతేకాక మొల్లకి పూర్వం చాలామంది పురుషులు రామాయణాలు రాశారని కాని మొల్ల రామాయణం మాత్రమే కాలగర్భంలో కలిసి పోకుండా నిలిచిందని ప్రశంసించారు. 

నిడదవోలు మాలతిగారు మొత్తం ఆరు కాండలలో 880 గద్యపద్యాలున్నాయని చెప్పారు. వీటిలో గద్యాలు 208 అని కూడా తెలియ చేసారు. 

మొల్ల మహిళా హృదయమార్దవంతో మాతృహృదయ సౌమనస్యంతో రామాయణం వ్రాసి మానవాళిని తరింపజేయడానికి సంకల్పించింది కవయిత్రీమతల్లి మొల్లతల్లి‘  అని ఆప్యాయతానురాగాలతో ప్రశంసించారు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు.  

మొల్ల గౌరవార్థం ఆమె విగ్రహాన్ని హైదరాబాదు లోని ట్యాంక్ బండ్ పై 1980 దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వం ప్రతిష్టింప చేసింది. ఆమె జ్ఞాపకార్థం 2017లో ఏప్రెల్ 26 న భారత ప్రభుత్వం, 5 రూపాయల విలువకలిగిన మొల్ల తపాలా బిళ్లను విడుదల చేసింది. స్టాంపు మీద చెట్టుకింద కూర్చుని ఎదురుగా ఉన్న వ్యాసపీఠం మీద తాళపత్ర గ్రంధాల పై గంటంతో వ్రాస్తున్న కవియిత్రి మొల్ల దర్శనమిస్తుంది. 

అంతేకాక, ప్రభుత్వం ఇప్పుడు మొల్ల జయంతి అయిన మార్చి 13వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా చేయాలని కూడా నిర్ణయించి ఆమెకు సాహిత్య చరిత్రలో ఒక సమున్నత స్థానాన్ని కల్పించిదని చెప్పవచ్చు.  

పలువురు కవులు, రచయితలు, కవయిత్రులు, కుమ్మర, శాలివాహన సంఘం ఇచ్చిన వినతుల మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొల్ల జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రతి ఏడాది మార్చి 13వ తేదీన జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ముత్యాల రాజు తెలిపారు. ఈ ఉత్సవాలను  . ఈ కార్యక్రమాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొల్ల జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరపడాన్ని కవులు, రచయితలు స్వాగతించి హర్షం వ్యక్తం చేశారు.

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆకుపచ్చని జ్ఞాపకం

గేయం