నీ ప్రపంచంలో నేను

కథ

అరుణ ధూళిపాళ

సూరి జీవితంలో ఇంతవరకు నిద్రపట్టని రోజు ఎప్పుడూ లేదు. కండ్లు మూసుకొని బలవంతంగా నిద్ర పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తాగిన సారాయి సీసా పక్కన ఖాళీగా వెక్కిరిస్తోంది. దాని మత్తు తన మీద

ఏ మాత్రం పని చేయడం లేదు.

‘ఆమేనా!’ “అవును ముమ్మాటికీ ఆమే”.

ఇరవై ఏళ్లుగా దూరమైనా తనను గుండెల్లో పెట్టుకొని చూసిన ఆ రూపాన్ని మర్చిపోలేడు. కడుపునిండా భోజనం పెట్టి, కళ్లారా ఆనందిస్తూ పెదవులపై చిరునవ్వు వసంతాలు పూయించిన నిండైన ఆ ముఖం తన మనసులో ఇంకా భద్రంగానే ఉంది.

ఆరోజు ఉదయం జరిగిన సంఘటనే కళ్ళనిండా ఆక్రమించి తనను నిద్రకు దూరం చేసింది. పదే పదే అదే నెమరు వేసుకుంటున్నాడు.

**********

డప్పుల మోత మెల్లమెల్లగా దగ్గరవుతోంది.

చెట్టుకు ఆనుకొని బీడీ కాలుస్తున్న సూరి ఆఖరు దమ్ము పీల్చి హుషారుగా లేచాడు. ఆ డప్పులకి, వాని జీవిత గమనానికి అవినాభావ సంబంధం. ఆ శబ్దాలతో పాటు తెరలు తెరలుగా వినిపించే పగిలిన గుండెల రోదనలు వాడికి పట్టవు. డప్పులు తెచ్చే డబ్బుల గలగలలు వాని చుట్టూ నాట్యం చేస్తాయి.

ఆ రోజు ఉదయం లేచి వేపపుల్ల నోట్లో పెట్టాడో లేదో

ఇద్దరు మనుషులు వచ్చి, ముందురోజు రాత్రి ఒక ప్రాణం గాలిలో కలిసిపోయిందని, నలుగురు మోసుకొచ్చే ఆ శరీరాన్ని బుగ్గిపాలు చేయడానికి అన్నీ తయారు చేయమని కొంత డబ్బు అడ్వాన్సుగా ఇచ్చి వెళ్లారు.

గత నాలుగు రోజులుగా సూరికి పని దొరకలేదు. మనుషులేమన్నా అమృతం తాగారా? అనే సందేహం వచ్చింది. తనకు వచ్చిన ఆలోచనకు తానే నవ్వుకున్నాడు. ఇంతలో వీళ్ళు వచ్చి డబ్బులు చేతిలో పెట్టడంతో తన కర్తవ్య నిర్వహణకు పూనుకున్నాడు.

*********

మోసుకొస్తున్న దేహానికి ముప్ఫయి ఏళ్లు  ఉంటాయేమో! చనిపోయే వయసు కాదు. మరి ఎట్లా చనిపోయాడో? తనది కూడా కొంచెం అటూ ఇటూ అదే వయస్సు. పోనీలే! అదంతా మనకెందుకు? నిస్తేజంగా నిట్టూర్చాడు. మనుషులు ఎవ్వరైనా, ఎప్పుడైనా ఇక్కడికి రావాల్సిందేనని తెలిసినా, రావాలని కోరుకోకపోవడం చిత్రం. తాను మాత్రం ఎప్పుడూ ఇక్కడే ఉంటూ వచ్చేవారికోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇది ఇంకో విచిత్రం.

అప్పటికే కర్రలను పేర్చి సిద్ధంగా ఉంచాడు. తన పని అయిపోయింది. వాళ్ళు కూడా త్వరగా ముగించి మిగిలిన డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతే బాగుండు. కొంచెం మందు నోట్లో పడితేగాని ముద్ద దిగదు. ఇక అక్కడ జరుగుతున్న పనులతో నిమిత్తం లేని సూరి కొంచెం దూరంగా ఉన్న సిమెంటు బెంచీ మీద కూర్చున్నాడు.

ఏడుస్తున్న గొంతుల నడుమ ఒక గొంతు బిగ్గరగా

వినిపిస్తోంది. బహుశా తల్లి కావచ్చు. చుట్టూ ఉన్నవాళ్లు ఓదారుస్తున్నారు. “నిన్ను నువ్వు సంబాళించుకో సుగుణా! ఏం చేస్తావ్ చెప్పు. రాత్రి నుండి పచ్చి గంగ కూడా ముట్టలేదు” అంటూ ఏదో మాట్లాడుతూ ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు.

ఉలిక్కిపడ్డ సూరి ఒక్కసారి ‘సుగుణ!’ అని గొణిగాడు.  తల తిప్పి అటువైపు చూసాడు. గుమిగూడిన ఆడవాళ్ళ మధ్య తనకు తెలిసిన రూపాన్ని పోల్చుకోవడానికి నిక్కి నిక్కి చూస్తున్నాడు.

అవునా కాదా! తేల్చుకోలేక పోతున్నాడు. ఆమే అయితే ఆయన కూడా ఉండాలి కదా! సూరిలో రకరకాల ఆలోచనలు. అప్పుడున్న రూపానికి ఇప్పటికీ ఎలాంటి పోలిక కుదరడం లేదు. ఒకవేళ ఆమే అన్నమాట నిజమైతే ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు……ఆ తర్వాత ఆలోచించలేక పోయాడు. అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

పొద్దున్నే తనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళను వివరాలు కనుక్కుందామనుకొని వాళ్లకోసం వెతికాడు. శవాన్ని చూస్తూ మౌనంగా ఏడుస్తున్న వాళ్లిద్దరూ కొంచెం దూరంలో కనిపించారు.  పోయేటప్పుడు కూడా వాళ్ళు హడావిడిగా డబ్బులు చేతిలో పెట్టినపుడు నోరు తెరిచి అడగలేకపోయాడు.

సూరికి చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకోవడం అస్సలు ఇష్టముండదు. కానీ ఆరోజు రాత్రంతా ఆ గుర్తులను నెమరు వేసుకుంటూనే ఉన్నాడు.

************

రికి ఏడేళ్లు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు కొడుకును తీసుకొని పట్నానికి వలస వచ్చారు. పది అంతస్తుల భవన నిర్మాణంలో కూలీలుగా కుదిరారు. బిల్డింగ్ దగ్గరలోనే చిన్న గుడిసెలో వారి నివాసం. తల్లిదండ్రులు వచ్చేవరకు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడడం, పరిచయమైన ఒకరిద్దరు పిల్లలతో ఆడుకోవడం సూరి దినచర్య.

చదువు సంధ్యలు లేని సూరికి గాలికి తిరగడమే తప్ప మరో వ్యాపకం లేదు. ఇదే సమయంలో ఈ నిర్మాణానికి మరో పక్క ఉన్న పెద్ద భవంతి సూరిని బాగా ఆకట్టుకుంది. ఊరికే దాన్ని చూస్తూ ఉండేవాడు. పొద్దున్నే ఎనిమిది గంటలకు వాచ్ మెన్ గేటు తీయగా బయటకు వెళ్ళే కారు రాత్రి ఎప్పుడు ఇంటికి చేరేదో తెలియదు.

సాయంత్రం పూట ఆ ఇంటి యజమానురాలు సుగుణ తన కొడుకును వీల్ చైర్ లో కూర్చుండ బెట్టుకొని తీసుకొని బయటకు వచ్చేది. బయట అంతా తిప్పుతూ ఏదేదో చూపిస్తూ, ఏదో మాట్లాడుతూ ఉండేది. ఆ అబ్బాయి మాత్రం ఎటో చూస్తుండేవాడు.  అట్లా రోజూ చూస్తూ వాళ్లను చూస్తూ ఉండడం అలవాటయింది సూరికి. ఏ రోజయినా ఏ కారణం చేతనో వాళ్ళు రాకపోతే ఏదో వెలితిగా ఉండేది తనకు.
*********

ఒకరోజు తమవైపే చూస్తున్న సూరిని గమనించి సుగుణ దగ్గరికి రమ్మని సైగ చేసింది. బెరుకు బెరుకుగా వెళ్ళాడు. సూరి వివరాలు అడిగి తెలుసుకుంది. ఆమెతో పాటు ఆరోజు నుండీ తానూ వెళ్ళేవాడు. ఆ పిల్లవాడు ఆమెకు ఒక్కగానొక్క కొడుకు వర్ధన్. దాదాపు తన వయస్సున్న ఆ పిల్లవాడు పుట్టుకతో నరాల బలహీనత వల్ల జీవితంలో ఎప్పటికీ నడవలేడని, మనం చెప్పే విషయాలు కూడా కొంతవరకే అర్థమవుతాయని తెలిసిన సూరికి ఎంతో జాలి కలిగింది. మెల్ల మెల్లగా వాళ్ళింట్లోకి ప్రవేశం లభించింది సూరికి. తనకే పనీ లేకపోవడం వల్ల ఎక్కువ వాళ్ళింట్లోనే గడిపేవాడు. ఆ పిల్లవాణ్ణి ఏదో రకంగా ఆడించి నవ్వించే ప్రయత్నం చేస్తుండేవాడు. అన్నా తమ్ముళ్లలా కలిసిపోయిన వీళ్ళిద్దరినీ చూస్తూ సుగుణ మురిసిపోయేది.

వర్ధన్ వాళ్ళ నాన్నగారు సుందరం. పెద్ద వ్యాపారవేత్త. ఎప్పుడూ ఇంట్లో ఉండేవాడు కాదు. ఏ రోజయినా ఇంట్లో ఉన్నాడంటే ఇంటిముందు ఎన్నో కార్లు ఆగి వుండేవి. వచ్చి పోయే వాళ్ళతో పండుగ సంబరంగా ఉండేది. అట్లా నెలకు రెండుసార్లు సూరికి ఆ ఇంట్లో ప్రవేశం ఉండేది కాదు. రెండు మూడు సార్లు మాత్రమే సుందరాన్ని చూసాడు సూరి.

ఆ బంగ్లా చాలా పెద్దది. ఇద్దరు పనివాళ్లు, ఇద్దరు వంటవాళ్ళు, వాచ్ మెన్ కుటుంబాలు ఇంటి వెనుక క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. సుగుణ, వర్ధన్ లకు తోడుగా ఇప్పుడు సూరి కూడా కుటుంబ సభ్యుడైనాడు. సుగుణ పేరుకు తగ్గట్టు సుగుణవతి. పనివాళ్ళందరినీ ఇంటివాళ్లుగా భావించి దగ్గరుండి వాళ్ళ బాగోగులు చూసేది. వాళ్లందరికీ ఆమె అంటే ప్రాణం.

తల్లి ప్రేమను మరపించే ఆమె ఆదరణలో రెండేళ్లు హాయిగా గడిచిపోయాయి సూరికి. తల్లిదండ్రులు వెళ్లిపోగానే వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోయేవాడు. చిన్నవాడే అయినా సుగుణ దగ్గర  కొంత లోకజ్ఞానం అలవడింది.

***********

ఉన్నట్టుండి సూరి అమ్మా నాన్నలు కూలీకి వెళ్తున్న భవన నిర్మాణంలో అనుకోని ప్రమాదం జరిగి, పైన సపోర్ట్ కోసం కట్టిన కర్రలన్నీ ఒకేసారి కూలిపోవడంతో సూరి అమ్మానాన్నలతో పాటు పదిమంది అక్కడికక్కడే చనిపోవడం, మరో ఇరవై మంది దాకా తీవ్రగాయాలపాలవడం సంభవించింది. హుటాహుటిన పోలీసులు, నాయకులు, చనిపోయిన వారి, గాయాలపాలయిన వారి బంధువుల రాకతో అంతా గందరగోళం నెలకొంది.

ఆనందంగా ఉండే జీవితాలలో చిచ్చు పెట్టడం, వంచించడం, జీవనతీరానికి దూరంగా విసిరివేయడం విధికి కొత్త కాదు కదా! చనిపోయిన వారి తాలూకు బంధువులు వచ్చి శవాలను తీసుకుపోయారు. ఆ బిల్డింగ్ ఓనర్ రామనాథం అనాథ శవాలుగా మారిన సూరి తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేసి, నలుగురిలో సానుభూతి పొందడం కోసం వాళ్ళతో పాటు ఏడుస్తున్న సూరిని కూడా వ్యాన్ లో ఎక్కించుకొని స్మశానానికి తీసుకువెళ్లాడు. అక్కడి కాటికాపరి పోచయ్యకు డబ్బిచ్చి దూరంగా ఏడుస్తూ కూర్చున్న సూరిని అక్కడే వదిలి అమాంతం కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసాడు. బిత్తరపోయిన పోచయ్య పిల్లవాని సంగతి అడగడానికి కారు వెనకాల పరుగెత్తిన లాభం లేకపోయింది. ఉసూరుమంటూ వెనక్కి వచ్చి సూరి ద్వారా జరిగిన సంగతి తెలుసుకొని ఓనర్ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నాడు.

***********

ఆరోజు నుండీ ఆ స్మశాన భూమి సూరికి నివాస స్థలమైంది. పోచయ్య సూరికి అన్నీ తానే అయినాడు. ఎదుగుదలతో పాటు క్రమంగా సూరి ఆ వృత్తిని కూడా స్వీకరించాడు. నాలుగేళ్ళ క్రితం పోచయ్య చనిపోయినప్పటినుండీ పూర్తిగా దానికి అంకితమయ్యాడు. కొంతకాలం తల్లిదండ్రులను, సుగుణను, వర్ధన్ ను తలచుకొని కుమిలిపోయేవాడు. రానురాను ఒంటరితనానికి అలవాటుపడ్డాడు. దేవుడు మనిషికిచ్చిన గొప్పవరం ‘మరపు’. అదే లేకపోతే ఈ లోకం ఇంకెంత దుఃఖాన్ని మోసేదో?

మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత మానిన గాయాన్ని రేపినట్టయింది. తిరిగి వర్తమానంలోకి వచ్చిపడ్డాడు సూరి. ఒకవేళ ఆమె అయి ఉంటే వాళ్ళిల్లు ఇక్కడికి చాలా దూరంలో ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వస్తుంది? దీన్ని తేల్చుకోవడం ఎట్లా? రకరకాల ఆలోచనలు సూరి మనసును అతలాకుతలం చేస్తున్నాయి.

మూడవరోజు అస్తికలు తీయడానికి  పురోహితునితో పాటు మొన్న వచ్చిన వ్యక్తులు ఇద్దరు కూడా వచ్చారు. సూరికి ప్రాణం లేచి వచ్చింది. వాళ్ళ తంతు అయిపోయాక పరుగున వెళ్లి వివరాలు అడిగాడు. వాళ్ళు చెప్పిన విషయాలు విన్న సూరి కొయ్యబారిపోయాడు. చాలా కాలం తర్వాత గుండెలు పగిలేలా ఏడ్చాడు. మొట్టమొదటి సారి సూరికి స్మశాన వైరాగ్యం కలిగింది.

నాలుగేళ్ళ క్రితం సుందరం చేస్తున్న వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు రావడంతో ఇల్లు, కొంత డబ్బు, బంగారం తప్ప ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృంగి కృశించిన సుందరం సంవత్సరం తిరగకుండానే మరణించాడు. స్మశానానికి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు సుగుణకు తమ్ముళ్లు. వాళ్ళు బాగా ఆలోచించి అంత పెద్ద బంగళా అవసరం లేదని దాన్ని అమ్మి , డబ్బునంతా బ్యాంకులో పెట్టి వాళ్లకు దగ్గరగా ఒక చిన్న ఇల్లు కొనిపించి బాగోగులు చూసుకుంటున్నారు. నాల్గు రోజులకు ముందు మానసిక వికలాంగుడైన వర్ధన్ హఠాత్తుగా కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. ఇదీ వాళ్ళు చెప్పిన సారాంశం.

ఇవన్నీ విన్న సూరి ఎటూ తోచని ఆలోచనల్లో సతమతమయ్యాడు. ఆమె పరిస్థితికి ఏదైనా చేయాలి.

ఆమె ఋణం తీర్చుకోవాలి. ఒక నిశ్చయానికి వచ్చాడు.

********

మూడు సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సూరీ, సూరీ! ఎక్కడున్నావ్? త్వరగా రా! అంటూ వరండాలోకి వస్తూ పిలుస్తోంది సుగుణమ్మ. ‘వస్తున్నానమ్మా!’ బయటినుండి పరుగెత్తుకొని వచ్చాడు సూరి. “ఇవాళ ఒక చిన్ని కృష్ణుడు మన ఇంటికి వస్తున్నాడు. త్వరగా వెళ్ళాలి పద”! అన్నది చెప్పులు వేసుకుంటూ. సూరి కార్ తీశాడు. అరగంట ప్రయాణం తర్వాత “వర్ధన్ మానసిక వికలాంగుల సంస్థ” అని  బోర్డు ఉన్న గేటు ముందు కార్ ఆపాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఎదురుగా చిరునవ్వుతో నిలువెత్తు వర్ధన్ ఫోటో. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘అమ్మా!’ సుగుణమ్మ భుజాలను పొదివి పట్టుకొని కళ్ళతో సైగ చేశాడు నేనున్నానని.  చిప్పిల్లిన కన్నీటిని తుడుచుకుంటూ తలపంకించి ప్రశాంతంగా నవ్వింది సుగుణ.

అమ్మలా తనను ఆదరించి అన్నం పెట్టిన చేతికి ఆసరాగా ఉండడానికి, ఒంటరైన ఆమెకు అన్ని విధాలుగా తోడుగా ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తాను తీసుకున్న నిర్ణయం ఆమెలో తిరిగి చిరునవ్వు దీపాన్ని వెలిగించినందుకు ఎంతో సంబరపడ్డాడు సూరి.

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“నేటి భారతీయమ్-కాలమ్”

ఆకుపచ్చని జ్ఞాపకం