నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం -11వ భాగం

   మాలాకుమార్

జరిగిన కథ…

పిల్లల దగ్గరకు అమెరికా వచ్చిన అర్జున్, సుభద్రలకు అమెరికాలో సీనియర్ సిటిజన్ సెంటర్ ఉందని తెలిసి అందులో చేరుతారు. వారానికి రెండురోజులు అక్కడికి వెళ్ళి, అమెరికన్స్ తో కార్డ్స్ ఆడుతుంటారు. అక్కడ వారు వారి అమెరికెన్ స్నేహితుల ద్వారా వారి జీవనవిధానము, వారి ఆలోచనలు ఆసక్తిగా తెలుసుకుంటుంటారు. అలాగే అక్కడికి వచ్చిన ఇండియన్ అమ్మాయి కీర్తి గురించి తెలుసుకుంటారు. ఆ సాయంత్రము అర్జున్ పార్క్ లో పటేల్ తో కలిసి ఆయన స్నేహితుడు మనోహర్ ను కలిసేందుకు వారి ఇంటికి వెళుతాడు.

ఇక చదవండి…

“నువ్వు తరచుగా అమెరికా వస్తుంటావా?” పటేల్ తో కలిసి నడుస్తూ అడిగాడు అర్జున్.

“ఆరు సంవత్సరాల క్రితం మా మనవరాలు పుట్టినప్పుడు ఇద్దరమూ వచ్చాము. ఆ తరువాత మనవడు పుట్టినప్పుడు రావటానికి వీలుకాలేదు. సూరత్ లో మాకు బట్టల బిజినెస్ ఉంది. అక్కడ బట్టలు మంచి డిజైన్లతో నేయించి, భారత్ లో అన్ని నగరాలకు, ఇక్కడికి కూడా సరఫరా చేస్తుంటాము. దానితో నాకు  ఇక్కడికి వచ్చేందుకు వీలు కాదు.  ఈమధ్యనే  మా పెద్దఅబ్బాయి కూడా ఫ్లొరిడా నుంచి కుటుంబముతో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడు. ఈ పార్క్ దగ్గరే మా అబ్బాయిలిద్దరూ చేరో వైపు ఇళ్ళు కొనుక్కున్నారు. ఒక్కసారైనా వచ్చి కొత్త ఇళ్ళు చూడమని పిల్లలు అడుగుతున్నారు. నా భార్య కూడా వద్దామని ఆసక్తి చూపిస్తోంది.అందుకే రెండు నెలల క్రితం వచ్చాము. ఇద్దరి ఇళ్ళూ నడక దూరములోనే ఉండటముతో మేమూ అటూఇటూ తిరుగుతూ పిల్లలతో కాలక్షేపం చేస్తున్నాము” జవాబిచ్చాడు పటేల్.

“ఈమధ్య మన దగ్గర పెద్దవాళ్ళు కొంత మంది ఇక్కడికి వచ్చి, గ్రీన్ కార్డ్ తీసుకొని, పిల్లల దగ్గరే ఉండిపోతున్నారు కదా? మీరూ అలా వచ్చేద్దామనుకుంటున్నారా?” అడిగాడు అర్జున్.

“ఇక్కడ ఉన్న ఒకే కుటుంబం పిల్లలు కూడా మా పిల్లలాగా ఒకేచోటకు వచ్చి స్థిరపడుతున్నారు. తల్లిండ్రులను కాస్త పెద్దవాళ్ళు కాగానే తీసుకొచ్చుకొని పిల్లలు కలిసి చూసుకుంటున్నారు. పెద్దవాళ్ళకూ వంటరితనము పోయి, పిల్లలతో కలిసి ఉన్నామన్న రక్షణభావము కలుగుతోంది. అది మంచి పరిణామమే!ప్రస్థుతమవుతే రాము. ముందుముందు వస్తే రావచ్చు” జవాబిచ్చాడు పటేల్.

మాటలలోనే మనోహర్ ఇల్లు చేరుకున్నారు. బయట లాన్ లో వీల్ చేర్ లో తండ్రిని తిప్పుతున్న సురేష్, వీళ్ళను చూసి, రండి అని ఆహ్వానించాడు.

“ఈయన అర్జున్. వీళ్ళ అబ్బాయి అటుపక్క ఉంటాడు. వాకింగ్ లో కలిసారు” పరిచయం చేస్తూ మనోహర్ చేయి పట్టుకున్నాడు పటేల్.

మనోహర్ పటేల్ ను పట్టించుకోకుండా, “ఎక్కడికి తీసుకెళుతున్నావు? నేను లోపలికి రాను” అని వీల్ చేర్ ను లోపలికి తిప్పుతున్న సురేష్ మీద అరవసాగాడు. కాళ్ళూ, చేతులుకుర్చీ చుట్టూ గట్టిగా బిగించాడు.

“డాడీ చాలా చలిగా ఉంది. అటు చూడు చల్లటి గాలులు ఎట్లా వీస్తున్నాయో! లోపలికి వెళుదాము. లేకపోతే మళ్ళీ జలుబు చేస్తుంది. జ్వరం వస్తుంది. రేపు ఇంకొంచము ముందుగా వద్దాము సరేనా? మా మంచి డాడీవి కదూ. చూడు నీ ఫ్రెండ్ పటేల్ సాబ్ వచ్చారు. కొత్త ఫ్రెండ్ ను తీసుకొచ్చారు. చాయ్ తాగించవా? లోపలికి వెళ్ళి గరమాగరం చాయ్ తాగుదాము. పదమ్మా” బుజ్జగిస్తున్నాడు సురేష్. ఏమనుకున్నాడో మనోహర్ వీళ్ళిద్దరి వైపు చూసి నవ్వాడు.

“నువ్వెప్పుడు వచ్చావు పటేల్? ఈయన ఎవరు? అబ్బ ఇంత చలిలో ఇక్కడెందుకు కూర్చోబెట్టావు?” కాస్త ఇబ్బందిగా కదులుతూ, వణుకుతూ అన్నాడు మనోహర్.

“లోపలికి వెళుదాము. రండి అంకుల్” లోపలికి వీల్ చేర్ తీసికెళుతూ పిలిచాడు సురేష్.

అప్పటి వరకూ లోపలికి తీసుకెళ్ళ వద్దు అని మారాము చేసి, అసలు వీళ్ళను గమనించనట్టుగా ఉన్న మనోహర్ అలా అనేసరికి ఆశ్చర్యంగా చూస్తున్న అర్జున్ చేతిని చిన్నగా తడుతూ, లోపలికి పద అని సైగ చేసాడు పటేల్. స్థిరంగా కూర్చోలేక ఇబ్బంది పడుతున్న మనోహర్ కు, కాసిని మంచినీళ్ళు తాగించి, మంచం మీద, వెనుక దిండు పైకి జరిపి, జాగ్రత్తగా  కూర్చోబెట్టాడు. తండ్రి నుదుటి మీద అలుముకున్న చెమటను టిస్యూతో చిన్నగా అద్ది, “ఎట్లా ఉంది? కూర్చోగలవా?” మృదువుగా అడిగాడు. పరవాలేదన్నట్లుగా నీరసంగా తలూపాడు మనోహర్.

“ఆషా ఆఫీస్ మీటింగ్ లో ఉంది. చాయ్ తెస్తాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి” చెప్పి లోపలికి వెళ్ళాడు సురేష్.

“అవునూ పటేల్ నువ్వు భారత్ నుంచి ఎప్పుడు వచ్చావు? మీమనవరాలు బాగుందా?”

“బాగుంది. నేను వచ్చి రెండు నెలలవుతోంది. నువ్వేమిటి ఇట్లా అయ్యావు?” అడిగాడు పటేల్. అర్జున్ కు మనోహర్ సంగతి అర్ధం కావటం లేదు. తరుచుగా వచ్చి కలుస్తున్నాను అన్న పటేల్ ను నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడేమిటి? పటేల్ కూడా ఇంతకు ముందు కలవన్నట్లు ఇలా అయ్యావేమిటి అని అడుగుతున్నాడేమిటి?అసలు ఏమయ్యిందిమనోహర్ కు? మనోహర్ ను, పటేల్ ను గమనిస్తున్నాడు.

“వారం క్రితం వాష్ రూం లో కింద పడ్డాను. ఇదో ఈ తుంటి ఎముక విరిగిందని సర్జరీ చేసారు. కదులుతేనే నొప్పి భరించలేక పోతున్నాను. అన్ని పనులూ సురేష్ నే చేస్తున్నాడు. పాపం వీడికి నా మూలంగా ఎంత ఇబ్బందిగా ఉందో! పసివాడిని చూసుకుటున్నట్లుగా చూసుకుంటున్నాడు” అన్నాడు.

“పరవాలేదులే కొన్ని రోజులే కదా! మూడువారాలవుతే లేచి నడుస్తావు. చిన్నప్పుడు నువ్వు వాడికి చేయలేదా? అట్లా అనుకుంటే ఎట్లా?” అనునయంగా అన్నాడు పటేల్.

పటేల్ మాటకు జవాబివ్వకుండా “నీకు తెలుసా తులసి నన్ను వదిలిపోయింది” విచారంగా అన్నాడు మనోహర్.

తెలుసు అన్నట్లుగా తల ఊపాడు పటేల్.

“తులసి లేకుండా ఇంకా నేనెన్నిరోజులు జీవించాలో! ఈ నొప్పులు భరించ లేకపోతున్నాను. నాలుగు రోజులకే బెడ్ సోర్స్ వచ్చాయి. పాపం సురేష్ ఒక డాక్టర్ లాగా అంతా క్లీన్ చేసి, పక్కకు తిప్పి పడుకోబెట్టాడు. ఆ కాస్తకే తట్టుకోలేక పోయాను. విపరీతమైన, భరించలేనంత బాధ! నాకు బరువు బాధ్యతలు ఏమీ లేవు. ఇంక ఉండి చేసేదేముంది? బతికి ఊన్నంతకాలము డిగ్నిఫైడ్ గా బతకాలి లేదా వెళ్ళిపోవాలి. కానీ ఈ నరకం వద్దు. నాకే కాదు వాడికీ నరకమే! అందుకే డాక్టర్ ను పిలవరా, లేకపోతే నన్ను హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళు. డెత్ డిగ్నిటీని ప్రసాదించమని వేడుకుంటాను అన్నాను. కానీ వాడు వినటం లేదు. పోనీ లాయర్ ను, డాక్టర్ నూ పిలువు ‘డెత్ డిక్లరేషన్ ‘ ఇస్తాను అన్నా వినడు. నువ్వన్నా చెప్పు” అన్నాడు మనోఎహర్.

టీ ట్రే తో వచ్చిన సురేష్ “డాడీ మళ్ళీ మొదలు పెట్టావా? పటేల్ అంకుల్ కొత్త ఫ్రెండ్ ను తీసుకొచ్చారు. మాట్లాడావా?” మందలించాడు.

ఏమీ మాట్లాడకుండా నిస్త్రాణంగా వెనకకు వాలాడు మనోహర్. టీ తాగి ఇంక వస్తామని చెప్పి బయటకు నడిచారు పటేల్, అర్జున్. వారి వెనుకనే వచ్చిన సురేష్, అర్జున్ తో “ఏమనుకోకండి అంకుల్. మా డాడీకి ఫ్రెండ్స్ అంటే ప్రాణం. కానీ ప్రస్థుతం తన బాధలో మిమ్మలిని మాట్లాడించలేదు” అన్నాడు.

“పరవాలేదు కానీ పటేల్ తరుచుగానే వస్తున్నాన్నాడు, మరి ఆయనను ఇప్పుడే చూసి నట్లు మాట్లాడారే?” సంశయంగా అడిగాడు అర్జున్.

“మా మమ్మీ అయిదు సంవత్సరాల క్రితం చనిపోయింది. మమ్మీ, డాడీ ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆమె ఎడబాటును డాడీ తట్టుకోలేకపోయారు. డిప్రెషన్ లోకి వెళ్ళారు. ఆ డిప్రెషన్ లోనే ఒకరాత్రి వాష్ రూంలో పడిపోయారు. అప్పుడు నేలకు కొట్టుకొని తలకు పెద్ద దెబ్బ తగిలింది. మల్టిఫుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. తలకు దెబ్బ తగలటము, డిప్రెషన్ తో కొద్దిగా మతిమరుపు వచ్చింది. అందులోనే బ్రేన్ అటాక్ కూడా వచ్చింది. రెండుమూడుసార్లు బ్రేన్ కు సర్జరీలు చేసారు. మనిషి బాగానే ఉన్నారు కానీ ఎవరినీ గుర్తు పట్టలేరు. అన్నీ మర్చిపోతుంటారు. ఫ్రాక్చర్స్ అతుక్కోక లేవలేరు. ఆయనకు ఏమి జరుగుతోందో ఆయనకే తెలియటం లేదు. మన ధ్యాసలోకి వచ్చినప్పుడల్లా అప్పుడే కింద పడ్డాననుకుంటారు. మమ్మీ కూడా అప్పుడే చనిపోయిందనుకుంటారు. డెత్ డిక్లరేషన్ ఇస్తానని అంటుంటారు. అయిదు సంవత్సరాలుగా ఇలా నిద్ర, మెలుకువ కాని స్థితిలో బాధ పడుతున్నారు” విచారంగా అన్నాడు.

“నువ్వు కూడా అయిదు సంవత్సరాల నుంచీ మీ డాడీని ఎవరి సహాయమూ లేకుండా నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఇంత సేవ చేసే కొడుకు ఉండటము మనోహర్ పూర్వజన్మ పుణ్యం” అన్నాడు పటేల్.

“అయ్యో నేను చేస్తున్నది ఏముందంకుల్. డాడీకి కొంచమయినా తగ్గి, లేచి నడవగలుగుతే అంతే చాలు” మొహమాటంగా అన్నాడు.

“ఇక్కడ మన దగ్గర దొరికినట్లుగా ఇంట్లో ఉండి చూసుకునే సహాయకులు ఎవరూ దొరకరా?” అడిగాడు అర్జున్.

“ఈ మధ్య వస్తున్నారు కానీ వారి చార్జీలను నేను భరించలేను. చాలా కాస్ట్లీ. అయినా మా డాడీని నేనే చూసుకోవాలని, నా భార్యను, పిల్లలను కూడా డాడీ దగ్గరకు రానీయను. ప్రస్థుతమవుతే వర్క్ ఫ్రం హోం నే కదా! అందుకే జాబ్ కు కూడా ఇబ్బంది లేదు” జవాబిచ్చాడు సురేష్.

సురేష్ భుజం మృదువుగా తట్టి, వెళ్ళి వస్తామని చెప్పి బయలు దేరారు. ఇద్దరూ కాసేపు మౌనంగా నడిచారు. కొద్దిసేపు తరువాత “పటేల్, ఈ డెత్ డిగ్నిటీ, డెత్ డిక్లరేషన్ ఏమిటీ?” మౌనం లో నుంచి బయటపడి అడిగాడు అర్జున్.

“ఇంటికి తొందరగా వెళ్ళాలా?” అడిగాడు పటేల్.

“లేదు. ఈ విషయాలు నన్ను కలవరపెడుతున్నాయి. పద కాసేపు పార్క్ లో కూర్చుందాము” పార్క్ వైపు నడిచాడు అర్జున్.

ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చున్నారు. చలి కొద్దిగా వణికిస్తోంది. పచ్చిక మీద ఉడత పరిగెడుతూ, మీరేమిటీ ఈ చలిలో కూర్చున్నారు అన్నట్లుగా తన గుండ్రటి కళ్ళను తిప్పి వారి వైపు ఓ క్షణం చూసి, పక్కనున్న చెట్టు మీదకు హడావిడిగా వెళ్ళిపోయింది. “ఏమిటీ? డెత్ డిక్లరేషన్, డెత్ డిగ్నిటీ అంటే ఏమిటని అడిగావు కదా? నీకు

‘అనాయాసేన మరణం,

వినా ధైన్యేన జీవనం,

దేహాంత్యం తవ సానిధ్యం

దేహిమాం పరమేశా’

శ్లోకం తెలిసే ఉంటుంది కదా?  వృధ్యాప్యం లో ఇబ్బందులు పడకుండా, ఒకరిపైనా ఆధార పడకుండా, తీసుకెళ్ళు పరమెశా అని దేవాలయం కు వెళ్ళిన ప్రతిసారి ప్రార్ధిస్తాము అవునా. అదే డెత్ విత్ డిగ్నిటీ అంటే. సహజముగా ఏ విధమైన ఇబ్బందిలేకుండా అనాయాసంగా వెళ్ళిపోతారు అదృష్ఠవంతులు. కాని అట్లా వెళ్ళిపోలేని, ఇబ్బందికరమైన జబ్బులు నయముకానీ, చాలా భయంకరమైన బాధ  అనుభవించేవారికి  కొన్ని అత్యవసర పరిస్థితులలో ఉంటే ఆ రోగికి ఇచ్ఛామరణం, కొన్ని పద్దతులలో ఇస్తారు డాక్టర్ లు. దానికి కూడా చాలా నిబంధనలు ఉంటాయి. అలా సులువుగా చేయరు. ఇంక డెత్ డిక్లరేషన్ అంటే మనము వీలునామా రాస్తాము కదా, అందులోనే నాకు విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇచ్చామరణం ఇవ్వండి అని లాయర్, డాక్టర్, కుటుంబ సభ్యుల ముందు రాసి,  డిక్లేర్ చేయటము. అదీ అంత సులువు కాదు. ఇంకా అన్ని చోట్ల అమలులో లేదు. కొన్ని రాష్ట్రాలలోనే ఉంది” చెప్పాడు పటేల్.

“డెత్ విత్ డిగ్నిటీ అంటే ఎలా ఇస్తారు?” కుతూహలంగా అడిగాడు అర్జున్.

“చెప్పాలంటే ఇచ్ఛామరణం అంటేడెత్ విత్ డిగ్నిటీ, డాక్టర్ సహాయంతో ఆత్మహత్య, టెర్మినల్ మత్తు లేదా వైద్య సహాయం నిరాకరించడం, వెంటిలేషన్ తీసేయటమూ మొదలయిన పద్ధతులను చట్టబద్ధం చేయడం. దానిని సమర్ధించేవారి అభిప్రాయం ప్రకారం, ఈ రకమైనవిగౌరవప్రదమైన మరణానికి హామీ ఇస్తాయి, చివరి క్షణం వరకు స్వేచ్ఛాయుత నిర్ణయాలను కలిగి ఉంటాయి ఇంకా అనవసరమైన వేదనను నివారిస్తాయి. అయినా చెప్పాను కదా ఇంకా అన్ని చోట్లా ఈ అవకాశము లేదు. పైగా ఇది అమలు పరిచేందుకు కుటుంబసభ్యులకు ఇష్టం ఉండకపోవచ్చు. ఇలా చాలా చాలా ఉన్నాయి దీనిలో. కొన్ని సార్లు మనోహర్ నిర్ణయము సబబే అనిపిస్తుంది. కొన్నిసార్లు బాధ కలిగిస్తుంది. చూద్దాం ఆ దైవ నిర్ణయం ఎలా ఉందో! చీకటి పడింది వెళుదామా?” లేచాడు పటేల్.

***

“బాబా, డాడీ ఇంకా రాలేదా పార్క్ నుంచి?” హోం థియేటర్ లో సినిమా పూర్తి అయిన తరువాత పైకి వచ్చిన సుభద్ర అక్కడే ఉన్న అభీని అడిగింది.

“నేను చూడలేదమ్మా. ఆ పటేల్ సాబ్ తో కబుర్లు చెపుతూ కూర్చున్నారేమోలే. వస్తారు” జవాబిచ్చాడు అభి. అమ్మతో చెప్పాడు కానీ ఇంకా రాకపోవటమేమిటి అని ఆలోచిస్తుంటే డెక్ మీద, చీకట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. అక్కడికి వెళ్ళి అర్జున్ ను చూసి, “ఇక్కడ చలిలో, చీకట్లో కూర్చున్నావేమిటి డాడీ?” ఆశ్చర్యంగా అడిగాడు.

జవాబివ్వలేదు అర్జున్.

అర్జున్ పక్కన కుర్చీలో కూర్చుంటూ “డాడీ ఏమయ్యింది?” అడిగాడు అభి.

“ఈరోజు పటేల్ ఫ్రెండ్ మనోహర్ ఇంటికి వెళ్ళాము. అతనిని చూస్తుంటే తెలియని బాధ కలిగింది. మనసంతా భారమయ్యింది. అప్పటి నుంచి వృధ్యాప్యం వరమా? శాపమా? అందులోనూ వంటరిగా మిగిలిపోయిన వారి పరిస్థితి ఏమిటి? అన్న ఆలోచన కలుగుతోంది. ఖర్మ వసాత్తు నేను ముందుగా పోతే, మీ మమ్మీ ఎలా ఉంటుంది? ఆప్రశ్న నన్ను వేధిస్తోంది. ఏమీ అర్ధం కావటం లేదురా” అన్నాడు అర్జున్.

“డాడీ ఏమిటీ పిచ్చి? ఇప్పుడేమి ముంచుకుపోయింది? ఎలా జరగాలో అలా జరుగుతుంది. అయినా నేనూ, అక్కా లేమా? అంత ఆలోచన ఎందుకు? లే డాడీ!మా డాడీని ఇట్లా చూడటం బాగాలేదు” అర్జున్ చేతి మీద చేయి వేస్తూ అన్నాడు అభిమన్యు.

వారి మాటలు వినిపించి అటుగా వచ్చిన సుభద్ర, అర్జున్ దగ్గర కింద కూలబడి “అండీ ఏమిటిది?” అడిగింది వణుకుతున్న గొంతుతో.

“ఏయ్ పిచ్చీ లే. ఇప్పుడేమయ్యింది? ఒక్క క్షణం మనసు బాధ పడి ఏదో ఆలోచనలోకి వెళ్ళింది. పద పిల్లలు వచ్చారేమో, డిన్నర్ చేద్దాము” అని తననుతను తమాయించుకొని లేచాడు అర్జున్.

***

“అండీ…  మీరలా మాట్లాడుతే నాకు చాలా ఏడుపు వస్తోంది. మీరు లేకుండా నేను ఉండగలనా?” పక్కనే అర్జున్ ను కరుచుకొని పడుకొని,అర్జున్ పొట్ట చుట్టూ చేయి వేసి ఏడుపు గొంతుతో అంది సుభద్ర.

“భద్రా… కొన్నికొన్ని సంఘటనలకు సెంటిమెంట్స్ ను పక్కకు పెట్టి, మనము తయారుగా ఉండాలి. తప్పదు అని ఈరోజు మనోహర్ ను చూస్తే అనిపించింది. ఇక్కడ కొన్ని రాష్ట్రాలలో ఉన్నట్లు మన దగ్గర కూడా ఇచ్ఛామరణం వెసులుబాటు ఉంటే బాగుంటుంది అనిపించింది. ఈ మధ్య మా అత్తయ్య నాలుగు సంవత్సరాలు ఎంత నరకం అనుభవించిందో గుర్తు లేదూ? అలాంటి వారికిది వరమే కదా! మన దగ్గర కూడా ఈ “డెత్ ఆఫ్ డిగ్నిటీ” “డెత్ డిక్లరేషన్” వెసులుబాటు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. సరేలే ఇది వదిలేయి.దాని గురించి ఆలోచించకు. హాయిగా పడుకో. మనకావసరం లేదు” అని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ అన్నాడు. సుభద్ర భర్త దగ్గరగా జరిగి నీ నీడలోనే నా జీవితం అంటూ పడుకుంది. కొద్ది సేపటిలోసుభద్ర నిద్రపోయింది. సుభద్రకు ధైర్యం చెప్పాడు కానీ అర్జున్ ను ఆ ఆలోచన వదలలేదు. ఇండియా వెళ్ళగానే భద్రకోసం పెన్షన్ ఒక్కటే కాకుండా, ఇంకా ఎవరి మీదా ఆధారపడకుండా ఏదైనా సరైన ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.

(సశేషం)

 

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు -9

గణపతి మహారాజ్ కీ జై