అభ్యసన – బోధన- Which is important?

8-9-2024 తరుణి పత్రిక సంపాదకీయం

చింత చచ్చినా పులుపు చావదు,- పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ఇది చాలా పాత నానుడులు పాతవి. అంటే ఎప్పుడో ఎవరో పెద్దలు చెప్పిన మాటలు. ఎందుకు చెప్పారు? ఎలా చెప్పారు ? అనే ప్రశ్నలలో జవాబు దొరుకుతుంది ! అయితే చూసి, అనుభవించి చెప్పిన మాటలు. ఇవి చెట్టు కోసమో పువ్వుల కోసం చెప్పినవా? కాదు. వీటి అంతరార్థం ఏంటి ? మనుషులు తెలుసుకోవలసిన నీతి,సందేశం ఇమిడిన విషయాలు. అహంభావులకు గర్విష్టులకు మనసుకెక్కనివి. మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకీ,గొప్ప వ్యక్తులకు మంచి వారిగా పేరు తెచ్చుకున్న వాళ్లకు చెప్పేవి. సాధారణంగా సామెతతో, నానుడితో , పలుకుబళ్ళతో పోలుస్తుంటారు. ఇది భాష సౌభాగ్యం, ఈ సౌభాగ్యాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళ లక్షణం. ఇది వేరే విషయం.
– మంచి లక్షణాలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ? ఎలా వంటబడతాయి అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు కొంతమంది పుట్టుకతోనే మంచి లక్షణాలను చెడు లక్షణాలను పుణికి పుచ్చుకుంటారు. అది వారసత్వ లక్షణం కావచ్చు మళ్లీ ఈ వారసత్వం అనగానే అంతరార్థం కాస్త గ్రహించాల్సి ఉంటుంది. ఏడు తరాల వారసత్వ లక్షణాలు, గుణాలు వచ్చే అవకాశాలుంటాయి. ఇదీ వేరే విషయం. జీన్స్ అనేవి అయాచితంగా వచ్చే ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్లల్లో గుడ్ ఆర్ బ్యాడ్ అనేవి గ్రహించుకున్న తర్వాత మంచి లక్షణాలు అయితే ఇంకా పెంపొందించుకుంటూ చెడు లక్షణాలు అయితే పోగొట్టుకుంటూ సాగే వ్యక్తులు జీవితంలో రాణిస్తారు.
– ప్రస్తుతం చెప్పుకునేది అభ్యసన వల్లనా? బోధన వల్లనా ? లక్షణాలు అలవాడేవి అనేది.
మంచి ఉపాధ్యాయులు ఉన్నంత మాత్రాన మంచిగా బోధన చేసినంత మాత్రాన విద్యార్థులలో మంచివాళ్ళు లేకుంటే ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని అందుకోలేరు. అలాగే తెలివైన విద్యార్థులు ఉన్నపుడు సరైన బోధన లేకుంటే ఆ విద్యార్థులు చేరవలసినటువంటి ఉన్నత స్థానానికి చేరలేరు .ఇవి రెండూ కూడా ముఖ్యమైన విషయాలు. కానీ …..రాయిని శిల్పంగా మార్చినట్టుగా విద్యార్థిని అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఉపాధ్యాయులు కృషి చేయగలుగుతారు కాబట్టి ఉపాధ్యాయుల లక్షణాలు మంచివై ఉన్నట్టయితే… విజ్ఞాన దాయకమైన విషయాలను, సామాజిక అంశాలను, సభ్య సమాజంలో మెలగవలసిన విధానాలను, శాంతి భద్రతల విషయం ఆలోచించే ఓర్పుని, అన్యాయాలు జరుగుతుంటే తిప్పికొట్టగలిగే నేర్పుని, నిత్య పాఠ్యాంశాలతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పిస్తారు ఉత్తమ ఉపాధ్యాయులు అన్నది గ్రహించాలి.
కాబట్టి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గురువులు ఉత్తమ లక్షణాలను ఉత్తమ గుణాలను కలిగి ఉన్నవాళ్లైతే విద్యార్థులను, శిష్యులను మంచి మార్గంలో సిద్ధం చేస్తారు.

కానీ కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు, నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు వైవిధ్యమైన విషయాలు గ్రహించగలిగే వాతావరణం కూడా అవసరం. ఉత్తమ మధ్యమ అధమ స్థాయిలు ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఉంటాయి వాటిని గ్రహించి ఉత్తమ మార్గంలోకి వెళ్ళగలిగే ప్రయత్నాలు మనుషులుగా అందరూ చేయాలి .ఈ మనుషులు ఎవరు అంటే తల్లిదండ్రులు, బంధువర్గాలు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్లంతా కూడా లేలేత వయసులో ఉన్న పిల్లల పైన ఉద్రేకాల యుక్త వయసుకు వచ్చిన వాళ్లకైనా నడవడిని సరైన మార్గంలో చూపిస్తే సమాజం మంచి సమాజం తయారవుతుంది.
Which one is correct?
జీవితం నేర్పిన పాఠాలలో ప్రకృతి, బ్రతుకు మొదటి గురువులు.
తల్లిదండ్రుల లా!
ఇది అని స్పష్టంగా చెప్పలేని బోధన అంతరంగం కూడా ప్రతి క్షణమూ చేస్తూనే ఉంటుంది. తప్పిదాలు అని తెలిసినా మూర్ఖత్వం తో ఉంటే రాయి రప్ప లాలా మనమూ అవుతాము. జంతువులు కూడా కొంత నియమం ప్రకారం బ్రతుకుతాయి , ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం లో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు మృగాలవడం ఖాయం. ఇవి గుణ సముదాయాల ప్రస్తావనలైతే, విజ్ఞాన వంతులం కాలానికి అభ్యసనా, బోధన రెండూ సమర్ధవంతంగా పని చేస్తాయి. కాబట్టి ఒక ధ్యేయం ఒక లక్ష్యం పెట్టుకుని అభ్యసన కోసం బోధకులనూ గౌరవం గా చూడాలనుకుంటున్నారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అనేది గుర్తెరిగి మసలుకోవాలి. పెద్దలు తనంతట తాముగా సర్వ శిక్షణ చేసుకోవాలి, పిల్లల పెంపకంలో ఈ బోధనా, అభ్యసనా సరిగ్గా ఉన్నాయానన్నది మనో నేత్రం తోనూ చూడాలి . రెండూ రెండు కళ్ళ వంటివీ, కాళ్ళ వంటివి , రెండు భుజాల వంటి వీ, రెండు చేతుల వంటివి అనేది అర్థం చేయించాలి అర్థం చేసుకోవాలి.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

ఎడారి కొలను